Tuesday, 24 April 2012

కవితా సూరీడి రంగు నలుపు!

నివాళి

ఉద్యమాల తొక్కిసలాటలో అల్లాడి ఆకులు మేసిన నేల నిర్దిష్టతను కోరుకున్న సందర్భం ఒకటుంది. అది గత దశాబ్ది 90 దశకం. అది విప్లవోద్యమం నిర్దిష్టతను కోల్పో యి, అగమ్యంగా కాళ్లీడ్చుకుంటున్న దశ. అంబేద్కరిజం వెలుగులో దళిత ఉద్యమం నవనవోన్మేషంగా సాగుతున్న దశ. ఆ సమయంలో విప్లవోద్యమం నుంచి దళిత ఉద్య మం వేపు ఆకర్షితుడై నల్లసూరీడై సరికొత్తగా ఉదయించినవాడు కేజీ సత్యమూర్తి అలియాస్ శివసాగర్.

వర్గపోరాటం ద్వారా మాత్రమే విప్లవం వస్తుందని మార్క్సిస్టులు మొండిగా వాదిస్తారు. ఈ దేశంలో విప్లవం రావాలంటే కుల వ్యతిరేక పోరాటం జరగాలని బల్లగుద్ది చెప్పినవాడు అంబేద్కర్. ఈ దేశానికి చెందిన అసలు సిసలు విముక్తి మార్గాన్ని బోధించినవాడు, నిజాన్ని ఢంకా బజాయించి చెప్పినవాడు అంబేద్కర్. అందుకే ఆయన్ను మార్క్సిస్టులు అంటరానివాడుగా చూశారు. కులం, వర్గం అనే అంశాలు చర్చకు వచ్చినప్పుడు కులం, వర్గం వేరువేరు కావు, మనిషి కులమే అతడి వర్గాన్ని నిర్ణయిస్తుం దన్న నిష్టుర సత్యం అంబేద్కర్‌కు తెలుసు. ఫూలేకు తెలు సు. పెరియార్‌కు తెలుసు. కేజీ సత్యమూర్తికీ తెలుసు. కాబట్టి ఈ సమాజానికున్న కుల-వర్గ స్వభావాన్ని తనదైన దృష్టితో చూడగలిగాడు. ‘నల్ల నల్ల సూరీడు నల్లాటి సూరీడు’ అనే పాటను రాయగలిగాడు. మావో గీతానికి అనువాదమైన ‘నా మల్లియ రాలెను’ పాటలో అమరత్వాన్ని కీర్తించిన శివసాగర్ నల్లసూరీడు పాటలో చావును కీర్తించలేదు. కారంచేడు, చుండూరు మారణకాండల వెనుక దాగిన సామాజిక చలన సూత్రాలను విశ్లేషించాడు. బౌద్ధంలో ఉన్న సూక్ష్మాన్ని సులభమైన పదాలతో చెప్పాడు. దళిత సౌందర్య శాస్త్రాన్ని అధ్యయనం చేసే వారికి నల్లసూరీడు పాట ఒక పాఠ్యగ్రంథం. ఈ పాట ను సునిశితంగా పరిశీలిస్తే శివసాగర్ భాష విషయంలోగానీ, అభివ్యక్తి విషయంలోగానీ విప్లవోద్యమం నుంచి దళిత ఉద్యమంవేపు జరిపిన సుదీర్ఘ ప్రయాణం ఎటువంటిదో తెలుస్తుంది.

ఇప్పుడున్న చాలామంది మార్క్సిస్టులకు, దళిత మేధావులకు సాధ్యంకానిది శివసాగర్‌కు ఎలా సాధ్యపడింది మౌలికంగా శివసాగర్‌ది అతిక్రమిం చే స్వభావం. నిషిద్ధ ప్రాంతంలోకి నిర్భయంగా చొచ్చుకుపోయే స్వభావం. కాబట్టే చాలామందికి కనపడని జీవి తం, ప్రతీకలు, దృశ్యాలు ఆయనకు కనిపిస్తాయి. ఎవరికీ వినిపించని కొత్త ధ్వనులు వినిపిస్తాయి. ఎవరికీ తగలని జీవిత స్పర్శ ఆయనకు తగులుతుంది.
నమ్మిన సిద్ధాంతం ఆయనను యోధుడుగా మార్చి తే, పుట్టిన కులం ఆయన్ను ‘బంధీ’ (బందీ అనే పదాన్ని శివసాగర్ ఇలానే పలికేవాడు) చేసింది. కవి జాగరూకుడై ఉండాలి. కులం గుండెల మీద కవాతు చేయడానికి సిద్ధంగా ఉండాలి. ముఖ్యంగా ‘నడిరాతిరి పత్తికాయ పగిలే చప్పుడు’ వినగలిగినంత అప్రమత్తంగా ఉండాలి. అలా ఉన్నాడు కాబట్టే శివసాగర్ కవి త్వంలో వెలుతురు ఉంది. వేకువకేసి నడిపించగలిగిన దమ్ము ఉంది.

మార్క్సిజం, అంబేద్కరిజం అనే రెండు గట్ల నడుమ ప్రవహిస్తూ... బుద్ధిజం అనే మూడో గట్టును ముద్దాడిన సత్యాన్వేషి శివసాగర్.

చెప్పడం తప్ప వినడం చేతగాని సమూహంలోంచి, అనాలోచన తప్ప ఆచరణ చేతగాని గుంపులోంచి బైటపడిన శివసాగర్, దళిత ఉద్యమాన్ని అన్ని పార్శ్వాల నుంచి కొన్ని అడుగులు ముందుకు వేయించగలిగాడు. చలపతి- విజయవర్థనం ఉరిశిక్షల వ్యతిరేక ఉద్యమంలో ఆయన మాతో కలిసి ఆడాడు, పాడాడు. అర్ధరాత్రి, అపరాత్రి అని లేకుండా పనిచేశాడు. దళిత సాహిత్యం ఒక ‘పాసింగ్ ఫినామినా’ అని సోకాల్డ్ విప్లవ కవులు, ‘వృత్తి’ ఉద్యమకారులు ఎద్దేవా చేసినప్పుడు... దిమ్మదిరిగే సమాధానాలు చెప్పి వాళ్ల నోళ్లు మూయించాడు.
ఒకసారి...

‘శత్రు చేజిక్కితినని  వెక్కిరించకు నన్ను
మిత్ర ద్రోహము చేత  శత్రు చేజిక్కితినే
చందమామా... చందమామా’
అని చందమామతో తన గోడు వెళ్లబోసుకుంటాడు.
మరోసారి...
‘నా మల్లియ రాలెను
నీ మొగిలి కూడా రాలెను’ అని ఆక్రోశిస్తాడు.
ఇంకోసారి...
‘నర్రెంగ చెట్టుకింద
నరుడో భాస్కరుడో’ అని శివాలెత్తుతాడు.
మరీ ముఖ్యంగా...
‘అలలపై నిఘా

అలలు కనే కలలపై నిఘా’ అంటూ రాజ్య స్వభావాన్ని విశ్లేషిస్తాడు.
ఒకచోట ఆగడు. ఒకచోట గిడసబారిపోడు. పయనిస్తాడు. ప్రవహిస్తాడు. కాబట్టి ఆయన పాటల్లో, కవిత్వం లో అంత వైవిధ్యం. తనమీద నెరూడా, మయకోవస్కీల ప్రభావం ఉందని శివసాగర్ స్వయంగా చెప్పుకున్నప్పుడు ‘అయ్యుండొచ్చు’ అనుకుంటాం. అదే సమయంలో నం డూరి సుబ్బారావు, కొనకళ్ల వెంకటరత్నంల ప్రభావం ఉందని కనిపెట్టి ఆశ్చర్యపోతాం.

జాగ్రత్తగా పరిశీలిస్తే ఆయన పాటల్లో క్రిష్ణశాస్త్రి ప్రభా వం ఉందనిపిస్తుంది. ఇవన్నీ ఒక ఎత్తు. రామ్‌నగర్ ‘ఏక లవ్య’ పత్రికాఫీసులో బాసింపట్లేసుకుని ఎంచక్కా గోడకానుకుని గగనాభిముఖం చేసి అర్థనిమీలిత నేత్రాలతో పాట పాడుతుంటే చూడాలి... అక్షరాలు బట్వాడా చేయలేని అనుభూతి అది. ఇక ఆ దృశ్యాన్ని చూడలేం కాబట్టి... ఆయన బొమ్మనైనా ఓసారి చూసి తీరాలి! ఆయన అక్షరాల్ని ఒక్కసారైనా తనివితీరా ముద్దాడాలి!!

-పైడి తెరేష్‌బాబు
http://sakshi.com/main/WeeklyDetails.aspx?Newsid=39734&Categoryid=1&subcatid=18

No comments:

Post a Comment