‘‘భుజాన కావడి బద్ద, నెత్తిమీద ఆదివాసీ బుట్ట, సంప్రదాయకంగా ధరించే మొలగోచీతో... అచ్చు అదివాసీలా మారువేషం ధరించి వారాలు, నెలల తరబడి దట్టమైన శ్రీకాకుళ కొండకోనల్లో చెట్టునూ పుట్టనూ పలకరిస్తూ వెతుకులాట. పోరాటదారిలో చెల్లాచెదరైన సహచర దళాలను సమీకరించడానికి శక్తియుక్తులన్నీ ఒడ్డి రాత్రింబవళ్లూ అలుపెరుగని గాలింపు. ఉద్దానంలోని దళాలు క్షేమంగా తన అధీనంలోనే ఉన్నప్పటికీ, పార్వతీపురం ప్రాంతంలోని దళాలకోసం తీవ్రంగా సాగుతున్న పోలీసుల వేట. చుట్టుపక్కల పల్లెల్లో ఎటుచూసినా భయానకమైన నిర్బంధం. పట్టు వదలని పోరాట యోధుని దీక్ష... ఎట్టకేలకు ఫలించిన లక్ష్యం. ఆయన సంతోషానికి అవధుల్లేవు!’’
ఇది చదువుతుంటే ఏదో హాలీవుడ్ సినిమా స్క్రిప్టులాగానో, పూర్వకాలంలో రాజ్యాలు కోల్పోయిన రాజులు సమీప అడవుల్లో మకాం వేసి... బలగాలను సమీకరించుకున్న కథలూ గాథలూ గుర్చొచ్చినట్టుగానూ ఉంటుంది. కానీ ఇది కథకాదు, వాస్తవం. శ్రీకాకుళ రైతాంగ సాయుధ పోరాటంలో కీలక భూమికపోషించి, నలభై రెండేళ్ల సుదీర్ఘకాలం ప్రభుత్వానికి చిక్కక, లొంగక రహస్య ఉద్యమ జీవితం గడిపిన కథానాయకుడి చరిత్ర. ఆయనే పైలా వాసుదేవరావు. 78 ఏళ్ల వయసులో, విద్యార్థిదశ మినహాయిస్తే 57 సంవత్సరాలు కమ్యూనిస్టుగా జీవించి 2010 ఏప్రిల్ 11న త్యాగాల బాటలో అమరులైన శ్రీకాకుళ పోరుబిడ్డ
ధైర్యం, సాహసం, పట్టుదల, ఆదర్శంతో కూడిన మొండితనానికి ప్రతీకగా మారిన పైలా వాసుదేవరావు 1932 ఆగస్టు 11న శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మం డలం, రిట్టపాడు గ్రామంలో జన్మిం చారు. ఎస్‌ఎస్‌ఎల్సీ చదువు ముగియగానే సర్వేయర్ ఉద్యోగం సంపాదించడమే కాక, 1952లో కమ్యూనిస్టు పార్టీ సభ్యులుగా నమోదయ్యారు. 1959 లో ఉపాధ్యాయ వృత్తిని చేపట్టి పీడిత ప్రజల ఉద్యమానికి ఊపిరిగా నిలిచా రు. శ్రీకాకుళ రైతాంగ సాయుధ పో రాటంలో ఆయన కనబరచిన చొరవ, సమయస్ఫూర్తి మరపురానివి.
నేటికీ ఒళ్లు గగుర్పొడిచే ఘటననొకదానిని ఆయన మాటల్లోనే గుర్తుచేసుకుంటే- ‘‘మేమున్న తోటను పోలీసులు చుట్టుముట్టారు. దగ్గరకు వచ్చేదాకా గమనించలేకపోయాం. అకస్మాత్తుగా పోలీసులు జరిపిన దాడితో తలోదిక్కుకు పరు గులెత్తాం. నా సహచరి చంద్రమ్మ అరెస్టయింది. పరిగెత్తే క్రమంలో ఆమె చీర తుప్పల్లో చిక్కుకుని కదలలేని స్థితి. పరిగెత్తుతూనే నా చేతిలో ఉన్న తుపాకీ పేల్చాను. ఆ దెబ్బ తో పోలీసులు చంద్రమ్మకు సమీపంలో ఆగిపోయారు. మిగిలిన వారమంతా చెట్ల గుబురుల్లో కలిసిపోయాం. ఎవరూ కనిపించక చంద్రమ్మను పోలీసులు తీసుకెళ్లారు.’’
అలా అరెస్టయిన చంద్రమ్మ 14 సంవత్సరాలు జైల్లో మగ్గిపోయింది. పసికందుగా ఉన్నప్పుడే కన్నబిడ్డను పెంపకానికి అప్పగించిన బాధ. ఉద్య మం కోసం అన్నిటినీ దిగమింగి, ప్రజలే సర్వస్వంగా బతుకును మలుచుకొన్న తీరు ఎన్నదగినది.
ఎప్పుడో గతించిన జ్ఞాపకాలను స్మరించుకోవడం మూలంగా ఒనగూరే ప్రయోజనం ఏమిటని ఎవరైనా ప్రశ్నించవచ్చు. స్వాతంత్య్రానంతర భారతంలో ఆదివాసీ, దళిత, బహు జన వర్గాల ప్రజలకు అనుకూలంగా రూపొందిన చట్టాలు, విధానాల వెనుక అనేక పోరాటాలతో కూడిన త్యాగాలు మిళితమై ఉన్నాయన్నది విస్మరించలేనిది. ప్రధానంగా, 1967లో పశ్చిమబెంగాల్‌లోని డార్జిలింగ్ జిల్లాలో ప్రారంభమై ‘నక్సల్బరీ వసంతకాల మేఘగర్జన’గా ప్రఖ్యాతిగాంచిన రైతాంగ పోరాటం, అదే కాలంలో ఆంధ్రప్రదేశ్‌లో వెల్లువెత్తిన శ్రీకాకుళ రైతాంగ పోరాటం ప్రత్యక్షంగా, పరోక్షంగా భారత రాజకీయాలపైన, ప్రభుత్వ విధానాలపైన తీవ్ర ప్రభావాన్ని చూపాయనడం అతిశయోక్తి కాదు. ఈ రెండు పోరాటాల ప్రభావంతోనే ఆదివాసీ అనుకూల విధానాలు, చట్టాలు అమలులోకి వచ్చాయని, ఆ రోజుల్లో ప్రభుత్వ ఉన్నతాధికారులుగా పనిచేసిన అనేక మంది నేటికీ గుర్తుచేసుకోవడం గమనార్హం. 1970లో వచ్చిన 170 యాక్ట్, ఐటీడీఏ సహా ఇటీవల మన రాజకీయ పార్టీల నాయకులు మాట్లాడుతున్న ‘ట్రైబల్ సబ్‌ప్లాన్’ వంటివి కూడా అలాంటి పోరాటాల ఫలితమేనన్నది మరవకూడదు. నక్సలైట్ ఉద్యమ ప్రభావం నుంచి ఆదివాసులను బయటపడేయాలంటే నిర్బంధం ఒక్కటే పరిష్కారంకాదనీ, అభివృద్ధివైపు కూడా దృష్టి పెట్టాలని ప్రభుత్వాలు ఆలోచించక తప్పని స్థితిని కల్పించింది కూడా ఆ పోరాటాలే. అందుకే గతంలో జరిగిన ఉద్యమాలను, ఆ పోరాటాల్లో అసువులు బాసిన వారి త్యాగాలను స్మరించుకోవాల్సిన అవసరం ఉంది.
నేటి రాజకీయ పార్టీలూ, ప్రజా ఉద్యమాలకు నేతృత్వం వహిస్తున్న నాయకులూ ఆ పోరాటాల నుంచి నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. నిజాయితీ, పట్టుదల, త్యాగం నేటి ఉద్యమాల్లో ప్రజలు ఆశించిన స్థాయిలో కనబడటం లేదన్నది బలంగా వినవస్తున్న విమర్శ. అలాగే పేదరికం, ఆకలి, అసమానత్వం సమూలంగా పారదోల డానికి అన్ని ప్రజా ఉద్యమాలను ఒక్క తాటిపైకి తెచ్చి, ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా కూడగట్టడం అవసరం. చెల్లాచెదురుగా ఉన్న సాయుధ దళాలను సమీకరించి, నాటి శ్రీకాకుళ పోరాటాన్ని సంఘటితంగా, మరింత ఉధృతంగా నడపడానికి ఎనలేని కృషి సాగించిన అమరులు పైలా వాసుదేవరావు ఆచరణ నేటి తరం నేతలకు స్ఫూర్తి కావాలి.
-మల్లెపల్లి లక్ష్మయ్య
(నేడు పైలా వాసుదేవరావు రెండో వర్ధంతి
http://www.sakshi.com/main/WeeklyDetails.aspx?Newsid=39371&Categoryid=1&subcatid=18
No comments:
Post a Comment