విప్లవోద్యమ నేత, పీపుల్స్‌వార్ వ్యవస్థాపక సభ్యుడు కే జీ సత్యమూర్తి కన్నుమూత
కృష్ణా జిల్లా కందులపాడులో కుమారుడి ఇంట మరణం
కొంతకాలంగా పక్షవాతంతో బాధపడుతున్న సత్యమూర్తి
ప్రముఖుల సంతాపం.. నేడు విజయవాడలో అంత్యక్రియలు
1969లో శ్రీకాకుళం రైతాంగ సాయుధ పోరాటంలో కీలక పాత్ర
1980లో కొండపల్లితో కలిసి పీపుల్స్ వార్ స్థాపన
కొండపల్లి అరెస్టుతో ప్రధాన కార్యదర్శిగా బాధ్యతల స్వీకరణ
1986లో పీపుల్స్‌వార్ నుంచి బయటకు..
శివసాగర్ అనే కలం పేరుతో విప్లవ రచనలు, గీతాలు
హైదరాబాద్, వరంగల్, విజయవాడ, న్యూస్‌లైన్ ఒక చేత్తో ఆయుధం, మరో చేత్తో కలం పట్టి.. నమ్మిన సిద్ధాంతం కోసం జీవితాన్ని అర్పించిన ఆరుణతార రాలిపోయింది. గిరిజనులు, పేదలు, దళితుల చైతన్యానికి తుది వరకూ అక్షరాయుధాలు సంధించిన విప్లవ సూరీడు అస్తమించాడు. పీపుల్స్‌వార్ వ్యవస్థాపక సభ్యుడు, పీపుల్స్‌వార్ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన ఏకైక దళిత నాయకుడు కంభం జ్ఞాన సత్యమూర్తి(85) మంగళవారం ఉదయం కన్నుమూశారు. కొంతకాలంగా ఆయన పక్షవాతంతో బాధపడుతున్నారు. కృష్ణాజిల్లా జి.కొండూరు మండలం కందులపాడు గ్రామంలోని తన కుమారుడి ఇంట్లో ఉంటున్నారు. తీవ్ర అనారోగ్యంతో మంగళవారం ఆయన అక్కడే మృతిచెందారు.
ఆయన మరణవార్త తెలియగానే అభిమానులు, నేతలు శోకసంద్రంలో మునిగిపోయారు. కేజీ సత్యమూర్తి పార్ధివ దేహాన్ని సందర్శించి, నివాళులు అర్పించారు. ప్రజల సందర్శనార్థం ఆయన భౌతిక కాయాన్ని మంగళవారం రాత్రి విజయవాడకు తరలించారు. ఆయన సన్నిహితులు, స్నేహితులు, అభిమానులు ఎక్కువగా ఉన్న సున్నపు బట్టీల సెంటర్‌లో ఆయన పార్ధివ దేహాన్ని ఉంచారు. బుధవారం ఉదయం 10 గంటలకు అక్కడి నుంచి అంతిమయాత్ర ప్రారంభమవుతుందని, స్వర్గపురి శ్మశానవాటికలో అంత్యక్రియలు జరుగుతాయని ఆయన కుటుంబీకులు తెలిపారు.
1926లో జననం 1926లో కృష్ణాజిల్లా నందివాడ మండలం పోలుకొండ గ్రామ శివారు శంకరంపాడులో కంభం ప్రసన్నరావు, మరియమ్మల తొలిసంతానంగా ఆయన జన్మించారు. ఆయనకు సోదరుడు కేరీ, సోదరి మంజులాబాయి. గుం టూరు ఆంధ్రా క్రిస్టియన్ కళాశాలలో డిగ్రీ పూర్తి చేసి.. విశాఖపట్నంలో పొలిటికల్ సైన్స్‌లో పోస్టుగ్రాడ్యుషన్ చేశారు. స్వగ్రామానికి చెందిన మణిమ్మను 1955లో వివాహమాడారు. కేజీ సత్యమూర్తికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. కుమారులలో సౌజన్య చనిపోగా.. సిద్ధార్థ లారీడ్రైవర్‌గా పనిచేస్తూ కందులపాడులో స్థిరపడ్డారు. పెద్దకుమారై శ్రీదేవి విశాఖపట్నంలో డాక్టర్‌గా పనిచేస్తుండగా.. చిన్నకుమార్తె అనుపమ స్టీల్ ప్లాంటులో ఉద్యోగిగా పనిచేస్తున్నారు. పీపుల్స్‌వార్ పార్టీతో విబేధాలు తలెత్తిన సమయంలో ఆయనకు తోడుగా నిలిచిన పార్టీ సభ్యురాలు పార్వతితో సహజీవనం చేశారు. తదనంతరం కాలంలో ఆమె క్యాన్సర్‌తో మరణించారు.
ఉపాధ్యాయుడిగా విప్లవ పాఠాలు కేజీ సత్యమూర్తిగా సుపరిచితులైన కంభం జ్ఞాన సత్యమూర్తి ఉద్యమ ‘నెలబాలుడు’. దళిత కుటుంబంలో పుట్టి విప్లవబాటలో నడిచారు. సమాజంలో ఆర్థిక అసమానతలు తొలగిపోవాలని ఆకాంక్షిం చారు. సమాజంలో మార్పు మార్క్సిజం, లెనినిజం, మావోయిజంతోనే సాధ్యమని విశ్వసించారు. 1954 నుంచి విద్యార్థి ఉద్యమంలో(ఏఐఎస్‌ఎఫ్)లో ఆయన చురుగ్గా పాల్గొన్నారు. గుడివాడ, మచిలీపట్నంలో రిక్షా కార్మిక సంఘం, రైతు కూలీ సంఘాలను స్థాపించి, కార్మిక వర్గ హక్కుల కోసం పోరాడారు. విప్లవకారుల సమన్వయ కమిటీలో కీలకభూమిక పోషించిన సత్యమూర్తిపై పోలీసుల నిఘా పెరగడంతో విజయవాడ నుంచి వరంగల్‌కు మకాం మార్చారు. 1968లో వరంగల్ సెయింట్ గ్యాబ్రియేల్‌లో ఇంగ్లిష్ టీచర్‌గా పనిచేస్తూనే యువకుల్లో విప్లవ భావాలను రగిలించారు. విప్లవోద్యమానికి బీజాలు వేసేందుకు ఆయన వరంగల్‌ను కేంద్రంగా చేసుకున్నారు.
పక్కనే ఉన్న ఫాతిమా స్కూల్లో కొండపల్లి సీతారామయ్య హిందీ టీచర్‌గా పనిచేసేవారు. 1969లో నక్సల్‌బరీ ఉద్యమ నేత చారుమజుందార్ మన రాష్ట్రానికి వచ్చినపుడు గుంటూరు జిల్లా గుత్తికొండ బిలంలో జరిగిన కీలక సమావేశంలో సత్యమూర్తి పాల్గొన్నారు. 1969 శ్రీకాకుళ రైతాంగ సాయుధ పోరాటంలో కూడా ఆయన చురుకైన పాత్ర పోషించారు. అదే ఏడాది వరంగల్ కేంద్రంగా ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి ఆయన బీజం వేశారు. 1977 ఎమర్జెన్సీ సమయంలో విప్లవకారులతోపాటు అరెస్టయ్యారు. ఎమర్జెన్సీకి ముందు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారనే అభియోగంతో అరెస్ట్ చేయగా.. వరంగల్ కోర్టు ప్రాంగణం నుంచి తప్పించుకుని అజ్ఞాతంలోకి వెళ్లారు. నక్సల్బరీ స్ఫూర్తితో 1980లో కొండపల్లి సీతారామయ్య, సత్యమూర్తిలు పీపుల్స్‌వార్‌ను స్థాపించారు. 1982లో కొండపల్లి అరెస్టు కావడంతో పీపుల్స్ వార్ ప్రధాన కార్యదర్శి బాధ్యతలను చేపట్టారు. కొండపల్లి జైలు నుంచి తప్పించుకుని వచ్చిన తరువాత కూడా 1985 వరకూ సత్యమూర్తి అదేస్థానంలో కొనసాగారు. పీపుల్స్‌వార్ నుంచి ఇప్పటి మావోయిస్టు పార్టీ వరకు లెక్క తీసుకున్నా.. ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలను చేపట్టిన దళిత నాయకుడు సత్యమూర్తి ఒక్కరే.
‘కొండపల్లి’తో విబేధాలు పీపుల్స్‌వార్‌లో దళితులకు సంబంధించిన అంశంపై సిద్ధాంతపరమైన విబేధాలు తలెత్తడంతో 1986లో పార్టీ ఆయన్ను బహిష్కరించింది. అదే సమయంలో కొండపల్లి, ఇతర నేతలతోనూ ఆయనకు మనస్పర్థలు ఏర్పడ్డాయి. అయితే, తానే పార్టీని బహిష్కరిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. కొన్నాళ్లపాటు రహస్య జీవితం గడిపారు. విప్లవ రచయితల సంఘం(విరసం) 20వ మహాసభల సందర్భంగా 1990లో మొదటిసారిగా సాధారణ జీవితంలోకి వచ్చారు. పీపుల్స్‌వార్‌లో అగ్రకుల ఆధిపత్యం ఎక్కువగా ఉందని విమర్శించారు. ప్రజలను మరచిపోవడం వల్లే పీపుల్స్‌వార్ నామమాత్రంగా మిగిలిపోయిందని వ్యాఖ్యానించారు. వారు అడవుల్లో కాకుండా ప్రజల్లో ఉన్నప్పుడే నిజమైన రక్షణ దొరుకుతుందని అభిప్రాయపడ్డారు. మావోయిస్టులు, సీపీఐ, సీపీఎం నేతలు.. దళితులను నాయకత్వ స్థానాలకు ఎదగడానికి దోహదపడలేదని సత్యమూర్తి అభిప్రాయపడ్డారు. పార్టీ నుంచి బయటకు వచ్చిన తరువాత కొంత కాలం బహుజన్ సమాజ్ పార్టీలో పనిచేసినా అక్కడా ఇమడలేకపోయారు. ఆ తరువాత 1996లో బహుజన్ రిపబ్లిక్ పార్టీని స్థాపించారు. 1999లో ముదినేపల్లి నియోజకవర్గం నుంచి ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. అంబేద్కర్, పూలే విధానాలను ప్రచారం చేసేందుకు సామాజిక విప్లవ వేదికను ఏర్పాటు చేశారు.
ఆయన ఆశయాలు ఆదర్శం కావాలి నారాయణ
నమ్మిన సిద్ధాంతం కోసం నిబద్ధతతో పనిచేసిన కేజీ సత్యమూర్తి ఆశయాలు ప్రజానీకానికి ఆదర్శం కావాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.నారాయణ అన్నారు. సత్యమూర్తి భౌతిక కాయాన్ని సందర్శించి, ఆయన నివాళులు అర్పించారు.
చనిపోయారని భావించి..
1971లో ఖమ్మం జిల్లా గుడిమెళ్ల అడవుల్లో స్పెషల్ ఆర్మ్‌డ్ పోలీసుల కాల్పుల్లో తీవ్ర గాయాలతో పట్టుబడిన నక్సల్స్ నేత కొల్లిపర రామనరసింహారావును పోలీసులు కాల్చి చంపారు. ఆయనను సత్యమూర్తిగా భావించి.. కాల్పుల్లో ఆయన మరణించినట్లు ప్రకటించారు. భార్యాపిల్లలతో సహా సత్యమూర్తి చనిపోయినట్లుగా అంతా భావించారు. రాష్ర్తవ్యాప్తంగా సంతాప సభలు జరిగాయి. సత్యమూర్తి మరణించారనే అభిప్రాయంతో దిగంబర కవి నగ్నముని తన కావ్యాన్ని ఆయనకు అంకితమిచ్చారు. పీపుల్స్‌వార్ కూడా వ్యూహాత్మకంగా సత్యమూర్తి బతికి ఉన్నారనే విషయాన్ని బయటకు వెల్లడించలేదు.
పోరాట యోధుడు
వివిధ పార్టీల నేతల సంతాపం
కేజీ సత్యమూర్తి మరణం పట్ల పలువురు నేతలు ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. జీవితకాలమంతా ఆయన పేదలు, దళితుల కోసం శ్రమించారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకర్‌రావు, ఎస్సీ సెల్ రాష్ట్ర కన్వీనర్ నల్లా సూర్యప్రకాష్‌రావు కొనియాడారు. నమ్మిన సిద్ధాం తం కోసం రాజీలేని పోరాటం చేసిన యోధుడు సత్యమూర్తి అని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, ఎంపీ చిరంజీవి అన్నారు. దళితుడిగా పుట్టుకతో వివక్షను ఎదుర్కొన్న సత్యమూర్తి.. కులం సంకెళ్ల నుంచి రాజకీయాలను విముక్తి చేసేందుకు కృషి చేశారని లోక్‌సత్తా పార్టీ కొనియాడింది.
కలం పేరు శివసాగర్..
శివసాగర్ కలం పేరుతో సత్యమూర్తి రాసిన రచనలన్నింటినీ విరసం నేత వరవరరావు పుస్తకరూపంలో తీసుకువచ్చారు. లాంగ్‌మార్చ్.. లాంగ్ మార్చ్.. లాంగ్‌మార్చ్.. ఎర్రసేన బెదిరిపోదు అంటూ ఆయన రాసిన పాటలు ఉద్యమానికి ఉత్తేజాన్ని ఇచ్చాయి. ఉద్యమ నెల బాలుడు, అమ్మా... నన్ను కన్నందుకు విప్లవాభివందనాలు వంటి రచనలు ఆయనకు ఎనలేని పేరుప్రఖ్యాతులు తెచ్చా యి. గెరిల్లా విప్లవగీతాలు, జనం ఊపిరిలో, పది వసం తాలు, నెలవంక, నడుస్తున్న చరిత్ర, యుద్ధచంద్రుడు, అం బేద్కర్ సూర్యుడు అనే పుస్తకాలను రాశారు. చెల్లీ చం ద్రమ్మ అనే నృత్యనాటిక, భూమి కోసం అనే సినిమాలో ఆయన పాటలను వాడుకున్నారు. ‘విప్పపువ్వుల చెట్ల సిగన దాచిన విల్లంబులన్నీ నీకిస్తా తమ్ముడా..’ అనే పాటను శ్రీరాములయ్య సినిమాలో వాడారు. ఈ పాటలు విశేష జనాదరణ పొందాయి. పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎదురీత, ఏకలవ్య అనే పత్రికలనూ ఆయన నడిపారు.
ఉద్యమాన్ని రికార్డు చేసిన విప్లవ కవి శివసాగర్. తాను నమ్మిన గతితార్కిక ఆలోచనలతో రాజీ కాకుండా నమ్మిన ఆశయం కోసం విప్లవ పార్టీలోని అత్యున్నత పదవినీ త్యజించడానికి వెనుకాడని మహానాయకుడు.
- గద్దర్
దేశంలోనే విప్లవోద్యమానికి పునాదులు వేసిన మొట్టమొదటి దళిత విప్లవకారుడు. సత్యమూర్తి మరణం దళిత బహుజన, విప్లవోద్యమానికి తీరని లోటు.
-ప్రొఫెసర్ కంచె ఐలయ్య
పండిత, పామరులను కదిలించగల, అనుభూతింపజేయగల విప్లవ, భావకవి శివసాగర్. జానపద సాహిత్యం సొగసులు తెలిసినవాడు. విప్లవస్వాప్నిక కవుల్లో అగ్రగణ్యుడు. దళిత తత్వశాస్త్రాన్ని, సౌందర్యాన్ని విప్లవీకరించిన మహాకవి.
-గోరటి వెంకన్న
విప్లవోద్యమాలకు గేయ, వచన కవిత్వాన్ని అం దించి, ఊపిరిపోసినవాడు శివసాగర్. నరజాతి చరిత్ర గమనాగమనాల్లో నల్లసూరీడుగా ఎల్లలను చెరిపినవాడు. పల్లవించిన ప్రజల పాట.
- డాక్టర్ అందె శ్రీ
ఉదయిస్తున్న సూరీడు, మరణం లేని వీరుడు. సత్యమూర్తి జనం మనిషి. ఆయన మరణం ఒక జననం.
- గూడ అంజయ్య
విప్లవ సాహిత్యానికి దశాదిశ నిర్ధారించిన కామ్రేడ్ సత్యమూర్తికి విప్లవ జోహార్లు. సత్యమూర్తి విప్లవ సాంస్కృతికోద్యమంలో చెరగని ముద్రవేశారు.
- విమలక్క
http://www.sakshi.com/main/FullStory.aspx?catid=359047&Categoryid=1&subcatid=33

No comments:
Post a Comment