Thursday, 19 April 2012

కేజీ సత్యమూర్తి ఇక లేరు


పీపుల్స్‌వార్‌గా మొదలై దళిత వాయిస్‌గా మారిన కామ్రేడ్
విప్లవ బాటకు.. పాటకు మార్గదర్శకుడు
కొండపల్లితో కలిసి నక్సల్ ఉద్యమానికి పాదులు
కారంచేడు ఘటనతో దళిత ఉద్యమ పంథా
నేడు విజయవాడలో అంత్యక్రియలు

విప్లవ పాటకు పురుడుపోసిన 'నరుడో భాస్కరుడు'' నింగికేగాడు. దళిత పదానికి పల్లవి కూర్చిన 'నల్ల సూరీడు' అస్తమించాడు. నెలబాలుడిని ఆజానుబాహుడిని చేసిన 'తోట రాముడు' తరలిపోయాడు. 'చెల్లి చంద్రమ్మ'ను దగ్గరుండి సాగరం దాటించిన శివ సాగరుడు చుక్కల్లో కలిశాడు. ట్రిగ్గర్‌పై వేలితోనే కాదు..బ్యాలెట్ 'బాయ్‌నెట్'లోంచి కూడా కుల రహిత సమాజాన్ని కలగన్న స్వాప్నికుడు కన్నుమూశాడు. అడవుల్లోనే కాదు..అంటరాని వాడల్లోనూ ధిక్కార గొంతుకను వినిపించిన కేజీ సత్యమూర్తి శాశ్వతంగా విశ్రమించాడు.


విజయవాడ, విశాఖ, హైదరాబాద్, ఏప్రిల్ 17  పీపుల్స్‌వార్ పార్టీ వ్యవస్థాపక నేత, తొలితరం మార్క్సిస్టు- లెనినిస్టు, దళిత బహుజన ఉద్యమ నాయకుడు కంభం జ్ఞాన సత్యమూర్తి అలియాస్ శివసాగర్ (84) అనారోగ్యంతో మరణించారు. కృష్ణాజిల్లా జి. కొండూరు మండలం కందులపాడులోని పెద్ద కుమారుడి స్వగృహంలో మంగళవారం కన్నుమూశారు. ఆరు దశాబ్దాల పాటు విప్లవ, దళిత ఉద్యమ నిర్మాణంలో తలమునకలైన సత్యమూర్తి చరమాంకంలో కుటుంబ సభ్యుల మధ్య గడిపారు. ఆయనకు భార్య మణెమ్మ, పెద్ద కుమారుడు సిద్ధార్థ, కుమార్తెలు శ్రీదేవి, అనుపమ ఉన్నారు. రెండో కుమారుడు రోడ్డు ప్రమాదంలో మరణించారు.

ప్రముఖ నక్సల్ నేత కొండపల్లి సీతారామయ్యతో కలిసి 1980లో పీపుల్స్‌వార్ పార్టీని సత్యమూర్తి స్థాపించారు. విప్లవోద్యమ అగ్రనేతగా కొనసాగుతూనే తెలుగు నాట విప్లవ సాహిత్యానికి మార్గదర్శకత్వం అందించారు. కొత్త కొత్త ప్రతీకలతో విప్లవ కవితను సుసంప న్నం చేశారు. అనంతర పరిణామాల్లో తన జాతి విముక్తి కోసం శాస్త్రీయ పద్ధతుల్లో సృజనాత్మకంగా ఉద్యమించారు. అందుకనే సత్యమూర్తి మరణ వార్త అటు విప్లవ శిబిరాన్ని. ఇటు దళిత వేదికలను దిగ్భ్రాంతికి గురి చేసింది. విజయవాడ సున్నపు బట్టీల సెంటర్‌లోని సీపీఐ(ఎం-ఎల్) కార్యాలయంలో సత్యమూర్తి భౌతికకాయాన్ని అభిమానుల సందర్శనార్థం ఉంచారు. బుధవారం విజయవాడ స్వర్గపురి శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

స్వార్థం శిరస్సు నరికిన వాడు..
కృష్ణాజిల్లా నందివాడ మండలం పోలుకొండ శివారు శంకరంపాడులో ప్రసన్నరావు, మేరీ దంపతులకు 1928లో సత్యమూర్తి జన్మించారు. చర్చి ఫాదర్ అయిన తండ్రి గుడివాడకు రావడంతో కళాశాల విద్య అక్కడ పూర్తి చేశారు. విశాఖ ఆంధ్రా యూనివర్సిటీలో పొలిటికల్ సైన్స్‌లో పీజీ చేశారు. విద్యార్థి దశలోనే కమ్యూనిస్టు సిద్ధాంతాలకు ఆకర్షితులయ్యారు. అప్పటి ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీలో చురుకైన పాత్ర పోషించారు. కృష్ణాజిల్లా పరిషత్ మాజీ చైర్మన్ పిన్నమనేని కోటేశ్వరరావు ఆయనకు సహధ్యాయి.

ఆ రోజుల్లో పార్టీ ఆదేశం మేరకు రిక్షా కార్మిక సంఘం బాధ్యతలను సత్యమూర్తి నిర్వహించారు. తొలి నుంచీ సృజనశీలి కావడంతో పార్టీ పత్రికలకు వ్యాసాలు, కవితలు రాసేవారు. ఈక్రమంలో విశాలాంధ్ర సబ్ ఎడిటర్‌గా, గుంటూరు యువజన సంఘం పత్రిక ఎడిటర్‌గా పనిచేశారు. 1959-60లో యూనివర్సిటీ విద్య (డబుల్ ఎంఏ) పూర్తి చేసిన అనంతరం వృత్తి విప్లవకారుడిగానే ఉండాలని నిర్ణయించుకున్నారు. మిత్రుల ప్రోద్బలంతో వరంగల్ తరలిపోయారు. స్వార్థం శిరస్సు నరికినవాడే రివల్యూషనరీ అని సంకల్పించుకున్నాడు.

సూర్యుడుకుట్రదారుడు కాదు..
వరంగల్ జిల్లా ఖాజీపేట ప్రాంతం ఫాతిమానగర్ సెయింట్ గాబ్రియేల్ కళాశాలలో ఇంగ్లీషు అధ్యాపకుడుగా పని చేశారు. అక్కడే హిందీ పండిట్‌గా పని చేస్తున్న కొండపల్లి సీతారామయ్యతో పరిచయం కావడం సత్యమూర్తి జీవన పథాన్నే మార్చివేసింది. 1969లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో, విశాఖ ఉక్కు ఉద్యమంలో పాల్గొని అరెస్టు అయ్యారు. కొండపల్లి ప్రోద్బలంతో 1970ల్లో నక్సలైట్ ఉద్యమ నిర్మాత చారుమజుందార్‌ను గుంటూరు జిల్లా గుత్తికొండ బిలంలో కలిశారు.

ఆ తరువాత కొద్ది రోజులకే చారుమజుందార్ చనిపోవడం, విప్లవోద్యమానికి నాయకత్వం కొరవడటం, బెంగాల్, శ్రీకాకుళ ఉద్యమాలు అణచివేయబడటం వంటి నిరాశభరిత విప్లవ పరిస్థితుల్లో కొండపల్లి, సత్యమూర్తి ఎదురీదాలని సంకల్పించారు. 'ఉద్యమం నెలబాలుడు' సంకలనం ఈ నేపథ్యంలో నే వచ్చింది. 1975 ఎమర్జెన్సీలో సత్యమూర్తి అరెస్టు అయ్యారు. పార్వతీపుురం కుట్రకేసులో ఐదేళ్లు జైల్లో గడిపారు. విప్లవం కుట్ర కాదు..సూర్యుడు కుట్రదారుడు'' కాదని కోర్టులో నినదించారు.

అమ్మా నను కన్నందుకు..
కొండపల్లి రాజకీయ దార్శనీకత, సత్యమూర్తి సృజనాత్మక మేధస్సు కలగలిసి వందలాది మందిని విప్లవోద్యమంలోకి నడిపించింది. ఈ క్రమంలో 1980లో పీపుల్స్‌వార్ పార్టీ ఏర్పడింది. కొండపల్లి అరెస్టుతో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బాధ్యతలు సత్యమూర్తి చేపట్టాల్సి వచ్చింది. ఈ క్రమంలో ప్రకాశం జిల్లా కారంచేడులో దళితులపై దాడులు జరగడం పునరాలోచనలో పడేసింది. ఇక అప్పటి నుంచి దళిత ఉద్యమాలపై దృష్టి సారించారు.ఐతే, ఏ శిబిరంలో పని చేసినా కన్న తల్లిని సత్యమూర్తి మరవలేదు.

విప్లవ తల్లులందరికీ అన్వయించేలా  అమ్మా నను కన్నందుకు'' అనే గీతాన్ని రచించారు. గెరిల్లా విప్లవగీతాలు, జనం ఊపిరితో, పది వసంతాలు, నెలవంక, నడుస్తున్న చరిత్ర, యుద్ధ చంద్రుడు సంకలనాలు, అంబేద్కర్ సూరీడు అనే దళిత తాత్విక గ్రంథం రచించారు. 'ఆస్తుల రద్దు' పోరాటం నుంచి అస్థిత్వ ఉద్యమాల్లోకి వచ్చినా ఏనాడూ తన స్వార్థం చూసుకున్నవారు కాదు. ఆయన కుమారుడు సిద్దార్థ లారీ డ్రైవర్‌గా పని చేస్తుండటమే దీనికి నిదర్శనం.

మానవతావాది కొండపల్లి సహచరి
కేజీ సత్యమూర్తి మానవతావాది. జనంతో ఉండేవాడు. మా ఇంట్లో నాలుగేళ్లు అద్దెకు ఉన్నారు. కొండపల్లి సీతారామయ్యతో నేను విభేదించిన సందర్భాల్లో.. అమ్మ చెప్పిందే కరెక్ట్'' అంటూ నన్ను సమర్థించేవారు. ఆ రోజుల్లో అంటరానితనం అధికంగా ఉండేది. ఆయనకు ఇల్లు అద్దెకు ఇచ్చామని చుట్టుపక్కల వాళ్లు గేలి చేసేవారు.

నాకు మంచి పుస్తకాలు తెచ్చి ఇచ్చేవారు. తన కవిత్వంలో ప్రకృతి సౌందర్యం తొంగిచూసేది. సీతారామయ్యతో విభేదించి బయటకు వచ్చినా నాతో మాట్లాడుతుండేవారు. ఓసారి నా కన్నీళ్లను...తన కన్నీళ్లతో తుడుస్తానన్నారు. దళిత సాహిత్యం రాసిన బోయి భీమన్న, జాషువాలను సమాజం గుర్తించింది. కానీ సత్యమూర్తికి ఆ గౌరవం దక్కలేదు.

తాతకు తగ్గ మనమడు
దిక్కార తాతయ్యకు దీటైన మనవడిగా నిలిచాడు ప్రసన్న సత్యమూర్తి (4). తాత మరణవార్తను తండ్రి సిద్ధార్థకు ప్రసన్న ఫోన్‌లో తెలిపిన తీరు మళ్లీ 'సత్యమూర్తి'ని గుర్తుకు తెచ్చిందని స్థానికులు అంటున్నారు. నాన్న నువ్వు అధైర్యపడొద్దు... జాగ్రత్తగా ఇంటికి రా'' అని నాన్నకు ధైర్యం చెప్పాడు. తాత ఏసయ్య దగ్గరకు వెళ్లిపోయా''డంటూ ఓదార్చడానికి ప్రయత్నించిన వారికి నచ్చచెప్పడం అక్కడున్నవారికి ముచ్చటేసింది.


ఒక ఉద్యమం ముగిసింది
కేజీ సత్యమూర్తి ఇక లేరు
https://www.andhrajyothy.com/mainnewsshow.asp?qry=2012/apr/18/main/18main3&more=2012/apr/18/main/main&date=4/18/2012

No comments:

Post a Comment