Sunday, 15 April 2012

అన్న...దమ్ములు-4


అన్న...దమ్ములు-4
అన్న అమరుడే!
హైదరాబాద్, ఏప్రిల్ 14  విప్లవోద్యమంలో మహిళలను సంఘటితం చేయడంపై కామ్రేడ్ కిషన్‌జీ లెనినిస్టు వైఖరికి పూర్తిగా కట్టుబడి ఉన్నాడు. విప్లవ కార్యాచరణలో మహిళలకు విడిగా ఒక సంఘం ఉండడం అవసరమంటూ దాని నిర్మాణాన్ని ప్రోత్సహించి దండకారణ్యంలో - గడ్చిరోలిలో 'ఆదివాసీ మహిళా సంఘ' నిర్మాణానికి బీజాలు వేశారు. దీని వెనక కిషన్‌జీ సైద్ధాంతిక అవగాహనకు చాలా ప్రాధాన్యం ఉంది. ఆ పరంపరను ఆయన 2007లో నందిగ్రాంలో మతాంగి మహిళా సంఘటన్‌ను, 2010లో లాల్‌గఢ్‌లో నారీ ఇజ్జత్ బచావో కమిటీ నిర్మించడం వరకు కొనసాగించాడు.

దండకారణ్య మహిళా పోరాటాలను ఎత్తిపడుతూ 1993లో పాట్నా సెమినార్‌కు పత్రం రాసి పంపింది ఆయనే. అణగారిన మహిళల విషయంలో పాలకవర్గాల మహిళా కమిషన్‌లు అవలంబిస్తున్న వైఖరిని ప్రశ్నిస్తూ లాల్‌గఢ్ మహిళల పక్షాన నిలిచి, బెంగాల్ మహిళా కమిషన్‌కు రాసిన లేఖ ఆయన చివరి రచనలలో ఒకటి. ప్రజాయుద్ధంలో తమ జీవిత సహచరులను కోల్పోయిన మహిళలకు అండ గా నిల్చి ధైర్యాన్నివ్వడం, ఆదివాసీ మహిళా కామ్రేడ్స్‌ను అన్ని రంగాలలో ప్రోత్సహించి, వెన్నుతట్టి ముందు నిలవడం ఆయన నుంచి ఎవరైనా నేర్చుకోవలసిందే.

గతంలో విప్లవోద్యమాలు విజయవంతం అయిన ఏ దేశంలోనూ అక్కడి ప్రజాసైన్యాలలో ఇంత పెద్దఎత్తున మహిళలు లేరన్నది ఒక వాస్తవం. పీఎల్‌జీఏలో పెద్ద ఎత్తున మహిళలు భాగస్వాములు కావడం, నిర్దిష్టంగా దండకారణ్యంలో 40 శాతం మహిళలు పీఎల్‌జీఏలో ఉండడం పురుషస్వామ్యం అనే అదనపు కాడిని భరిస్తున్న 'ఆకాశంలో సగం' విముక్తికి చాలా మంచి పరిణామమని కామ్రేడ్ రామ్‌జీ గ్రహించారు.

వారిని అన్ని రంగాలలో ప్రోత్సహిస్తూ వారి అభిమానాన్ని, విశ్వాసాన్ని గొప్పగా చూరగొన్నారు. ఆయన అమరత్వం తర్వాత క్రాంతికారి ఆదివాసీ మహిళా సంఘటన అధ్యక్షురాలు కామ్రేడ్ నర్మదక్క ఆయన జ్ఞాపకాలతో నాకు రాసిన ఉత్తరంలో... 'మనల్ని ఓదార్చే మన అన్న వెళ్లిపోయాడుగా! దుఃఖంతో చిన్నబోతూ పడుకుంటే చేయిపట్టి లేపి ధైర్యాన్నిచ్చే మన అన్న లేడుగా! మలేరియా వస్తే కలలో వచ్చి పలకరించే అన్న నిజంగానే కల అయిపోయిండుగా! అన్న అందించిన చేయి ఊతంతో, విశ్వాసంతో సూర్జాగఢ్ నుండి జంగల్ మహల్ వరకు అర్ధాంతరంగా ఆగిపోయిన వారధిని నిర్మించడానికి, ఆయన ఆశయాలను పరిపూర్తి చేయడానికి ప్రతినబూనుదాం'' అంటూ తక్షణ కర్తవ్యాన్ని ప్రకటించింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ కార్యదర్శిగా ఉన్నప్పుడు కామ్రేడ్ కోటేశ్వర్లు ప్రచార రంగంపై ప్రత్యేక శ్రద్ధ కనబర్చేవాడు. ప్రచారంలో పత్రికలు ఒక ముఖ్య సాధనం. 'పత్రిక ఒక ఆర్గనైజర్' అన్న లెనిన్ మాటల స్ఫూర్తితో ఆయన ఉద్యమ ప్రచార కమిటీ (ఏపీసీ) బాధ్యత వహించాడు. కమిటీ అధికార పత్రిక 'క్రాంతి' పీరియాడిసిటీ తగ్గించి క్రమం తప్పకుండా వెలువరించడానికి వ్యాసకర్తలను ప్రోత్సహిస్తూ, తాను పత్రికలకు రాస్తూ వచ్చాడు. తాను దండకారణ్యానికి బదిలీ అయిన తర్వాత మధ్య భారతంలో విప్లవ విస్తరణ ప్రాధాన్యతను నొక్కి చెబుతూ హిందీలో 'ప్రభాత్' పత్రికను తీసుకురావడానికి పూర్తి బాధ్యతలు తీసుకున్నాడు.

దండకారణ్యంలో సైన్యం పెంపొందుతూ ప్రజాయుద్ధం ముందుకు పోతున్న క్రమంలో యుద్ధ పత్రికను ప్రారంభించాలన్న నిర్ణయంలో భాగస్థుడై 'జంగ్'ను నడిపించాడు. 2000 చివర్లో జరిగిన దండకారణ్య పార్టీ మూడో మహాసభ వేదిక వద్ద ఉద్యమ నాయకత్వ కామ్రేడ్‌లతో కబుర్లు చెబుతూ ఎక్కడికక్కడే స్థానిక భాషల్లో మాస్ పత్రికలు తేవలసిన అవసరం చాలా పెరిగిందని చెప్పారు. భారీ హంగులు లేకుండా మొబైల్ ప్రెస్‌ల నిర్వహణతో పత్రికల నిర్వహణకు పూనుకోవాలని కోరాడు.

అఖిలభారత స్థాయిలో విప్లవ పత్రిక వెలువడకుండా శత్రువు ఎన్ని ఆటంకాలు ఏర్పరుస్తున్నప్పటికీ... అమరుడు కామ్రేడ్ ఆజాద్‌తో కలిసి అన్నిటికీ దీటైన జవాబులు, పద్ధతులు ఎన్నుకుంటూ వ్యాన్‌గార్డు, పీపుల్స్‌మార్చ్ పత్రికలను తీసుకురావడానికి ఎనలేని కృషి చేశారు. హిందీ, బంగ్లాలో వాటి అనువాదాలు తేవడానికి చాలాకాలం సొంత బాధ్యత తీసుకున్నారు. కలకత్తా కేంద్రంగా ఆ పత్రికలు రావడం పాఠకులకు తెలియనిది కాదు.

కామ్రేడ్ కిషన్‌జీతా కోటేశ్వర్లు పశ్చిమ బెంగాల్ వెళ్లాక కలకత్తాలోని షహీద్ గ్రౌండ్స్‌లో జరిగిన సభలు, సమావేశాలన్నింటి వెనక ఆయన కృషి ఎంతో ఉంది. 'తిరిగి తిరిగి వచ్చింది నక్సల్బరీ' అనే విప్లవ సందేశాన్ని పశ్చిమ బెంగాల్, కలకత్తా ప్రజానీకానికి చేర్చి... వారిలో మునుపటి విప్లవ చేవను, ఉత్సాహాన్ని నిలపడానికి ఎంతో ఆరాటపడేవాడు. కలకత్తా మహానగరంలో విశ్రాంతి వర్గంలో చేరిపోయిన పాతతరం విప్లవకారులను ప్రగతిశీల, ప్రజాస్వామ్య భావాలు కలవాళ్లను కలవడానికి ఆయన కాలికి బలపం కట్టుకొని తిరిగాడు.

సోషల్ ఫాసిస్టులకు నిలయంగా మారిన కలకత్తా మహానగరంలో నక్సల్బరీ నాటి వైభవాన్ని తిరిగి ప్రతిష్టించగలిగిన నక్సల్బరీ తర్వాతి తరం నాయకుడాయన. కలకత్తా-నందిగ్రాం-లాల్‌గఢ్‌ల మధ్య పోరాటానుబంధాన్ని నెలకొల్పి న ప్రచారకుడు, ఉద్యమకారుడు, విప్లవకారుడు మన తరం కిషన్‌జీ. లాల్‌గఢ్ సంతాల్‌లను కలకత్తా వీధుల్లో మార్చింగ్ చేయించిన సాహసి ఆయన. కలకత్తా రైటర్స్ బిల్డింగ్‌లో ప్రకంపనలు సృష్టించిన విప్లవ సేనాని ఆయన.

కామ్రేడ్ కిషన్‌జీ ప్రపంచానికి పరిచయం చేసింది లాల్‌గఢ్. ఆ లాల్‌గఢ్ ఉద్యమాన్ని ప్రపంచం ముందుంచడానికి ఆయన మీడియాను శక్తిమంతంగా ఉపయోగించుకొని తన గళంగా మార్చుకున్నాడు. విప్లవోద్యమ చరిత్రలోనే మున్నెన్నడూ లేని విధంగా ఆయన మీడియాతో వ్యవహరించి, పార్టీ వైఖరిని ప్రజల ముందుంచడానికి చాలా రిస్క్‌తో కూడిన శ్రమ తీసుకున్నాడు.

ఆ సమయం లో వ్యక్తిగా తాను తీసుకున్న నిర్ణయాల్లో కొన్ని తప్పులు జరిగాయి. వాటిని ఆయన చాలా నిజాయతీగా సీసీ (కేంద్ర కమిటీ) ముందు అంగీకరించాడు. దేశవ్యాప్తంగా లాల్‌గఢ్‌లను సృష్టించారని పార్టీ ప్రధాన కార్యదర్శి కొనియాడితే, లాల్‌గఢ్ ఏక్ ప్యారా నామ్ అంటూ పార్టీ సీనియర్ నాయకులు కిషన్‌దాను ఎత్తిపట్టారు. కిషన్‌జీ ఒరవడిని పట్టుకోవడం అంత తేలికైన పని కాదు. కానీ, ఆయన ప్రత్యక్ష శిక్షణలో తర్ఫీదైన ప్రజలు తప్పక ఆ ఒరవడిని కొనసాగిస్తారు.

పార్టీకి అరుదైన నాయకత్వ కేడర్లలో కిషన్‌జీ ఒకరు. ఆయన నిరంతర అధ్యయనశీలి. సిద్ధాంతాన్ని ఆచరణకు అన్వయిస్తూ పొందే నూతన అనుభవాలతో దానిని మరింత సంపద్వంతం చేసే దిశలో ఆయన ప్రతిభావంతమైన కృషి సల్పాడు. ఎత్తుగడలు రూపొందించడంలో మంచి దిట్ట. ఎత్తుగడలంటే ఎడమచేతి వాటంగా ఉండాలంటూ నవ్వేవాడు. ఎత్తుగడల విషయంలో బిగుసుకుపోయి ఉండకూడదని చెప్పడమే కాదు చేసి చూపారు. పాలకవర్గాల మధ్య తలెత్తే వైరుధ్యాలను చాకచక్యంగా ఉపయోగించుకోవాలని కోరేవాడు.

తెలివిగా ఉండాలి తప్ప గుడ్డిగా మోసపోకూడదని హెచ్చరించేవాడు. 1980-2010 మధ్య పార్టీ రూపొందించిన మౌలిక దస్తావేజులు, విధానాలు, కార్యక్రమాలు అన్నింటిలో ఆయన చొరవగా పాల్గొని వాటిని సంపద్వంతం చేయడంలో దీర్ఘకృషి సలిపాడు. కిషన్‌జీ పార్టీకి ఒక గురువు అని చెబుతూ మధ్య రీజియన్ రాజకీయ పాఠశాల ప్రభారీ కామ్రేడ్ గౌతం ఆయన జ్ఞాపకాలను ఉత్తరంలో ఇలా రాశాడు. 'అన్ని రంగాలలో రాణించిన రామ్‌జీ అన్ని ప్రాంతాలలో ఉద్యమ బీజాలు నాటాడు. రాజకీయాలు కామ్రేడ్స్‌ను చైతన్యపరుస్తాయి. మనుషుల మధ్య సంబంధాలు కమిట్‌మెంట్‌ను, ఆచరణలో విప్లవ గాఢతను పెంచి పట్టుదల, విశ్వాసాలను మరింత ఇనుమడింప చేస్తాయి.

ఈ రెండూ పంచి ఇచ్చిన మన అమరుడు రామ్‌జీ చిరకాలం గురువు స్థానం లో నిలుస్తాడు'. రామ్‌జీ జ్ఞాపకాలను, అనుభవాలను, ఆయన గురించి చెప్పుకోవాలంటే ఒక సుదీర్ఘ విప్లవోద్యమ చరిత్ర గురించి మాట్లాడుకోవాలి. విప్లవోద్యమ చరిత్ర నిర్మాణంలో తొలినుంచీ భాగమై సుదీర్ఘకాలం పనిచేసి, ఆ చరిత్రలో ఒక ప్రధాన భాగమై, ఆ చరిత్రకే అంకితమై ఒక కొత్త చరిత్రను అందించి వెళ్లిన వాళ్ల గురించి మాట్లాడుకోవడం... అంటే వాళ్లను ఆవిష్కరించుకోవడం చాలా కష్టమైన పనే. అది సమష్టి కృషి ద్వారానే సాధ్యమవుతుంది. అప్పుడే చరిత్రకు అమరుల త్యాగాలకు న్యాయం జరుగుతుంది. ఆ కృషిలో నా అనుభవాలు ఏ మేరకు తోడ్పడినా సంతోషమే.

రామ్ జీ అంతిమ యాత్రలో పాల్గొన్న కామ్రేడ్ గద్దర్ 'ఎవరైతే తాను నమ్మిన సిద్ధాంతం కోసం చివరి నెత్తుటిబొట్టు ఇవ్వగలిగారో... వారే చరిత్రను మార్చారు. వాళ్లే మారుస్తారు' అని అన్నారు. ఆ నెత్తుటి చరిత్రను సమష్టిగానే ఆవిష్కరించుకోవాలి. రామ్‌జీ దగ్గర తొలి కొరియర్‌గా పనిచేసిన ఠాకూర్ జగన్ మోహన్‌సింగ్ మాట్లా డుతూ... 'కమ్యూనిస్టు పార్టీలో సభ్యత్వం తీసుకోవడం ఒక ఎత్తు. కమ్యూనిస్టుగా జీవించడం ఒక ఎత్తు. చివరకు కమ్యూనిస్టుగా మరణించిన వాడే నిజమైన కమ్యూనిస్టు' అని రామ్‌జీ చెప్పిన విషయాలను ఉటంకించి అదెంత కఠినమైన కార్యమో తన ఆచరణలో నుంచి ప్రజలకు చెప్పాడు. నిజమైన విప్లవకారుడిగా తుది శ్వాస విడిచిన కామ్రేడ్ కోటన్నకు మరణం లేదు. ఆయన అజరామరుడు!

('అన్న' కోటన్నపై తమ్ముడు మల్లోజుల వేణుగోపాల్ రాసిన సుదీర్ఘ ఉత్తరంలో చాలా సంఘటనలు, చాలా మంది వ్యక్తుల అనుభవాలు, వారికి కిషన్‌జీతో ఉన్న సంబంధం గురించి సవివరంగా రాశారు. స్థలాభావం వల్ల ఈ లేఖలో సారాంశాన్ని, మరీ ముఖ్యంగా కిషన్‌జీ గురించిన వివరాలను మాత్రమే ప్రచురించడం జరిగింది.)

http://www.andhrajyothy.com/mainnewsshow.asp?qry=2012/apr/15/main/15main9&more=2012/apr/15/main/main&date=4/15/2012


No comments:

Post a Comment