Sunday, 29 April 2012

ఎర్రపొద్దు వాలింది

ఏకశిల నగరిలో ఎర్రపూ లు పూయించిన శివసాగర్ కృష్ణాతీరంలో తుదిశ్వాస విడిచాడు. అక్షర సాయుధుడిగా విప్లవసాహిత్యాన్ని పండించిన కేజీ సత్యమూర్తి మరణించాడన్న వార్త ఓరుగల్లు ఖిల్లాను శోకసంవూదంలోకి నెట్టింది. ఉద్యమ నెలబాలుడిగా కీర్తిని సొంతం చేసుకుని తోటరాముడిగా పాటలల్లిన విలుకాడు నేలకొరిగాడు. పీపుల్స్ వార్ ఉద్యమ నిర్మాణంలో కొండపల్లి సీతారామయ్యతో కలిసి నడిచిన కాజీపేట నేల చిన్నబోయింది. కేజీ సత్యమూర్తి పుట్టిం ది ఆంధ్రాలో, మరణిచింది ఆంధ్రాలోనే అయినా ఆయన జీవి తం తెలంగాణతో ముడిపడింది. ఓరుగల్లును పోరుగల్లుగా మా ర్చడంలో ఆయనది ప్రత్యేకమైన ప్రస్థానం.

కమ్యూనిస్టు ఉద్యమాల ప్రభావంతో సీపీఎం సభ్యుడిగా జిల్లాలో కాలుమోపి పీపుల్స్‌వార్ పంథాను ఎంచుకున్న తొలితరం విప్లవ యోధుల్లో కేజీ సత్యమూర్తి ఒకరు. ఆయనకు జిల్లాతో విడదీయరాని అనుబం ధం ఉంది. 1960వ దశకంలో కాజీపేట సేయింట్ గ్యాబ్రియల్ స్కూల్‌లో హిందీ మాస్టారుగా పాఠాలు నేర్పుతున్న కాలంలో తెలంగాణలో నెలకొన్న భూస్వామ్యపెత్తందారి శత్రువుతో పోరాడేందుకు తెలంగాణ సమాజ స్థితిగతులు పీపుల్స్‌పార్టీ నిర్మాణానికి దోహదం చేసిందంటారు. కొండపల్లి సీతారామయ్యది సి ద్ధాంత వ్యూహాత్మక పాత్ర అయితే, తన కలం ద్వారా భావోద్వేగాలను రగిలించడంలో సత్యమూర్తిది అందెవేసిన చేయి. కేజీ సత్యమూర్తి అసలుపేరు కంభంపాటి జ్ఞాన సత్యమూర్తి. శివసాగర్, అజ్ఞాత సూర్యుడు, నల్లసూర్యుడు లాంటి మారు పేర్లతో ఈ ప్రాంతంలో కేజీ సత్యమూర్తిని పిలుచేవాళ్లు. 1970వ దశకం ప్రారంభంలో జరిగిన ప్రత్యేక తెలంగాణ పోరాటం నుంచి వ చ్చిన విద్యార్థి యువకిషోరాలను విప్లవమార్గంలో నడపడంలో ఆయనది మరువలేని పాత్ర.

ఉద్యమకారుడిగా ఆయన రాటుతేలడానికి ఆయనకు అప్పటి ఆర్‌ఈసీ, కాకతీయ మెడికల్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థి యువకిషోరాలకు ఎంత సహాయకారిగా ఉన్నారో ఆనాడు నెలకొన్న సమాజ పరిస్థితులు భట్టుప ల్లి, తరాలపల్లి, దేశాయిపేట, పైడిపెల్లి లాంటి గ్రామాల్లో చేతికొచ్చిన ఉడుకు నెత్తురును ఉద్యమానికి ఆయుధంగా మలచుకున్నారని అంటారు. జన్నుచిన్నాలు లాంటివాళ్లు నిర్వహించిన సభల్లో కేజీ సత్యమూర్తి భావోద్వేగ ప్రసంగాలకు ఆకర్షితులై ఎంతోమంది ఈ ప్రాంతానికి చెందిన యువత విప్లవకారులుగా మారారని చెబుతారు. ప్రజాసంఘాల నిర్మాణం, గ్రామాలకు తరలండీ అన్న నినాదాలతోపాటు నూతన ప్రజాస్వామిక విప్ల వం లాంటి మార్గాలను ఈ ప్రాంత యువత ఎంచుకునేందుకు కేజీ సత్యమూర్తి మహావూపేరణగా నిలిచారు.


అక్షరాల విలుకాడు...
తెలంగాణ సమాజ స్థితిగతులను ప్రధాన ఆయువుగా వాడుకుని, అక్షరాలను విల్లంబులగా మలచుకుని ఎంతోమంది యు వకిషోరాలను సాయుధులుగా మలచుకున్నాడు. ఆయన మరణంతో ఒక్కసారిగా జిల్లా ఆనాటి ఎర్రదారుల్లో పూసిన మోదుగుపూల వనాన్ని గుర్తుచేసుకుంటున్నారు. పీపుల్స్‌వార్ ఉద్యమంలో పనిచేసిన కాలంలోనూ, ఆయన పీపుల్స్‌వార్ నుంచి బయటికి వచ్చిన (ఆయనను పీపుల్స్‌వార్ బహిష్కరించింది అ నే వాదనా ఉంది) తరువాత ఆయన తెలంగాణ ఉద్యమాన్ని వి ప్లవమార్గంలో నడిపించాలని చూశాడు.

విప్లవ మార్గం అంటే సాయుధపోరాట పంథాలో కాదనీ ఆయన అప్పట్లో సూత్రీకరించాడు. బహుజన్ సమాజ్ పార్టీలో (కాన్షిరాం)లో కొంతకా లం పనిచేసి తరువాత అక్కడా ఇమడలేక బహుజన్ రిపబ్లికన్ పార్టీని పెట్టి దాని ద్వారా కొంతకాలం దళిత బహుజనులతో రా జ్యాధికారం కోసం పనిచేశారు. ఆయన ఆయుధాన్ని ఏస్థాయి లో గురిపెట్టగలడో అంతకంటే పదునైన భావావేశంతో అక్షరాలును మలిచేవాడని ఆయన సాహిత్యం చెబుతోంది.

శివసాగర్‌గా సాహితీకారులకు చిరపరిచితుడైన ఆయన గెరిల్లా విప్లవగీతాలు, జనం ఊపిరితో, పది వసంతాలు, నెలవంక, నడుస్తున్న చరిత్ర (196-2004) లాంటి అనేక రచనలు చేశారు. వాటన్నింటినీ ఏర్చికూర్చి ‘శివసాగర్ కవిత్వం’గా స్వేచ్ఛ పబ్లికేషన్ 2004లో తీసుకొచ్చింది. ఉద్యమాన్ని నెలబాలుడిగా ఊహించడంలోనే శివసాగర్ కాల్పనిక ధోరణి వ్యక్తమవుతోంది. అలలపై కలగంటాడు. అలలపై నుంచి వచ్చే చిరుగాలి సితారా ధ్వనులకు పరవశిస్తాడు అంటాడు చేరా (చేకూరి రామారావు). ‘జననంలో మరణం!మరణంలో జననం! నా చిరునవ్వుల కన్నీళ్లతో కనిపించని అక్షరాల్లోకలకాలం నిలిచేలా ఇలా రాస్తాను  కామ్రేడ్ డాక్టర్ సమాధి మీద’ అంటూ 197లో రాస్తాడు శివసాగర్ డాక్టర్ రామనాథం హత్యకు నిరసనగా (డాక్టర్ రామనాథం ఈ జిల్లా వాసి).


సమాజ దార్శనికుడు..
మొదట ఉద్యమాలకు ఆయుధాలు అందించి ఆ తరువాత మనుషులు సాయుధులుగా మారాల్సిన అవసరం లేదని బలం గా ప్రచారం చేశాడు. ‘దళిత సమస్య పరిష్కారానికి బుద్ధుడు చాలడు. అంబేద్కరూ చాలడూ మార్క్స్ కావాలి’ అంటూ రంగనాయకమ్మ సంచలనాత్మక రచనకు సమాధానంగా ఆయన ‘అంబేద్కర్ సూర్యుడు’ అన్న గ్రంథాన్ని రాశాడు. అదీ ఒక సం చలనమే. మాదిగ జాతి ఆత్మగౌరవం ఉద్యమాన్ని నిర్మించిన, నడిపిస్తున్న ఈ జిల్లా వాసీ మంద కృష్ణ మాదిగకు ఆ పేరుపెట్టిం దీ (అంతకు ముందు ఆయనను కిషన్ అనేవారు) కేజీ సత్యమూర్తే.

కేజీ సత్యమూర్తి ఉపాధ్యాయుడిగా ఈ జిల్లాలో ప్రవేశిం చి విప్లవోద్యమానికి తన భావోద్వేగాన్ని జోడించి జన్ను చిన్నాలు లాంటి వాళ్లను ఎంతోమందిని విప్లవకారులుగా మార్చడం లో ఆయన పాత్ర మరువలేనిదని చెప్తారు. మొత్తంగా జిల్లాలో కేజీ సత్యమూర్తి మరణించారని తెలిసి ఈ పోరుఖిల్లా ఓరుగల్లు నాలుగు కన్నీటి చుక్కల్ని ఆయనకు నివాళిగా అర్పించాయి. మొ త్తంగా పీపుల్స్‌వారు (ఇప్పటి మావోయిస్టు) కేంద్ర కమిటీ కా ర్యదర్శిగా కేజీ సత్యమూర్తి ఎదిగినా ఏకశిలా నగరంపై ఆయన ప్రత్యేకమైన అభిమానాన్ని చాటుకున్నారని ఆయన సాహిత్యం స్పష్టం చేసింది.

‘గార్ల రైలు దాడిలోన గుంజుకున్న బల్ రైఫిల్ నీకి స్తా తమ్ముడా.. నీకిస్తా చెల్లెలా’ అంటూ ఆయన రాసిన పా అందుకు నిదర్శనంగా నిలుస్తోంది. పీపుల్స్‌వార్ ఉద్యమం నుంచి వైదొలిగిన తరువాత ఆయన చేపట్టిన, నిర్మించిన అనేక ప్రజాఉద్యమాలు, సాగించిన పోరాటాలు అన్నింటిలోనూ వరంగల్‌ను ఆయన ఎప్పటికీ మరచిపోలేదని ఆయన జిల్లా పర్యటన సందర్భంగా పేర్కొన్నారు.


పుట్టుక ఆంధ్ర.. చావు ఆంధ్ర..
జీవితమంతా తెలంగాణ

ములుగు, ఏప్రిల్17 టీన్యూస్  ఇప్పపువ్వుల సిగల నడుమ దాచిన విల్లంబులన్ని నీకిస్త తమ్ముడా...! నీకిస్త్త తమ్ముడా...! శ్రీరాములయ్య సినిమాలోని ఈ పాట తెలియని వారు ఉండరేమో. ఈ పాటకు అక్షరం రూపం ఇచ్చింది శివసాగరే ఆయనే కేజీ సత్యమూర్తి. అప్పటి పీపుల్స్‌వార్ కేంద్ర కమిటీ కార్యదర్శి, భారత విప్లవోద్యమంలో తమదైన ముద్ర వేసుకున్న సత్యమూర్తి మలివిడత ఉద్యమ పంథాలో తొలిసారి ఏటూరునాగారం అడవుల్లోని కొండపర్తి వద్ద తొలిపాదం మోపి సీపీఐఎంఎల్ ప్రజావూపతిఘటన రాష్ట్ర కార్యదర్శిగా ఐదు సంవత్సరాల పాటు పదవీ బాధ్యతలు నిర్వహించారు. ఈ ప్రాంత వాసులతో ముఖ్యంగా ఆదివాసీలతో అడవిలోని సాయుధ సహచరులతో పెనవేసుకున్న అనుబంధాన్ని ఆయన అల్లుకున్నారు.

ఒక సందర్భంలో మహాకవి కాళోజీ అన్నట్లు పుట్టుక నీది... చావు నీది... జీవితమంతా దేశానిది.. అన్న మాటలు శివసాగర్ జీవితంలో అక్షర సత్యం అవుతాయి. పు ట్టుక ఆంధ్ర, చావు ఆంధ్ర, జీవితమంతా తెలంగాణలో మమేకమ య్యారు. ఆదివాసీ, దళి త బహుజన పీడిత వర్గాల విముక్తి కోసం పరితపించాడు. అడవిలో ఆదివాసీలకు ఆయుధాలు పట్టించడంతో పాటు అట్టడువర్గాల్లో సామాజిక చైతన్యం రగిలించి అడవుల్లో చైతన్యదారులను నిర్మించాడనే పేరును ఆయన సార్థకం చేసుకున్నారు. గోదావరిలోయ పరివాహక ప్రాంతంలో ఆయన చెట్టూ, పుట్టకు సుపరిచితుడేనని అందరూ చెబుతుంటున్నారు.


అడవిలోకి ఆయన ..
195లో పీపుల్స్‌వార్ సెంట్రల్ కమిటీ కార్యదర్శిగా ఉంటూ పార్టీలో కేఎస్(కొండపెల్లి సీతారామయ్య)తో విభేదించి బయటకు వచ్చారు సత్యమూర్తి. అనంతరం ఆయన బహుజన సమాజ్‌వాది పార్టీలో చేరారు. కొంతకాలం పనిచేశాక ఆ పార్టీ అధినేత కాన్షీరామ్ విధానాలతో విభేదించి బహుజన రిపబ్లికన్ పార్టీని స్థాపిం చారు. చివరకు అందులోనూ విభేదాలు, చీలికలు రావడంతో మరోసారి ఆయన సాయుధ పో రాట బాటపట్టారు. అందుకు అంకురార్పణ ములుగు సబ్‌డివిజన్ అడవుల్లోనే జరిగింది. సీపీ గ్రూపుల నుంచి విడిపోయిన ఒక పాయ సీపీఐఎంఎల్ ప్రజా ప్రతిఘటన అప్పటికే న్యాయకత్వలేమితో తీవ్రమైన ఎదురుదెబ్బలతో ముఖ్యమైన న్యాయకత్వాన్ని కోల్పోయింది.

ఆ సంక్షోభంలోనే సత్యమూర్తి అడవిలోకి అడుగుపెట్టారని, ప్రజావూపతిఘటన సాయుధ దళాలకు రాజకీయ దశ దిశను అందించారని ఆయన సహచరులుగా పనిచేసిన మా జీలు చెబుతున్నారు. 199లో అడవిలోకి అడుగుపెట్టిన సత్యమూర్తి వరంగల్, ఖమ్మం జిల్లాలలోని అటవీ ప్రాంతంలో జరిగిన మూడు ఎన్‌కౌంటర్ సంఘటనల నుంచి సురక్షితంగా తప్పించుకున్నట్లు తెలుస్తుంది. ఆయన 199లో పీపీజీ రాష్ట్ర కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టి ఆ పార్టీకి రాజకీయ జీవం పోశారు. సాయుధ దళాలకు రాజకీయ శిక్షణ తరగతులను నిర్వహించి ప్రత్యే క తెలంగాణ ఆవశ్యకత, భారతదేశంలో కులం సమస్యకు మార్క్సిస్టు కోణంలో పరిష్కారం లాంటి కీలకమైన సైద్ధాంతిక తాత్విక భూమికను ఆ పార్టీకి నిర్దేశించారని పీపీజీ రాష్ట్రకార్యదర్శిగా పనిచేసిన కీలక నాయకుడు ఒకరు ’టీన్యూస్’కు తెలిపారు.


ఏఎల్‌టీ సిద్ధాంతకర్తగా..
తర్వాతకాలంలో ఆదివాసీల విముక్తి కోసం ప్రత్యేక పోరాటాల అవసరాన్ని గుర్తించి సత్యమూర్తి జనశక్తి సీపీయూఎస్‌ఐల నుంచి బయటకు వచ్చిన ఆదివాసీ నాయకుడు కుంజ కొమ్మాలు అలియాస్ రాము నాయకత్వంలో స్థాపించిన ఏఎల్‌టీ(ఆదివాసీ లీబరేషన్ టైగర్స్) అనే సంస్థకు సిద్ధాంతకర్తగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. దండకారణ్యాన్ని ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించాలనే డిమాండ్‌తో ప్రారంభించిన ఏఎల్‌టీ ఆ దిశలో విల్లంబులతో పోరాటాలకు సిద్ధమవుతున్న క్రమంలోనే 2005 ప్రాంతంలో ఏఎల్‌టీ వ్యవస్థాపక కార్యదర్శి రాము ఎన్‌కౌంటర్‌లో చనిపోవడంతో ఆ పార్టీ కనుమరుగైంది. ఏది ఏమై నా సత్యమూర్తి మరణం తెలంగాణకు, విప్లవోద్యమానికి తీరని లోటని భావిస్తున్నారు.


కంటతడి పెట్టిన ఉద్యమనేస్తాలు..
సత్యమూర్తి కృష్ణా జిల్లా వాస్తవ్యుడైనప్పటికీ జిల్లాతోనే ఎక్కువ అనుబంధాన్ని కలిగి ఉన్నారు. జిల్లాలోని అడవిలోకి అడుగుపెట్టి ప్రజావూపతిఘటన సాయుధ దళాలకు ఆయన విప్లవపాఠాలు నూరిపోశారు. దీనికి తోడు ఆదివాసీల సమస్యల పరిష్కారం కోసం పరితపిస్తూ ఎప్పటికప్పుడు వారికి అండగా నిలుస్తూ వచ్చారు. అలాంటి విప్లవకారుడు మంగళవారం తన సొంత గడ్డ కృష్ణా జిల్లాలో అనారోగ్యంతో మృతి చెందడం ఇక్కడి ఆదివాసీలు, తనతో పని చేసినవారితోపాటు అతన్ని గుర్తెరిగిన ప్రతి ఒక్కరూ కంటతడిపెట్టారు. ఆయన విప్లవ భావాలను మరోసారి గుర్తుచేసుకున్నారు. సత్యమూర్తి మరణం ఇటు తెలంగాణ ప్రజలకు, విప్లవోద్యమానికి తీరని లోటుగా ఆవేదన వ్యక్తం చేశారు.

(టీన్యూస్ ప్రతినిధి-వరంగల్)  
http://www.namasthetelangaana.com/Districts/Warangal/ZoneNews.asp?category=25&subCategory=12&ContentId=96294

No comments:

Post a Comment