Monday, 16 April 2012

విద్యార్థి ఉద్యమ బావుటా!

చరిత్రలో ఓ రాజకీయ ఉద్యమ జననానికి ఓ ఉద్యమకా రుడి భౌతిక మరణమే తక్షణ కారకంగా పనిచేసిన విశిష్ట సందర్భాలు అత్యంత అరుదైనవి. అలాంటి అరుదైన మరణాల కోవలో జార్జిరెడ్డిది ఒకటి!

ఉస్మానియా విశ్వవిద్యాలయంలో 1970 దశాబ్దారంభంలో ప్రగతిశీల విద్యార్థి ఉద్యమ నిర్మాణానికి జార్జిరెడ్డి రాజకీయ పునాదులు వేశాడు. ఆ మార్గంలోనే 1972, ఏప్రిల్ 4వ తేదీన ఇంజనీరింగ్ కాలేజీ వసతి భవనం (నేటి కిన్నెర హాస్టల్) ఎదుట ఆర్‌ఎస్‌ఎస్, ఏబీవీపీ శక్తుల చేతుల్లో హత్యకు గురయ్యాడు. ఓయూ క్యాంపస్‌లో సామాజికంగా అట్టడుగు విద్యార్థులను చైతన్య పరచిన చరిత్ర జార్జిరెడ్డిది. అలాంటి జార్జిరెడ్డి సరిగ్గా అంబేద్కర్ జయంతి రోజే హత్యకి గురికావటం కాకతాళీయమైనప్ప టికీ చారిత్రిక సందర్భమే! ఈ ఏప్రిల్ 14కి సరిగ్గా నాలుగు దశాబ్దాలు నిండుతున్నది.

అసాధారణ ప్రతిభాపాటవాలు గల జార్జిరెడ్డికి ఆ కాలపు క్యాంపస్ చరిత్రలో ఒక విశిష్ట స్థానం లభించింది. అణు భౌతిక శాస్త్రంలో స్వర్ణపతకం పొందిన విద్యార్థిగా క్యాంపస్ విద్యార్థి లోకపు హృదయాల్లో జార్జికి సుస్థిర స్థానం ఉంది. గ్రంథాలయాల్లో అధిక సమయం వెచ్చిం చడం ద్వారా సమకాలీన జాతీయ, అంతర్జాతీయ, చారి త్రక పరిణామాలపై అవగాహన పెంచుకున్నాడు. విద్యా ర్థుల ఆర్థిక, రాజకీయ, సామాజిక సమస్యల పట్ల అమి తంగా స్పందించేవాడు. ముఖ్యంగా ఆనాడు క్యాంపస్‌లో వేళ్లూనుకున్న గూండాయిజం, రౌడీయిజాలను సాహసో పేతంగా ప్రతిఘటించిన ‘ధిక్కార స్వరం’గా పేరొందాడు.

జార్జిరెడ్డిని విప్లవ విద్యార్థి నిర్మాణం వైపు ఆలోచింపజేయడానికి ఆనాడు మూడు ప్రధాన అంతర్జాతీయ సంఘటనలు పురికొల్పాయి. మరో జాతీయ రాజకీయ పరిణామం ఆయన్ని కార్యోన్ముఖుడిని చేసింది.

అంతర్జాతీయంగా చేగువేరా విప్లవ జీవితం జార్జిరెడ్డిని అమితంగా ప్రభావితం చేసింది. అదే కాలంలో ఫ్రెంచి విద్యార్థుల ‘రెక్కవిప్పిన రెవల్యూషన్’ మరో గొప్ప రాజకీయ ప్రేరణనిచ్చింది. వియత్నాం విప్లవ పోరాటం జార్జిని పరవశింపజేసింది. శ్రీకాకుళం, గోదావరిలోయ ప్రతిఘటనా పోరాటాలకి ఉత్తేజితుడయ్యాడు. ముఖ్యంగా అమరజీవి నీలం రామచంద్రయ్యతో సంబంధం ద్వారా నిరంతర చర్చలు జరిగి గోదావరి లోయ ప్రతిఘట నోద్యమ విప్లవ నిర్మాణ సంస్థకి రాజకీయంగా చేరువయ్యాడు. మార్క్సిజంపై విద్యార్థుల్లో చర్చాగోష్టులు నిర్వహించాడు. ఈ దిశలో సాగిన రాజకీయ కృషిలోనే తన 25వ ఏట అసువులు బాశాడు.

విప్లవాదర్శాలకి ప్రతిరూపంగా జార్జిరెడ్డి పేరొందాడు. నిజాయితీ, నిస్వార్థత, నిరాడంబరత, త్యాగనిరతి, శ్రమతత్వం, సేవాతత్పరత, అధ్యయనం వంటి విలువలు ఆయనను తీర్చిదిద్దాయి. అందుకే జార్జి భౌతిక మరణమే రాష్ట్రంలో విప్లవ విద్యార్థి ఉద్యమ జననంగా మారింది. ఆయన భౌతికంగా మరణించి, రాజకీయంగా పునర్జన్మ పొందాడు. ఆయన ఉస్మానియా క్యాంపస్‌లో అంతర్థానమై, అఖిలాంధ్ర విద్యా సంస్థల్లో ప్రత్యక్షమయ్యాడు. జార్జి కేంద్రంగా ప్రచారంలోకి వచ్చిన ‘జీనా హైతో మర్‌నా సీఖో, కదమ్ కదమ్ పర లడ్‌నా సీకో’ (బతకాలంటే చావడం నేర్చుకో, అడుగడుగునా పోరాటం నేర్చుకో) నినాదం ఆ తర్వాత రాష్ట్ర విద్యార్థి లోకంలో ప్రతిధ్వనించింది.

జార్జి తొలుత కాంగ్రెస్‌లోని యంగ్ టర్కుల బృందాన్ని అనుసరించాడు. 1969-70ల నుంచి సోవియట్ అండతో కాంగ్రెస్ పార్టీని పెట్టుబడిదారీ సంస్కరణ పంథావైపు నడిపించే ప్రయత్నం జరిగింది. అందుకోసం యంగ్‌టర్కుల బృందం కాంగ్రెస్ పార్టీలో ప్రెషర్ గ్రూపుగా అవతరించింది. ఫ్యూడల్ భూస్వా మ్యానికి వ్యతిరేకంగా యంగ్‌టర్క్‌ల తీవ్రవాద నినాదాలు తొలుత జార్జిని ఆకర్షించాయి. వారు ‘సోషలిస్టు స్టడీఫోరం’గా ఏర్పడి సాగించిన ప్రచారాన్ని చిత్తశుద్ధితో నమ్మాడు. కానీ అవి కూడా పెట్టుబడిదారీ వ్యవస్థను కొత్త ముసుగుతో పరిరక్షించే ఎత్తుగడగా త్వరలోనే అర్థం చేసుకున్నాడు. దానిపై భ్రమలు వీడి విప్లవ పంథాను స్వీకరించాడు.

జార్జి మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చాడు. కానీ నాటి క్యాంపస్‌లోని మెజార్టీ విద్యార్థులు గ్రామీణ ప్రాంత పేద కుటుంబీకులే. అందులో సాంఘిక అణచివేతకి గురయ్యే వారి సంఖ్య గణనీయంగా ఉంది. నిజానికి జార్జికీ, మెజార్టీ విద్యార్థులకీ మధ్య ఆర్థిక, రాజకీయ, సామాజిక సాంస్కృతిక అగాధం చాలా ఉంది. కానీ జార్జి ఒకసారి విప్లవ రాజకీయాలను విశ్వసించాక అట్టడుగు విద్యార్థుల జీవన విధానాన్ని అలవరుచుకోవాలని నిర్ణయించుకున్నాడు. విద్యార్థుల అర్థాకలి దుస్థితికి చలించి ఒకేపూట అన్నం తినేవాడు. వస్త్రధారణ నుంచి ఆహార అలవాట్ల వరకూ మార్చుకున్నాడు. తాను పుట్టి పెరిగిన సహజ జీవన స్థితి నుంచి తన పరిసర విద్యార్థుల జీవన స్థితికి కఠోర కృషితో భౌతికంగా జీవన విధానాన్ని మార్చుకున్నాడు. ఒక్కమాటలో చెప్పాలంటే ‘డీక్లాసిఫై’ (జీవన విధానాన్నీ, భావాలనూ కింది వర్గాలకనుగుణంగా మార్చుకోవటం) అయ్యాడు. తనతోపాటు నగర వాసానికి చెందిన అనేక మంది మధ్య తరగతి, సంపన్న కుటుంబీకుల విద్యార్థులను ‘డీక్లాసిఫై’ చేయించాడు. అలా డీక్లాసిఫై అయ్యే ప్రక్రియలోనే ఆయన ఆదర్శ విప్లవ కారుడుగా రూపొందాడు.

సమాజంలోని ప్రజలందరికీ అన్ని వసతులు కల్పించే సమసమాజ స్థాపనకై జార్జి మెదడు ఉన్నతంగా ఆలోచించింది. అంటే ‘హైథింకింగ్’కి ప్రతీకగా జార్జి మెదడు ఎదిగింది. కానీ ఆయన జీవన విధానం మాత్రం అట్టడుగు విద్యార్థుల అర్ధాకలి ప్రమాణాలకి దిగిపోయింది. అంటే ‘సింపుల్ లివింగ్’కి ఆయన నిత్య జీవితంగా మారింది. ఒక్కమాటలో చెప్పాలంటే జార్జి రెడ్డి ‘సింపుల్ లివింగ్ - హై థింకింగ్’కి ప్రతిరూపంగా వర్ధిల్లాడు.

ప్రపంచీకరణ గాలుల ప్రభంజనంలో జేమ్స్ పేట్రాస్ చెప్పినట్లు వర్తమాన విప్లవ సంస్థల నాయకులు కొందరు కింద నుంచి పైవర్గంలోకి తిరోగమన పథంలో తమ జీవన విధానాన్ని ఉన్నతీకరించే ప్రక్రియ (రీక్లాసిఫై)కి గురవు తున్న కాలమిది. ఇది భారత విప్లవ సంస్థలకు కూడా అతీతం కాదు. ఈ నేపథ్యంలో విప్లవ సంస్థల్లో ‘డీక్లాసిఫికేషన్’ కోసం చేపట్టాల్సిన దిద్దుబాటు లేదా ప్రక్షాళనోద్యమాలకు కూడా జార్జి నలభై ఏళ్ల అమరత్వం ఓ రాజకీయ సందర్భం కావాలి. అదే జార్జికి నిజమైన విప్లవ నివాళి. తెలుగు నేల మీద విద్యాసంస్థల్లో చదువులకి కొత్త అర్థం చెప్పి, జీవితాలకు నిజ లక్ష్యం నిర్దేశించి తన మరణంతో ఓ నూతన విప్లవ విద్యార్థి ఉద్యమానికి పురుడు పోసిన జార్జి అమరుడు.

-పి.ప్రసాదు
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఐఎఫ్‌టీయూ
(జార్జిరెడ్డి కన్నుమూసి నేటికి నలభై ఏళ్లు!

http://www.sakshi.com/main/WeeklyDetails.aspx?Newsid=39528&Categoryid=1&subcatid=18

No comments:

Post a Comment