Tuesday, 24 April 2012

ఉద్యమ సవ్యసాచి శివసాగర్

హైదరాబాద్, ఏప్రిల్ 17 ఒకానొక సమయంలో గన్‌తోనూ.. ఇంకొంతకాలం పెన్‌తో ఉద్యమాన్ని కొనసాగించిన బహుముఖ ఉద్యమనేత కెజి సత్యమూర్తి. నక్సలైట్ల ఉద్యమానికి ఒక రూపం ఇచ్చిన వారిలో కీలక వ్యక్తిగా.. సమాజంలో దళితులకు జరుగుతున్న నష్టాన్ని నివారించేందుకు ఉద్యమించిన హక్కుల నేతగా... రచనల ద్వారా సమాజాన్ని మేలుకొలిపేందుకు ప్రయత్నించిన ఒక రచయితగా సత్యమూర్తి బహుముఖ పాత్ర పోషించారు. నల్ల సూరీడుగా, శివసాగర్‌గా ప్రఖ్యాతిగాంచిన సత్యమూర్తి పత్రికా రంగానికి కూడా సేవలు అందించడమేకాకుండా కొద్దికాలం ఉపాధ్యాయ వృత్తిలో కూడా విద్యార్ధులకు బోధనలు చేశారు. తొమ్మిది పదుల వయసు ఉన్నప్పటికీ సత్యమూర్తి అంటే ఒక సంచలనంగానే జీవనాన్ని కొనసాగించడం ఆయనకే చెల్లింది.
రాష్ట్రంలో అణగారిన ప్రజల కోసం ఉద్యమం సాగుతున్న తరుణంలో... శ్రీకాకుళం జిల్లా బొడ్డపాడులో ప్రారంభమైన రైతాంగ సాయుధ పోరాటం రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు విస్తరిస్తున్న సమయంలో సత్యమూర్తి కూడా తాను తుపాకీపట్టేందుకు సిద్ధమయ్యారు. ప్రముఖ నక్సలైట్ నేత కొండపల్లి సీతారామయ్యతో కలిసి సత్యమూర్తి విప్లవ సంఘాలను ఒక తాటిపైకి తీసుకువచ్చి 1980లో పీపుల్స్‌వార్ గ్రూప్ పేరుతో నక్సలైట్ పార్టీకి శ్రీకారం చుట్టారు. అప్పటివరకు వరంగల్‌లోని ఫాతిమా స్కూలులో ఆంగ్ల ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న సత్యమూర్తి, సహచర హిందీ ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న కొండపల్లి సీతారామయ్యలు కలిసి తమ వృత్తిని సైతం విడిచిపెట్టి సాయుధ పోరాటానికి తెరతీశారు. ఈ కాలంలోనే వీరిద్దరూ కలిసి స్థానిక ఆర్‌ఇసిలో చదివే విద్యార్థులతో రహస్యంగా ఉద్యమకర్తలను తీర్చిదిద్దారు. అలాంటివారిలో ఇటీవల ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన అజాద్ ఒకరు. ఈ ఇద్దరి నేతృత్వంలో పీపుల్స్ వార్ ఉద్యమం బలపడింది. ఆనాటి నుంచి అప్పటి నుంచి ఊపందుకున్న నక్సలైట్ల ఉద్యమం నేడు మావోయిస్టు పార్టీగా మారి దేశంలోనే అనేక రాష్ట్రాల్లో ప్రభుత్వాలకు కొరకరాని కొయ్యగా మారిందంటే ఏనభయ్యవ దశకంలో సత్యమూర్తి, కొండపల్లి సాగించిన పోరాటాలేనంటే అతిశయోక్తి కాదు. ఆ తరువాత కాలంలో పార్టీ సిద్ధాంతాలతో విబేధించిన సత్యమూర్తి తరువాత పార్టీకి గుడ్‌బై చెప్పారు. సత్యమూర్తిని పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు పీపుల్స్‌వార్ ప్రకటించగా, తానే పార్టీని బహిష్కరిస్తున్నానని ధైర్యంగా చెప్పిన సత్యమూర్తి తరువాత కాలంలో విప్లవ రచయితగా, దళిత హక్కులకోసం పోరాడే నేతగా రూపాంతరం చెందారు. తన పదునైన వాక్కులతోపాటు, అక్షరాలను కూడా ఆయుధంగా మార్చుకుని రచనలు, కవితలతో దళితుల కోసం పోరు సాగించారు. అనేక పార్టీల నుంచి రాజకీయాల్లోకి రావాలంటూ ఆహ్వానం అందినప్పటికీ దళిత ఉద్ధరణకే ఆయన మొగ్గు చూపించారు. నలుపు, ఎదురీత వంటి పత్రికలను కొంతకాలం నడిపిన ఆయన తన వ్యాసాలు, రచనలతో ఒక ఊపు తీసుకువచ్చారు. ఆయన నెలబాలుడు రచన విప్లవ సాహిత్యానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది. విరసం ఏర్పాటులో కూడా సత్యమూర్తి పాత్ర కీలకంగా మారింది.
దళితుల హక్కుల పరిరక్షణ కోసం ప్రధానంగా చుండూరులో జరిగిన దళితుల ఊచకోత సమయంలో పోరాటాలు సాగించారు. 1999లో బిఎస్‌పి టిక్కెట్ నాశించి భంగపడి కృష్ణాజిల్లా ముదినేపల్లి అసెంబ్లీ స్థానం నుంచి ఇండిపెండెంట్‌గా పోటీ చేశారు. నక్సలైట్ చాగంటి భాస్కరరావు ఎన్‌కౌంటర్‌లో మరణించి నప్పుడు ‘నరుడో... భాస్కరుడో’ అంటూ తొలిసారి జానపద బాణిలో విప్లవ రాజకీయాలను జొప్పిస్తూ కొత్త పంథాకి శ్రీకారం చుట్టారు. శ్రీరాములయ్య సినిమాలో ‘నీకిస్తా తమ్ముడా.. నీకిస్తా తమ్ముడా.. అంటూ సత్యమూర్తి రాసిన గేయం కూడా జనాదరణ పొందింది. నక్సల్స్ ఉద్యమంలో సత్యమూర్తి రచనలు ప్రభావితం చేశాయి. శివసాగర్ కలం పేరుతో శివసాగర్ కవిత్వం, అంబేద్కర్ సూర్యుడు అనే రెండు రచనలు చేశారు. (చిత్రం) కుటుంబ సభ్యులతో కెజి సత్యమూర్తి

http://www.andhrabhoomi.net/content/shivasagar

No comments:

Post a Comment