Thursday, 19 April 2012

ఉద్యమ 'నెలబాలుడు' ఇక లేరు


కృష్ణా, ఏప్రిల్ 17  పీపుల్స్‌వార్ ఉద్యమ వ్యవస్థాపక సభ్యుడు ఉద్యమ 'నెలబాలుడు' అస్తమించారు. విప్లవోద్యమం, దళిత ఉద్యమంలో ఎనలేని కృషి చేసిన కేజీ సత్యమూర్తి (80), అలియాస్ శివసాగర్ మంగళవారం ఉదయం కన్నుమూశారు. కృష్ణాజిల్లా, జి.కొండూరు మండలం కందుల పాడులో ఆయన కుమారుని ఇంట్లో తుది శ్వాస విడిచారు. గత కొంతకాలంగా పక్షవాతంతో బాధపడుతున్న సత్యమూర్తి ఈరోజు ఉదయం ఆరోగ్యపరిస్థితి విషమించడంతో మృతిచెందారు.

కృష్ణాజిల్లా నందివాడ మండలం శంకరపాడు గ్రామం సత్యమూర్తి స్వస్థలం. బుధవారం ఆయన అంత్యక్రియలు జరగనున్నట్లు తెలియవచ్చింది. 1968లో నక్సలైట్ ఉద్యమంలో చేరిన సత్యమూర్తి అదే సమయంలో శివసాగర్ అనే కలం పేరుతో విప్లవరచ నలు రాశారు. కవిగా ఆయన సాహిత్య ప్రపంచానికి సుపరిచితులు. పిన్నమనేని కోటేశ్వర్‌రావు, కొండపల్లి సీతారామయ్యతో సత్యమూర్తికి సాన్నిహిత్యం ఉంది. పీపుల్స్ వార్ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. సత్యమూర్తి మృతి పట్ల పలువురు నేతలు దిగ్భ్రాంతి వ్యక్తపరిచారు. ఆయన మృతిపట్ల ప్రముఖ దళిత సాహిత్యవేత్త కత్తి పద్మా రావు సంతాపం వ్యక్తం చేశారు.

పీపుల్స్‌వార్ (ఇప్పుడు మావోయిస్టు పార్టీ)లో కొండపల్లి సీతారామయ్య తర్వాత స్థానాన్ని సత్యమూర్తి ఆక్రమించారు. పీపుల్స్‌వార్‌తో విభేదించిన బయటకు వచ్చిన ఆయన దళిత ఉద్యమానికి నాయకత్వం వహించారు. సామాజిక విప్లవ వేదిక ఏర్పాటులో ప్రధాన భూమిక పోషించి దళితులను చైతన్యవంతులను చేయడానికి ప్రయత్నించారు. ఆయన 'నలుపు', 'ఎదురీత' వంటి పత్రికలను నడిపించారు.

పీపుల్స్‌వార్ సత్యమూర్తి బహిష్కరించింది. అయితే తానే దాన్ని బహిష్కరించారని అన్నారు. విప్లవోద్యమంలో ఆయన చేసిన కృషి అసమానమైనది. ఆయన రాసిన ఉద్యమ నెలబాలుడు విప్లవ కవిత్వానికి ప్రతీకగా నిలుస్తుంది. సత్యమూర్తి పార్వతీపురం కుట్ర కేసులో అరెస్టయ్యారు. ఆయన ఆదిలాబాద్ నక్సలైట్ ఉద్యమంలో పనిచేశారు. ఆ సమయంలో ఆయన తెలంగాణ జీవన విధానాన్ని సునిశితంగా పరిశీలించి, అక్కడి జానపద బాణీలను అర్థం చేసుకుని, అందుకు అనుగుణంగా విప్లవ బాణీలను కట్టారు. ఆయన రాసిన నరుడో భాస్కరుడా.. పాట ఎప్పటికీ సాహిత్య లోకంలో నిలిచిపోతుంది.

శివసాగర్ గొప్ప సాహితీవేత్త అని విప్లవ రచయితల సంఘం (విరసం) నాయకుడు వరవర రావు అన్నారు. సున్నితమైన భావాలు కలిగినవాడని ఆయన అన్నారు. విరసం ఏర్పాటులో శివసాగర్‌ది ప్రధానమైన భూమిక. శివసాగర్ ఎంతో మంది కవులను ప్రభావితం చేశారని వరవరరావు అన్నారు. శ్రీశ్రీ తర్వాతి స్థానం శివసాగర్‌దేనని ఆయన అన్నారు. శివసాగర్ కవిత్వం విప్లవ కవిత్వంలో ప్రత్యేకతను సంతరించుకుంటుందని విప్లవ రచయిత కళ్యాణ రావు అన్నారు. కృష్ణాజిల్లా, జీ. కొండూరు మండలం, కందులపాడులో సత్యమూర్తి భౌతికకాయానికి బుధవారం అంత్యక్రియలు జరుగుతాయి.


పీపుల్స్‌వార్ ఉద్యమ వ్యవస్థాపక సభ్యుడు
ఉద్యమ 'నెలబాలుడు' ఇక లేరు
http://andhrajyothy.com/mainnewsshow1.asp?qry=2012/apr/17/latest/17new64


No comments:

Post a Comment