Tuesday, 24 April 2012

విప్లవమూర్తికి కన్నీటి వీడ్కోలు

రెడ్ సెల్యూట్
విజయవాడ కల్చరల్, న్యూస్‌లైన్  సామాజిక విప్లవం కోసం ఒక చేత్తో గన్ను, మరో చేత్తో పెన్ను పట్టుకుని అహరహం శ్రమించిన సామాజిక విప్లవ నేత కంభం జ్ఞాన సత్యమూర్తికి ఆయన సహచరులు, అభిమానులు బుధవారం కన్నీటి వీడ్కోలు పలికారు. సత్యమూర్తి భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్ధం విజయవాడలో స్వాతంత్య్ర సమరయోధుల భవనం ప్రాంగణంలో ఉంచారు. ఆయనతో కలిసి అనేక ఉద్యమాల్లో పనిచేసిన పలువురు కవులు కూడా వచ్చి ఘన నివాళులర్పించారు. కొంతమంది దుఃఖం ఆపుకోలేక విలపించారు. వై.కె., సాంబశివరావు తదితరులు సత్యమూర్తి భౌతికకాయంపై ఎర్రజెండా కప్పారు. వైఎస్సార్ సీపీ సీజీసీ సభ్యుడు, ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకరరావు, పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర కన్వీనర్ నల్లా సూర్యప్రకాష్‌రావు, జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను, జ్యేష్ఠ రమేష్‌బాబు, నగర అధికార ప్రతినిధి తాడి శకుంతల సత్యమూర్తికి నివాళులర్పించారు.

జూపూడి మాట్లాడుతూ మార్క్స్, అంబేద్కర్‌ల ఆలోచనా విధానాలను అర్ధం చేసుకున్న విప్లవ యోధుడు సత్యమూర్తి అని చెప్పారు. సూర్యప్రకాష్ మాట్లాడుతూ సత్యమూర్తి ఆశించిన సామాజిక విప్లవం కోసం అభిమానులు, సహచరులు నడుం బిగించాలన్నారు. తాడి శకుంతల మాట్లాడుతూ దేశంలో వర్గ, కుల నిర్మూలన కావాలని ధైర్యంగా ఎలుగెత్తి, ఎర్రజెండా ఎగురవేసిన నల్లసూర్యుడు సత్యమూర్తి అని అన్నారు. విరసం సభ్యుడు కల్యాణరావు మాట్లాడుతూ సమాజంలో తల్లికి ఎలాంటి స్థానం ఇవ్వాలో ‘తల్లీ నను కన్నందుకు వందనాల’ంటూ రాసిన పాట తెలియచేసిందన్నారు.

ఎమ్మెల్యే దేవినేని ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ ప్రతి రాజకీయ నాయకుడు సత్యమూర్తిని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. మరో ఎమ్మెల్యే తంగిరాల ప్రభాకర్ మాట్లాడుతూ దేశంలోనే గొప్ప విప్లవమూర్తి అయిన సత్యమూర్తి మళ్లీ మళ్లీ పుట్టాలని ఆకాంక్షించారు. విరసం వ్యవస్ధాపక సభ్యుడు చిరంజీవి కొల్లూరి మాట్లాడుతూ పీపుల్స్ వార్, తెలంగాణ ఉద్యమాల్లో ఆయనతో పనిచేసే అదృష్టం తనకు దక్కిందన్నారు. రాష్ట్ర పౌరహక్కుల ప్రజా సంఘం అధ్యక్షురాలు జయ వింధ్యాల మాట్లాడుతూ తెలంగాణ కోసం తెలంగాణ జన పరిషత్ తరఫున ఆమరణ దీక్ష చేపట్టిన సత్యమూర్తితో పాటు మరోనలుగురిని మూడో రోజున దీక్ష భగ్నం చేసి నిర్బంధంలోకి తీసుకున్నారని గుర్తుచేసుకున్నారు.

సంతాప సభ 
మధ్యాహ్నం ఏర్పాటుచేసిన సంతాప సభలో ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాట్లాడుతూ రెండు దశాబ్దాల కిందట పశ్చిమ గోదావరి జిల్లా ఆచంటలో సమతా వాలెంటరీ ఫోర్స్‌ను ఏర్పాటుచేసిన సత్యమూర్తి వద్దకు శిక్షణ కోసం వెళ్లానని చెప్పారు. తనకు నామకరణం చేసింది ఆయనేనని గుర్తుచేసుకున్నారు. మంద కృష్ణ కుటుంబసమేతంగా వచ్చి నివాళులర్పించారు. సత్యమూర్తి సోదరి మంజులాభాయి మాట్లాడుతూ అన్నయ్య జీవితంలో తటస్థపడి ఆయనను పరిరక్షించిన స్త్రీలకు (మణిమ్మ, పార్వతి) కృతజ్ఞతలు తెలిపారు.. మూడో వ్యక్తి కృష్ణ మాదిగ భార్య జ్యోతి అని చెప్పారు. పార్వతి లేకపోతే 1985లోనే అన్నయ్యకు సంస్మరణ సభ జరిగేదన్నారు. గాయకుడు గోరటి వెంకన్న మాట్లాడుతూ అటు శ్రీశ్రీ, ఇటు శివసాగర్ ఇద్దరూ సామాజిక విప్లవానికే పోరాడారన్నారు. విస్తృతమైన అధ్యయనం వల్ల ఒక హోచిమన్‌లా తయారయ్యారన్నారు. నరుడో భాస్కరుడో అన్న పాట తనకు ప్రేరణ కలిగించిందన్నారు. సత్యమూర్తి రాసిన ‘అమ్మా నను కన్నందుకు’ అనే పాటను పాడి వినిపించారు. ఇంకా పలువురు ప్రసంగించి తమ అభిమానాన్ని చాటుకున్నారు.
http://www.sakshi.com/main/FullStory.aspx?catid=359918&subcatid=18&Categoryid=3

No comments:

Post a Comment