Tuesday, 24 April 2012

అతడి మాట జనానికి ముందుబాట!

విశ్లేషణ
దేశ సంపద అందరికీ సమానంగా అందే సమాజం ఏర్పడాలంటే రాజకీయ విప్లవం విజయవంతం కావాలి. అందుకు సత్యమూర్తి తత్వం, కవిత్వం, పాట, మాట, బాట మెజారిటీ జనానికి మార్గనిర్దేశం చేస్తాయి. ఆ మార్గమే ఆయన అమరత్వాన్ని జాజ్వల్యమానం చేస్తుంది. అంబేద్కర్ తత్వశాస్త్రానికి అది అంతిమ విజయాన్ని చేకూరుస్తుంది.అంబేద్కర్‌ను అధ్యయనం చేసిన ఫలితంగా రాజకీయ ఉద్యమం అంటే ‘సాయుధ పోరాటం’ మాత్రమే కాదు, ప్రజాసమూహాలు పాల్గొనే ‘బ్యాలెట్’ కూడా పోరాట రూపమేనని ఆయన గ్రహించారు. ఈ క్రమంలో ఆయన బహుజన సమాజ్ పార్టీలో చేరడమేకాక, ఇతరులను చేరవలసిందిగా పిలుపునిచ్చారు.

కంభం జ్ఞానసత్యమూర్తిది అతి విశిష్ట సామాజిక రాజకీయ ప్రస్థానం. ఆయన గురించి మాట్లాడుకోవ డమంటే ఐదు దశాబ్దాల ఆంధ్రప్రదేశ్ రాజకీయ సామాజిక పరిణామాల గురించి మాట్లాడుకోవడమే. సత్యమూర్తిది ప్రవాహశీలమైన వ్యక్తిత్వం. ఎంత సున్నిత హృదయుడో అంత వజ్రకఠోరమైన పట్టుదల కలవాడు. 1956 నుంచి ఆయన సామాజిక రాజకీయ అస్తిత్వం పరిణతి చెందుతూనే ముందుకుసాగింది.

మొదట ఆయన ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీలో పని చేశారు. మార్క్స్, లెనిన్ రచనలను అధ్యయనం చేశారు. ఆ రోజుల్లో కృష్ణా జిల్లా కమ్యూనిస్టు పార్టీకి కేంద్రబిందువుగా ఉండేది. చండ్ర రాజేశ్వరరావు, కొండపల్లి సీతారామయ్య వంటి ప్రజా నాయకులు అక్కడి నుంచి వచ్చిన వారే. విద్యార్థి దశలోనే రిక్షా కార్మికులను సమీకరించి రిక్షా సత్యమూర్తి అనిపించుకు న్నారు.

సత్యమూర్తిలో ‘వర్గకసి’ రావడానికి కారణం, పశ్చిమగోదావరి జిల్లాలో ఆయన పుట్టిన ఊరు అడవికొలనులో జరిగిన భూఆక్రమణ. డొక్కల కరువు వచ్చినప్పుడు ఆయన కుటుంబం కృష్ణా జిల్లా శంకరపాడు చేరింది. తల్లిదండ్రు లు క్రైస్తవ మిషనరీ టీచర్లు. తాత తరంనాడే క్రైస్తవ మతానికి మారిన కుటుంబం వారిది. క్రిస్మస్ పండుగకు మంచి బట్టలు వేసుకోవడం దగ్గర నుంచి చదువు నేర్చుకోవడం దాకా అన్నీ ఒక యుద్ధంలాగే సాగాయి.

ఆ రోజుల్లో క్రైస్తవ మతం, ఇంగ్లిష్ విద్య దళితుల్లో ఆత్మగౌరవాన్ని కలిగిం చాయి. బైబిల్లోని సలోమాన్ పరమగీతాలు, ప్రసంగి, దావీదు సామెతలు చిన్న తనంలోనే సత్యమూర్తి భావుకతను పెంచాయి. కొల్లేరు ప్రాంతంలోని ప్రకృతి రమణీయతతోపాటు, దళితుల భూములు కమ్మ భూస్వాములు మోసపూరి తంగా ఆక్రమించుకున్నారన్న వ్యథ ఆయన వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దాయి. కమ్యూ నిస్టు పార్టీ ఆ రోజుల్లో దళితులకు, శ్రామిక జనాలకు అండగా నిలబడింది. స్వాతంత్య్రోద్యమ కాలంలో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పోరాడిన అంబేద్కర్, సోషలిస్టులు, కమ్యూనిస్టులు దేశవ్యాప్తంగా అస్పృశ్యులకు అండగా నిలబడ్డ కాలం.

అయితే రాష్ట్రంలో హైదరాబాద్, తూర్పుగోదావరి జిల్లాలో కొన్ని ప్రాం తాల్లో మాత్రమే అంబేద్కర్ ప్రభావం ఉండేది. కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో ప్రధానంగా క్రైస్తవమత ప్రభావంతోపాటు కమ్యూనిస్టు ఉద్యమ ప్రభావం దళితుల మీద ఉంది. అప్పుడు దళితవాడల నుంచే కమ్యూనిస్టు పార్టీకి సైన్యం ఏర్పడింది. కళాకారులు ఏర్పడ్డారు. దళితుల నుంచి వచ్చిన వారిలో సత్యమూర్తి వంటి సిద్ధాంతకర్తలు, అధ్యయనపరుల సంఖ్య కమ్యూ నిస్టు పార్టీలో అత్యల్పం.

కమ్యూనిస్టు ఉద్యమం చీలి సీపీఐ-సీపీఎంగా ఏర్పడే నాటికి కమ్మ, రెడ్డి నాయకత్వం పార్టీలో ఆధిపత్య స్థానానికి చేరుకోగా దళితులు కేడర్‌గా, కళాకారులుగానే మిగిలిపోయారు. కమ్యూనిస్టు సాహిత్య అనువాదకులుగాను, కమ్యూనిస్టు సిద్ధాంతకర్తలుగాను నాడు బ్రాహ్మణులే ఉండేవారు. 1964-68 మధ్యలో కేజీ సత్యమూర్తితోపాటు ఉపాధ్యాయుడిగా పని చేసిన కొండపల్లి సీతారామయ్య రెడ్డి కులస్తుడైనా పీడితవర్గ పక్షపాతి. గొప్ప ఆర్గనైజర్, నిర్మాణ కర్త. సత్యమూర్తి సిద్ధాంతకర్త, అధ్యయనపరుడు, కవి.

ఇద్దరి కలయిక తెలుగు నేలపై అపూర్వైమైన చరిత్రను సృష్టించింది. చారుమజుందార్ సీపీఎం నుంచి బయటకు వచ్చినప్పుడు సాయుధ పోరాటం వెల్లువగా ముందుకు వచ్చింది. ముఖ్యంగా చారుమజుందార్ ప్రచారంలోకి తెచ్చిన ‘వర్గశత్రు నిర్మూలన’ ్డతాలూకు భావాలు దేశమంతా పాకాయి. ఆ భావాలకు సిద్ధాంత రూపాన్ని సత్యమూర్తి, ఆచరణ రూపాన్ని కొండపల్లి ఇచ్చారు. 1969లో వచ్చిన తెలం గాణ ఉద్యమంలో రెడ్డి, వెలమలు ముందుకొస్తున్నట్టు గమనించినా ఆయన మద్దతుగా నిలిచారు.

సాధారణ ఉపాధ్యాయుడి నుంచి, విప్లవోద్యమ ఉపాధ్యాయుడిగా ఎదిగిన ఆయన పాఠాలు ఇంజనీరింగ్, మెడిసిన్ విద్యార్థులను ఉత్తేజపరిచాయి. కట్టడాలు నిర్మించడం కాదు, సమాజాన్ని పునర్నిర్మించాలని ఆయన వారికి బోధించేవారు. ముఖ్యంగా ఆయన ప్రభావం విద్యార్థులను త్యాగాలకు పురి గొలిపింది. సత్యమూర్తిపై ప్రభుత్వం అనేక కేసులు పెట్టి అరెస్టు చేసింది.

1972-77 మధ్య కాలంలో జైల్లో ఉన్నప్పుడు మార్క్స్, లెనిన్, మావోలనే గాక, గోర్కీ, గెథే, లూసన్‌లను చదివారు. ఆ కాలంలో విప్లవ రచయితల సంఘం, ఆర్‌ఎస్‌యూ, రైతు కూలీ సంఘం వంటి ప్రజా సంఘాలకు ప్రణాళికలు ఆయనే రాశారు. ఏ ఉద్యమానికైనా రాత రాయగలిగిన సమర్థులుంటేనే ఆ ఉద్యమం చరిత్రలో నిలుస్తుంది.

విప్లవం అంటే, విప్లవ సాహిత్యం అంటే సత్యమూర్తి అనే ముద్ర పడింది. 1980లో పీపుల్స్‌వార్ పార్టీ ఏర్పడిన తరువాత దేశం ఉలిక్కిపడింది. 1984లో కేంద్ర కమిటీ కార్యదర్శి అయిన తరువాత విప్లవోద్యమంలో కుల రాజకీయం బద్దలైంది. కొండపల్లి సీతారామయ్యలో రెడ్డి ఆధిపత్యం దాగుందని తేలిపో యింది. సెంట్రల్ కమిటీ కార్యదర్శిని స్టేట్ కమిటీ బహిష్కరించింది. 1989లో సత్యమూర్తి పొన్నూరులోని దళిత ఉద్యమ కేంద్రం ‘లుంబినీవనం’ వచ్చిన ప్పుడు కొన్ని విషయాలు ఆయన చర్చకు పెట్టారు.

కారంచేడు సంఘటనలో కమ్మ భూస్వాములు దళితులను ఊచకోత కోసిన సందర్భంలో సత్యమూర్తి పార్టీలో ఈ విషయాన్ని చర్చకు పెట్టారు. అప్పుడే పార్టీ కుల పెత్తందారీతనం బయటపడింది. భారతీయ సమాజాన్ని కుల, వర్గాధిపత్య సమాజంగా ప్రకటిం చమని పార్టీని కోరాడు. అగ్రకుల ఆధిపత్యం పల్లెల నుంచి పార్టీల దాకా ఉందని చెబుతూ అంతర్గత చర్చ పెట్టినందుకే రకరకాల కారణాలు చూపించి ఆయన్ను పార్టీ నుంచి గెంటేశారు.

ఈ నేపథ్యంలోనే సత్యమూర్తి అంబేద్కర్ తత్వాన్ని అధ్యయనం చేశారు. విప్లవ రచయితల సంఘం (విరసం) బ్రాహ్మణుల ఆధిపత్యంలో ఉందని, విర సం నుంచి తనను బహిష్కరించిన నాడే అది మరణించిందని ఆయన బహిరంగ ప్రకటన చేశారు.
ఆంధ్రదేశంలోని అన్ని పార్టీలకు క్యాడర్ దళితులు కాగా నాయకత్వ స్థానంలో రెండు అగ్రకులాలే ఎందుకున్నాయని, అంబేద్కర్ కుల నిర్మూలన శాస్త్రం చదవకుండా ఏ కమ్యూనిస్టు అయినా తన పోరాటంలో విజయం సాధించగలడా అని ఆయన ప్రశ్నించారు.

ఫూలే, అంబేద్కర్లను చదివాక ఆయన హిందూ సామ్రాజ్యవాదం మీద యుద్ధం ప్రకటించారు. మార్క్సిస్టు లెనినిస్ట్ పార్టీలుగా, ప్రజాసంఘాలగా చెలామణిలో ఉన్న సంఘాలు నీడతో యుద్ధం చేస్తున్నాయని ఆయన తీర్మానించారు. కులం మూలాలను తొలగించకుండా నక్సలైట్ ఉద్యమం విజయం సాధిస్తుందా అలాగే కులాన్ని రూపుమాపడానికి కమ్యూనిస్టుల దగ్గర ఏం కార్యక్రమం రూపొందించారు అని ఆయన ఉద్యమ నాయకత్వాన్ని నిలదీశారు. ఆ విధంగా కమ్యూనిస్టు ఉద్యమంలోని కేడర్‌ని ఆలోచింపచేశారు.

కారంచేడు దళిత ఉద్యమ ప్రభావంతో సత్యమూర్తితోపాటు, తరిమెల నాగిరెడ్డి, చండ్రపుల్లారెడ్డికి చెందిన పార్టీల్లో ఉన్న అనేక మంది దళిత బహుజన మేధావులు బయటకు వచ్చారు. వీరిలో బీఎస్ రాములు, కంచ ఐలయ్య, ఉ.సాంబశివరావు, వైకే వంటివారు ముఖ్యులు. వీరంతా దళిత బహుజన తాత్విక సామాజికతకు కొత్తచూపునద్దారు. విరసం, పౌరహక్కుల ఉద్యమాల్లో ఉన్న బ్రాహ్మణులు మాత్రం ఈ గతిశీలతను గ్రాహ్యం చేసుకోలేకపోయారు.

1991లో చుండూరులో దళితుల ఊచకోతకు నిరసనగా తలెత్తిన దళిత ఉద్యమానికి సత్యమూర్తి అండగా నిలిచారు. దళిత ఉద్యమం ప్రజాస్వామ్య పంథాలో, అంబేద్కర్ మార్గంలో నడవడంపై సత్యమూర్తి చర్చ పెట్టారు. దళితులు అవసరమైతే ప్రతిఘటించాలని స్పష్టం చేశారు.

అందుకే ఆయన స్వతంత్రంగా అంబేద్కర్ నడిపిన ‘సమతా సైనికదళ్’ ఏర్పాటుకు గట్టి ప్రయత్నం చేశారు. అంబేద్కర్‌ను అధ్యయనం చేసిన ఫలితంగా రాజకీయ ఉద్యమం అంటే ‘సాయుధ పోరాటం’ మాత్రమే కాదు, ప్రజాసమూహాలు పాల్గొనే ‘బ్యాలెట్’ కూడా పోరాట రూపమేనని ఆయన గ్రహించారు. ఈ క్రమంలో ఆయన బహుజన సమాజ్ పార్టీలో చేరడమే కాక, ఇతరులను చేరవలసిందిగా పిలుపునిచ్చారు.

దళిత బహుజనవాదం, అంబేద్కర్‌వాదం బలపడటం సహించలేని సంప్రదాయ కమ్యూనిస్టుల నుంచి ‘అంబేద్కర్ చాలడు బుద్ధుడూ చాలడు మార్క్స్ కావాలి’ తరహా గ్రంథాలు వెలువడిన నేపథ్యంలో సత్యమూర్తి ‘అంబేద్కర్ సూర్యుడు’ గ్రంథాన్ని రాయవలసి వచ్చింది. సత్యమూర్తి కృషి ఫలితంగా కమ్యూనిస్టు పార్టీలు అంబేద్కర్‌ని అధ్యయనం చేయక తప్పని పరిస్థితి ఏర్పడింది. జనాభాలో ఎస్సీ, ఎస్టీలు 25 శాతం, బీసీలు 52 శాతంగా ఉండటంతో అన్ని రాజకీయ పార్టీలు దళిత-బహుజన ఎన్నికల రాజకీయాలను గుర్తించక తప్పలేదు. ఏ పోరాటంలోనైనా ముఖ్యులు ప్రజలే. అంగట్లో సరుకుల్లా ఓట్లను అమ్ముకోకుండా, ఈ రాజ్య పునాదిని మార్చాల్సిన కర్తవ్యం వారిపై ఉంది. దేశ సంపద, వనరులు, హక్కులు అందరికీ సమానంగా అందే సమాజం ఏర్పడాలంటే రాజకీయ విప్లవం విజయవంతం కావాలి. అందుకు సత్యమూర్తి తత్వం, కవిత్వం, పాట, మాట, బాట మెజారిటీ జనానికి మార్గనిర్దేశం చేస్తాయి. ఆ మార్గమే ఆయన అమరత్వాన్ని జాజ్వల్యమానం చేస్తుంది. అంబేద్కర్ తత్వశాస్త్రానికి అది అంతిమ విజయాన్ని చేకూరుస్తుంది.
http://www.sakshi.com/main/WeeklyDetails.aspx?Newsid=39824&Categoryid=1&subcatid=18

No comments:

Post a Comment