Tuesday, 24 April 2012

అనగనగా ఒక నేను..

ఆయన మహాకవి శ్రీశ్రీ మెచ్చిన విప్లవ మహాకవి. వియత్నాం వీరుడు హోచిమిన్‌లా, శ్రీకాకుళ రైతాంగ పోరాట వీరుడు సుబ్బారావు పాణిగ్రాహిలా ఒక చేత్తో ఆయుధం, మరో చేత్తో కలం పట్టి పోరాడిన యోధుడు. భారత విప్లవోద్యమానికి వేగుచుక్క. దళిత సాహిత్యోద్యమానికి పెద్దదిక్కు. 'కసితో గండ్రగొడ్డలితో స్వార్థం శిరస్సు నరకగలిగిన వాడే నేటి హీరో', 'ప్రజల్ని సాయుధం చేస్తున్న రెవల్యూషనరీ నేటి కవి' వంటి విప్లవ కవితా నినాదాలను అందించిన విప్లవ సత్యమూర్తి, కవితా శివసాగ ర్ నిన్న ఉదయం కన్నుమూశారు. ఆయన తన ఆత్మకథ పూర్తిగా రాసుకున్నారో లేదో గాని అందులో కొంత భాగాన్ని ఏడేళ్ల క్రితం ఆంధ్రజ్యోతికి ఇచ్చారు. దానిలో కొద్ది భాగాన్ని ఇక్కడ ప్రచురిస్తున్నాం.

మా నాన్న బడిపంతులు. మా అమ్మ బడిపంతులమ్మ. నేను పుట్టింది అడవికొలనులో. అది పశ్చిమగోదావరి జిల్లాలోని ఒక కుగ్రామం. పసితనపు తప్పటడుగులు వేసింది అక్కడే.

ఒకనాడు అడవికొలను రణరంగంగా మారిపోయినట్లు గుర్తు. ఏడ్పులు, పెడబొబ్బలు, తిట్లు, సవాళ్ళు, ప్రతి సవాళ్ళు, చేతుల్లో బాణా కర్రలు. వీధిలో రేగిన దుమ్ము. మా అమ్మమ్మ చంకలో ఏడుస్తూ నేను. సువ్వలాగ మా నాన్న. ఆయనకు ఒక పక్క తొడచరుస్తూ వస్తాదు సంసోను. మరొక పక్క మా అమ్మ. నడివీధిలో అటూ ఇటూ బారులు తీరిన రెండు శిబిరాలు. ఎప్పుడు అడిగానో గుర్తులేదు కానీ, మా నాన్నను ఒకరోజు అడిగాను. అప్పుడు అక్కడ జరిగిందేమిటి'' అని. మా నాన్న కళ్లు నిప్పులు కక్కాయి ఆక్రోశంగా.

అరే! సత్తీ! మీ అమ్మ క్రిస్మస్ పండుగనాడు రంగు చీర కట్టుకుని, పూల జాకెట్ తొడుక్కుని ఊళ్ళో కోమటి కొట్టుకు వెళితే 'మాలది బాగున్నదిరా!' అని ఒక రాజు (కులం) ఎద్దేవా చేశాడు. మా అమ్మ ఆ సంగతి నాకు చెప్పింది. నేను పహిల్వాన్ సంసోనుకు చెప్పాను. సంసోను వాడ పెద్దలకు చెప్పాడు. వాడ పెద్దలు ఊళ్ళో పెద్దలకు కబురు చేశారు. చివరకు అది కొట్లాటగా మారింది'' అని మా నాన్న చెప్పాడు. తరువాత ఏమయింది'' అని అడిగాను.

అడవికొలను పక్క ఊళ్ళో గాంధీగారి భక్తుడొకాయన ఉన్నాడు. ఆయన జైలుకెళ్ళివచ్చాడు. 'మాలలు మాత్రం మనుషులు కారా!' అని పాడేవాడు. రెండు గుంపుల మధ్య నిలబడి రెండు చేతులెత్తి దండం పెట్టి 'నన్ను చంపి మీరు చంపుకోండి!' అని వెక్కి వెక్కి ఏడ్చాడు. ముందుగా మాలోళ్ళం, మాదిగోళ్ళం వెనక్కి వచ్చేశాం. తరువాత 'రాజులు' వెనక్కి వెళ్ళిపోయారు'' అన్నాడు మా నాన్న.

ఇదే సంగతి మా అమ్మను అడిగితే పెద్ద కులపోళ్ళకు మనం శుభ్రంగా ఉంటే గిట్టదురా! ఒక అవమానం కాదురా నేను భరించింది. ఎన్నెన్నో'' అన్నది. ఇదే సంగతి మా అమ్మమ్మ మార్తమ్మను అడిగితే క్రీస్తు మనవైపు ఉన్నాడురా! లేకపోతే ఆ రోజు ఏమయిపోయేవాళ్ళమో!'' అన్నది. ఆమె క్రీస్తు బోధకురాలు. అడవికొలనులోని మాలమాదిగలు 'రాజు'లకు వ్యతిరేకంగా నిలబడి ఆ మాత్రపు ఆత్మగౌరవాన్ని ప్రదర్శించారంటే ఆ కీర్తి ఆనాటి క్రైస్తవ మతానికే దక్కుతుంది.

మా నాన్నకు క్రైస్తవ మిషనరీలు (తెల్లదొరలు) నెలకు ఒక్క రూపాయి జీతమిచ్చేవారు. మా అమ్మకూ అంతే. గ్రామ క్రీస్తు సంఘం ప్రతి ఆదివారం చర్చిలో ప్రార్థనా సమావేశంలో పంతులుగారి కుటుంబానికి పిడికెడు బియ్యమో, నూకలో చందాగా ఇచ్చేవారు. పొయ్యిలోకి వారానికి ఇంటికి రెండు పిడకల చొప్పున చందా ఇచ్చేవారు. పంతులుగారి తాటాకు పాకకు వేసవి కాలం గడ్డి కప్పేవారు.

ఈ టీచర్లే ఆ రోజుల్లో మాలమాదిగ వాడల్లో ప్రమిదలు, కొవ్వొత్తులు, కాగడాలు. 'మనందరం దేవుని బిడ్డలం' అనేది వారి సందేశం. మేము అంటరానివారం కాదు. దేవుని సంతానం'' అనేది వారి వివరణ. క్రైస్తవ మతం ఇచ్చిన ఆత్మగౌరవ స్ఫూర్తి తరువాత కాలంలో సన్నగిల్లింది. ఇందుకు క్రైస్తవ మిషనరీలు కూడా ఒక కారణం. ఆత్మగౌరవ స్ఫూర్తిని ఇచ్చిన వాళ్ళూ వాళ్ళే, తిరిగి దాన్ని అదుపు చేసిందీ వాళ్ళే.

 నేను పుట్టింది అడవికొలనయితే నా స్వగ్రామం శంకర పాడు. అది పోలుకొండ శివారు. నందివాడ మండలం. కృష్ణా జిల్లా. శంకర పాడు మాలపల్లె. దానికి అదే పేరున్న 'ఊరు' లేదు. ఊరంటే 'పెద్ద' కులాల నివాస ప్రాంతం.

మా పల్లె మధ్యలో ఊడలు దిగిన పెద్ద రావిచెట్టు వందల సంవత్సరాల ముత్తాత గెడ్డంలా ఉండేది. రావిచెట్టు మీద పక్షుల గూళ్ళు. రావిచెట్టు క్రింద రచ్చబండ. ఆ చెట్టు చుట్టూ కాస్త దూరంగా డెబ్బయి తాటాకు పాకలూ, పూరి గుడిసెలూ, పల్లె అంచున పెద్ద చెరువు. చెరువు నిండా తెల్లని, ఎర్రని కలువపూలు. చెరువు చుట్టూ పచ్చని తీపి ముళ్ళ తుమ్మచెట్లు. చెరువు గట్టు మీద పోలేరమ్మ రాతిబొమ్మ. గట్టు కింద చర్చి. కాస్త దూరంలో కొల్లేరు సరస్సు. తరచుగా తాకే ఈదరగాలి.

కొల్లేటి పిట్టలే ఆహారం
అక్కడకు గుంపులు, గుంపులుగా వస్తూ పోతూ మమ్మల్ని రకరకాలుగా పలుకరించే కొల్లేటి కొంగలు; దూరతీరాల నుండి వలస వచ్చే పెలికాన్‌లు; నీలి ఆకాశం మీద తెల్లని రుమాళ్ళు ఎగురుతున్నట్లు ఉండేవి. పల్లె చుట్టూ పంటల్లేని పంట పొలాలు. తరచూ వచ్చే కొల్లేటి ముంపు. పొంగే బుడమేరు.

మేము కొల్లేటి పిట్టల్ని కొట్టి తెచ్చుకునే వాళ్ళం. కొల్లేటి చేపల్ని పట్టి తెచ్చుకునే వాళ్ళం. ఊస బియ్యం, నత్తలు మాకు నిత్యాహారం. ఆనాటి మా స్వగ్రామం ఆహార సేకరణ- ఉత్పత్తి దశల కూడలి. పిల్లలం చెరువులోని కలువపూలు కోసి, దండలు గుచ్చి మెళ్ళో వేసుకుని, ముఖానికి బూడిద పూసుకుని, నత్తగుల్ల గజ్జెలు కట్టుకుని రావిచెట్టు దగ్గర చిందులు వేసే వాళ్ళం.

కాకి కాకి
కలవర కాకి
కాకినోట్లో దీపం పెడితే
దీపం తీసికెళ్ళి దిబ్బకిస్తే
దిబ్బ నాకు పిల్లనిస్తే
పిల్లపేరు మల్లెమొగ్గ
నాపేరు జమీందార్!
గోచీపాత జమీందార్!
శంకరపాడు 'డొక్కల కరువు'లో '19వ శతాబ్దంలో' పుట్టింది. డొక్కల కరువు'లో జనం బురద తాగారు. గుమ్మడి ముక్కల్ని బురదతో నంజుకు తిన్నారు'' అని మా తాత చెప్పేవాడు. ఆ భీకరమైన కరువును తట్టుకోలేక ఖమ్మం నుండి మాలలు కొల్లేరు దిక్కుగా నడిచారు. కొల్లేటి సరస్సు మీద పక్షులుంటాయనీ, లోపల చేపలుంటాయనీ, నత్తలుంటాయనీ, చుట్టూ గడ్డిదుంపలుంటాయనీ, ఊసబియ్యం దొరుకుతుందనీ- మోజస్ నాయకత్వంలో ఇజ్రాయెల్ ప్రజలు 'పాలు, తేనె ప్రవహించే కానాన్' కోసం సముద్రాలు దాటి వెళ్ళినట్టుగా, ఖమ్మంలోని మాలలు కొల్లేరు కోసం అష్టకష్టాలు దాటి వెళ్ళారు. దారిలో చనిపోగా మిగిలిన వారు శంకరపాడు చేరారు. అప్పటికి ఆ పల్లెకు ఆ పేరు లేదు. తరువాత కాలంలో పోలుకొండ కమ్మ భూస్వాములు దానికాపేరు పెట్టి, రెవిన్యూ రికార్డుల్లో రాయించి తమ కుటుంబాల్లోని ఒక 'పుణ్యపురుషుని' నామం చిరస్మరణీయం చేసుకున్నారు.

శంకరపాడుకు ఇతర ప్రాంతాల నుండి వచ్చినవారు కూడా ఉన్నారు. ఖమ్మం నుండి వచ్చిన మా ముత్తాత గడ్డియ్య (గడ్డి+అయ్య)ను ఖమ్మం గడ్డియ్య అని పిలిచారు. అదే చివరకు మా ఇంటి పేరయింది. శంకరపాడు ఏర్పడిన మొదటిరోజుల్లో దాన్ని 'ఏనాది కోటడు గ్రామం' అని ఎగతాళిగా పిలిచేవారట. ఏనాది కోటడు ఏనాది గజదొంగ. సంపన్నుల ఇళ్ళకు 'ధర్మకన్నం' చేసేవాడు. వ్యక్తిగత ఆస్తికి బద్ధవిరోధి. ధర్మకన్నం చేసి శంకరపాడుకు దగ్గరగా కొల్లేటి సరస్సుకు చుట్టూ ఉన్న ఎత్తయిన గడ్డి దుబ్బుల్లో దాక్కునేవాడు. మావాడే అతనికి తిండీ తిప్పలూ చూసేది. సమాచారం అందించేది. కాపలా కాసేది. తెచ్చుకున్న సొమ్ములో అతను కొంత భాగం మా వాడకు ఇచ్చేవాడని కొందరంటారు. ఇచ్చినా ఇవ్వకపోయినా ఉన్నవాళ్ళను లూఠీ చేస్తున్నాడని మా పల్లెకు ఒక సంతృప్తి.

చివరకు ఏనాది కోటడు కొల్లేటి దుబ్బుల్లో ఉన్నాడని తెలిసి ఇరవైమంది పోలీసులొచ్చి, చుట్టు ముట్టి, అరెస్టు చేసి లాక్కొని పోతుండగా మా వాడ జనం పోలీసులపై మూకుమ్మడిగా దాడిచేసి తన్ని, వాళ్ల టోపీలు తగుల పెట్టి ఏనాది కోటడిని తప్పించారు. వాళ్లకు పోలీసుల గురించి తెలియదు. స్టేట్ గురించి తెలియదు. వాళ్లకు తెలిసింది, పోలుకొండ కమ్మ భూస్వాముల గురించే. రెండు రోజుల తర్వాత మా పల్లెను చుట్టుముట్టిన పోలీసు బృందం పెద్దా చిన్నా, ఆడా మగా తేడా లేకుండా అందర్నీ రావిచెట్టు దగ్గరకు మందగా తోలి చితగ్గొట్టి మగ వాళ్ళందర్నీ అరెస్టు చేసి 50 మైళ్ల దూరంలో ఉన్న మచిలీపట్నం నడిపించుకుపోయి కోర్టులో కేసు నమోదు చేశారు.

మిషనరీలు కదిలి సామ్యూల్ లాయర్‌కు కేసు వకాల్తా ఇచ్చారు. జిల్లా కలెక్టరు తెల్లవాడు. మిషనరీలు జిల్లా కలెక్టరు సహాయం అర్థించారు. చివరకు కేసు కొట్టేశారు. నేను చిన్న వయసులో ఉండగా ఈ ఏనాదికోటడి చరిత్రను మా నాన్న సంవత్సరానికి ఒక్కసారైనా తప్పనిసరిగా చెప్పేవాడు. జనం పోలీసుల టోపీలను తగులబెట్టడాన్ని చేతులు తిప్పుతూ మరీ చెప్పేవాడు. మా నాన్న ఎనిమిది ఏళ్ళ ప్రాయంలో ఉండగా ఈ ఉదంతం జరిగిందట.

మా నాన్న- మా తాత
మా నాన్న పొడవు మనిషి. మా తాత యాకోబు ఇంకా పొడవు. ఇద్దరూ సన్నగా రివటలా ఉండేవారు. మా నాన్న ఎర్రగా, మా తాత నల్లగా ఉండేవాళ్లు. మా నాయనమ్మ రాహేలు పొట్టిగా, బొద్దుగా, ఎర్రగా ఉంగరాల జుట్టుతో అందంగా ఉండేది. 'పెద్ద కులపోడి'కి పుట్టిందని అనుకునేవారు. మా నాన్నకు ఆమె పోలికలే వచ్చాయి. మా తాత పాములు పట్టి ఆడించేవాడు. పాము, తేలు మంత్రాలు ఆయనకు వచ్చు. పాముల్ని ఊళ్ళో ఆడించి జనాన్ని భయపెట్టేవాడు. పండుగలకు పోలుకొండలో పాములాడించి బుట్ట నిండా గారెలు, బూరెలు అడుక్కుని తెచ్చేవాడు. వయస్సు పండిపోయిన తరువాత గుడిసె ముందు కూర్చుని వచ్చేపోయే వాళ్లను పేరు పేరునా బండబూతులు తిడుతూ పాటలు పాడేవాడు.

అప్పటికే మా తాతకు మతిచాంచల్యం వచ్చింది. నేను పెద్దవాణ్ణయి, నక్సలైట్‌నయి రహస్య జీవితానికి వెళ్లిపోయిన తర్వాత మా గ్రామస్తులు నన్ను 'చినయానాది కోటడు' అని చెప్పుకొని రచ్చబండ దగ్గర కళ్లనీళ్ల పర్యంతంగా పగలబడి నవ్వుకునేవాళ్ళు.

మా నాన్న నన్ను కొల్లేరు సరస్సుకు తీసుకొని వెళ్ళినప్పుడల్లా శంకరపాడు బయటనున్న విస్తార ప్రాంతాన్ని చూపిస్తూ, ఆ ప్రాంతంలోని భూములన్నీ శంకరపాడు, పోలుకొండ మాలమాదిగలకు చెందినవేననీ, కమ్మ భూస్వాములు మాలమాదిగలు అవసరాలకు తెచ్చుకున్న అప్పులపై వడ్డీలమీద వడ్డీలు పెంచి, చదువురాని వాళ్ళను దగాచేసి, దౌర్జన్యంగా వేలిముద్రలు వేయించుకొని భూములు ఎలా గుంజుకున్నారో వివరంగా చెప్పేవాడు. కళ్ళనీళ్ళ పర్యంతం చెప్పేవాడు. ఆ మాటల్లో కోపతాపాలు కలగలిసి ఉండేవి. మా నాన్న పోలుకొండ భూస్వాముల దౌర్జన్యాల గురించి ఎంత భయంకరంగా చెప్పినా ఆ పిన్న వయసులో ఆ భూస్వాములందరి కంటే మా నాన్నే శక్తివంతుడని అనిపించేది. మా నాన్న కర్ర పట్టుకుంటే వాళ్ళంతా 'లగెత్తుతార'ని అనుకునేవాణ్ణి.

 మా నాన్న నా తల దించనివ్వలేదు
శంకరపాడు మాలపల్లెకు ఊరు పోలుకొండ. అక్కడ పర్వతనేని కుటుంబం పెద్ద భూస్వాములు. వారిని 'కొల్లేటి భూస్వాముల'ని మిగతా ప్రాంతాల్లోని భూస్వాములు ఎద్దేవా చేసేవారు. తొలిరోజుల్లో పర్వతనేని వారు కొల్లేరుకు దగ్గరలో సెటిల్ కాలేదు. వెంట్రప్రగడ నుంచి గుర్రాలమీద వచ్చి శిస్తులు వసూలు చేసుకొని వెళ్ళేవారట. కొల్లేరు ప్రాంతంలో లాభసాటి వ్యవసాయం చేయవచ్చుననే నమ్మకం కుదిరిన తరువాతనే వారు పోలుకొండలో స్థిరపడ్డారట. వారికి అలాంటి నమ్మకాన్నిచ్చింది ఆ ప్రాంతంలో అప్పటికే స్థిరపడిన మాలమాదిగల చెమట చుక్కలే.

శంకరపాడుకు, పోలుకొండకు మధ్యదూరం రెండు మైళ్ళే అయినా తేడా ఎన్నో మైళ్ళు. శంకరపాడు అంతా అంటరాని వాళ్ళే. పెద్ద కులపోళ్లు లేరు. శంకరపాడును పోలుకొండ మాలపల్లెతో పోలిస్తే తేడా అర్థం అవుతుంది. శంకరపాడు మాలలు కనీసం వాడలోనైనా తలెత్తుకొని తిరిగేవారు. ఎప్పుడన్నా పోలుకొండ నుంచి భూస్వాములు వస్తే పల్లె వాతావరణం మారేది. పోలుకొండ మాలపల్లి ఎప్పుడు తలదించుకొనే బతికింది. ఆ పల్లెలో ఎక్కువమంది భూస్వాముల వద్ద పాలేళ్ళు. పోలుకొండ వీధులగుండా మాలమాదిగలు చెప్పులు వేసుకొని నడవడానికి వీల్లేదు. చెప్పులు చంకలో పెట్టుకొని నడవాలి. గొడుగు వేసుకుని నడవడానికి వీల్లేదు. కాలిబాట పక్కనే నడవాలి. ఎదురుగా పెద్ద కులపోడొస్తే దూరంగా తొలగాలి. పెద్ద కులపోళ్ళు నూతుల్లో నీరుతోడి మాలమాదిగల కుండల్లో పోసేవారు. ఇందులో దయాదాక్షిణ్యాలేమీలేవు. జీవనాధారమైన మంచినీళ్ళు కూడా పెద్దకులపోళ్ల కంట్రోల్‌లోనే ఉన్నదనే హెచ్చరిక అది.

నా చిన్న వయసులో మా నాన్న నన్ను పోలుకొండ ఊరు మధ్యగా తీసుకుని వెళ్ళేవాడు కాదు. ఊరు బయటనుంచి తీసుకొని వెళ్ళేవాడు. తన కొడుకు కుల వివక్షకు గురికావడం చూడలేక అలాచేసేవాడు కాబోలు! ఒకరోజు మా నాన్న నాతో మనందరం విశాఖపట్నం వెళ్ళిపోవా''లన్నాడు చేతిలో బెల్లం మిఠాయి పొట్లం పెడుతూ.

http://andhrajyothy.com/mainNewsShow.asp?qry=2012/apr/18/navya/18navya1&more=2012/apr/18/navya/navyamain&date=4/18/2012

No comments:

Post a Comment