పీపుల్స్‌వార్ గ్రూపు అగ్రనాయకుల్లో ఇద్దరు వ్యక్తులను అందించిన ఘనత జిల్లాదే. వారిలో ఒకరు కొండపల్లి సీతారామయ్య, రెండోవారు కేజీ సత్యమూర్తి. తొలుత కమ్యూనిస్టు ఉద్యమం వైపు ఆకర్షితులైన వీరు ఆ తర్వాత నక్సలిజం వైపు అడుగులు వేశారు. గన్ను పట్టిన సత్యమూర్తి.. పెన్నుకు పదునుపెట్టి శివ సాగర్‌గా విప్లవ కవిత్వ మార్గదర్శకుడయ్యారు. చివరి దశలో ఆయన చేపట్టిన దళిత ఉద్యమానికి జిల్లానే కేంద్ర స్థానమైంది. కందులపాడులో మంగళవారం అస్తమించిన ఆ ఉద్యమ నెలబాలుడికి పలువురు నివాళులర్పించారు. ఆయన భౌతికకాయానికి బుధవారం నగరంలో అంత్యక్రియలు నిర్వహిస్తారు.
విజయవాడ, న్యూస్‌లైన్ ప్రతినిధి ‘అమ్మా నన్ను కన్నందుకు, విప్లవాభివందనాలు, పక్షుల రాగాల నడుమ గరికపూల పాన్పు మీద, అమ్మా! నన్ను కన్నందుకు విప్లవాభివందనాలు’ అంటూ కన్నతల్లిని, పుట్టిపెరిగిన గడ్డను మరవని విప్లవ యోధుడు, కవి కేజీ సత్యమూర్తి. గుడివాడ సమీపంలోని పోలుకొండ శివారు శంకరంపాడులో జన్మించిన సత్యమూర్తికి ఆనాటి ఉభయ కమ్యూనిస్టు పార్టీ నాయకులతో సత్సంబంధాలు ఉండేవి. 1954నుంచి విద్యార్థి ఉద్యమంలో (ఏఐఎస్‌ఎఫ్) పాల్గొన్నారు. ఆంధ్రా యూనివర్సిటీలో విద్యనభ్యసించిన తర్వాత 1959-60 మధ్య విశాలాంధ్రలో అతికొద్ది కాలం పనిచేశారు. 1964లో ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ కాలంలో ఆనాటి యువజన విభాగం పత్రికకు సంపాదకుడిగా పనిచేశారు. ఉభయ కమ్యూనిస్టు పార్టీల చీలిక అనంతరం కృష్ణాజిల్లా సీపీఐలో సభ్యుడిగా ఉంటూ ఇక్కడ జరిగిన అనేక ఉద్యమాల్లో కీలకపాత్ర పోషించారు. గుడివాడ, గన్నవరం, మచిలీపట్నం ప్రాంతాల్లోని ప్రజలతో సత్సంబంధాలు కొనసాగించేవారు. గుడివాడ, మచిలీపట్నంలో రిక్షా కార్మిక సంఘం, రైతు కూలీ సంఘాలు తొలిసారిగా స్థాపించి కార్మికవర్గ హక్కుల కోసం పోరాడారు. తూర్పుకృష్ణా కేంద్రంగా కొండపల్లి సీతారామయ్యతో కలసి ఉద్యమాలలో పాల్గొన్నారు. 1967లో జరిగిన నక్సల్‌బరీ ఉద్యమానికీ, శ్రీకాకుళం ఉద్యమానికి ప్రభావితుడై కొండపల్లి సీతారామయ్యతో కలసి నక్సలిజం వైపు అడుగులు వేశారు. 1969లో కొంతకాలం ఉపాధ్యాయుడిగా పనిచేసిన సత్యమూర్తి 1970 నుంచి విప్లవ రాజకీయాల్లో చురుకుగా పాల్గొన్నారు. మావోయిస్టు పార్టీలో విభేదాల కారణంగా బయటకు వచ్చిన సత్యమూర్తి 1999 అసెంబ్లీ ఎన్నికల్లో ముదినేపల్లి నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేశారు.
కుగ్రామం నుంచి ప్రారంభమైన ప్రస్థానం
దళిత కుటుంబంలో పుట్టిన సత్యమూర్తి భారత్‌లో విప్లవోద్యమ నేతగా, విప్లవ రచయితలకు మార్గదర్శకుడిగా నిలిచారు. సమాజంలో ఆర్థిక అసమానతలు తొలగిపోవాలని, ఈ సమాజం మార్పు మార్క్సిజం, లెనినిజం, మావోయిజంతోనే సాధ్యమవుతుందని భావించారు. గ్రామంలో ఉన్న సీబీసీఎన్‌సీ పాఠశాలలో ఐదోతరగతి వరకు చదివారు. అనంతరం గుడివాడ పట్టణంలో ఉన్న ఏజీకే మున్సిపల్ పాఠశాలలో ఎస్‌ఎస్‌ఎల్సీ, గుడివాడ ఏఎన్నార్ కళాశాలలో పీజీ వరకు చదివారు. ఎమ్‌ఏలో గోల్డ్ మెడలిస్ట్. ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ మందపాడు కమిటీ కార్యదర్శిగా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. గుడివాడ పట్టణ కమిటీ సభ్యుడిగా పని చేశారు. శంకరంపాడుకు చెందిన మణిమ్మతో వివాహం జరిగింది. విప్లవ రచయితల సంఘంలో ముఖ్య పాత్రధారిగా ఉన్నారు. 1970 ఫిబ్రవరిలో విశాఖపట్నంలో శ్రీశ్రీ షష్టిపూర్తి మహోత్సవాలు సత్యమూర్తి ఆధ్వర్యంలోనే జరిగాయి. 1970 అక్టోబర్‌లో ఖమ్మంలో జరిగిన విరసం మహాసభలలో ముఖ్యభూమిక పోషించారు. 1980లో కొండపల్లి సీతారామయ్య, ముక్కు సుబ్బారెడ్డితో కలిసి పీపుల్స్‌వార్ పార్టీని స్థాపించడంలో ముఖ్యపాత్ర వహించారు. దీనికి సెంట్రల్ కమిటీ జనరల్ సెక్రటరీగా కూడా కొన్నాళ్లు పనిచేశారు. ఉద్యమంలో ఉన్నప్పుడు ఖమ్మం జిల్లాకు చెందిన పార్వతమ్మ పరిచయం కావడంతో రెండో వివాహం చేసుకున్నారు. ఆమెకు పిల్లలు లేరు. పీపుల్స్‌వార్ పార్టీనుంచి 1988లో బయటకు వచ్చి కొంతకాలం పాటు అజ్ఞాతంలో ఉన్నారు.
1992లో గ్రామంలో ఘన సన్మానం..
పీపుల్స్‌వార్ పార్టీ నుంచి బయటకు వచ్చాక ఆయనకు శంకరంపాడులో భారీ సన్మానం చేశారు. ఉద్యమ నెల బాలుడుగా పేరొందిన ఆయనకు గ్రామమంతా ఎదురేగి స్వాగతం పలికిన తీరు నేటికీ మర్చిపోలేమని స్థానికులు గుర్తుచేసుకుంటున్నారు. కొంతకాలంపాటు సత్యమూర్తి ఈ గ్రామంలోనే గడిపారని చెబుతున్నారు.
‘ఎదురీత’ మాసపత్రికలో...
ఎంఎల్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఓ.సాంబశివరావు ఎడిటర్‌గా కొనసాగిన ఎదురీత మాసపత్రికలో సత్యమూర్తి ప్రత్యేక వ్యాసాలు రాశారు. అనంతరం దళిత సాహిత్యం వైపు మొగ్గుచూపారు. నగరం కేంద్రంగా ఏర్పాటైన సామాజిక విప్లవ వేదికను నడిపారు.
బాబ్రీ మసీదు కూల్చివేతకు నిరసనగా బహిరంగ సభ
బాబ్రీ మసీదు కూల్చివేతకు నిరసనగా మొగల్రాజపురంలోని మధుకళామండపానికి సమీపంలో పెద్ద కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమ నిర్వహణలో సత్యమూర్తి కీలక పాత్ర పోషించారు. రాష్ట్రస్థాయిలో జరిగిన ఈ కార్యక్రమం అప్పట్లో సంచలనం సృష్టించింది.
కుటుంబ సభ్యుల కంటే.. శిష్యులకు ప్రాధాన్యత
సత్యమూర్తికి గన్నవరంతో అనుబంధం ఉండేది. ఆయన కుటుంబ సభ్యులకంటే, శిష్య బృందానికే అధిక ప్రాధాన్యత ఇచ్చేవారు. సత్యమూర్తి పీపుల్స్‌వార్ కార్యక్రమాల్లో చురుగ్గా ఉండటంతో భార్యాబిడ్డలు గన్నవరంలో స్థిరపడ్డారు. పీపుల్స్‌వార్‌తో సంబంధాలు తెంచుకున్న తరువాత 1990లో మొదటిసారిగా గన్నవరంలో తన కుటుంబ సభ్యులను కలిశారు. అప్పటి నుంచి తరచూ ఆయన గన్నవరం వచ్చి వెళుతుండేవారు. సత్యమూర్తి గన్నవరం వస్తున్నాడని తెలిస్తే క్షణాల్లో అభిమానులు, శిష్యులు చుట్టుముట్టేవారు. ఆయన నోటి వెంట కవిత్వం ఎడతెరిపి లేకుండా వచ్చేది. ఆయన కవితాధోరణిని సన్నిహితులు ఆసక్తిగా వినేవారు. సత్యమూర్తి మరణవార్త తెలియగానే గన్నవరంలో ప్రముఖులు ఆయన స్మృతులను నెమరు వేసుకున్నారు.
http://www.sakshi.com/main/FullStory.aspx?catid=359380&subcatid=18&Categoryid=3
No comments:
Post a Comment