Thursday, 19 April 2012

ఈ చిరుగాలి సితారా వినిపించదిక


కవిత్వంలో విప్లవాన్ని పండించి
పోరుముగ్గులు వేసిన చిత్రకారుడు
ఆ కంఠమే ధిక్కారం
అతని మాటలు తెగిపడిన మందుపాతరలు
అడవి అందాల్ని కవిత్వ అందం చేశావ్
చెట్ల ఆకులతో కొమ్మల రాపిడితో
విప్లవ జేగంటలు మోగించావ్
మరణమంటే అదృశ్యం కావటమే
శివసాగర్ ఎప్పటికీ చెరగని దృశ్యకావ్యం
తెలుగు సాహిత్యానికి
తన అక్షర స్తన్యాన్ని అందించి
పాలిచ్చి పెద్ద చేసినోడు
పోరు దారుల్లో మహాకావ్యాల్ని కన్నవాడు
అక్షరాలకు అర్థం చెప్పినోడు
అక్షరాల్ని ఆయుధాలు చేసి ఇచ్చినోడు
మరణంలేని అక్షరాలై నిలిచినోడు
చిరుగాలి సితారా సంగీతం వినిపించిన వాడు
కవిత్వంతో ఈ నేలంతా ఆక్రమించినోడు
ఆయన కవిత్వాన్ని తాకకుండా పొద్దు పొడవలేదు
అక్షరాల్లో మరిగి, కరిగి, వెలిగి
అక్షరాల్లోనే తనువు చాలించినోడు
మొక్కలా మొలవటం
ఆకులా రాలటం తెలిసినోడు
సకల సౌందర్యాలను అక్షరాల రాశిపోసి
గరికపూల పాన్పుల నల్లినోడు
కవిత్వాన్ని ఒక ఆట ఆడించి
తెలుగు సాహిత్యాన్ని నడిపించినోడు
ఈ లోకమంతా అతని అక్షరాల్లో పొదుగుకుని
నిద్రించినట్లుంది
పరవశించిన అక్షర శివతాండవమతడు
ఈ నేల మీద చెరగని సంతకం శివసాగర్
విప్లవాన్ని కవిత్వం చేయటం
కవిత్వాన్ని కంఠంగా మార్చటం అందరికీ చేతకాదు
కలాలు పట్టిన వాళ్లంతా కవులు కారు
అడవిలో తిరిగినోళ్లంతా విప్లవకారులూ కారు
అందులో ఎవరో ఒకరు
గన్నూ, పెన్నూ పట్టిన శివసాగర్
కులం గోడల్ని తన రెండు చేతులతో కూల్చేసిన
దళితాగ్రహ రూపం శివసాగరం
ఎట్టోడ్ని, ఎనకపడ్డోన్నే కాదు
సకల జనుల ఆగ్రహానికి తన స్వరం కలిపి
తెలంగాణ నాలుగో నేత్రాన్ని తెరిచాడు
జై ఆంధ్రా, జై తెలంగాణ అని
గొంతు విప్పిన ఉద్యమ నెలబాలుడతడు

- జూలూరు గౌరీశంకర్


https://www.andhrajyothy.com/EditorialShow.asp?qry=2012/apr/18/edit/18edit5&more=2012/apr/18/edit/editpagemain1&date=4/18/2012

No comments:

Post a Comment