Monday, 16 April 2012

వైజ్ఞానికుడు, విప్లవవాది

భౌతిక శాస్త్ర సిద్ధాంతరంగంలో పరిశోధనని కొనసాగించి వుంటే జార్జిరెడ్డి ఖచ్చితంగా నోబెల్ బహుమతి సాధించి వుండేవాడని ప్రొఫెసర్లు, సహచరులు, సహాధ్యాయులు, స్నేహితులు భావిస్తారు. ఆ ధీమంతుడు మరొక కఠినమైన మార్గాన్ని యెంచుకున్నాడు. తన విశ్వాసాలతో, అకుంఠిత దీక్షతో చేగువేరా 'స్ఫూర్తి'తో యెంచుక్ను మార్గమది.

అది 1971. నేను 18 యేళ్ళ వయసులో యూనివర్సిటీ కళాశాలలో అడుగు పెట్టాను. నేను చేరిన కోర్సుని ఆ రోజుల్లో 'స్పెషల్ బిఎస్‌సి (ఫిజిక్స్)' అని పిలిచేవాళ్ళు. హైదరాబాద్‌లోని మధ్యతరగతి కుటుంబంలో పుట్టి పెరిగిన నేను అప్పటికి స్కూలు చదువులో అత్యుత్తమ స్థాయిలో రాణించి, సైన్యంలో చేరాలని ప్రయత్నించి వున్నాను (వివిధ కారణాల వల్ల అది వీలు పడలేదు). ఐఐటిలో చేరి మొదటి సంవత్సరంలోనే వదిలేసి వచ్చినందుకు కుటుంబం, బంధువులు, స్నేహితులందరితో తిట్లు తింటూ వుండిన కాలమది. స్వతహాగానే సరదాగా, హాయిగా, జాలీగా కాలం గడపాలనే మనస్తత్వం నాది.

అనతికాలంలోనే నేను కొత్త స్నేహితులని సంపాదించాను. ప్రత్యేకించి వెంకటరమణి, మరికొంత మంది మిత్రుల బృందంతో స్నేహంలోని మాధుర్యాన్ని ఆస్వాదిస్తున్న రోజులవి. ఒక రోజు క్యాంపస్‌లో నేనూ రమణి పక్కపక్కనే నడుస్తూ వెళుతున్నాం. మాకు ఎదురుగా వస్తున్న ఒకరిని రమణి పలకరించి, అతనే జార్జిరెడ్డి అని నాతో చెప్పాడు. జార్జి ఎ.వి కాలేజీలో తమకు ఫిజిక్స్ లెక్చరర్‌గా పాఠాలు చెప్పేవాడని, ఆ పాఠాలు చాలా ఆసక్తికరంగా, విలువైన సమాచారంతో వుండేవనీ రమణి చెప్పాడు. కొన్ని సంవత్సరాల క్రితం మా స్కూల్ (సెయింట్ పాల్స్ హైస్కూల్)లో గేటు కాపలాదారు యూసుఫ్‌ని జార్జిరెడ్డి అనే వ్యక్తి కొట్టాడన్న విషయం నాకు అప్పుడే గుర్తుకొచ్చింది. కొంత మంది రౌడీలు యూసుఫ్ పైన దౌర్జన్యం చేశారని అప్పట్లో మా ప్రిన్సిపాల్ ప్రకటించారు. అప్పట్లో రెండు విద్యార్థి బృందాలు ప్రత్యర్థులుగా మారి గూండాల్లా కొట్లాడుకుంటూ వుంటారని అక్కడక్కడ విన్న మాటలు కూడా నాకు గుర్తుకొచ్చాయి. ఈ ప్రత్యర్థి బృందాలు రెండూ ఆనాటి ప్రధాన రాజకీయ పక్షాల యువజన విభాగాలకి అనుబంధంగా వుండేవి. మల్లయోధుడిగానూ, పోరాటశీలిగానూ, ఎమ్మెస్సీ భౌతిక శాస్త్రంలో స్వర్ణ పతకాన్ని సాధించిన మేధావిగానూ గుర్తింపు పొంది, అందరినీ ఆకట్టుకునే జార్జి రెడ్డి అందులో ఒక బృందానికి నాయకుడు. జార్జి రెడ్డిపై ఆనాడు నాకేర్పడిన అభిప్రాయమది. నాలాగే చాలామందికి అలాంటి అభిప్రాయమే ఉండేది.

'భారత ప్రజలు సాయుధ విప్లవం ద్వారానే తమ విముక్తిని సాధించగలుగుతార'నే అంశం పైన జార్జి యూనివర్సిటీ స్థాయిలో చర్చ నిర్వహిస్తున్నాడని తెలియగానే అక్కడికి వెళ్ళి చూడాలని నిర్ణయించుకున్నాను. చర్చ ముగింపు సందర్భంగా జార్జి వొక మంచి సమాచారంతో కూడిన ఉపన్యాసాన్నిచ్చాడు. తర్వాత జార్జితో సహా మేమంతా యూనివర్సిటీ సైన్సు కళాశాల క్యాంటీన్ వైపు వెళ్ళాం. అక్కడ ఆనాటి చర్చాంశంపైననే మళ్ళీ ఆవేశపూరితమైన చర్చ కొనసాగింది. నేను కూడా చర్చలో పాల్గొని నా అభిప్రాయాల్ని చెప్పాను. చర్చ తర్వాత అందరం వెళ్ళిపోయాం. కానీ నాలో మాత్రం ఏదో ఒక తెలియని సంఘర్షణ కొనసాసాగుతూ పోయింది.

కొద్దిరోజుల తర్వాత నేను, వియత్నాం యుద్ధం మీద నా వాదనని రుజువు చేసుకొందామని 'ప్లెయిన్ ట్రూత్' అనే పత్రిక ప్రతినొక దాన్ని పట్టుకు వెళ్ళాను. జార్జి, కులకర్ణి యిద్దరూ అది పాశ్చాత్య దేశాల మద్దతుతో సాగుతున్న ప్రచారమని తిరస్కరించారు. పాశ్చాత్య దేశాల మిలిటరీ పరిశ్రమల కూటమి దుష్ప్రచారంలో నేను పొరపడుతున్నానని అన్నారు. నాకీ విషయాలన్నీ కొత్త. వాళ్ళ దగ్గర చాలా సమాచారముంది. నా దగ్గర వాళ్ళ వాదానికి జవాబు చెప్పేందుకేమీ లేకుండాపోయింది. నోమ్ ఛామ్‌స్కీ రాసిన 'ఎట్ వార్ విత్ ఆసియా' పుస్తకాన్ని చదవమని నాకు సలహా ఇచ్చారు. నేను ఆ పుస్తకం చదివేను. రమణి కూడా ఆ చర్చల్లో పాల్గొనే వాడు. కొన్ని నెలల పాటు ఇదే వరవడి కొనసాగింది.

అన్ని విషయాలపైనా మేము తీవ్రంగా చర్చించుకునే వాళ్ళం. వీటినే నేను 'బండ క్యాంటీన్ చర్చల'ని అంటున్నాను. క్యాంటీన్ ఆనుకొని వొక పెద్ద వేప చెట్టు, దాని కింద నాలుగైదు పెద్ద బండరాళ్ళు వుండేవి. వాటిపై సుమారు 10-12 మంది కూర్చునే వీలుండేది. ఈ బండరాళ్ళ మూలంగానే దానికి 'బండ క్యాంటీన్' అనే పేరు పెట్టాం. ఇక్కడ నేను 'ఖాలా' లేక 'ఖాలా జాన్' (చిన్నమ్మ -పిన్ని అని అర్థం) గురించి చెప్పాలి. క్యాంటీన్ సహాయకురాలిగా పనిచేసే ఆమె మాకు వేడి వేడి ఛాయ్‌నీ, తినుబండారాలనీ అడిగినప్పుడల్లా అందించేది. జార్జి నిర్ణీత వేళల్లో మాత్రమే. అదీ కొంచెం కొంచెంగా తినేవాడు.

అందరికీ సమానంగా అందేట్లు చూసేవాడు. ఈ రకంగా నాకు ప్రత్యామ్నాయ దృక్పథాలతో, ప్రత్యేకించి సోషలిస్టు దృక్పథంతో పరిచయం యేర్పడింది. జార్జిరెడ్డి అంటే ఒక 'విద్యార్థి గూండా' అనే నా తొలినాటి అభిప్రాయం మారసాగింది. ఒక భౌతిక శాస్త్రవేత్త, వొక మేధావి తన జీవితదృక్పథాన్ని, లక్ష్యాన్నీ రూపొందించుకునే ప్రయత్నం చేస్తున్నట్లనిపించింది. తిరుగుబాటు మనస్తత్వం నుంచి సిద్ధాంతాలకి కట్టుబడిన వొక కార్యచరణవాదిగా రూపొందుతున్న క్రమాన్ని నేను చూడడం మొదలైంది.

జార్జి అనేక అంశాలని- వియత్నాం యుద్ధం, పాలస్తీనా సమస్య, డొమినికన్ రిపబ్లిక్, గ్వాటెమాల (యునైటెడ్ ఫ్రూట్ కంపెనీ) సంఘటనలు, 1968 ఫ్రెంచి విద్యార్థుల తిరుగుబాటు, అమెరికా బ్లాక్ పేంథర్‌ల ఉద్యమం, నక్సల్బరీ, శ్రీకాకుళం, తెలంగాణ ఉద్యమాలని చర్చకి తీసుకొచ్చేవాడు. బూర్జువా సంస్కృతి, డీక్లాసిఫై కావాల్సిన (ఆధిపత్య వర్గ స్వభావాన్ని తొలగించుకోవాల్సిన) అవసరం, ఫోకో సిద్ధాంతం, గెరిల్లా పోరాటం, ఆఫ్రికా ప్రజల విముక్తి ఉద్యమాలు మొదలైన విషయాలు తరచుగా చర్చకి వచ్చేవి. చేగువేరా, రెజి దెబ్రే, కాన్ బాండీ, సార్త్రె జార్జ్ హబాష్- ఇవి ఆ రోజుల్లో మేం తరచుగా వినే కొన్ని పేర్లు.

తన చేతుల్లో చూసిన వాటిని బట్టి తనకి కొన్ని అభిమాన గ్రంథాలు వుండేవనీ, అందులో ఎర్నెస్టో చేగువేరా పుస్తకాలు ముఖ్యమైనవనీ నేనుకుంటాను. ఫెడరిఖ్ హెగెల్ (సైన్స్ ఆఫ్ లాజిక్), సిగ్మండ్ ఫ్రాయిడ్ (కంప్లీట్ సైకలాజికల్ వర్క్స్), కార్ల్ మార్క్స్ (కలెక్టడ్ వర్క్స్) రచనల సంపుటాలని అధ్యయనం చేయడం కూడా నేను చూసేను. ఇంకో మూడు పెద్ద పుస్తకాలు జేమ్స్ జాల్ (ది అనార్కిస్ట్స్), మిఖాయిల్ బకునిన్ రచనలు (సెలెక్ట్‌డ్ రైటింగ్స్), అలెక్స్ హేలీ రాసిన 'ఆటో బయోగ్రఫీ ఆఫ్ మాల్కం ఎక్స్' మొదలైన వాటిని జార్జి చదవడం నేను చూశాను. ఇంకా రెజి దెబ్రె రాసిన 'రివల్యూషన్ ఇన్ రివల్యూషన్', 'ప్రాన్జ్ ఫేనన్ రాసిన 'రెచెడ్ ఆఫ్ ది ఎర్త్' మొదలైన పుస్తకాలని తిరగేయడం నేను చూశాను.

జార్జి రెడ్డి రూపురేఖలు యెలా వుండేవి మరీ పొట్టీ, పొడుగూ కాని మధ్యస్థమైన 5 అడుగుల 6 అంగుళాల ఎత్తు. గోధుమ వన్నె. క్రీడాకారులకుండే దృఢకాయం. చాలా వరకూ గడ్డం పెంచేవాడు. అప్పుడప్పుడూ సన్నటి మీసాలు, నున్నటి గడ్డంతో కనిపించే వాడు. జుట్టు యెడమ వైపు పాపిటతో, ఎప్పుడూ దువ్వి వుండేది. అప్పుడప్పుడూ పాపిట మార్చేవాడు. పొట్టిచేతలు బుష్ షర్టులు వేసుకునేవాడు. తర్వాతి దశలో వెడల్పాటి జేబులున్న పొడుగు చేతుల ఆలివ్ గ్రీన్ చొక్కా, కాటన్ జీన్స్, స్లిప్పర్లు వేసుకోవడాన్ని ఇష్టపడేవాడు. చదవడానికి కళ్ళద్దాలు పెట్టుకునే వాడు. అతనికి బట్టలు ఎక్కువ వుండేవి కావు. అయినా అవి యెప్పుడూ శుభ్రంగా వుతికి, మడతలుపెట్టి వుండేవి. ఆల్కహాల్, పొగాకు ముట్టుకునే వాడుకాదు.

తన ఆహారపు అలవాట్లు చాలా సాదాగా, మితమైనవిగా, సమయమానుసారంగా వుండేవి. చివరి కొన్ని నెలల కాలంలో రోజూ ఆకలితో నిద్రించే వాళ్ళ పట్ల సహానుభూతితో రోజుకి ఒక పూట తిండి మానేసేవాడు. పొదుపుగా మితంగా వ్యవహరిస్తూ దేనినైనా జాగ్రత్తగా, పూర్తిగా ఉపయోగించేవాడు. కాగితం మీద రాసేటప్పుడు ఇదీ అత్యంత ప్రస్ఫుటంగా కనిపించేది. ఏదైనా రాస్తే కాగితమ్మీద యెక్కడా ఖాళీ వుండేది కాదు. జార్జి చాలావరకూ ఇంగ్లీష్, హైదరాబాదీ హిందీలో మాట్లాడేవాడు. తాను తెలుగులో మాట్లాడగా నేనెన్నడూ చూడలేదు. అయితే తెలుగు, హిందీ భాషల్లో రాయడం, చదవడం నేర్చుకునే క్రమంలో వున్నాడు.

కొత్త విషయాలని నేర్చుకోవడంలో ఆయనకున్న శక్తి సామర్థ్యాల రీత్యా వాటిపై అనతికాలంలోనే పట్టు సంపాదించగలిగేవాడు. జార్జి అద్భుతంగా బోధించే వాడు. ఎమ్మెస్సీ పూర్తయ్యాక తన పరిశోధనకి గ్రాంటు కొరకు వేచి చూస్తున్న కాలంలో ఎ.వి కాలేజి ఫిజిక్స్ లెక్చరర్‌గా పనిచేశాడు. తను కూడబెట్టుకున్న డబ్బులతో పుస్తకాలు కొనేవాడు. 1971 చివరలో 'భారతదేశ విశ్వవిద్యాలయాలలో అశాంతి' గురించి తీసిన వొక డాక్యుమెంటరీలో జార్జి కనిపిస్తాడు. అందులో తను ఆలివ్ గ్రీన్ చొక్కా, గడ్డంతో కనిపిస్తాడు. నేనీ డాక్యుమెంటరీ ఫిలింని ఓయూ టాగోర్ ఆడిటోరియంలో చూశాను. ఎవరైనా దాన్ని దొరికించుకోగలిగితే బాగుండును. మళ్ళీ వొకసారి రక్తమాంసాలతో, తెరపైనైనా అతనిని చూడగలుగుతాం.

1972 ఏప్రిల్ 14 సాయంత్రం జార్జిరెడ్డి హత్యకు గురయ్యాడు. నాకు గుర్తున్నంత వరకూ ఆయన వంటిపై సుమారుగా 32 కత్తి పోట్లు. పట్ట పగలు ఓయూ ఇంజనీరింగ్ కాలేజి హాస్టల్ దగ్గర సాయుధులైన ప్రత్యర్థి బృందపు విద్యార్థులూ, వాళ్ళకి అండగా దొంగసారా ముఠా పంపిన కిరాయి హంతకులూ కలిసి కత్తులతో పొడిచారు. హాస్టల్లో బెదిరింపులకీ, దాడికీ గురౌతున్న వొక విద్యార్థికి సహాయంగా వెళ్ళిన జార్జిని ఆ హంతక ముఠా చుట్టు ముట్టి, కత్తులతో దాడిచేసి కసిదీరా పదేపదే పొడిచారు. జార్జి అక్కడికక్కడే చనిపోయాడు. జార్జి హత్య వార్త గురించి తెలియగానే విస్తృతమైన ఆగ్రహం పెల్లుబికింది. పోస్టు మార్టం తర్వాత జార్జి మృతదేహాన్ని పోలీసులు అప్పగించారు.

ఆ మృతదేహాన్ని ఆయన యింటి వద్దకి తీసుకు వెళ్ళారు. మొత్తం కుటుంబ సభ్యులు, అసంఖ్యాకమైన అతని స్నేహితులు, శ్రేయోభిలాషులు, సానుభూతిపరులు అందరూ దిగ్భ్రమకి లోనయ్యారు. జార్జి మృతదేహాన్ని కడసారిగా చూడాలని నగరంలోని అన్ని ప్రాంతాల నుంచీ విద్యార్థులు పెద్ద ఎత్తున రాసాగేరు. అధికార పార్టీ, వామపక్ష పార్టీల రాజకీయ నాయకులు నివాళులర్పించి, హత్య పట్ల తమ ఆగ్రహాన్ని, ఖండనలని ప్రకటించారు. జార్జి అంతిమయాత్ర జనసంద్రమైంది. జార్జి పట్ల జనాభిమానానికి నిదర్శనంగా నారాయణగూడ స్మశానవాటికకి వేలాది ప్రజలు తరలివచ్చారు. నినాదాలిస్తూ అనేక మంది, మౌనంగా విలపిస్తూ కొంత మందీ, కన్నీళ్ళతో మరికొంత మందీ వుంటే ఆగ్రహంతో మాటలు పెగలని వాళ్ళు అనేకులు.

జరిగినదాన్ని నమ్మలేని విస్మయం అందరిలోనూ. భౌతిక శాస్త్ర సిద్ధాంతరంగంలో పరిశోధనని కొనసాగించి వుంటే అతను ఖచ్చితంగా నోబెల్ బహుమతి సాధించి వుండేవాడని ప్రొఫెసర్లు, సహచరులు, సహాధ్యాయులు, స్నేహితులు భావిస్తారు. కానీ తాను మరొక కఠినమైన మార్గాన్ని యెంచుకున్నాడు. తన విశ్వాసాలతో, అకుంఠిత దీక్షలతో చేగువేరా 'స్ఫూర్తి'తో యెంచుక్ను మార్గమది. జార్జి మాటలని గుర్తుకి తెచ్చుకోకుండా తప్ప నాయీ కథనాన్ని మరో విధంగా ముగించలేను. 'ఆఖిర్ క్యోం' (ఇదంతా యెందుకు) అని జార్జి అడిగితే చేగువేరా తన గురించి తాను చెప్పుకున్న మాటల్ని జార్జి వల్లె వేసే వాడు. 'చాలామంది నన్ను సాహసికుడనంటారు. నేను సాహసికుడనే. కాకుంటే కొంత భిన్నమైన వాడిని. నా విశ్వాసాల కోసం ప్రాణాలొడ్డే మనిషిని'.

- ఎ.వి.అశ్వినీ కుమార్
(నేడు జార్జి రెడ్డి 40వ వర్ధంతి)
జార్జిరెడ్డి జీవిత విశేషాలపై నేడు ఆవిష్కరించనున్న 'బండ క్యాంటీన్ ప్రసారాలు' పుస్తకం నుంచి...

http://www.andhrajyothy.com/EditorialShow.asp?qry=2012/apr/14/edit/14edit3&more=2012/apr/14/edit/editpagemain1&date=4/14/2012

No comments:

Post a Comment