Monday, 16 April 2012

కలలు సజీవంగానే ఉన్నాయి

జార్జి రెడ్డిని చూస్తుంటే బహుముఖాలైన ప్రత్యేకతలు గోచరించేవి మాకు. చదువులో ఆయనది అద్భుతమైన ప్రతిభ. అన్నిటికన్నా మిన్నగా దోపిడీ, పీడనలు లేని సమాజాన్ని కలగన్న విప్లవకారుడు జార్జి. ప్రజల కొరకు ప్రాణాలొడ్డిన ఆదర్శ ప్రాయుడిగా ఈనాటికీ ఉత్తేజాన్నిస్తున్న జార్జి వంటి అరుదైన వ్యక్తిని సృష్టించింది అరవైల నాటి ఉద్విగ్న వాతావరణమే. ఆయన అందించిన పోరాట వారసత్వం ఎన్నో ప్రతికూల పరిస్థితులను తట్టుకుంటూ కొనసాగుతూనే ఉంది.

'ఏ అనుమతినీ, నెపాన్నీ కోరుకోకుండానే అతడు తనకు తానుగా మృత్యు మార్గంలో కాలు మోపాడు! దానికతడు ఎదురు నిలిచాడు...' 1967లో చేగువేరా మరణాన్ని గురించి ప్రసిద్ధ చరిత్రకారుడు ఎడ్వార్డో గలియానో రాసిన మాటలివి. ఫిజిక్స్‌లో గోల్డ్ మెడలిస్ట్, రీసెర్చి స్కాలర్, మల్లయోధుడూ అయిన జార్జిరెడ్డి 1972 ఏప్రిల్ 14న ఉస్మానియా యూనివర్సిటీ హాస్టల్‌లో ఇదే విధంగా మృత్యువు పాలయ్యాడు. ఆరెస్సెస్-ఎబివిపి మతోన్మాదశక్తులు పంపిన కిరాయి గూండాలు జార్జిని కత్తులతో పొడిచి హత్య చేశారు. ఈ ఏప్రిల్ 14న జార్జిరెడ్డి 40వ వర్ధంతిని నిర్వహించేందుకు ఆయన మిత్రులు సన్నధులవుతున్నారు. ప్రతి ఏడాదీ ఏప్రిల్ 14న జార్జి అమరత్వాన్ని స్మరించుకుంటూ పిడిఎస్‌యు ఆధ్వర్యంలో సభలు జరుగుతూనే ఉన్నాయి.

'వేల వేల కోర్కెలు, ప్రతిదీ జీవితాన్ని అర్పించదగినదే,  ఎన్నెన్నో ఆకాంక్షలు నాకు, అయినా అవి జీవితానికి చాలనివి' అని మహాకవి మీర్జాగాలిబ్ అంటారు. అది అరవయ్యో దశాబ్దపు ఉత్తరార్ధం నుంచి డెబ్భైలలోకి అడుగుపెడుతున్న కల్లోల కాలం. ప్రపంచంలోని అనేక పెట్టుబడిదారీ దేశాల్లోనూ, అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనూ కాలేజీల్లో, యూనివర్సిటీల్లో చదువుతున్న యువ పోరాటకారులూ, విప్లవకారులూ 'విప్లవ' ప్రతిరూపాలను నిర్మిస్తున్న కాలమది. పర్వత శ్రేణుల నుంచి, గ్రామ సీమలనుంచి 'విప్లవ' ప్రతిరూపాన్ని చూస్తున్న వాళ్ళు మరికొందరు. ఆనాటి 'ఆగ్రహం' అనేక ఉద్యమాలుగా వ్యక్తమయింది.

దక్షిణాఫ్రికాలో వర్ణ వివక్షకు వ్యతిరేకంగా తలెత్తిన సొయెటో విద్యార్థి ఉద్యమం, ఫ్రాన్సు విద్యార్థుల మే ఉద్యమం, అమెరికాలో తలెత్తిన బ్లాక్ పాంథర్స్ ఉద్యమం, అన్నిటికన్నా మిన్నగా అమెరికన్ సామ్రాజ్యవాదంపై వెల్లువెత్తిన వియత్నాం ప్రజా పోరాటం, మన దేశంలోని నక్సల్బరీ, శ్రీకాకుళం రైతాంగ పోరాటాలు వంటివన్నీ ఈ కాలంలోనే ప్రధానమైన రాజకీయ పరిణామాలు. 'వేర్ హేజ్ ద రేజ్ గాన్' అనే వ్యాసంలో తారీక్ అలీ చెప్పినట్టుగా '1968లో ఒక తుపాను ప్రపంచాన్ని కుదిపివేసింది. అది వియత్నాంలో మొదలై ఆసియా మీదుగా సముద్రాలనూ, పర్వతాలనూ దాటి యూరప్‌లోకీ ఇతర ప్రాంతాలలోకీ వ్యాపించింది... ప్రపంచంలో కెల్లా శక్తిమంతమైన రాజ్యాన్ని వియత్నాం ప్రజలు ఓడించారంటే, మనం కూడా మన పాలకులను ఓడించగలం... 1960లలోని అనేక మంది విప్లవవాదులలో ప్రబలంగా ఉండిన ఆలోచనా ధోరణి అది' ఇటువంటి రాజకీయ నేపథ్యం నుంచి మనకాలం వీరుడిగా ఎదిగిన వాడు జార్జి.

ఆ రోజుల్లో ఉస్మానియా క్యాంపస్‌లోని సైన్స్ కాలేజీలో గ్రాడ్యయేషన్ విద్యార్థిగా ఉండిన నాకు జార్జి రెడ్డితో పరిచయమయింది. ఆయన మరణాంతరం ఏర్పడిన పిడిఎస్‌యుకు పూర్వరూపమైన ప్రగతిశీల బృందంలో నేను కూడా ఒక సభ్యుడిని. అప్పుడే జార్జితో కలిసి పనిచేసే అవకాశం కలిగింది. జార్జి ఒక మల్లయోధుడనీ, ఆయనకొక సహచర బృందం ఉందనీ జార్జితో ప్రత్యక్ష పరిచయానికి ముందే విన్నాను. అప్పట్లో సిపిఐకి అనుబంధంగా ఉండిన మార్క్సిస్ట్ ఎడ్యుకేషన్ సొసైటీ అనేక విషయాలపై ఉపన్యాసాలను ఏర్పాటు చేస్తుండేది. వైఎమ్‌సిఎ లో జరిగిన రెండు సభల్లో సిపిఐ సిద్ధాంతకర్త మొహిత్ సేన్ ఉపన్యాసాలకు హాజరవడం నాకు ఇంకా గుర్తున్నది.

కొంచెం పొట్టిగా, తెల్లగా ఉన్న ఒక వ్యక్తి ఆ సభల్లో ప్రశ్నలు లేవనెత్తుతూ, చర్చలు సాగిస్తూ ఉండటాన్ని అప్పుడే చూశాను. జార్జి రెడ్డి ఆయనేనని నాకప్పుడు తెలియదు. ఆయనతో ప్రత్యక్ష పరిచయం కలిగాక తరచుగా ఆయన్ని కలిసి మాట్లాడుతూ ఉండేవాణ్ని. సైన్స్‌కాలేజీలోకి ఆస్ట్రానమీ డిపార్ట్‌మెంట్‌ను ఆనుకుని ఉండిన క్యాంటీన్‌ను మా 'అడ్డా'గా మార్చుకుని, వివిధ విషయాలపై జార్జి చేసే విశ్లేషణలను వింటుండేవాళ్ళం. మార్క్సిజాన్నీ, సోషలిజాన్నీ అభిమానించే వ్యక్తులు సైతం 'ఆయాన్ రాండ్' రాసిన 'అట్లాస్ ష్రగ్‌డ్', 'ఫౌంటెన్ హెడ్'వంటి పుస్తకాలను చేతబట్టుకుని ఈ అడ్డాలో తరచుగా కనబడుతుండేవాళ్లు. సిద్ధాంతం, తత్వ శాస్త్రం, సైన్స్, విప్లవం వంటి ఎన్నో విషయాలపై అక్కడ చర్చలు జరిగేవి. జార్జి స్పష్టమైన మార్క్సిస్టు ప్రాపంచిక దృక్పథంతో మాట్లాడేవాడు. సోషలిస్టు భావనలను, ఆదర్శాలను వ్యాప్తి చెయ్యాలన్న లక్ష్యంతో ఆయన స్టడీ సర్కిల్స్‌ను ఏర్పాటు చేశాడు.

అటువంటి ఒక స్టడీసర్కిల్‌లో నేను సభ్యుడిని. 'ఇంపీరియలిజం ది హయ్యస్ట్ స్టేజ్ ఆఫ్ క్యాపిటలిజం'అనే లెనిన్ ప్రసిద్ధ గ్రంథాన్ని మేము జార్జి ఆధ్వర్యంలో అధ్యయనం చేస్తుండే వాళ్ళం. విప్లవానికి ఒక చిహ్నంగా నిలిచిన చేగువేరా హత్య ఆనాటి యువ విప్లవకారుల హృదయాలపై బలమైన ముద్ర వేసింది. మాలో కొందరం జార్జిని స్థానిక చేగువేరాగా చూస్తుండే వాళ్ళం. ఆయన ఒకసారి 'భారతదేశంలో సాయుధ విప్లవం' అనే అంశంపై సైన్స్ కాలేజీలో చర్చా వేదికను నిర్వహించాడు. ఆనాడు ఆయన ఎన్నుకున్న ఆ అంశం ఆనాటి రాజకీయ పరిస్థితులకు ప్రతిబింబం. నక్సల్బరీ అనంతర, శ్రీకాకుళం సాయుధ రైతాంగ పోరాటాల అనంతర కాలమది. ఆ సభలో హింసను గురించి చర్చిస్తూ జార్జి చేసిన వ్యాఖ్యలు నా మనసులో బలంగా ముద్రించుకుపోయాయి. వలసవాద పాలన ముగిసినా తెల్లవాడి ఆధిక్యాన్ని ఆమోదించడాన్ని, వలసదేశాల మనస్తత్వాన్ని ఆయన విమర్శించాడు.

జార్జిని చూస్తుంటే బహుముఖాలైన ప్రత్యేకతలు గోచరించేవి మాకు. చదువులో ఆయనది అద్భుతమైన ప్రతిభ. ఆయన పిహెచ్.డిలో చేరినప్పుడు గైడ్‌గా ఉండటానికి ఫిజిక్స్ డిపార్ట్‌మెంట్‌లోని ప్రొఫెసర్లెవరూ ముందుకు రానేలేదనీ, చివరికి ఆస్ట్రానమీ డిపార్ట్‌మెంట్‌కు చెందిన ఒక ప్రొఫెసర్ గైడెన్స్‌లో జార్జి పరిశోధన ప్రారంభమైందనీ చెప్పగా విన్నాను. ఆ రోజుల్లో హైదరాబాద్‌లో రిక్షాలు విస్తృతంగా తిరిగేవి. రిక్షా కార్మికులంటే జార్జికెంతో అభిమానం. ఒక మనిషి బరువును మరొక మనిషి మోస్తూ రిక్షా లాగటం ఎంత కష్టమో ఆలోచించమని చెప్తుండేవాడు. ఆయనది స్వార్థరహితమైన పరోపకార ప్రవృత్తి అని చెప్పవచ్చు.

గూండా మూకలను ఒంటిచేత్తో ఎదిరించటానికి వెనుదీయని ఆయన సాహసోపేతమైన వ్యక్తిత్వం మాలో చాలా మందికి గొప్ప ఉత్తేజం. జార్జి హత్యకు గురవటానికి రెండు నెలల ముందు, డి.డి.కాలనీలోని ఆయన ఇంటి సమీపంలోనే గూండాలు ఆయనపై దాడి చేశారు. ఆయన వాళ్ళను ఎదిరించి పోరాడి, గాయాల పాలయ్యాడు. ఒంటరిగా తిరగడం క్షేమం కాదనీ, జాగ్రత్తగా ఉండమనీ కొందరు ఆయనకు సూచించారు. తనకిప్పట్లో చావు లేదంటూ వాళ్ళకు జవాబిచ్చాడు జార్జి. ఆయన గొప్ప సాహసికుడు. ఐతే, ఒక సందర్భంలో చేగువేరా చెప్పుకున్నట్లుగా 'తమ గొప్పతనాన్ని ప్రదర్శించుకునేందుకు ప్రమాదాలకు సిద్ధపడే మనుషులకు భిన్నమైన వ్యక్తిత్వం' అతడిది. అన్నిటికన్నా మిన్నగా దోపిడీ, పీడనలు లేని సమాజాన్ని కలగన్న విప్లవకారుడు జార్జి.

ప్రజల కొరకు ప్రాణాలొడ్డిన ఆదర్శ ప్రాయుడిగా ఈనాటికీ ఉత్తేజాన్నిస్తున్న జార్జి రెడ్డి వంటి అరుదైన వ్యక్తిని సృష్టించింది అరవైల నాటి ఉద్విగ్న వాతావరణమే. జార్జి అమరుడై నలభయ్యేళ్ళు గడిచాయి. ఆయన అందించిన పోరాట వారసత్వం ఎన్నో ప్రతికూల పరిస్థితులను తట్టుకుంటూ కొనసాగుతూనే ఉంది. ఎన్నో విధాలైన వర్గ, ప్రజాస్వామిక ఉద్యమాల్లో ఆయన స్ఫూర్తి విభిన్న రూపాల్లో వ్యక్తమవుతున్నది. జార్జి ప్రచురించిన కరపత్రాలు పిడిఎస్ తరపున వెలువడుతుండేవి. ఆయన మరణానంతరం ఆ పిడిఎస్ ఒక రాష్ట్రస్థాయి సంఘంగా రూపొంది, 1974లో పిడిఎస్‌యు అనే పేరుతో ఏర్పడింది. 1975లోని ఎమర్జెన్సీ కాలంలో దేశంలో ప్రజాస్వామిక కార్యకలాపాలన్నీ స్తంభించిపోవటంతో బాటు, బూటకపు ఎన్‌కౌంటర్లు విచ్చలవిడిగా జరిగాయి.

ఆ హత్యాకాండలో జార్జి ఉద్యమ వారసుడైన జంపాల ప్రసాద్‌తో బాటు సూరపనేని జనార్దన్ శ్రీహరి వంటి యువ విప్లవకారులు ఎందరో అమరులయ్యారు. మధుసూదన్ రాజ్, రంగవల్లి, వీరయ్య వంటి విప్లవకారులెందరినో రాజ్యం బలిగొన్నప్పటికీ వారి పోరాట స్ఫూర్తి కొనసాగుతూనే ఉన్నది. భవిష్యత్‌ను గురించి వారి సుందర స్వప్నాలు సజీవంగానే ఉన్నాయి. వాటిని చిదిమి వేయటం ఎవరి తరమూ కాదు. అందుకే, స్వప్నాలు మరణించటం విషాదాల్లోకెల్లా విషాదమన్నాడు ఒక కవి. మాల్కమ్ ఎక్స్ ఒక సందర్భంలో నల్లజాతి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ఇలా అన్నాడు  'మీ స్వాతంత్య్రాన్ని సాధించుకునేందుగ్గానూ మీరెంతకైనా తెగిస్తారని మీ శత్రువుకు తెలియజేసినప్పుడే మీకు స్వతంత్రం లభిస్తుంది. అంతకు మించిన మార్గం మరొకటి లేదు.. వాళ్ళు మిమ్మల్ని తీవ్రవాదులనో, ద్రోహులనో, ఉన్మాదులనో, కమ్యూనిస్టులనో, విప్లవకారులనో పిలుస్తారు. కానీ చిరకాలంపాటు విప్లవ మార్గంలో నిలబడి, మీ వంటి వారిని మరింత మందిని తయారు చెయ్యగలిగినప్పుడే మీకు స్వతంత్రం లభిస్తుంది'.
- ప్రదీప్
(ఏప్రిల్ 14న జార్జిరెడ్డి 40వ వర్ధంతి)
http://andhrajyothy.com/EditorialShow.asp?qry=2012/apr/12/edit/12edit3&more=2012/apr/12/edit/editpagemain1&date=4/12/2012

No comments:

Post a Comment