Tuesday, 17 April 2012

ఉస్మానియా చే గువేరా


మనం మరణించినా మనం చేసిన మంచి పనులు నిలిచే ఉంటాయి. ప్రజానీకం తమ అశ్రు తర్పణతో మన చితాభస్మాన్ని పునీతం చేస్తారు. విద్యార్థి దశలో కారల్ మార్క్స్ అన్న మాటలు విద్యార్థి వీరుడిగా అమరుడైన జార్జిడ్డికి అక్షరాలా వర్తిస్తాయి.1972 ఏప్రిల్ 14న మతోన్మాద కిరాయి గూండాలచే ఉస్మానియా యూనివర్సిటీలోని ఇంజనీరింగ్ కాలేజీ హాస్టల్ దగ్గర జార్జిడ్డి దారుణ హత్యకు గురై నలభై ఏళ్లు కావస్తున్నాయి. ఈ సుదీర్ఘ కాలగమనంలో జార్జి సాగించిన విప్లవ పోరాట మార్గంలో ఎంతోమంది నూతన మానవులు రూపొందారు. వీరిలో ఎందరో అమరులయ్యారు. మరెందరో ఇంకా పోరాడుతున్నారు. నలభై ఏళ్ల తర్వాత కూడా జార్జిని తమ గుండెల్లో నిలుపుకుని ఆయ న వర్ధంతిని జరుపుతున్నారు. అందుకే జార్జిడ్డిని విప్లవ ధృవతారగా, తెలుగు నేల మీద తొలి అడుగులు వేసిన ‘చే గువేరా’గా ప్రతిష్టించుకుంటున్నారు. ఈ ప్రస్థానంలో నాలాంటి ఎంతోమంది కార్యకర్తలు ఆయన నుంచి పొందిన ప్రేరణ ఇదే..

జార్జిడ్డి 1947 జనవరి 15న లీలా వర్గీస్, సి. రఘునాథ్‌డ్డి దంపతులకు జన్మించిన నాల్గవ సంతానం. జార్జిడ్డి జననం పాలకాడు (కేరళ)లోనే జరిగింది. చిత్తూరు జిల్లా పీలేరు నియోజకవర్గం రొంపిచర్ల మండలమే వీరి స్వగ్రామం. ఉపాధ్యాయురాలైన తల్లి వివేకవంతమైన పెంపకంలో జార్జి వ్యక్తిత్వం మొగ్గతొడిగింది. జార్జి పినతండ్రి సీకే నారాయణడ్డి విప్లవపంథాపై నిలబడడమే గాకుం డా, పలుమార్లు పీలేరు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఉద్యోగరీత్యా వరంగల్‌కు వచ్చిన కుటుంబంలో జార్జి అన్యాయాలపై పోరాడు తూ, విప్లవాన్ని విశ్వసించే వ్యక్తిగా ఎదిగాడు.1969 నాటి తెలంగాణ ప్రభంజనంలో వేములవాడలోని మా ఇల్లు ఒకానొక ఉద్యమ కేంద్రంగా ఉండేది. ఈ బాల్య స్మృతులను దాటిన తర్వాత, జార్జిడ్డి వివరాల పత్రాలు, లెనిన్ గ్రంథాలు, కొన్ని విప్లవ గీతాలు జార్జి సహచరుడైన మా అన్న రాజన్న ద్వారా మా ఇంటికి చేరి, నాకు తొలి విప్లవ పరిచయాలైనాయి. జార్జిడ్డి శాస్త్రీయ సోషలిస్టు సిద్ధాంతం కోసం సాగించిన అన్వేషణ సఫలమైంది. అమరుడు కామ్రేడ్ నీలం రామచంవూదయ్య మార్గదర్శనం లో జార్జి బృందం స్పష్టమైన లక్ష్యం ఏర్పరుచుకున్నారనడానికి తదనంతర పరిణామాలు సాక్షి భూతంగా ఉన్నాయి. సునిశిత మేధో సంపత్తితో ఎమ్మెస్సీ భౌతికశాస్త్ర గోల్డ్‌మెడలిస్టుగా, అణుభౌతిక శాస్త్ర పరిశోధకుడిగానే కాకుండా, జార్జి చరిత్రను తార్కికంగా అధ్యయనం చేశాడు. రూసో నుంచి మార్క్స్ వరకు విమర్శనాత్మకంగా చదువుతూ అతి చిన్నవయసులో భగత్‌సింగ్‌లా శాస్త్రీయ సోషలిస్టు సిద్ధాంతాన్ని అన్వేషించాడు.

ఇండో-చైనా దేశాలైన వియత్నాం,లావోస్,కాంబోడియాల విప్లవ ప్రభంజనం అమెరికన్ సామ్రాజ్యవాదపు నడ్డి విరుస్తుండ టం ప్రపంచ ప్రజలందరిని ఉర్రూతలూగించింది. 1969 ఫ్రెంచి డీగాల్ వ్యతిరేక విద్యార్థి ఉద్యమం, చే గువేరా వీరత్వం విశ్వవిద్యాలయాల తలుపులు తట్టింది. ప్రత్యేకించి 1967 మేలో బద్ధలైన నక్సల్బరీ వంసతకాల మేఘ గర్జన, శ్రీకాకుళం, గోదావరి లోయల గుండా సాగుతూ తెలుగునేలను ప్రభావితం చేసింది. మరోవైపు అభివృద్ధి నిరోధక ఛాందసవాద భావజాలంతో వేళ్లూనుకున్న ఆరెస్సెస్ గూండాయిజానికి క్యాంపస్ ప్రధాన కేంద్రంగా ఉండేది. అందుకే సైద్ధాంతిక భావ సంఘర్షణతోపాటు, భౌతిక ప్రతిఘటన అనివార్యమైంది. ఈ పరిస్థితుల్లో ‘ఉస్మానియా విద్యార్థులు’ అనే వేదిక మొదలుకొని ‘పీడీఎస్’ నిర్మాణం జార్జి నేతృత్వంలోనే ఉనికిలోకి వచ్చాయి. ఈ పరిస్థితులు పరిపక్వమై కాలం కడుపు పండి జార్జిడ్డిని కన్నది.

జార్జి నేతృత్వంలో వర్తమాన ప్రపంచదేశ కాలమాన పరిస్థితులపై పీడీఎస్ ఆధ్వర్యంలో చర్చాగోష్ఠులు నిర్వహిస్తూ కరపత్రాలు వెలువరించేవారు. విద్యారంగ సమస్యలు, పాలక మండలి విద్యార్థి వ్యతిరేక విధానాలపై ఆందోళనలుచేశారు. బస్తీల్లోని పేద ప్రజలతో మమేకమై డీ-క్లాస్‌ఫై కావడం, శాస్త్రీయ సోషలిస్టు దృక్పథంకై నిరంతరం అధ్యయనం చేశారు. ఆర్‌ఎస్‌ఎస్ ఛాందసవాదుల గూండా చర్యలను ప్రతిఘటించి విద్యార్థులను గెలుచుకున్నారు. ఈ బహుముఖ కర్తవ్యాల కోణం నుంచి జార్జిని అర్థం చేసుకోవాలని, జార్జి సహచరుడు కూర రాజన్న చెబుతుంటాడు. ఈ కార్యక్రమంలో యావత్ విద్యార్థుల భాగస్వామ్యం కంటే సిక్స్‌మెన్‌ఆర్మీగా ప్రసిద్ధిగాంచిన జార్జి రెడ్డి, సిరిల్‌ రెడ్డి, కె.రాజన్న, మహిపాల్‌ రెడ్డి, యాదగిరిరావు, శ్రీకృష్ణ తదితరుల పోరాటమే ఎక్కువగా జరిగేది. కొంతమంది త్యాగనిరతులైన వీరుల సైన్యంతో క్యూబా, బొలీవియాల్లో సాయుధ పోరాటం నడిపిన చే-గువేరా అనుభవం వీరికి గొప్ప ప్రేరణగా ఉండింది. అందుకే జార్జి తో సహా వీరందరికి అలీవ్ గ్రీన్ డ్రెస్ కోడ్ ఉండటం గమనార్హం. జార్జి అమరత్వం రాష్ట్ర వ్యాప్తంగా ప్రగతిశీల విద్యార్థి ఉద్యమానికే గాకుండా, విప్లవోద్యమానికి బాటలు వేసింది. అనేకమంది రహస్య జీవితంలోనికి పోయేలా బాటలు పరిచింది. దీంతో పాటు మతోన్మాద గూండా శక్తుల పీచమణిచి, ఉస్మానియా యూనివర్సిటీని తిరిగి అభ్యుదయ శక్తుల పోరాట కేంద్రంగా తీర్చిదిద్దింది.

జార్జి అమరుడైన తర్వాత విప్లవ విద్యార్థి ఉద్యమాన్ని అణచడానికి జరిగిన దాడులను ప్రతిఘటిస్తూనే యావత్ తెలంగాణతో పాటు, కావలి, నెల్లూరు, గుంటూరు , అనంతపురం తదితర సెంటర్లకు విద్యార్థి ఉద్యమం పురోగమించింది. ఉస్మానియాలో పాలకవర్గం, మతోన్మాదులంతా కుమ్మక్కై విద్యార్థులను రస్టికేట్ చేస్తే, వీటికి వ్యతిరేకంగా విద్యార్థులు పోరాడారు. జార్జిడ్డి అమరుడైన ఏప్రిల్ 14, 1974ననే హైద్రాబాద్ పీడీఎస్ నగర మహాసభ జరిగి సంఘాన్ని పీడీఎస్‌యూగా మార్చాలని తీర్మానించారు. ఆ తర్వాత 1974 రాష్ట్ర మహాసభల్లోనే విద్యార్థి ఉద్యమ నిర్మాణంలో పొడసూపిన విభేదాలు ఏకకాలంలో పీడీఎస్‌యూ, ఆర్‌ఎస్‌యూలు ఏర్పడటానికి దారి తీశాయి. ఆ తర్వాత 1975 ఏప్రిల్ 14ననే ‘విజృంభణ’ అనే పీడీఎస్‌యూ గోడపత్రిక వెలువడ్డది. కాలక్రమం లో అదే పీడీఎస్‌యూ మాసపత్రిక అయ్యింది. జార్జి అందించిన ఉస్మానియా ఉద్యమ వారసత్వంగా ఉదయించిన కామ్రేడ్స్ జంపాల చంద్రశేఖర ప్రసాద్, మధుసూదన్‌రాజ్, వీరన్న, రంగవల్లి, సంతోష్‌డ్డి, కిషన్‌జీలాంటి ఎంతో మంది అమరులయ్యారు. 1930ల నాటి వందేమాతర ఉద్యమమైనా, నేటి తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమమైనా ఉస్మానియా విశ్వవిద్యాలయమే ప్రధాన కేంద్రమైంది. లక్షలాదిమందితో జరిగిన తెలంగాణ విద్యార్థి గర్జన సభ జార్జితో పాటు విప్లవ విద్యార్థి అమరుల గుండెచప్పుడు వినిపించింది. నలబై ఏండ్ల విప్లవ విద్యార్థి ఉద్యమ ప్రస్థానంలో జార్జిని నెమరేసుకుంటున్నప్పుడు ఒకే విద్యార్థి వేదిక నిర్మాణానికి పూనుకోవడం తప్పకుండా జార్జికి నిజమైన నివాళి అర్పించడం కాగలదు. యాధృచ్ఛికమే గావచ్చు భారతీయ సమాజపు వర్ణవ్యవస్థ, వర్గ-కుల వ్యవస్థల పరిణామాన్ని గమనించినప్పుడు శంబూకుని వర్ధంతి, జార్జి వర్ధంతి ఒకే రోజు. ఏప్రిల్11, 14 తేదీల్లో వరుసగా సామాజిక విప్లవకారులైన జ్యోతిబాఫూలే, అంబేద్కర్‌ల జయంతులున్నాయి. మతోన్మాదం-పాలకవర్గం ఒకే గూటి పక్షులుగా సామ్రాజ్యవాదంతో మిలాఖతై భారత ప్రజలపై కుల భూస్వామ్యాన్ని, ప్రపంచీకరణను బలవంతంగా రుద్దుతున్నాయి. వీటిని వ్యతిరేకించి పోరాడుతున్న దేశప్రజలపైనే యుద్ధం ప్రకటించి కొనసాగిస్తున్నాయి. సామాజిక న్యాయాన్ని వర్గ కుల దోపిడీ నిర్మూలనతో , సామ్రాజ్యవాద వ్యతిరేక దేశవిముక్తి పోరాటంతో మేళవించి సాగిస్తామని ప్రతినబూనడానికి ఏప్రిల్ మాసం సరయిన సందర్భం.

-అమర్
(రేపు జార్జిరెడ్డి వర్ధంతి)

http://www.namasthetelangaana.com/Editpage/article.asp?category=1&subCategory=5&ContentId=94371

No comments:

Post a Comment