Thursday, 19 April 2012

ధ్రువతారకు కన్నీటి నివాళి


- పరిచయాలు నెమరేసుకున్న నాటితరం
- ఆయనబాటలో సాగుతామన్న నేటితరం
-సకల ప్రజా, సాహితీ సంఘాల సంతాపం
రహస్యోద్యమంలో ఆయన ఎందరికో ఆదర్శం. ఆయన దిద్దితీర్చిన అనేక మంది ఇప్పుడు భారతవిప్లవోద్యమానికి నాయకత్వం వహిస్తున్నారు. ఆదివాసీలు, అడవి పుత్రులు, పీడిత, తాడిత ప్రజల విముక్తి కోసం విప్లమోద్యమం బాట పట్టిన కేజీ.. విప్లవ పార్టీలో ఆయన అందరికీ మార్గదర్శకుడే. ఆయన అక్షరాలు అల్లితే అందరూ ఆశ్చర్యపోయేవారు. తెలియని పదాలను కవిత్వంలో జోడించి నూతన ఒరవడిని సృష్టించారు. కులాలు, మతాలకు అతీతంగా మహోత్తరమైన ఉద్యమాలను నిర్మించిన విప్లవ జ్వాల ఆయన. జాలువారిన పదాలతో కవిత్వం అలలు దాటేది. విప్లవ, దళిత సాహిత్యంలో ఆయనకు ఆయనే సాటి. అందరితో సత్సంబంధాలు కొనసాగిస్తూ, ఎంతటి చిన్నవారినైనా ఆప్యాయంగా, అనురాగంతో పలుకరించే గొప్ప మనస్తత్వం కలిగిన వ్యక్తి సత్యమూర్తి. ప్రపంచ కార్మికుల యోగక్షేమాల కోసం, వారి విముక్తి కోసం నిరంతరం పరితపించిన త్యాగశీలి. విద్యార్థులు, మేధావులు, కవులు, కళాకారులు, ప్రజా సంఘాలు, కుల సంఘాలు, దళిత సంఘాలు సత్యమూర్తికి ప్రగాఢ సంతాపాన్ని ప్రకటించాయి. అందులో కొంత మంది ఆయనతో సన్నిహితంగా ఉన్న వారు శివసాగర్‌తో తమ సాన్నిహిత్యాన్ని, ఉద్యమ అనుబంధాన్ని నెమరువేసుకున్నారు.
స్వాతంవూత్యానంతరం నూతన సామాజిక ఉద్యమాల వైపు తెరచాపలేపి ఎదురీదిన ప్రముఖ నక్సలైట్ నాయకుడు కేజీ సత్యమూర్తి అని కేజీ సన్నిహితుడు ఉ సాంబశివరావు నివాళులర్పించారు. తెలంగాణ ఉద్యమానికి 1969లోనే పునాదిరాళ్లు వేసిన గొప్ప ఉద్యమకారుడని కీర్తించారు. సిద్ధాంత రంగంలో పూలే, అంబేద్కర్ మార్క్స్ , మావో ఆలోచన విధానాన్ని అనుసంధానం చేసిన సిద్ధాంత కర్తని పేర్కొన్నారు. కుల నిర్మూలన పోరాటం చేపట్టకుండా ఎర్రజెండాలను ముందుకు తీసుకుపోలేమని, ఎదురీత మాస పత్రిక ద్వారా సిద్ధాంత చర్చ నిర్వహించిన నాయకుడని అన్నారు. దళిత ఉద్యమాల అభివృద్ధికి బుద్ధుడు, అంబేద్కర్ సరిపోడని, మార్క్స్ అవసరమవుతాడని, రంగనాయకమ్మ రచించిన దళితుల అంతిమ పరిష్కారంపై సిద్ధాంత చర్చ చేసిన నాయకుడని నివాళులర్పించారు. సత్యమూర్తికి తనకు మధ్య ఎంతో అవినావభావ సంబంధం ఉండేదని జనశక్తి నేత కూర రాజన్న చెప్పారు. సత్యమూర్తి మృతి ఉద్యమానికి తీరని లోటని అన్నారు.
‘‘సత్యమూర్తిలోని సానుకూల అంశాలను ఎత్తిపట్టి నేటి యువత ప్రేరణ పొందాలి. నిర్దిష్ట పరిస్థితులను మరింత అధ్యయనం చేయడానికి సత్యమూర్తి ఆగిపోయిన దగ్గర నుండి తిరిగి విప్లవోద్యమం మొదలై కొనసాగాలి’’ అని జనశక్తి నేత అమర్ నివాళులర్పించారు.
విప్లవ సాహితోద్యమానికి శివసాగర్ మృతి తీరని లోటని అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షురాలు విమలక్క, ఉపాధ్యక్షుడు బైరాగి, నాయకురాలు అనిత విప్లవ జోహార్లు అర్పించారు.
‘‘శివసాగర్ భారత విప్లవోద్యమానికి పునాదులు వేసిన మొట్టమొదటి దళిత విప్లవకారుడు. ఆయన మరణం దళిత బహుజన ఉద్యమానికి, విప్లవోద్యమానికి తీరని లోటు’’ అని ప్రొఫెసర్ కంచ అయిలయ్య నివాళులర్పించారు.
‘‘శ్రీశ్రీని దాటిన ప్రపంచ విప్లవ స్వాప్నికుడు శివసాగర్. దళిత తత్వశాస్త్రాన్ని సౌందర్యాన్ని విప్లవీకరించిన మహాకవి ఆయన. మార్క్సిజానికి, అంబేద్కరిజానికి వారధి. ఆయన మరణం శ్రీశ్రీ లేనంతటి లోటును ఏర్పరిచింది’’ అని ప్రముఖ గాయకుడు, గేయ రచయిత గోరటి వెంకన్న జోహార్లర్పించారు.
‘‘శివసాగర్ మహోన్నత విప్లవోద్యమాల నిర్మాణకర్త. దళిత బహుజనులకే కాదు, దండకారణ్యాల వరకు ప్రజల గుండె చప్పుడై ప్రతిధ్వనించిన విప్లవకారుడు. నల్లసూరీడుగా ఎల్లలు చెరపివేసిన మహనీయుడికి నివాళి. సబ్బండ వర్ణాల జీవనపద చిత్రాలలో చెరగని చిరునామా శివసాగర్’’ అంటూ ప్రముఖ గేయ రచయిత డాక్టర్ అంద్శై నివాళులర్పించారు.
‘‘శివసాగర్ ఉదయిస్తున్న సూర్యుడు. బలహీనవర్గాలకు అండదండలందించిన మహనీయుడాయన. సావుతో గుసగుసలాడిన దళితకవి. అమ్మా నన్నుకన్నందుకు విప్లవాభినందనలు అంటూ మహావిప్లవోద్యమంలో దుమికిన వీరుడాయన’’ అని గూడ అంజయ్య జోహార్లర్పించారు.
‘‘విప్లవోద్యమ సాహిత్యంలో వేగుచుక్క శివసాగర్. ఆయన కవిత్వం,ఆయన సైద్ధాంతిక ఆచరణ నిరుపమానమైనవి’’ రచయిత నమ్ము నివాళులర్పించారు.
‘‘ఆయన విప్లవమార్గంలో ప్రయాణించాలని మా తపన. ఆయన ఆశయాలలో కొనసాగాలని మా ఆకాంక్ష ’’ అని తెలంగాణ మట్టిమనుషుల వేదిక నేత వేనేపల్లి పాండురంగారావు పేర్కొన్నారు.
‘‘శివసాగర్ కేవలం కవి కాదు. ఉద్యమాన్ని రికార్డ్ చేసిన విప్లవసూర్యుడు. దళితజాతి నుండి వచ్చి, మానవజాతి విముక్తికోసం పోరాడిన పరిపూర్ణ మానవుడు. ఆయన జీవితంలోవిప్లవోద్యమం కోసం పడ్డ తపనను దేశీయ విప్లవకోణంలో విశ్లేషించాల్సిన బాధ్యత భవిష్యత్తు తరాల మీద ఉన్నది. ఆయన మరణం ఈ కార్యాచరణకు నాంది పలకాలి’’ అని ప్రజా గాయకుడు గద్దర్ పేర్కొన్నారు.
తెలుగు సాహిత్యలోకానికి ప్రముఖమైన దళిత శ్రేణి ఆగ్రనాయకుడు సత్యమూర్తి అని దళిత ఉద్యమ నాయకుడు గౌతమ్ నివాళులర్పించారు.
శ్రామికులు, కార్మికులు, కూలీలు, రైతులు, దళితులు చేస్తున్న పోరాటాలకు సంపూర్ణ మద్దతు ప్రకటించాలని నిరంతరం పరితపించిన వ్యక్తి సత్యమూర్తి అని అణగారిన ప్రజల హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీఎల్ యాదగిరి కొనియాడారు. అంబేద్కర్, మావో ఆలోచన విధానమే ఈ దేశానికి మార్గదర్శకమని నమ్మిన సిద్ధాంతకర్త సత్యమూర్తి అని కమిటీ అధ్యక్షుడు జేబీ.రాజు అన్నారు. విప్లవ కవిత్వానికి దిశానిర్దేశం చేసిన మహోన్నత వ్యక్తి సత్యమూర్తి అని ప్రొఫెసర్ కాశీం అన్నారు. ఉద్యమం నెల బాలుడిగా ప్రారంభించిన కవిత్వం ఎందరికో ఆదర్శంగా నిలిచిందన్నారు. తెలుగు సాహిత్యంలో ఎవరూ ఉపయోగించని నూతన ఒరవడిని ఆయన తీసుకువచ్చారన్నారు. పరిగె పక్షుల రాగాలు, గరికె పువ్వులు, పత్తికాయ పగిలిన ధ్వని వంటి గ్రామీణ పదాలను జోడించి ప్రజలకు చేరువయ్యారని వివరించారు.
విప్లవోద్యమంలో దళితులకు నాయకత్వం రావాలని పోరాడిన విప్లవ యోధుడు సత్యమూర్తి అని పీడబ్ల్యూజీ కేంద్ర కమిటీ మాజీ సభ్యుడు శంకర్ నివాళులర్పించారు. ఆ మహానీయుని మరణం విప్లవోద్యమానికి తీరని లోటన్నారు. జీవితాంతం విప్లవం కోసమే పరితపించిన వ్యక్తి సత్యమూర్తి అని జనశక్తి (వీరన్న వర్గం) మాజీ రాష్ట్ర కమిటీ సభ్యులు, సీపీయూఎస్‌ఐ రాష్ట్ర కార్యదర్శి బత్తుల సిద్ధేశ్వర్ అన్నారు. సత్యమూర్తి వృత్తి విప్లవకారుడని నివాళులర్పించారు.
పోరాట సాహిత్య అభివ్యక్తిలో కళాత్మకతను సాధించి ఒక ప్రత్యేక ఒరవడిని ఏర్పచుకున్నారని సాహితీ స్రవంతి రాష్ట్ర అధ్యక్షుడు తెలకపల్లి రవి, ప్రధాన కార్యదర్శి కే ఆనందాచారి ఆ ప్రకటనలో నివాళులర్పించారు.
దళిత బహుజనులు రాజ్యాధికారంలోకి రావాలని నిరంతరం శ్రమించిన మహోన్నత నేత అని సత్యమూర్తికి ఓయూ జేఏసీ, టీఎస్‌జేఏసీ నివాళులర్పించాయి. ఆంధ్రవూపదేశ్‌లో విప్లవ ఉద్యమానికి కేజీ మరణం తీరనిలోటని టీఎస్ జేఏసీ చైర్మన్ పిడమర్తి రవి, అధ్యక్షులు రాజారాం యాదవ్, అధికార ప్రతినిధి బాలరాజ్ యాదవ్ చెప్పారు.
‘‘తెలుగు సాహిత్యం మీద గణనీయమైన ప్రభావం చూపించిన కవి శివసాగర్. విప్లవ కవిత్వానికి, దళిత కవిత్వానికి కొత్త అలంకార శాస్త్రాన్ని నిర్వచించారాయన. నరుడో భాస్కరుడో పాటతో అనేక ప్రజల పాటలు పుట్టడానికి తొవ్వ చూపించారు శివసాగర్’’ అని గాయకుడు దేశపతి శ్రీనివాస్ నివాళులర్పించారు.
‘‘సామాజిక జీవనాన్ని తాత్వికంగానే కాదు, కవిత్వంగానూ పట్టుకున్న సవ్యసాచి శివసాగర్. రెండు రంగాల్లోనూ విజయుడు, శిఖరంగా నిలబడ్డవాడు. దీపశిఖగా ప్రసరించిన వాడు. ఆయన లేకపోవడం తెలుగు సాహితీ లోకానికి విషాదం’’ అని సింగిడి రచయితల వేదిక నేత సుంకిడ్డి నారాయణ రెడ్డి నివాళులర్పించారు. సత్యమూర్తి విప్లవ సాగరుడని ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు నివాళులర్పించారు. ‘తోటరాముని తలకు తూట తగిలింది.. రామచిలుక వచ్చి నాకు కబురు చెప్పింది..’ అంటూ అడవిలో నేలకొరిగిన విప్లవవీరుడు రాములు గురించి శివసాగర్ కలం నుంచి జాలువారిన పాటను నెమరువేసుకుంటూ, ఆయనతో కలసి ఉన్న జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ కంట తడిపెట్టారు.
‘‘సత్యమూర్తి 1992లో నా వివాహనికి హాజరైనారు. పీపుల్స్‌వార్ నుంచి బయటికి వచ్చిన తర్వాత తొలి పర్యటన అదే. ఆయన బహుజన రాజ్యస్థాపన కోసం పరితపించేవాడు. తెలంగాణ ఉద్యమాన్ని కూడ ఆ దిశగా నడపాలని కలలు కన్నాడు’’ అని ప్రజామిత్ర మండలి వ్యవస్థాపకుడు కొరివి వేణుగోపాల్ నివాళులర్పించారు.
‘‘మార్క్సిజం తోపాటు అంబేద్కరిజం ఆవశ్యకతను ఆయన ప్రపంచానికి తన కవితల ద్వారా చాటారు. ఆంధ్రావాడై ఉండి ప్రత్యేక తెలంగాణ పోరాటం. బహుజన రాజ్యస్థాపన ఉద్యమాన్ని నడిపారు’’ అని టీఆర్‌ఎస్ నాయకుడు పూరెల్ల రాములు గుర్తు చేసుకున్నారు.
‘‘సుందరగిరి ప్రాంతంలో 15 రోజుల పాటు శిక్షణ తరగతులను ఏర్పాటు చేసి, దోపిడీ వ్యవస్థను ఏ విధంగా ఎదుర్కొవాలో శిక్షణ ఇచ్చారు. ఈ శిక్షణకు హుస్నాబాద్, అంతక్కపేట, సమువూదాల, మహ్మదాపూర్ గ్రామాల నుంచి అధిక సంఖ్యలో హాజరయ్యారు, అప్పుడు మేము పోరగాండ్లం’’ అని నాటి సంగతులను సుందరగిరి మాజీ సర్పంచ్ దేవులపల్లి భద్రయ్య నెమరువేసుకున్నారు.
కేజీ మరణం భారత విప్లవోద్యమానికి తీరని లోటని సీపీఐ(ఎం-ఎల్) ప్రజావూపతిఘటన రాష్ట్ర కార్యదర్శి మోహన్ తెలిపారు.
పీడిత ప్రజల ఆశాజ్యోతి కేజీ మంత్రి కే జానాడ్డి
పీడిత ప్రజల కోసం అహోరావూతులు కృషిచేసిన కేజీ సత్యమూర్తి మరణం తీరనిలోటని రాష్ట్ర పంచాయితీరాజ్ శాఖ మంత్రి కే జానాడ్డి అన్నారు. సాహిత్యం ద్వారా, పోరాటం ద్వారా సామాజిక మార్పు కోసం కృషిచేసిన పోరాటయోధుడు కేజీ అని అభివర్ణించారు. ఆయన మరణం పీడిత, తాడిత వర్గాలకు తీరనిలోటని జానాడ్డి సంతాపం వ్యక్తం చేశారు.
లోక్‌సత్తా సంతాపం
పీపుల్స్‌వార్ గ్రూప్ వ్యవస్థాపకుల్లో ఒకరైన కేజీ సత్యమూర్తి మృతి పట్ల లోక్‌సత్తా పార్టీ సంతాపం తెలిపింది. కేజీ విప్లవ నేతగానే కాకుండా కవిగా పార్టీ కార్యకర్తలను, ప్రజలను చైతన్యవంతుల్ని చేశారని, దళితునిగా పుట్టుకతో వివక్షను ఎదుర్కొన్న సత్యమూర్తి కులం సంకెళ్ల నుంచి దేశ రాజకీయాలను విముక్తి చేసేందుకు జీవితాంతం కృషిచేశారని లోక్‌సత్తా ప్రధాన కార్యదర్శి కె.శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు.

http://www.namasthetelangaana.com/News/article.asp?category=1&subCategory=2&ContentId=96316

No comments:

Post a Comment