ఉరితీయబడ్డ పాటనుండి, చెరపడ్డ జలపాతం నుండి
గాయపడ్డ కాలిబాట నుండి
ప్రాణవాయువునుండి, వాయులీనం నుండి
తిరిగి వస్తాను
తిరిగి లేస్తాను
నా కోసం ఎదురు చూడు
నా కోసం వేచి చూడు
మేల్కొన్న ఇసుకరేణువు నుండి
తొలకరి వాన చినుకునుండి
నెత్తురొలికే పిల్లనక్షిగోవినుండి
ఆనంతాకాశంలోని అంతిమ నక్షత్రం నుండి
నుదిటిపై నవ్వే నాగేటి చాళ్ళ నుండి
గాలి ఈల నుండి, నీరెండనుండి
మట్టి వాసన నుండి, అట్టడుగునుండి
తిరిగి వస్తాను
తిరిగి లేస్తాను
నా కోసం ఎదురు చూడు
నా కోసం వేచి చూడు
గోధూళి వేళ
గోరింటాకు అరచేతిలో ఎరుపెక్కే వేళ
హోరెత్తే సముద్రం ఆకాశాన్ని తాకేవేళ
నక్షత్ర దీపాలు మౌనసంగీతాన్ని వినిపించేవేళ
నౌక తీరాన్ని విడిచేవేళ
తిరిగి వస్తాను
తిరిగి లేస్తాను
నా కోసం ఎదురు చూడు
నా కోసం వేచి చూడు
పక్షులు చెట్ల కొమ్మలకు సంగీతాల్ని అలంకరించేవేళ
శిశిరంలో రాలిన ఆకులు జీవిత సత్యాల్ని విప్పిచెప్పేవేళ
తల్లి చనుబాలు నా గీతాలపై ప్రవహించేవేళ
ఎందరో నన్ను మరిచిపోయిన వేళ
తిరిగి వస్తాను
తిరిగి లేస్తాను
నా కోసం ఎదురు చూడు
నా కోసం వేచి చూడు
భూమీ ఆకాశం కలిసేచోట
పొన్నపూలు రాలిపడిన చోట
వీధి దీపాలు ఉరిపోసుకున్నచోట
నేలమాళిగ కన్నీరు కార్చిచ్చు అయినచోట
నా కోసం ఎదురు చూడు
నా కోసం వేచి చూడు
తిరిగి వస్తాను
తిరిగి లేస్తాను
అసత్యాల అరణ్యాలను తెగనరికేచోట
గోదారి సమువూదంతో కరచాలనం చేసేచోట
చరమగీతం మరణ శాసనం రాసుకొన్నచోట
మహా సంకల్పం ఎర్రజెండాగా ఎగిరేచోట
నా కోసం ఎదురు చూడు
నా కోసం వేచి చూడు
తిరిగి వస్తాను
తిరిగి లేస్తాను.
నేను మట్టి కరిసేననే సర్కారీ కట్టుకథను తిరస్కరించు
కౌటిల్యం నా పేరిట జరిపే ‘సంస్మరణ దినోత్సవాల’ ను బహిష్కరించు
వాడవాడలా నా సంగీతాన్ని వినిపించు
నేను చనిపోను
ఏతాడూ నన్ను ఉరితీయలేదు
సగర్వమైన నీ కన్నీళ్ళ నుండి తిరిగిలేస్తాను
సూర్య నేత్రం నుంచి లేచి వస్తాను
ప్రాణవాయువు వూది పిల్లనక్షిగోవిని పలికిస్తాను
సంధ్యారాగంలో వాయులీనం వినిపిస్తాను
హోరెత్తే సమువూదంతో కరచాలనం చేస్తాను
‘భువన భవనపు బావుటానై పైకి లేస్తాను’
నా కోసం ఎదురు చూడు
నా కోసం వేచి చూడు
తిరిగి వస్తాను
తిరిగి లేస్తాను
‘ నా పేరు మృత్యుంజయుడు
నా కోసం ఎదురు చూడు’
నా కోసం వేచి చూడు.
- శివసాగర్, ఆగస్టు 22, 19
http://www.namasthetelangaana.com/Editpage/article.asp?category=1&subCategory=7&ContentId=96131
No comments:
Post a Comment