Tuesday, 24 April 2012

శివసాగర్‌కు మరణం లేదు_వరవరరావు పూర్తి కథనం

"కసితో స్వార్థం శిరస్సు గండ్రగొడ్డలితో
నరకగలిగినవాడే నేటి హీరో
ప్రజల గుండెల కొండల్లో మాటుగాసి
ట్రిగర్ నొక్కగలిగినవాడే స్రష్ట
ప్రజను సాయుధం చేస్తున్న
రెవల్యూషనరీ నేడు కవి"

ఈ ఆఖరి చరణమే వరంగల్‌నుంచి పెండ్యాలకిషన్‌రావు సంపాదకత్వంలో వెలువడిన ‘విప్లవకవులు’ కవితాసంకలనం ‘మార్చ్‌’కు మకుటం. ఈ కవిత్వంలో మనకు కనిపించే కొంచెం దిగంబరకవుల వాసన, స్పష్టమైన విప్లవ అవగాహన, కవితా ‘ప్రభంజనం’, తిరుగబడు కవులు కలిసి జులై 4, 1970న ఏర్పడిందే విప్లవ రచయితల సంఘం. ఆనాటినుంచి ఈనాటి వరకు సాహిత్య, సాంస్కృతికరంగాల్లో విరసం ఆశయం, లక్ష్యాలకు ఇదే మార్గనిర్దేశం.

‘ఆకులందున అణగిమణగి కవితకోకిల పలకవలెనోయ్‌’ అన్నాడు గురజాడ. ‘కదిలేది కదిలించేది, పెనునిద్దర వదిలించేది, మునుముందుకు నడిపించేది కావాలోయ్‌ నవకవనానికి’ అన్నాడు శ్రీశ్రీ. కాని నక్సల్బరి, శ్రీకాకుళోద్యమ దశకు విప్లవోద్యమ దశకు ఎటువంటి కవిత్వం కావాలో దిశానిర్దేశం చేసినవాడు మాత్రం పాణిగ్రాహి అడుగుజాడల్లో వచ్చిన శివుడు, శివసాగర్‌.

1974లో నా ‘ఊరేగింపు’ కవితాసంకలనాన్ని మార్క్సిస్టు లెనినిస్టు నాయకులు కామ్రేడ్‌ కెజి.సత్యమూర్తికి అంకితం చేసాను.

‘To find heroes in the grand manner
we must look rather in the present’

అని మావోసేటుంగ్‌ను ఉదహరిస్తూ ఈ పై కవితా చరణాలను నేను ఉటంకించాను. అంతకుముందు 68లో నా మొదటి కవితాసంకలనం ‘చలినెగళ్లు’ గుడిపాటి వెంకటచలానికి అంకితమిచ్చాను. దీన్నిబట్టే నాపై చలం తర్వాత అప్పటికి శివసాగర్‌ ప్రభావం ఎంత ప్రగాఢమైందో ఎవరైనా ఊహించుకోవచ్చును.

1966లో ‘ఆధునిక సాహిత్య వేదిక’గా ప్రగతిశీల భావాలు, శాస్త్రీయదృక్పథం, ప్రయోగం కొరకు ప్రారంభమైన సృజన 67 నాటికి ‘‘రక్తచలన సంగీతశృతి’’ని వ్యక్తావ్యక్తంగా వినడం, విని హృదయంలోకి ఇంకించుకోవడం ప్రారంభమైంది. ఇప్పుడు వెనక్కి తిరిగి చూస్తే అది చైనా శ్రామికవర్గ సాంస్కృతిక విప్లవ గాలుల ప్రభావం అని అర్థమవుతుంది. ఆ రోజుల్లో నేను జడ్చర్లలో పనిచేస్తున్నాను. కాని 1966-68 మధ్యన వరంగల్‌ మిత్రమండలి సమావేశాల్లో కవిమిత్రుడు లోచన్‌తో కవిత్వం వింటున్నాం, మంచిచెడ్డలు మాట్లాడుకుంటున్నాం కాని దిశానిర్దేశం చేయలేకపోతున్నాం అని మధనపడుతుండేవాళ్లం. గాబ్రియెల్‌స్కూళ్లో కెజి.సత్యమూర్తి అనే టీచర్‌ ఉన్నాడని, ఆయన అయ్యర్‌గారి టీచర్స్‌గిల్డ్‌లో పనిచేస్తున్నాడని, ఆయన నాటకాలు రాసి ప్రదర్శింపచేస్తున్నాడని, ఆయనకు తీవ్రమైన అభ్యుదయభావాలున్నాయని తన ఇంప్రెషన్‌గా లోచన్‌ చెప్పేవాడు. ఒకసారి మిత్రమండలిలో విల్సన్‌ అనే కవిమిత్రుడ్ని సత్యమూర్తిగారు మీ కొలీగా అని అడిగాను. ఆయన ఉలికిపడి ‘‘ఆయనా, ఆయన స్టాలినండీ’’ అన్నాడు. బహుశా అప్పటికే ఆయన బ్రహ్మానందరెడ్డి కాలం లోని ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాల సమ్మెలో పాల్గొని, స్కూళ్లో ఉపాధ్యాయసంఘ నిర్మాణం చేయబోయి సస్పెండయి ఉన్నాడు.

కాని, నేను ప్రత్యక్షంగా సత్యమూర్తిని కలిసింది మాత్రం హైదరాబాద్‌ రెడ్డి మహిళాకళాశాల ఎదురుగా సందులో ఒక చిన్న ఇంట్లో ఉంటున్న సృజన సాహితీమిత్రుడు శ్రీపతి ఇంట్లో. తెల్లటి ధోవతి, మీద జుబ్బా, ఉంగరాల జుట్టు, కళ్లలో వెలుగు, చిరునవ్వు. అచ్చం కవికుమారుడి లాగా ఉన్నాడు. శ్రీపతి పరిచయం చేసాడు. సృజన ద్వారా నేనూ ఆయనకు పరోక్ష పరిచయమే. ఆయన రాజకీయ విశ్వాసాల గురించి విని ఉన్నాను. బహుశా అప్పటికే ఆయన ముందస్తు నిర్బంధంలో భాగంగా జైలుకు కూడా వెళ్లివచ్చి పూర్తికాలపు రాజకీయ కార్యకర్తగా పనిచేస్తున్నాడు. ఆయన చేతిలో ‘లెనిన్‌ నా లెనిన్‌’ అని రాసిన ఆయన దీర్ఘకవిత కాగితాలున్నాయి. అది లెనిన్‌ శతజయంతి జరుగుతున్న సంవత్సరం. ప్రపంచవ్యాప్తంగా రివిజనిస్టులు మొదలు విప్లవకారుల వరకు ఏమొచ్చే బూర్జువా ప్రభుత్వాలు కూడా లెనిన్‌ శతజయంతి జరుపుకుంటున్నాయి. శివసాగర్‌ మాటల్లోనే చెప్పాలంటే ఆయననొక బాబాను చేసి, ఆయన కాళ్లకు మేజోళ్లు తొడిగి, ఆయననొక విగ్రహాన్ని చేసి ఆరాధనా ఉత్సవాలు జరుపుతున్నారు. లెనిన్‌ విప్లవాచరణలో ఉన్నాడని తీవ్రమైన ఉత్తేజంతో రాసిన కవిత అది. ‘‘ఈ సాయంత్రం కృష్ణదేవరాయాంధ్ర భాషానిలయంలో లెనిన్‌ శతజయంతి సందర్భంగా ఒక కవిసమ్మేళనం ఉందట. అక్కడ ఈ కవిత చదివించాలి’’ అని ప్రతిపాదించాడు. ఆ ఏర్పాటు ఏదో చేసినట్టున్నాం. ఎట్లాగూ ఒక సంచలనం ప్రారంభమైంది. లెనిన్‌ పుట్టినరోజయిన 69 ఏప్రిల్‌ 22న ప్రపంచవ్యాప్తంగా మార్క్సిస్టు లెనినిస్టు పార్టీలు ఏర్పడ్డాయి. నక్సల్బరీ, శ్రీకాకుళోద్యమాల వెలుగులో ఆ ఉద్యమాలకు ఒక నిర్మాణరూపం ఇవ్వడానికి మనదేశంలో కూడా చారుమజుందార్‌ కార్యదర్శిగా మార్క్సిస్టు లెనినిస్టుపార్టీ ఏర్పడింది. మేడే రోజు కలకత్తా షహీద్‌మినార్‌ మైదాన్‌లో కానూసన్యాల్‌ ఆ పార్టీ ఆవిర్భావ ప్రకటన చేసాడు. ఆ తర్వాత గుంటూరులో నక్సల్బరీ సంఘీభావ కమిటీని ఏర్పాటు చేసిన డాక్టర్‌ చాగంటి భాస్కరరావు, శ్రీకాకుళోద్యమ జిల్లా నాయకుడు పంచాది కృష్ణమూర్తి మొదలయినవారు చారుమజుందార్‌ను తెలుగునేలకు తీసుకొనివచ్చి గుత్తికొండబిలంలో రాష్ట్ర పార్టీని ఏర్పాటుచేసారు. ఆ సమావేశానికి కొండపల్లి సీతారామయ్య వెళ్లలేకపోయాడు కాని, కెజి.సత్యమూర్తి, కొండపల్లి చంద్రశేఖరరెడ్డి వెళ్లారు. తెలంగాణ ప్రాంతం నుంచి కొండపల్లి సీతారామయ్య, కెజి.సత్యమూర్తిలను రాష్ట్రకమిటీలోకి తీసుకున్నారు.

అయితే 1969 నుంచి 85 దాకా కెజి.సత్యమూర్తితో సృజనకైనా, విరసంకైనా గాఢమైన అనుబంధం ‘శివసాగర్‌’తోనే. కెజి.సత్యమూర్తిగా లేదా ఆయన అజ్ఞాతజీవితం లోని పార్టీపేర్లతో ఆయన పార్టీలో నిర్వహించిన పాత్ర గురించి సాధికారికంగా చెప్పగలిగేది ఆ పార్టీ నిర్మాణమే. లెనిన్‌ కవిత మొదలుకొని 85 దాకా అంటే సృజన నిర్వహించబడినంత కాలం ఆయన ఏ కవిత రాసినా సిరా తడి ఆరకముందే అది సృజనకే పంపించేవాడు. అచ్చయి వచ్చేలోగా మళ్లీ ఎన్నిసార్లు ఆ కవితకు ఆయన నుంచి సవరణలు వచ్చేవో. ఆయనంతటి కవితాశిల్పి. ఆయన అక్షరాల వలె కవిత్వాన్ని చెక్కేవాడు. అది పూర్తి సంతృప్తినిచ్చేదాకా బహుశా ఆయనకు నిద్రపట్టేది కాదు. కవిత్వంలో ఆయన పర్‌ఫెక్షనిస్ట్‌. కవిత్వంలో కవిత్వం కానిది పలకడాన్ని ఆయన సహించేవాడు కాదు. అట్లే ఆయన ఎన్నో పాటలు రాసాడు. ఆ పాటలన్నీ సృజనలోనే వచ్చినవి. 69 నుంచి 79 దాకా అజ్ఞాత జీవితంలోనే, జైళ్లలోనో ఉన్నందువల్ల ఆ పాటలకు స్వరకల్పన (ట్యూన్‌) ఎన్‌కె (రామారావు) చేసేవాడు, చెయ్యాలని ఎస్ఎమ్ కోరుకునేవాడు కూడా. ‘చెల్లీ చెంద్రమ్మా’, ‘తోటా రాముడు’, ‘జాలరన్న’ వంటి పాటలన్నీ ఎన్‌కె ట్యూన్‌ కట్టి పాడినవే విస్తృత ప్రచారాన్ని పొందినవి. ఆ తర్వాత కాలంలో తోటరాముడు పాటను ‘మాభూమి’ సంధ్య, ‘అమ్మా మము కన్నందుకు విప్లవాభివందనాలు’ అరుణోదయ రామారావు, ‘నల్లా సూర్యుడు’ పాటను చంద్రశ్రీ విస్తృత ప్రచారం చేసారని నేను అనుకుంటాను. 79లో బెయిల్‌మీద విడుదలయి వరంగల్‌కు వచ్చినపుడు ఆయనను ఆయన పాటలు తాను రాసినపుడు ఎట్లా స్వరకల్పన చేసుకునేవాడో పాడి విన్పించమని అడిగాం. ఆశ్చర్యంగా ఆయన మందస్వరంలో భానుమతి ప్రభావంతో పాడినట్లు అనిపించింది.

పాట అన్నప్పుడు ముఖ్యంగా చెప్పవలసింది ఆయన ‘నరుడో భాస్కరుడా’. డాక్టర్‌ చాగంటి భాస్కరరావును ఎన్‌కౌంటర్లో చంపివేసిన తర్వాత భాస్కరుడు నామవాచకం కాదు, అనే చిన్న వివరణతో తెలంగాణ ప్రాంతంలో పీరీలు నీళ్లల్లో పడినతర్వాత మొహర్రం ఆఖరి రోజున తిరిగివస్తూ పాడుకునే జానపద గీతం శైలిలో ఆయన నరుడో భాస్కరుడా పాట రాసాడు. ఈ పాటయే విరసం పాట, మౌఖిక కళారూపాల ద్వారానే విప్లవభావ ప్రచారం చేయాలనే దానికి ప్రాతిపదిక అయింది. ఖమ్మం సుబ్బారావు పాణిగ్రాహినగర్‌లో జరిగిన విరసం ప్రథమ మహాసభలకు విరసం ప్రథమ కవితాసంకలనం ‘ఝంఝ’ను స్వయంగా అచ్చువేయించుకొని వచ్చిన శ్రీశ్రీ ఈ పాట పాడుతూనే ట్రెయిన్‌ దిగాడని సభలు జరిగిన రెండ్రోజులూ ఈ పాట పాడుతూనే ఉన్నాడని, ఈ పాట రాసిన శివుడెవరో అప్పటికి ఆయనకు తెలియదని మనం ఎన్నోసార్లు గతంలో చెప్పుకున్నాం. నగ్నముని తన ‘తూర్పుగాలి’ కవితాసంకలనాన్ని ఈ నరుడూ భాస్కరుడికే అంకితం చేసాడు. ఈ పాటతో పాటు ఝంఝలో 70 జులై 10న ఎన్‌కౌంటర్లో అమరులయిన వెంపటాపుసత్యం, ఆదిభట్ల కైలాసంల స్మృతిలో రాసిన ‘సత్యం చావదు’ (డు) అనే కవిత కూడా అచ్చయింది. ‘మార్చ్‌’ కవితాసంకలనంలో ప్రారంభంలో పేర్కొన్న కవితతో పాటు లెనిన్‌పై రాసిన దీర్ఘకవిత కూడా ఉంది. ఇతర కవితలతో పాటు ఈ నాలుగు కవితల గురించి కూడా మార్చ్‌, ఝంఝలు నిషేధానికి గురయినవి. ఈ నాలుగు కవితలను విడిగా ఒకచోట అచ్చువేసిన బుక్‌లెట్‌ను నిషేధానికి వెరవకుండా గుంటూరు విరసం మహాసభల్లో పంచిన ధూళిపాళ మోహన్‌ (ఆ తర్వాత కాలంలో విప్లవోద్యమంలో చేరి, జైల్లో మొలీనా పేరుతో అరుదయిన, అద్భుతమైన కవిత్వం రాసి అమరుడయిన యువకుడు) ఇప్పటికీ నాకు కళ్లల్లో ఆడుతున్నాడు. ఈ నాలుగు కవితలు ఎస్ఎమ్ శివుడు అనే పేరుతోనే రాసాడు. ఆ తర్వాత ఆయన సృజనకు రాసిన ప్రతి కవితకూ కవితా వస్తువును బట్టి ఎక్కువగా సాహితీమిత్రులే శివసంబంధమైన పేర్లు పెట్టేవాళ్లు. శివసాగర్‌, నటరాజ్‌ (ఉద్యమం నెలబాలుడు), పార్వతి (మాతృఘోష) ఇట్లా. ప్రపంచకార్మికులంతా ఒకేతల్లి బిడ్డలురా, ప్రపంచశ్రామికులంతా ఒకే కొమ్మ పువ్వులురా అని రాసిన పాటకు మాత్రం ఆజాద్‌ అని పేరు పెట్టాం. సృజన ప్రచురణగా వెలువడిన గెరిల్లా విప్లవగీతాలకు ముందుమాటలో అందుకే ఇందులో వివిధ కవుల కవితలు ఉన్నాయి గాని వీటన్నింటిలో విప్లవ సత్యమూర్తిత్వం ఆవిష్కరింపబడింది అని ప్రస్తావించడం జరిగింది. కవిత్వంలో, కవిత్వం ద్వారా ఆయన ఇవ్వాటి కవికి నిర్వచనాన్ని, కవితారూపాన్ని నిర్దేశించినట్లుగానే విప్లవ కాల్పనికవాదాన్ని, విప్లవ ఆశావాదాన్ని ప్రవేశపెట్టాడు. ఆయన కవిత్వంపై ఏకకాలంలో గురజాడ, కృష్ణశాస్త్రి, శ్రీశ్రీల ప్రభావాన్ని చూడవచ్చు. వీటితోపాటు తనదైన కవి సమయాలను, కవితా రూపాలను, శిల్పాన్ని, వినూత్న ప్రయోగాలను కూడా ప్రవేశపెట్టాడు. ముఖ్యంగా సమకాలీన విప్లవపరిభాషతో, కవితా వస్తువులతో, కవిసమయాలతో కవిత్వాన్ని సుసంపన్న చేసాడు. తెలుగు వచన కవితపై, ముఖ్యంగా విప్లవ కవిత్వంపై శ్రీశ్రీ తర్వాత బలమైన ముద్ర శివసాగర్‌. మరొక ప్రత్యేకత ఏమంటే నరుడో భాస్కరుడా పాట నుంచి గంగదాటెలిపోకే చెల్లెమ్మా దాకా ఆయన ప్రతి పాటా, కవితా ద్వారా శ్రీకాకుళోద్యమం మొదలు జగిత్యాల జైత్రయాత్ర దాకా విప్లవోద్యమ చరిత్ర నిర్మాణం చేసి చూపవచ్చు. ముఖ్యంగా శ్రీకాకుళోద్యమ చరిత్రను, ఆయన కవిత్వంతో రక్తమాంసాలతో కూడిన చరిత్రగా పునర్లిఖించవచ్చు. ఆయన కవిత్వంలో చెరబండరాజు కవిత్వంలో వలెనే పోలమికల్‌ అంశాలు కూడా చాలా ఉంటాయి. ఏ కవితా సందర్భం లేకుండా అనిర్దిష్టంగా ఉండదు. ‘లెనిన్‌’ గ్రేట్‌డిబేట్‌ ముగిసి మార్క్సిస్టు లెనినిస్టు విప్లవాలు పెల్లుబికిన కాలం. ‘నరుడో భాస్కరుడా’ ఎన్‌కౌంటర్‌ హత్యలు ప్రారంభమైన కాలం. అంతేకాదు, నీ బాటనే నడుస్తాం అని విప్లవభాస్కరునికి హామీపడిన సందర్భం. జాలరన్న పాట సత్యం, కైలాసాల అమరత్వం సందర్భంగా తెలంగాణలో మాత్రమే నాయకత్వం మిగిలినపుడు కెఎస్‌ను ఉద్దేశించి రాసిన కవిత్వం. తెరచాప చిరిగినా, పడవ మునకేసినా, కొందరప్పటికే దిగజారి తెడ్డు నదిలో విసిరేసినా చుక్కాని దిక్సూచిగా పనిచేసినంత కాలం ఈ ఎదురీత కొనసాగుతుందని చెప్పిన పాట. ఉద్యమం నెలబాలుడు శ్రీకాకుళోద్యమ నాయకత్వమే రివిజనిస్టు మార్గాన్ని జైల్లో ఉండి ప్రతిపాదించినపుడు ఆగ్రహంతో రాసిన గీతం. ఇట్లా ఉద్యమం నెలబాలుడు సంపుటిలోని ప్రతి కవితకు ఒక నిర్దిష్టమైన సందర్భాన్ని చెప్పవచ్చు.

ఎస్ఎమ్ 73లో ఖమ్మం అరెస్టయ్యాడు. ఒక ద్రోహి కారణంగానే అరెస్టయ్యానని హోచిమిన్‌ వలెనే చందమామను ఉద్దేశిస్తూ జైలు నుంచి కవిత రాసి పంపాడు. మిత్రద్రోహంతోనే బందీనయ్యానని. శత్రుచేతిలో చిక్కానని. ఖైదీగీతం పేరుతో 74 జనవరిలో అది చిన్నకవితాసంకలనంగా వెలువడింది. గెరిల్లా విప్లవ గీతాలు, ఖైదీగీతం ఆ తర్వాత రాసిన కవితలు అన్నీ కలిపి అప్పటికి ఒక సమగ్ర సంపుటంగా ఆ తర్వాత కాలంలో ఉద్యమం నెలబాలుడు వెలువడింది.

ఈ కాలమంతా ఆయన కొండపల్లి సీతారామయ్యతో కలిసి పార్టీ కార్యకలాపాల్లో కూడా పాల్గొంటూనే ఉన్నాడు. ఆదిలాబాదు, వరంగల్‌, భోనగిరి, హైదరాబాదు మొదలైన ప్రాంతాల్లో పనిచేస్తూనే ఉన్నాడు. రాష్ట్రకమిటీ నాయకత్వంలో ఉండి విరసంతోగాని, ఇతర ప్రజాసంఘాలతో గాని సంబంధాల్లోనే ఉన్నాడు. ఈ క్రమమంతా ఆయన దృష్టి ప్రధానంగా సాహిత్య సాంస్కృతిక భాషా రంగాలమీద ఉండేది, ఆయన ప్రభావమూ ఈ రంగాలమీద ఉండేది. ఆదిలాబాదు అడవుల్లో తిరిగినపుడు వెంటఉన్న నర్సిరెడ్డి అనే సహచరుడితో ఆ అడవిలోని చెట్ల పేర్లు, పిట్టల పేర్లు అడిగి తెలుసుకొని రాసుకొని ఆ తర్వాత కాలంలో వాటిని తోటరాముడు పాటలో అద్భుతంగా ఉపయోగించుకున్నాడు. ఆ తోటరాముడు భూమయ్య కిష్టాగౌడ్‌ లోని కిష్టాగౌడ్‌. సత్యమూర్తి ఎమర్జెన్సీలో జైల్లో ఆ ఇద్దరి పక్కన గంజ్‌లో ఉన్నాడు. వాళ్లకు సన్నిహితుడయ్యాడు. కిష్టాగౌడ్‌ తొడలో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట కాలంలో దూరిన బుల్లెట్‌ను చూసి ఆయన ‘తోటారాముని తొడకు కాటా తగిలిందాట’ అని పాట రాసాడు. భూమయ్య కిష్టాగౌడ్‌ ఉరిశిక్షల మీదనే ‘ఉరిపాట’ రాసాడు. ఉరికంబం మీద నిలిచి ఉజ్వలగీతం పాడెద అని సృజనలో రాసాడు. అది నిషేధానికి గురయింది. 1972లో తరచుగా సృజన సంచికలు నిషేధానికి గురయినాయి. ఎక్కువగా శివసాగర్‌ కవితల కోసమే. ఇంటెలిజెన్స్‌ వాళ్లు (మూడు ఎమ్ఏలు చేసిన గోపాల్‌రావనే ఇంటెలిజెన్స్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆ రోజుల్లో నిషేధింపబడ్డ కవిత్వాన్ని అనువాదం చేసేవాడు) చేసే ఆ ఇంగ్లీష్‌ అనువాదాలు నిషేధపు ఉత్తర్వులు ప్రచురించే సాకుతో సృజనలో అచ్చేసేవాళ్లం. సృజన సంచికల నిషేధం గురించి విని ఆవేదనతో శివసాగర్‌ ‘అలలు’ కవిత రాసాడు. అలల పైన నిఘా. అలలు కనే కలల పైన నిఘా అనే అద్భుతమైన కవిత అది. సృజనతో ఆయనకున్న అనుబంధం అటువంటిది. 1974 చరిత్రాత్మకమైన రైల్వే సమ్మె అప్పుడు ఆయన రాసిన ‘రెడ్‌సిగ్నల్‌’ కవిత నిర్మాణం, భాష, పదబంధాలు, కవిసమయాలు మొదలయిన మొత్తం నిర్మాణరూపం వల్ల గద్దర్‌ గ్యాంగోళ్లమండీ, వంగపండు యంత్రమెట్లా నడుస్తున్నదంటే పాటలతో పోల్చదగిన వచనకవిత.

అజ్ఞాత జీవితంలోనూ జైల్లోనూ కలిపి మొత్తం ఆయన 69 నుంచి 79 దాకా బహిరంగజీవితంలో లేడు. పార్వతీపురం , సికింద్రాబాద్‌ కుట్రకేసుల్లో ముద్దాయిగా అదే క్రమంలో ఎమర్జెన్సీలో కూడా 73 నుంచి జైల్లో ఉన్నాడు. 78లో బెయిల్‌ మీద విడుదలయి 79 జనవరిలో వరంగల్‌లో జరిగిన విరసం సాహిత్యపాఠశాలకొచ్చాడు. అయితే నిజానికి 72లో గుంటూరు విరసం మహాసభల్లోనే ఆయనకు విరసం గౌరవ సభ్యత్వమిచ్చింది. బహుశా అటువంటి అరుదయిన గౌరవం ముందూ వెనుకా ఎవరికీలేదు. 79లో ఆయన మహాసభల్లో పాల్గొన్న తర్వాతనే ఆయన సాధారణ సభ్యుడుగా కొనసాగాడు. బహుశా 92 గుంటూరు విరసం మహాసభలకు ఆయన ఆఖరిసారిగా వచ్చాడు. విషాదం ఏమంటే 86లో సిపిఐఎమ్ఎల్‌ పీపుల్స్‌వార్‌ ప్లీనంలో సస్పెన్షన్‌కు, ఆ తర్వాత బహిష్కరణకు గురైన తర్వాత 90లో ఆయన హైదరాబాద్‌లో జరిగిన 20 ఏళ్ల విరసం సభలకు వచ్చి, ఆ సభ ఆవరణలోనే ప్రెస్‌ కాన్ఫరెన్స్‌ పెట్టి పార్టీతో తన విభేదాల గురించి చెప్పాలని ప్రయత్నించాడు. మేం అంగీకరించలేదు. అయినా ఆ తర్వాత మండల్‌ కమిషన్‌కు అనుకూలంగా, రిజర్వేషన్‌కు అనుకూలంగా వెలువరించిన కవితాసంకలనం సందర్భంగా గాని, గద్దర్‌ మీద హత్యాప్రయత్నం జరిగినప్పుడు కాని విరసం ఆయనతో కలిసి పనిచేసింది. గద్దర్‌ మీద హత్యాప్రయత్నం సందర్భంలోనైతే ఆయన నాయకత్వంలో పనిచేసింది.

80లో సిపిఐఎమ్ఎల్‌ పీపుల్స్‌వార్‌ ఏర్పడిన తర్వాత ఆయన విరసంను గైడ్‌చేయడం నాకు జ్ఞాపకం ఉన్నది. ముఖ్యంగా మాచర్ల విరసం మహాసభలకు ముందు ఆయన శ్రీశ్రీ గురించి ప్రస్తావిస్తూ ఆయన విప్లవ శిబిరంలో చనిపోవాలని, ఆయనకు ఎర్రజెండా కప్పాలని, విప్లవం విజయవంతమయిన తర్వాత ఆయన విగ్రహాన్ని విశాఖ సముద్రతీరాన యేరాడకొండపై పెట్టాలని మాముందు ఒక స్వప్నాన్ని ఆవిష్కరించాడు. అది 1982. అయితే, 1979 నుంచి 82 దాకా కొంత బహిరంగజీవితంలోనూ, కొంత అజ్ఞాతంలోనూ ఆయన తరచూ కలుస్తుండేవాడు. విరసం మిత్రులతో మాట్లాడుతుండేవాడు. రాజకీయ నిర్దేశకత్వంకన్నా ఎక్కువగా సాహిత్యం గురించి, కవిత్వం గురించి మాట్లాడుతుండేవాడు.

రాజకీయ నిర్మాణానికి సంబంధించినంతవరకు బహుశా ఆయన పరిమితులు గుడివాడ పరిచయం దగ్గరినుంచి మరెవరికన్నా ఎక్కువగా కొండపల్లి సీతారామయ్యకే తెలియాలి. గంజి రామారావుగారు, సత్యమూర్తి కుటుంబం గుడివాడలో ఇరుగూ పొరుగూ. ఈ ఇద్దరూ కెఎస్‌ అనుయాయులే. సత్యమూర్తి గుడివాడలో రామకోటిశాస్త్రి విద్యార్థిగా చలసాని ప్రసాద్‌, త్రిపురనేని మధుసూదనరావులకు సహాధ్యాయి. అప్పటినుంచే కన్యాశుల్కం నాటకంలోనూ, ఎస్‌ఎఫ్‌ఐ విద్యార్థి ఉద్యమంలోనూ పాల్గొనేవాడు. అది ఆంధ్రా యూనివర్సిటీలో కూడా కొనసాగింది. ఆ తర్వాత విశాలాంధ్ర పత్రికలో చేరాడు. 1960లలో కెఎస్‌ తెలంగాణకు వచ్చి కాజీపేటలో స్థిరపడి ఎస్ఎమ్ను కూడా రమ్మన్నాడు. కెఎస్‌ ఫాతిమాలో హిందీపండిట్‌గానూ, ఎస్ఎమ్ గాబ్రియెల్‌లో సోషల్‌సైన్స్‌ టీచర్‌గానూ పనిచేసారు. కనుక ఆయన మొదటినుంచీ కెఎస్‌ అనుయాయి, మేమంతా వాళ్లు ఒకళ్లకొకళ్లు కాంప్లిమెంట్‌ అనుకునేవాళ్లం. చాలా రొమాంటిక్‌గా వాళ్లను మార్క్స్‌ ఎంగెల్స్‌గా, సూర్యచంద్రులుగా చెప్పుకునేవాళ్లం.

1972లో మొదటిసారి కామ్రేడ్‌ కెఎస్‌ కెవిఆర్‌ (అప్పటికి కెవి.రమణారెడ్డి), చెరబండరాజు, నాకు రాజకీయ తరగతులు చెప్పాడు. రాజకీయ ఆర్థికశాస్త్రం, తత్వశాస్త్రం మొదలయినవి. అప్పుడు మీకు ఎస్ఎమ్ పట్ల ఆరాధనాభావం ఉన్నది, వరంగల్‌లో విప్లవ విద్యార్థి ఉద్యమ నిర్మాణం అంతా ఆయన చేసాడని భావిస్తున్నారు, చాలాచోట్ల రాసారు కూడా. మీరు చెప్పుకునే పోలికలు కూడా కర్ణాకర్ణిగా మా చెవిలో పడినవి. మార్క్సిస్టులకు ఈ ఆరాధనాభావం సరైంది కాదు అని చెప్తూ, అప్పుడు రీజనల్‌ ఇంజనీరింగు కాలెజి, కాకతీయ మెడికల్‌ కాలెజి విప్లవ విద్యార్థి నిర్మాణంలో ఉన్న వాళ్లెవరో చెప్తూ ముఖ్యంగా అమరులు మువ్వా రవీంద్రనాథ్‌, కొండపల్లి చంద్రశేఖర్‌, మెడికల్‌ కాలెజిలో రమేశ్‌, నాగేశ్వరరావు, ఆర్‌ఇసిలో బాబూరావు, ముక్కు సుబ్బారెడ్డి మొదలయినవాళ్ల పేర్లు పేర్కొని, అయితే ఆదిలాబాదు జిల్లా జన్నారం ప్రాంతంలో విప్లవ ప్రచారానికి నాటకాలు వీరకుంకుమ వంటివి ప్రదర్శించిన సందర్భంగా ఆ నాటకాల్లో ఆయన ఇప్పటికి అనుగుణంగా పాటలు రాసిచ్చేవాడని, రైతు బిడ్డడు గెరిల్లాగా గండ్రగొడ్డలి లేపెనోయ్‌ అనేవి అటువంటివేనని చెప్పాడు.

బహుశా 78 జగిత్యాల జైత్రయాత్ర తర్వాత 79లో కెఎస్‌ అరెస్టయిన దగ్గరినుంచి పార్టీ నిర్మాణాన్ని, రాజకీయ ఆచరణను ముందుకు తీసుకపోవడంలో శ్రేణులతో సమస్య వచ్చినట్లున్నది. కరీంనగర్‌, ఆదిలాబాద్‌ పోరాటాలు మునుముందుకు సాగుతూ నిర్బంధం, అణచివేత, ఎన్‌కౌంటర్లు కొనసాగుతున్నప్పుడు ఎటువంటి ఎత్తుగడలు అనుసరించాలె అని ఆయా జిల్లాల నాయకత్వం ఆయనను తీసుకవెళ్లి శ్రేణులతో చర్చలను పెట్టినప్పుడు ఆయన కవితాత్మకంగా మహావృక్షాలు కూలినా, గాలివీచడం మానదు, కత్తుల కోలాటం ఆగదు, విప్లవానికి కోటికొకడున్నా చాలునురా వంటి మాటలు చెప్పేవాడని, నేలస్థాయిలో రాజకీయ సమస్యల పరిష్కారానికి ఈ కవితా ప్రేరణ సరిపోయేది కాదని ఆ శ్రేణులు భావించినట్లు నాకెందరో చెప్పారు. 1982లో మళ్లీ కెఎస్‌ అరెస్టయిన తర్వాత అప్పటికి నాలుగురాష్ట్రాలు కలిపి ఏర్పడిన సిపిఐఎంఎల్‌ పీపుల్స్‌వార్‌కు ఆయన కెఎస్‌ స్థానంలో కేంద్రకమిటీ కార్యదర్శిగా నియమింపబడ్డాడు. ముఖ్యంగా తమిళనాడు పార్టీ, మహారాష్ట్ర పార్టీ ఆయన వెనుక నిలిచాయి. పార్టీలో ప్రజాస్వామ్యం లేదని విమర్శ ప్రారంభమయింది. కానీ, ఆంధ్రప్రదేశ్‌ అంతా విస్తరించిన విప్లవోద్యమానికి మాత్రం కేంద్రకమిటీ నుంచి సరైన మార్గదర్శకత్వం లభించలేదని అసంతృప్తి ప్రబలింది. ఆ దశలో అనివార్యంగా 1984లో కెఎస్‌ను జైలునుంచి తప్పించుకొని తీసుకవెళ్లింది పీపుల్స్‌వార్‌ నాయకత్వం. కెఎస్‌ విడుదల తర్వాత కూడా ఎస్‌ఎంను కార్యదర్శిగా కొనసాగించాలని తమిళనాడు నాయకత్వంలో ఉన్న కోదండరామన్‌ ప్రయత్నించాడు. మొదటిరోజుల్లో మహారాష్ట్ర పార్టీ కూడా పార్టీలో ప్రజాస్వామ్యం లేదని భావించింది. కాని, ఏపీ, కర్నాటక కమిటీలు ఇంకెంతమాత్రం ఎస్‌ఎం నాయకత్వాన్ని అందించలేడని భావించారు. 85 నాటికి కెఎస్‌, ఎస్‌ఎంల విభేదాలు నలుగురి చెవుల్లో పడడం ప్రారంభమయింది. సహజంగానే వాళ్లిద్దరినీ ఉద్యమానికి సూర్యచంద్రులుగా భావిస్తున్న మా విరసం నాయకత్వానికి అదొక షాక్‌ అయింది. కెవిఆర్‌, సిఎస్‌ఆర్‌ ప్రసాద్‌, టిఎమ్ఎస్‌, చలసాని, నేను ఇరువైపులా వీళ్లిద్దరినీ కలిపి ఉంచడానికి తీవ్ర ప్రయత్నాలు చేసాం. ఇవి నాయకత్వ సమస్యలనుకున్నాం. ఒక దశలో ఐవి.సాంబశివరావు కెఎస్‌కు సన్నిహితుడై ఎస్ఎమ్ను దూరం చేస్తున్నాడని నిష్ఠూరంగా ఆరోపణ కూడా చేసాం. కాని, ఇది నాయకత్వ సమస్య కాదని, వైయక్తికం కాదని తమిళనాడు కోదండరామన్‌ ప్రోద్బలంతో ఎస్‌ఎం పార్టీని చీల్చే ప్రయత్నం చేస్తున్నాడని కెఎస్‌ మాత్రమే కాదు, నల్లా ఆదిరెడ్డి మొదలు పులి అంజయ్య వరకు అన్ని జిల్లాపార్టీల నాయకత్వం మాకు ముక్తకంఠంతో చెప్పింది. అందుకే చిత్తూరుజిల్లా పత్తిచేనులో జరిగిన ప్లీనంలో ఎస్ఎమ్ ఏకాకి అయ్యాడు. ఆయన దానిని పార్వతీపురం కుట్రకేసు తనమీద జరిగిన మొదటి కుట్ర అయితే, పత్తిచేను కుట్ర రెండవదన్నాడు. పార్టీలో తొలగింపును రాజ్యం చేసిన కుట్రతో పోల్చవద్దని నేను చెప్పాను. ఏమైతేనేం 1990 నాటికి ఆయన బహిరంగ జీవితానికి వచ్చాడు. కాని, అప్పటికి సిపిఐఎంఎల్‌ పీపుల్స్‌వార్‌ బోల్షివిక్‌పార్టీ పెట్టడానికనే చెప్పాడు. ఎందుకంటే పీపుల్స్‌వార్‌ ఆర్థికవాదానికి గురిఅయిందని, కార్మికవర్గాన్ని రాజ్యాధికారానికి తెచ్చే రాజకీయాచరణలో లేదని మొదట చెప్పాడు. ఊసాతో కలిసి మార్క్సిస్టు లెనినిస్టు ఐక్యతాకేంద్రం పేరుతో ఎదురీత పత్రికా నిర్వహణలో పాల్గొన్నాడు. అక్కడా ఎక్కువకాలం నిలవలేదు. ఆ తర్వాత ఊసా యాసిన్‌ అరాఫత్‌, నెల్సన్‌ మండేలాలతో పాటు ఎస్ఎమ్ను ‘గజ ఈతగాడు’ అని వెక్కిరించాడు. ఆ తర్వాత ఎస్ఎమ్ బిఎస్‌పిలో చేరాడు. దానిలోనుంచి చీలి ఎపికి పరిమితమై తానొక బిఎస్‌పి ఏర్పాటు చేసాడు. కాని, ఏ రాజకీయ ఆచరణలోనూ నిలవలేదు. అప్పుడుకాని పార్టీలో కులం గురించి మాట్లాడాడు. కారంచేడు సంఘటన నాటికి నిజానికి కులం ప్రాతిపదికగా విభేదాలున్నట్టుగా ఎక్కడా దాఖలాలు లేవు. పైగా కారంచేడు విజయనగర్‌లో కారంచేడు బాధితుల శిబిరం కాని, జిల్లాలో పీపుల్స్‌వార్‌ పార్టీ గాని పూర్తిగా దళితులపక్షం నిలబడి పోరాడింది. జననాట్యమండలి, విరసం, ఆర్‌వైయల్‌ అందులో క్రియాశీలంగా పాల్గొన్నాయి. జిల్లానాయకత్వంలో ఉన్న శేషప్రసాద్‌ ఈ విప్లవోద్యమానికి నాయకత్వాన్ని అందించాడు. అది చెంచురామయ్యను శిక్షించాలని నిర్ణయాన్ని కూడా అమలు చేసింది.

1968, 69 నుంచి కెఎస్‌ నాయకత్వంలో మాలె పార్టీలో ఉన్నప్పుడు గాని, చివరి దాకా గాని ఎస్ఎమ్ ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని బలపరిచాడు. 68-69 ఉద్యమంలో వరంగల్‌లో చక్కిళ్ల ఐలయ్యతోపాటు సికింద్రాబాద్‌లో కొల్లిపర నరసింహారావుతో పాటు స్వయంగా ఆ ఉద్యమానికి ప్రోత్సాహాన్నందించాడు. ఆ కాలంలోనే జైలుకు కూడా పోయాడు. గద్దర్‌ మీద హత్యాప్రయత్నం తర్వాత బహుశా ఆయన రాజకీయ జీవితంలో ఆఖరిసారిగా ఆయన సిపిఐఎమ్ఎల్‌ ప్రజాప్రతిఘటన కార్యదర్శి అయి ఆ పార్టీ ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని బలపరచకపోవడం వల్ల బయటికి వచ్చాడు. అది పీపుల్స్‌వార్‌ ప్రజాస్వామిక ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని 97లో మళ్లీ ప్రారంభించిన కాలం.

ఆయన ఎదురీత పత్రికలో పనిచేస్తున్న రోజుల్లోనే 80లలో ఆయనకు రాడికల్‌ యువకుడిగా సన్నిహితుడైన కృష్ణమాదిగ కూడా అందులో పనిచేసాడు. వాళ్లకు చాలా సాన్నిహిత్యం ఏర్పడింది. కృష్ణమాదిగ ఎస్‌సి వర్గీకరణ ఉద్యమం ప్రారంభించిన తర్వాత ఎస్ఎమ్ అందుకు అండగా నిలబడ్డాడు.

నా ఊరేగింపు కవితా సంకలనం ఆయనకు అంకితం ఇవ్వడం మాత్రమే కాదు, దానికి ఆయన ముందుమాట కూడా రాసాడు. సముద్రం కవితాసంకలనాన్ని చాలా ఇష్టపడ్డాడు. కాని 90ల తర్వాత రాజకీయ విభేదాల వల్ల ఆయన నా కవిత్వం విషయంలో తన తొలి అభిప్రాయాలు మార్చుకున్నాడు. అయినా Without prejudice and malice శ్రీశ్రీ తర్వాత తెలుగు కవిత్వంలో ఆయనదే స్థానం అని, ముఖ్యంగా 70ల విప్లవ కవిత్వానికి పాణిగ్రాహి తర్వాత ఆయనే మార్గదర్శకుడని, అందుకే శివసాగర్‌కు మరణం లేదని చిత్తశుద్ధిగా ఆయనతో అనుబంధాన్ని గుర్తుచేసుకుంటున్నాను.

- వరవరరావు
హైదరాబాద్‌
ఏప్రిల్‌ 17, 2012
http://varavararao.org/blog/2012/04/18/sivasagar/

Posted on  April 18, 2012  No Comments
Siva Sagar, Photo by G.Bharath Bhushan

(ఆంధ్రజ్యోతి దినపత్రికలో 23-04-2012న ఇదే పేరుతో వచ్చిన కథనం చివరలో బాగా కత్తిరింపులకు గురైంది. వివి సమగ్ర కథనం ఇక్కడే - పై లింకులో- చూడవచ్చు. శివసాగర్ రాజకీయ వైఫల్యంపై అప్పటి పీపుల్స్‌వార్ పార్టీ అధికారిక వైఖరికి సమీపంగా ఉన్న అంశాలను ఈ కథనంలోనే చూడవచ్చు.

ఆ మేరకు ఆంధ్రజ్యోతిలో వచ్చిన వి.వి. కథనం కంటే స్వంత బ్లాగులోని వి.వి.  పూర్తి కథనం చాలా ప్రాధాన్యత కలిగినట్టిది.

శివసాగర్‌కు మరణం లేదు
-వరవరరావు
http://andhrajyothy.com/vividhaNewsShow.asp?qry=2012/apr/23/vividha/23vividha2&more=2012/apr/23/vividha/vividhamain&date=4/23/2012

1 comment: