Sunday, 15 April 2012

అన్నల నడిపిన 'అన్న'


అన్నల నడిపిన 'అన్న'
అన్న.. దమ్ములు - 3

1980నాటి 'కరీంనగర్- ఆదిలాబాద్ జిల్లాల రైతాంగ ఉద్యమాన్ని మున్ముందుకు తీసుకుపోదాం!' (గెరిల్లా జోన్ల నిర్మాణం) నిర్ణయం అమలుకు కామ్రేడ్ ప్రహ్లాద్ (కిషన్‌జీ) రాష్ట్ర కార్యదర్శిగా నడుం బిగించాడు. ఆయన దండకారణ్య ఉద్యమ నిర్మాణం కోసం నాతో సహా వందలాది కేడర్లను అడవికి తరలించాడు. విముక్తి ప్రాంత లక్ష్యంతో ప్రారంభమైన దండకారణ్య విప్లవోద్యమాన్ని బలోపేతం చేయడంలో భాగంగా ప్రజా యుద్ధాన్ని - ప్రజా సైన్యాన్ని అభివృద్ధి చేయడం తక్షణ, ప్రధాన కేంద్ర కర్తవ్యంగానే భావించాడు.

ఆయన ఎక్కడున్నా, ఏ బాధ్యతలు నిర్వహిస్తుండినా ఆయన ఎజెండాలో విముక్తి ప్రాంత నిర్మాణమే మొదటి స్థానంలో ఉండేది. 1980 - 85 మధ్య ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించిన కాలంలో ఆంధ్రప్రదేశ్ రైతుకూలీ సంఘం, అఖిల విప్లవ ప్రజాసంఘాలు, కొన్ని ఉనికిలోకి వచ్చాయి. ఆ కాలంలోనే సింగరేణి కార్మికుల దీర్ఘకాల సమ్మె పోరాటంలో మంచి సింగరేణి కార్మిక సమాఖ్య 1981లో పుట్టుకొచ్చింది. 'ట్రేడ్ యూనియన్‌లో మన పని విధానం'పై విడుదలైన పార్టీ డాక్యుమెంటును పోరెడ్డి వెంకటరెడ్డి, అల్లం నారాయణ, బయ్యపు దేవేందర్ రెడ్డి, ఠాకూర్ జగన్‌మోహన్‌సింగ్‌లతోపాటు నన్నూ, మరికొంత మందిని జగన్ వాళ్ల మామిడితోటలో కూర్చోబెట్టి సమగ్ర చర్చ జరిపాడు.

మనం కార్మిక వర్గంలో ఎలాంటి ట్రేడ్ యూనియన్‌ల నిర్మాణానికి పూనుకోకూడదనీ, ఉన్న యూనియన్‌లలోనే చేరి సమరశీల కార్మిక సంస్థలుగా మలచాలనీ కంక్లూడ్ చేశాడు. కానీ, ఏడాది తిరగకముందే సికాస నిర్మాణానికి కోటన్న, ఆదిరెడ్డితో సహా ఆనాటి ప్రధాన నాయకత్వం నడుం బిగించడం పార్టీ కార్యకర్తల్లో కొత్త స్ఫూర్తిని నింపింది. 'ఏ పోరాట రూపాలూ మనకతీతం కాదు. సకాలంలో సరైన నిర్ణయం తీసుకోవడమే ఆర్గనైజర్ల నైపుణ్యానికి అద్దం పడుతుంది' అని కోటన్న కామ్రేడ్ లెనిన్‌ను ఉటంకిస్తూ అనేక సందర్భాలలో చెబుతూ వచ్చేవాడు.

ఆంధ్రప్రదేశ్‌లోని విప్లవోద్యమ ప్రాంతాలకు 1985లో తొలిసారిగా అర్ధ సైనిక బలగాలు దిగాయి. ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణచివేస్తామని రాజ్యం ప్రకటించింది. దానికి గట్టి జవాబుగా కంటికి రెప్పలా ఉద్యమాన్ని కాపాడుకుందామని పార్టీ నిర్ణయం తీసుకుంది. అందుకు తగిన ఎత్తుగడలు రూపొందించింది. అందులో మొదటి చర్యగా రాష్ట్ర కమిటీ కుదింపు జరిగింది. వ్యూహాత్మక నాయకత్వ రక్షణ, దండకారణ్య బలగాలకు ప్రత్యక్ష, సన్నిహిత మార్గదర్శకత్వంలో భాగంగా రాష్ట్ర కమిటీ నుంచి కామ్రేడ్ ప్రహ్లాద్‌ను దండకారణ్యానికి తరలించారు.

1986 అక్టోబర్‌లో తానూ తన జీవన సహచరితో దండకారణ్యానికి చేరుకున్నాడు. (పూర్తికాల విప్లవకారణి కా. మైనక్కతో 1984లో ఆయన వివాహం జరిగింది.) అప్పటికే పలుమార్లు రాష్ట్ర కార్యదర్శి బాధ్యతల్లో దండకారణ్యానికి వచ్చి ఉండడం, దండకారణ్య కేడర్లలో ఆనాటికే మెజార్టీ సభ్యులు తెలుగు వారు, అందులో అనేకమంది తన ద్వారా వచ్చిన వారు కావడంతోపాటు ఆయన భవిష్యత్ స్వప్నంగా దండకారణ్య విముక్తి ప్రాంతం ఉండడంతో ఆయనకు దండకారణ్యం రావడం అక్షరాల్లోకి అనువదించలేనంత సంబరంగా ఉండింది.

ఆదిలాబాద్ కొమరంభీం పోరాట సన్నిహిత సహచరుడైన రామ్‌జీ గోండు స్మృతిలో కామ్రేడ్ ప్రహ్లాద్ రామ్‌జీ గోండుగా మారాడు. అందుకే ఆయన 'నేటి దండకారణ్యం' (2001-11) పుస్తకానికి ముందుమాట రాస్తూ 'ఫలించిన స్వప్నం దండకారణ్యం' అన్నాడు. తన కలల పంటను పండించుకోవడం కోసం ఆయన 1986-93 మధ్య ఎంతో కృషి చేశాడు. సైనికుడిగా, కమాండర్‌గా, ఆర్గనైజర్‌గా, నాయకుడిగా, విద్యార్థిగా, టీచర్‌గా, కవిగా, సాహితీ ప్రియుడిగా ఇంకా అనేక రకాలుగా ఏకకాలంలో అనేక బాధ్యతలు నిర్వహించాడు.

తన కలల పంటను చిదిమివేయడం కోసం అతి దూకుడుగా వస్తున్న ప్రత్యేక బలగాలను ఎదుర్కోకుండా దానిని కాపాడుకోలేమని పార్టీ తీసుకున్న నిర్ణయంలో భాగంగా మన్యంలో దారగడ్డ, (ప్రస్తుత ఏవోబీ), ఆదిలాబాద్‌లోని అల్లంపెల్లిలో జయప్రదంగా జరిగిన తొలిమాటు దాడులు అందరిలో ఉత్తేజాన్ని నింపాయి. సరిగ్గా ఆ సమయంలో మిలటరీ శిక్షణా శిబిరంలో విద్యార్థిగా ఉన్నా, కామ్రేడ్ రామ్‌జీ భవిష్యత్‌లో జరగబోయే యుద్ధం గురించి లోతుగా ఆలోచించాడు. 1987లో ఉత్తర తెలంగాణ, దండకారణ్యాలను గెరిల్లా జోన్‌లుగా పార్టీ గుర్తించింది.

భారతదేశ ప్రజాయుద్ధంలో గెరిల్లా జోన్‌ల నిర్ధారణకు దీనినే ప్రమాణంగా తీసుకోవడం అప్పటి నుంచే ఉనికిలోకి వచ్చింది. ఈ సైనిక సిద్ధాంత విశ్లేషణలో కామ్రేడ్ నల్లా ఆదిరెడ్డి, రామ్‌జీల పాత్ర ప్రముఖమైనది. 2007లో పార్టీ జరుపుకొన్న ఐక్యతా కాంగ్రెస్ - తొమ్మిదో కాంగ్రెస్ నాటికి దేశంలో దాదాపు డజన్‌కు పైగా గెరిల్లా జోన్‌లు ఉనికిలోకి వచ్చినట్లుగా చెప్పుకోవచ్చు. ఈ అన్ని గెరిల్లా జోన్‌లలో చాలా వరకు ప్రత్యక్షంగా, కొన్నిటిలో పరోక్షంగా కామ్రేడ్ రామ్‌జీ పాత్ర విస్మరణీయమైనది.

నిర్మాణ రంగాన్నీ (మాస్ వర్క్) - సైనికరంగాన్నీ వేరు చేసి అభివృద్ధి చేయాలనే నిర్ణయం 1993లో జరిగాక దండకారణ్యంలో సైనికరంగాభివృద్ధికి కామ్రేడ్ రామ్‌జీ విశేష కృషి జరిపాడు. కామ్రేడ్ రామ్‌జీ తన ఆలోచనలతో ఇతరులను కన్విన్స్ చేసుకోవడంలో మంచి నేర్పరి. ఆయన తన ఆలోచనలను సమిష్ఠి ఆలోచనలుగా మలచి, వాటిని అమలు చేస్తూ ఆశాజనకమైన ఫలితాలు సాధించడంలో అద్భుతమైన ప్రతిభా పాటవాలు కలిగినవాడు.

పార్టీలో చాలా మంది నాయకత్వ కేడర్లు ఒకటి లేదా రెండు రంగాలలో మంచి పట్టు సంపాదించి, విశేషానుభవం గడించిన వారున్నారు. కానీ, కామ్రేడ్ రామ్‌జీ అనేక రంగాలలో ప్రావీణ్యం సంపాదించాడు. సిద్ధాంత రాజకీయ, నిర్మాణ, సైనిక, సాహిత్య సాంస్కృతిక రంగాలన్నింటిలో ఆయనకు మంచి పట్టు ఉండింది. పార్టీకి అరుదైన కేడర్లలో కామ్రేడ్ రామ్‌జీ ఒకరు. ఆయన తరగని గని వనరు అని చెప్పవచ్చు. కామ్రేడ్ రామ్‌జీ దండకారణ్యంలో ఉన్నప్పుడు ప్రమాదవశాత్తు తన సన్నిహిత సహచరుడి ఏకే ఫైర్ అయి కుడిచేతి దండలో నుండి గుండు దూసుకుపోయింది.

ఆయన పక్కనే కూచున్న మేమంతా తీవ్ర ఆందోళనకు గురవుతుంటే.... రక్త స్రావాన్ని అరికట్టడానికి ముందు కట్టుకట్టాలన్నాడు. 1979లో ఓసారి ఇలాంటి సన్నిహిత సహచరుని చేతిలో నుంచి తయారీ తుపాకీ పేలిపోయి కుడి మోచేతి నుంచి గుండ్లు దూసుకుపోవడం గుర్తు చేస్తూ, మా ఆందోళనను మాయం చేస్తూ అందరినీ తన మాటలతో నవ్వించాడు. దిల్‌సుఖ్‌నగర్‌లో (హైదరాబాద్) పోలీసులు తన మీద 1984లో కాల్పులు జరిపినపుడు తానెలా తప్పుకొన్నాడో గుర్తుచేశాడు.

కామ్రేడ్ రామ్‌జీ జ్ఞాపకాలతో సుజాతక్క రాసినట్టు 'అతనొక సజీవ చైతన్యం'. పార్టీ నిర్మాణాల విషయంలో కామ్రేడ్ రామ్‌జీ ఎంతటి ప్రాధాన్యతను ఇచ్చేవాడో, వాటి నాయకత్వంలో ప్రజా మిలీషియా నిర్మాణంపై ఆయన విశేష శ్రద్ద పెట్టేవాడు. ఆయనను చివరి వరకూ ప్రాణప్రదంగా కాపాడుకున్నది ఆయన నమ్మిన, నిర్మించిన ప్రజా మిలీషియాలే. సాయుధ తెలంగాణ రైతాంగ పోరాటం అందించిన చారిత్రక పాఠాలను అనేక సందర్భాలలో ఆయన చెప్పేవాడు. ఈ అపార అనుభవాల వెలుగులో ఆయన బెంగాల్‌లోని సింగూర్-నందిగ్రాంలలో, లాల్‌గఢ్‌లలో ప్రజారాజ్యాధికార సంస్థల నిర్మాణానికి తీవ్ర కృషి చేశాడు.

పార్టీ నిర్మాణం విషయంలో కోటన్న చాలా నిక్కచ్చిగా ఉండేవాడు. ఆయన బెంగాల్ వెళ్లిన తర్వాత గంభీరంగా ఎదుర్కొన్న సమస్యల్లో ఇది ప్రధానమైంది. నక్సల్బరీ ఉద్యమం తర్వాత ముక్కచెక్కలై మిగిలిన పార్టీలు, గ్రూపులు, వ్యక్తులను తిరిగి ఒక విప్లవ పార్టీలో సమైక్యం చేయాలంటే... ముందు పార్టీ నిర్మాణం విషయంలో భావ సారూప్యతతో పాటు కార్యసారూప్యత కూడా అత్యంత ప్రాధాన్యత కలిగిన విషయమేనన్నది... ఆయన వ్యక్తులతో, సంస్థలతో చేసిన ఘర్షణ అక్కడ పొల్లునూ-నెల్లూనూ వేరు చేసింది. బెంగాల్‌తోపాటు తూర్పు, ఉత్తర భారతదేశంలోని ఇంకా అనేక ప్రాంతాలలో ఆయన చేసిన కృషి ఫలితంగా పూర్తికాలం విప్లవకారులతో కూడిన బలమైన రహస్య, పార్టీ నిర్మాణాలు ఉనికిలోకి వచ్చాయి.

పార్టీ నిర్మాణాలతోపాటు సైన్యం నిర్మాణ విషయంలోనూ భిన్నమైన కార్యాచరణ ఉందని అర్థమైన చోట దానిని సరిదిద్దడానికి కోటన్న అలుపెరగని కృషి చేశాడు. సైన్య నిర్మాణంతోపాటు, సైనిక క్రమ శిక్షణ విషయంలో నిజమైన మావోయిస్టు మిలటరీ జనరల్ ఆయన. తుపాకీ పట్టుకోవడం నుంచి గురి చూసి కాల్చడం వరకు, పీటీ నుంచీ మస్కట్ డ్రిల్ వరకు గ్రౌండ్‌లో, గ్రౌండ్ బయట ప్రతి సైనికున్నీ నిశితంగా పరిశీలించి వారి లోపాలను సరిదిద్దడానికి అనునయంగా చెప్పేవాడు.

దండకారణ్య ఫారెస్ట్ కమిటీ రూపొందించిన స్థాయి ఆదేశాల (స్టాండింగ్ ఆర్డర్స్) తయారీలో కామ్రేడ్ రామ్‌జీ ముఖ్యుడు. ఇలా భారతదేశంలో అపూర్వమైన రీతిలో ఒక ప్రజా సైన్యాన్ని నిర్మించిన ప్రజా సేనానులలో ముఖ్యుడైన రామ్‌జీని అమరత్వం ద్వారా మేం కోల్పోయాం. కానీ, ఆయన నిర్మించిన ప్రజాసైన్యం అద్భుతమైన విజయాలతో ముందుకు పోతుంది. నక్సల్బరీకి పుట్టినిల్లయిన పశ్చిమ బెంగాల్‌ను కేంద్రంగా చేసుకొని విప్లవకారుల సమైక్యతకు కామ్రేడ్ రామ్‌జీ చాలా కృషి చేశాడు.

1998లో పార్టీ యూనిట్‌తో సాధించిన ఐక్యతలో, 2004లో ఎమ్‌సీసీఐతో ఏర్పడిన ఐక్యత ఆయన పోషించిన పాత్ర కీలకమైంది. అంతేకాదు... పార్టీ తరఫున చేపట్టిన ఐక్యత కృషిని మరింత ముందుకు కొనిపోతూ దక్షిణాసియా దేశాల్లోని మావోయిస్టు పార్టీలతో, సంస్థల మధ్య భారత విస్తరణ వాదానికి వ్యతిరేకంగా సమైక్య అవగాహనను పెంపొందింప చేసి సీ.కంపోసా నిర్మాణానికి పునాదులు వేసిన వారిలో రామ్‌జీ కీలకమైన వ్యక్తి.

http://www.andhrajyothy.com/mainnewsshow.asp?qry=2012/apr/14/main/14main5&more=2012/apr/14/main/main&date=4/14/2012

No comments:

Post a Comment