Monday, 19 December 2011

ఎన్‌కౌంటర్ సాధ్యమేనా

ఒక్కరినే హతమార్చారంటే నమ్మొచ్చా పటిష్ఠ భద్రతా వలయం నడుమ కిషన్‌జీ
40-50 మంది దాటుకుంటేనే ఆయన చెంతకు
భద్రతా దళాలను ఇట్టే పసిగట్టే సామర్థ్యం వారి సొంతం
పోలీసుల కథనం అంతా కట్టుకథేనా!

హైదరాబాద్, నవంబర్ 24 కిషన్‌జీ స్థాయి మావోయిస్టు నేతలను ఎన్‌కౌంటర్‌లో హతమార్చడం సాధారణం గా సాధ్యమయ్యే పనేనా చుట్టూ పటిష్ఠ భద్రతావలయం ఉండగా కేవలం ఒక్కరు మాత్రమే ఎన్‌కౌంటర్‌లో మరణించారంటే నమ్మగలిగే విషయమేనా మావోయిస్టుల కదలికలు, వారి ఆపరేషన్ల తీరుతెన్నుల గురించి తెలిసినవారు మాత్రం దీనికి కచ్చితంగా కాదనే సమాధానం చెబుతున్నారు. మావోయిస్టు పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడైన కిషన్‌జీ ఎక్కడైనా ఒక చోట శిబిరంలో ఉన్నారంటే.. ఆయన చుట్టూ కనీసం 50-70 మందికి పైగా ఉంటారు.

ఆయనకు అత్యంత సమీపంలోనే 27 మందితో కూడిన వ్యక్తిగత భద్రతా దళం ఒకటి అహర్నిశలూ కాపలా కాస్తూ ఉంటుంది. కుడి ఎడమలు, ముందు వెనుకలు.. అన్ని దిశల్లోనూ పూర్తిస్థాయిలో సాయుధ మావోయిస్టులు ఆయనను కంటికి రెప్పలా కాపాడుతూ ఉంటారు. కిషన్‌జీ స్థాయికి చెందిన నాయకులకు దాదాపు ఒక కిలోమీటరు దూరంలో ఇరువైపులా సెంట్రీ పోస్టులు ఉంటాయి. అక్కడి నుంచి చుట్టుపక్కల అన్ని వైపులా భద్రతా దళాల ఆనుపానులను కనిపెడుతుంటారు. వారు సమీపిస్తున్న విషయాన్ని వాసన పసిగట్టిన మరుక్షణమే వ్యక్తిగత భద్రతా దళానికి సమాచారం వెళ్లిపోతుంది, వెనువెంటనే అత్యంత సురక్షితంగా ఆయనను వేరే మార్గం గుండా పక్కకు తప్పించేస్తారు.

సెంట్రీ పోస్టులు, వ్యక్తిగత భద్రతా దళం ఉన్న దిక్కులు కాకుండా మరో దిశలో ఆయనతో తరచు సమావేశం కావాల్సిన మావోయిస్టు నేతల టెంట్లు ఉంటాయి. ఇదంతా కిషన్‌జీకి అత్యంత సమీపంలో ఉండే భద్రతా వలయం. ఇది కాక.. దాదాపు ఏడు కిలోమీటర్ల దూరంలో వలయాకారంలో రెండు మూడు దళాలు నిరంతరం సంచరిస్తూ ఉంటాయి. ఇలా ఎటువైపు నుంచి ముప్పు వస్తున్నా వెనువెంటనే సమాచారం అందిపోతుంది. వీళ్లు కాక.. అటవీ ప్రాంతానికి చుట్టుపక్కల ఉండే గ్రామాలన్నింటిలోనూ గ్రామరక్షణ దళాలు, వ్యవస్థాగత దళాలు నిరంతరం సంచరిస్తూ ఉంటాయి. పోలీసు పదఘట్టనలు వినిపిస్తుంటే ఆ విషయాన్ని మరుక్షణమే అగ్రనేత వ్యక్తిగత భద్రతాదళానికి తెలియజేస్తాయి.

అందువల్ల, కిషన్‌జీ స్థాయిలోని మావోయిస్టు నేతను అడవుల్లో ఉన్నప్పుడు ఎన్‌కౌంటర్‌లో హతమార్చాలంటే ఎంత లేదన్నా కనీసం 40-50 మందిని మట్టుబెట్టిన తర్వాత గానీ సాధ్యపడదు. ప్రస్తుతం పశ్చిమబెంగాల్‌లో జరిగిందని చెబుతున్న ఎన్‌కౌంటర్‌లో కేవలం కిషన్‌జీ మాత్రమే మరణించారని చెబుతున్న కథనం పూర్తిగా కట్టుకథ మాత్రమేనని, ముందుగానే మైదాన ప్రాంతంలో పట్టుకుని కాల్చి చంపి ఉంటారని సానుభూతిపరులు అనుమానిస్తున్నారు.
https://www.andhrajyothy.com/mainnewsshow.asp?qry=2011/nov/25/main/25main5&more=2011/nov/25/main/main&date=11/25/2011

No comments:

Post a Comment