Sunday, 18 December 2011

సత్యం దుర్భాషితాలు


'విప్లవకారుల విషాదం' పేరుతో (ఆంధ్రజ్యోతి, డిసెంబర్ 7) చెరుకూరి సత్యనారాయణ రాసిన వ్యాసం చదివితే చలం గారి 'శేషమ్మ ఎ స్టడీ' అనే కథ గుర్తుకొచ్చింది. శేషమ్మ వితంతువు. ఇల్లు దాటదు. కాలు కదపదు. గడపలో కూర్చుని వీధిలో వచ్చిపోయేవాళ్ళని శాపనార్థాలు పెడుతూ ఉంటుంది. అదే పని ఆమె అనునిత్యం చేస్తూ ఉంటుంది. చెరుకూరి సత్యనారాయణ శేష మ్మ అడుగుజాడల్లో నడుస్తూవున్నారు. మావోయిస్టు మల్లోజుల మీద, విప్లవోద్యమం మీద తమ అక్కసంతా వెళ్ళగక్కారు. శేషమ్మని మించిన సినిక్ అనిపించుకున్నారు.

విప్లవం కార్యాచరణకి సంబంధించింది. చైతన్య రంగంలో విశేషంగా కృషిచేసే నీటిలో చేపలాగా ప్రజలతో కలిసి ఉండి, దోపిడీ, పీడనను ఎండగట్టి ప్రజలని సమీకరించి శత్రువుని ఎదిరించేది విప్లవం. ఇవాళ భారతదేశంలో మావోయిస్టు పార్టీ ఆ కార్యాచరణలో నిండా మునిగివుంది. ఈ మాట అటు పాలకులూ, ఇటు ప్రజలు కూడా ఒప్పుకున్నదే. కాని దివాంధాలు సూర్యరశ్మిని చూడలేవు. మరుగుజ్జు మనస్తత్వం కలవాళ్ళు మహత్యాన్ని నొలవలేరు. అలనాటి శ్రీకాకుళాన్ని తెలంగాణకు విస్తరింపజేసింది అప్పటి పీపుల్స్ వార్ పార్టీ.

అదే ఇప్పటి మావోయిస్టు పార్టీ. ఇతర రాష్ట్రాల్లో కూడా విప్లవ కార్యరంగంలో మునిగివుంది. ఇవాళ మావోయిస్టు పార్టీ ఎన్నో కష్టాలనీ, నష్టాలనీ ఎదుర్కొంటోంది. వడ్లతో పాటు తట్టకూడా ఎండినట్టు ప్రజలతో పాటు పోరాట రంగంలో ఉంది. ఈ సత్యాలను సత్యం విస్మరించి గాలిలో తేలిపోయి నేలని విడిచిపెట్టి వేశారు. అమరులను ప్రజలు తమ గుండెల్లో దాచుకుంటారు. నేలకొరిగిన వారిని తమ కళ్ళల్లో నింపుకుంటారు. నవంబరు 24న పెద్దపల్లి (మల్లోజుల స్వగ్రామం)కి ఎందరెందరో తరలివచ్చారు.

వేలమంది హాజరయ్యారు. శేషమ్మ ఉరఫ్ సత్యం గారెక్కడా కానరాలేదు. ఆరోజు అక్కడ మల్లోజుల మృతదేహం కాలిపోయేదాకా ఎవ్వరూ కనీసం మంచినీళ్ళు కూడా ముట్టలేదు. అక్కడ వేలాది మంది తమ గుండెల్లో మల్లోజులని పదిలంగా దాచుకున్నారు. అతను అక్షరాలా అమరుడు. ఇది సత్యం. చాగంటి భాస్కరరావు నాటికి మృతదేహాల అప్పగింత లేదు. ప్రజాసంఘాలు, హక్కుల సంఘాల పోరాటాల ఫలితంగానే ఇప్పుడు ఈ అవకాశం నెలకొంది. విప్లవం ఎప్పుడూ ఒంటరి పోరాటం కాదు. పీడిత ప్రజల గుండెల్లో చెలరేగే ఆరాటానికి కార్యరూపం విప్లవం. సత్యం గారిలాగా ఒంటెత్తు పోకడల ఊబిలో కూరుకుపోయే వారికి ఇవి వినిపించవు. కనిపించవు.

జపం చేసుకుంటూ కూర్చోవడం ఇలాంటి వారి నిత్యకృత్యం. కాని 'విప్ల వం ఏడుందిరా ఆడనే నీ కూడుందిరా నీ గూడుందిరా'! (శ్రీశ్రీ) అని పోరాటంలో లీనం అయ్యే వారిని తిట్టి దిగపారిబొయ్యడం, అసత్యాలను నెత్తికెత్తుకోవడం సత్యం గారికి బులపాటం, ఉబలాటంలా ఉంది. వాటిలో మునిగి తేలిపోయే అవకాశం, హక్కు వారికున్నాయి. వారు యథేచ్ఛగా వాటిని వాడేసుకుని కాలక్షేపం చేయవచ్చు. కాని అమరులనీ, వారిని అభిమానించే అశేష ప్రజలని కించపరచడం, తేలిగ్గా చూడడం విజ్ఞత అనిపించుకోదు. తెలుగునాట ఉమ్మడి కమ్యూనిస్టు ఉద్యమం ఉధృతంగా కొనసాగిన కాలం అది. కృష్ణాజిల్లా దివి తాలూకాలో జమిందారీ వ్యతిరేక పోరాటాలు పుంజుకున్నాయి.

కృష్ణానది తీరాన ఉన్న లంకలు రైతులకే చెందాలని కమ్యూనిస్టు పార్టీ పోరాడింది. అక్కడి స్థానిక కమ్యూనిస్టు పార్టీ నాయకుని పేరు చల్లపల్లి నారాయణరావు. అతన్ని 1950, మే 27న మలబారు పోలీసులు కాల్చేశారు. లంకలలోని రైతు కూలీలు ఆ తర్వాత ఒక మాటన్నారు. 'మేమూ అన్నాలు వండుకోనిది రెండుసార్లే' గాంధీగారిని కాల్చేసినప్పుడు, చల్లపల్లి నారాయణరావుని కాల్చేసినప్పుడు, అమరత్వం చెందిన వారిని ప్రజలు ఏనాటికీ మర్చిపోరు. విప్లవ పదజాలం చాటున వారిపై బురద చల్లే వారిని ఎప్పటికీ గుర్తుపెట్టుకోరు. ఆనాటి చల్లపల్లి నారాయణరావు, ఈనాటి మల్లోజుల కోటేశ్వరరావు - ఇద్దరూ పుట్టుకతో బ్రాహ్మణులు. కులం వెర్రి తలలు వేస్తున్న ఈ రోజుల్లో ఈ సంగతి గుర్తించడం మంచిదని ఇక్కడ ఉటంకించవలసి వస్తున్నందుకు మన్నించమని మనవి.
- చలసాని ప్రసాద్

https://www.andhrajyothy.com/EditorialShow.asp?qry=2011/dec/15/edit/15edit4&more=2011/dec/15/edit/editpagemain1&date=12/15/2011

No comments:

Post a Comment