Friday, 30 December 2011

ఆజాద్.. అనంతం...

సాకేత్‌రాజన్ గొప్ప మాండొలిన్ వాయిద్యకారుడు. యోగా నిపుణుడు. ఢిల్లీలోని ప్రతిష్ఠాత్మక ఇండియన్ మాస్ కమ్యూనికేషన్ విద్యాలయం నుంచి నాలుగు బంగారు పతకాలు సాధించినవాడు. సాకేత్ జర్నలిస్టు, చరిత్ర కారుడు కూడా. అంతకు మిం చి అతను 'ఇటీజ్ రైట్ టు రెబెల్' అని నమ్మి ఆచరించిన విప్లవకారుడు.

ఐ.ఎం.సీలో నాలుగు బంగారు పతకాలు తీసుకోవడానికి... వేదిక మీదకు వెళ్లి.. అప్పటి కేంద్ర విద్యామంత్రి విద్యాచరణ్ శుక్లా నుంచి బంగారు పతకాలు స్వీకరించకుండానే, కనీసం మంత్రితో కరచాలనం చెయ్యకుండానే వేదిక దిగి వెళ్లిపోయిన రెబెల్. రక్తంలో తిరుగుబాటు నింపుకున్న సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన సామాన్యుడు.

అతనొక మావోయిస్టు. అయిదేళ్ల క్రితం కర్ణాటక అడవుల్లో ఎన్‌కౌంటర్‌లో చనిపోయాడు. ఈ భారత దేశం లో ఒక విప్లవకారుడు రాసిన చరిత్ర ఈ దేశపు యూనివర్సిటీలో బోధించడం కూడా సాకేత్‌తోనే మొదలు.. సాకేత్ రాసిన 'మేకింగ్ హిస్టరీ' ఇప్పటికీ మంగళూరు యూనివర్సిటీ పాఠ్యపుస్తకం. ఒక విప్లవకారుణ్ని చంపిన రాజ్యం.. అతని పుస్తకాన్ని పాఠ్యపుస్తకంగా అంగీకరించింది.. ఎవరి గొప్ప.. ఫ్రాంజ్ ఫానన్ 'రెచ్‌డ్ ఆఫ్ ది ఎర్త్' తో ప్రభావితమైన సాకేత్ ఒక మేధో శిఖరం. సాకేత్ చనిపోదగినవాడు కాదు. చంపదగిన వాడు అంతకన్నా కాదు. అతను మావోయిస్టే.. కావొచ్చు. కానీ.. ఈ దేశ సంపద. ఈ దేశపు మేధో సంపద.

చిరకాలం జీవించదగినవాడు. భారత రాజ్యానికి ఈ విచక్షణ లేదు. అదొక నైతిక సంక్షోభంలో చిక్కుకుని ఉన్నది. నిండా మునిగిపోయి ఉన్నది. సాకేత్ రాజన్ లాంటి వ్యక్తికి స్ఫూర్తినిచ్చిన బుద్ధిజీవి ఆజాద్ అనే చెరుకూరి రాజ్‌కుమార్. ముప్పది ఐదు సంవత్సరాల ఆజాద్ ప్రజాజీవితం. విషాదాంతమైంది. భారతదేశపు ప్రత్యామ్నాయ రాజకీయాల్లో సుదీర్ఘకాలం విప్లవకారుడిగా జీవించిన రాజ్‌కుమార్ డబుల్ ఎంటెక్. ప్రతిష్ఠాత్మకమైన వరంగల్ ఆర్ఈసీలో బీటెక్, ఎంటెక్ కూడా చేసిన రాజ్‌కుమార్ డెబ్భైయవ దశకం మధ్యలో తెలుగు సీమను చుట్టుముట్టిన నక్సల్బరీ రాజకీయాల్లో మెరిసి, విరిసి, అగ్ర నాయకత్వానికి చేరిన తొలి తరపు ఆణిముత్యం.

ఆంధ్రాయూనివర్సిటీలోనూ ఎంటెక్‌లో ఉండగానే.. ఇవాల్టి భార త విప్లవానికి నాయకత్వం వహిస్తున్న తొలితరం రాడికల్ విద్యార్థి సంఘానికి అధ్యక్షుడిగా పనిచేసిన రాజ్‌కుమార్.. కర్ణాటకలో చాలా కాలం రాష్ట్ర బాధ్యుడిగా పనిచేశారు. మావోయిస్టు పార్టీలో కేంద్ర అధికార ప్రతినిధిగా కొనసాగుతున్న రాజ్‌కుమార్‌ది కృష్ణా జిల్లా. వడ్డించిన విస్తరి జీవితం.

తల్లిదండ్రులు లోటు లేకుం డా పెంచారు. విప్లవ కేంద్రంగా విలసిల్లిన వరంగల్ ఆయనకు విప్లవాన్ని నేర్పినా.. కృష్ణా జిల్లాలో సీపీఐ, సీపీఎంలు, తెలంగాణ సాయుధ పోరాట ప్రభావాలు ఆర్ఈసీలో రాజ్‌కుమార్‌తో పాటు నంబాల కేశవరావు, కొల్లి శివాజీ, విశ్వేశ్వరరావు, కుమార్‌రెడ్డి లాం టి వాళ్లను కదన రంగానికి ఆహ్వానించింది. ఇప్పుడు ఆ యుద్ధరంగంలో ఒక్క నంబాల కేశవరావు మిగిలారు. ఇదంతా ఎమర్జెన్సీ తరంతో పాటు గడిచిన చరిత్ర. సూరపనేని జనార్ధన్ వాళ్ల హీరో. సూరపనేని.. చెరుకూరి.. ఇంటిపేర్లు చిరపరిచితమైన వే కానీ.. ఈ ఇంటి పేర్లకు విప్లవ సౌగంధం అద్దిన తొలితరం విప్లవ కేతనాలయ్యారు వాళ్లు. మెదక్ జిల్లా దుద్దెడ ప్రాంతంలో ఎమర్జెన్సీ మొట్టమొదటి ఎన్‌కౌంటర్‌లో సూరపనేని జనార్ధన్ మరణించాడు. ఇదం తా మన చరిత్రే. మరిచిపోలేని.. వర్తమానమే.

పదేపదే సరిగ్గా దండకారణ్యం సరిహద్దుల్లో జరుగుతున్న అగ్రనాయకుల ఎన్‌కౌంటర్లు తెలుగు ప్రజల జీవితంలో మరో పార్శ్వాన్ని పదేపదే రక్త చలన సంగీతాలై కలవెల పరుస్తూనే ఉన్నాయి. మన రాష్ట్రం ఇప్పు డు 'కిల్లింగ్ ఫీల్డ్'.. విస్మరించలేం. మరిచిపోనూలేం. 'అందరూ పోతే ఎట్లా' అని అడిగేవారూ ఉంటారు. వాళ్లూపోతే ఇక దిక్కేది అని అనుకునే వాళ్లూ ఉంటారు.

ఈ దేశపు విప్లవానికి ఇప్పటికే నాయకత్వం వహిస్తున్న వారంతా తెలుగువాళ్లే.. అది మానని గాయం. పదేపదే సలుపుతూ ఉంటుంది. సందెరాజమౌళి, వడ్కాపూర్ చంద్రమౌళి, పటేల్ సుధాకర్‌రెడ్డి, శాఖమూరి అప్పారావు ఎన్ని పేర్లని.. నల్లా ఆదిరెడ్డి, అంజన్న, శీలం నరేష్, సంతోష్‌రెడ్డి... లింగమూర్తి (కాకతీయ తెలుగు గోల్డ్ మెడలిస్టు) ఎన్నెన్ని పేర్లని..నింగికెగిసిన నేలతారలెన్నని రాజ్యానికి రెండు నాల్కలుంటాయి. విప్లవాన్ని వ్యతిరేకించేవాళ్లకు, ఈసడించుకునేవాళ్లకూ..ఎందుకీ చావులు, హింస, రక్తపాతాలు, సమాజం నిశ్చలంగా ఉండాలని కోరుకునే అచ్చమైన మధ్యతరగతి బుద్ధిజీవుల కూ రెండు నాల్కలుంటాయి.

మావోయిస్టు ఉద్యమంలో ఇంజనీర్లు, డాక్టర్లు, లాయ ర్లు, విద్యాధికులు, బుద్ధి జీవులు ఉన్నంత కాలం అది బాగా జరిగింది. ఇప్పుడు ఆ నాయకత్వం లేదు. అంతా అరాచకం అంటూ ఉంటుంటారు. రాజ్యం పనిగట్టుకొని జరుగుతున్నదాన్ని బదనా మ్ చేస్తుంది. రాజ్యంతోపాటే మనమూ మాట్లాడు తూ ఉంటాం.. కానీ..రాజ్యం.. ఇంజనీర్లను, డాక్టర్లను.. సాకేత్ రాజన్‌లనూ, చెరుకూరి రాజ్‌కుమార్‌లనూ, నల్లా ఆదిరెడ్డిని, పటేల్ సుధాకర్‌రెడ్డినీ, సంతోష్‌రెడ్డినీ చంపేస్తుంటుంది.

ఎక్కడో పట్టుకొని ఎక్కడో కాల్చేస్తుంటుంది. మన రెండో నాలుక పని చేయదు. మన రెండో నాలుకకు మాటరాదు. శ్రీకాకుళంలో వెంపటాపు సత్యనారాయణ, ఆదిభట్ల కైలాసం, చాగంటి భాస్కర్‌రావు, పంచాది నిర్మల, రామనర్సయ్య ఎన్ని పేర్లని.. అందరూ విద్యాధికులే. వాళ్లను చంపిన నాడూ మాట్లాడలేము.. ఇవ్వాళ్ల ఏ ఉద్యమానికైతే దిశానిర్దేశం చెయ్యదగినవారు.. ఏ ఉద్యమానికైతే సిద్ధాంత బలాన్ని అందించగలరో.. గన్ను కన్నా.. పెన్నుతో కార్యక్షేత్రంలో కత్తులు మెరిపించగలరో అలాంటి బుద్ధి జీవులను చంపుతున్నప్పుడు మాట్లాడలేము. మున్నూటా రెండు కేసులున్న రాజ్‌కుమార్ గురించి ఎలా మాట్లాడగలం. అతనొక నిందితుడు.

అతను ఈ రాజ్యాన్నే కూలదోసేవాడు. అయిదేళ్లలో అక్షరాల ఇరవై ఐదు వేల కోట్లు సంపాదించినవాడే మన హీరో.. మార్క్సిజం ఈ భూ మండలంమీద అత్యున్నత మానవులను తయారు చేసింది. లక్షలాది, కోట్లా ది మందిని అది మానవ జీవితంలో అత్యున్నత వ్యవస్థల కోసం, అత్యున్నత మాన వ సంబంధాల కోసం..మనిషి సమున్నతంగా బతకడం కోసం.. మనిషి తనం మిగలడం కోసం.. మనిషి సర్వ దోపిడీలను ఎదిరించడం కోసం సమాయత్తం చేసింది. ప్రపంచ మానవాళి కోసం మార్క్సిజం కొందరికి త్యాగాలను నేర్పింది.

ఆ త్యాగాల చాలు బోసిన వారు ప్రపంచం నిండా నిండి ఉన్న విప్లవయోధులు.. మరులండ కావొచ్చు.. చేగువేరా కావొచ్చు.. చియాప స్ కొండల్లో మాటుగాసిన దేశీ విప్లవకారుడు మార్కోస్ కావొచ్చు..ఎవరైతేనేం.. ఆధునిక విప్లవకారులు ఇంకా ఈ ప్రపంచాన్ని పరాధీనం కాకుండా .. కాపాడుతున్న ఒకగొప్ప మానవ విలువ.. చెరుకూరి రాజకుమార్ అదే కోవ. సాకేత్ రాజన్ అదే కోవ.. భారత రాజ్యం నైతిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నది. బహుళజాతి కంపెనీలకు భారత దేశాన్ని తాకట్టుపెట్టింది.

దండకారాణ్యాన్ని.. గనుల ను, సహజ సంపదలను 'వేదాంత'లకు తాకట్టుపెడ్తున్న భారత రాజ్యం.. ప్రత్యామ్నాయ వేదాంతాన్ని ప్రవచిస్తున్న చెరుకూరి రాజ్‌కుమార్‌ను చంపేస్తున్నది. నిజమే మావోయిస్టులను మనం ఇష్టపడకపోవచ్చు. ఆ పార్టీ ఎందరినో చంపుతున్నది. వాళ్లనూ చంపాలని అనే వాళ్లూ ఉండచ్చు.కానీ.. చెరుకూరి రాజ్‌కుమార్ లాంటి వాళ్లు నూటికో కోటికో ఒకరు పుడతారు.

నల్లమలలో చనిపోయిన మాధవ్‌లు కూడా అంతే...సామాన్యులు విప్లవంలో శక్తివంతమైన నాయకులైన వాళ్లు.. అట్లాంటి వాళ్ల త్యాగాలను.. ఎట్లామరిచిపోగ లం.. దేశాన్ని అమ్ముకుంటున్న వాళ్లకు.. యూనియన్ కార్బైడ్‌కు వంగి కాళ్లు మొక్కిన వాళ్లకు.. మల్కాన్‌గిరిలో గిరిజనం కొలుచుకునే కోటలాంటి కొండలను అమ్ముకుంటున్న వాళ్లకు.. వాళ్లను ఇంత క్రూరంగా చంపే అధికారం ఉంటుందా రాజ్యానికి విచక్షణ లేదు. ఆజాద్ చివరి ఇంటర్వ్యూలో యుద్ధం సంగతులు మాట్లాడా రు.

యుద్ధంగా ప్రకటించకుండా జరుగుతున్న యుద్ధంలో నియమాలుండాలని కనీసం ప్రజాస్వామ్య రాజ్యానికి అది ఎంతో అవసరమన్నారు. జెనీవా ఒప్పందాలు ప్రస్తావించారు. ఈ రాజ్యం..కనీసం యుద్ధంలో ప్రత్యక్షంగా లేని వారిని సామాన్య ప్రజలను, గాయపడిన వారిని చంపదనే ఆశను కూడా వెలిబుచ్చారు. అతనొక మేధావి. భారత దేశం పట్ల ప్రేమతోనే .. ఒక సమూల మార్పు కోసం ఒకదారి ఎన్నుకున్నవాడు.. మనకు ఇష్టం లేకున్నా..ఉన్నా ఒకప్రాతిపదిక దృక్పథం ఉన్నవాడు.. చర్చల గురించి, సంప్రదింపుల గురించి ప్రస్తావిస్తున్న చిదంబరం.. ఆలోచించాల్సింది ఒకటుంది. సాకేత్ కావొచ్చు.. కోబాడ్ గాంధీ కావొచ్చు.. చెరుకూరి రాజ్‌కుమార్ కావొచ్చు.. నిజంగా సంప్రదింపులు జరపదలుచుకుంటే సమాన స్థాయిలో మావోయిస్టుల ప్రతినిధులు.. ఆజాద్‌ను చంపి ఏమి సాధిస్తారు చంపకుండా ఉంటే.. ఎన్నైనా సాధించవచ్చు.

ఆజాద్ గురించి చివరగా ఒక మాట.. అమ్మానాన్న బతికి ఉన్నారా లేదా తన మూడున్నర దశాబ్దాల విప్లవ జీవితంలో అతనెన్నడూ తెలుసుకోలేదు. మూడు నెలల క్రితం ఆజాద్ మిస్సయినప్పుడు.. ఆయన కన్న తల్లి కరుణ హైకోర్టులో వేసిన పిటిషన్ వార్త చూసి అమ్మ బతికి ఉందని తెలుసుకున్న వాడు.. కన్నపేగు కదులుతున్నది.. రాజ్‌కుమార్‌ను ఆయన త్యాగాన్ని ఎట్లా శంకించగలం.. నిబద్ధతను ఎట్లా ప్రశ్నించగలం.. ఎట్లా మాట్లాడకుండా ఉండగలం.. పేగుతెంపుకొనిపోయిన వాడు దేశాన్ని అమ్మగా భావించుకున్నవాడు.. స్వంత అమ్మను అందరు తల్లుల్లో చూసుకున్న వాడు..ఎలా త్యాగజీవి కాకుండా ఉండగల డు. అంగీకరిస్తావా విభేదిస్తా వా ... వేరు విషయం.. అతనొక తెలుగు చెగువేరా.. బొలివియా కొండల్లో చెగువేరా.. సమాధిలో మొలకెత్తుకుంటాడు.. జోగాపూర్ అడవిలో చెరుకూరి రాజ్‌కుమార్‌లాగా.. చిక్‌మగలూరు కొండల్లో సాకేత్‌లాగా.. ఇది అనంతం..
-అల్లం నారాయణ
ఆంధ్రజ్యోతి

No comments:

Post a Comment