Sunday, 18 December 2011

మావోయిస్టు ఉద్యమం -కిషన్‌జీ...!


పశ్చిమ బెంగాల్ మావోయిస్టు పార్టీ నాయకుడు మల్లోజుల కోటేశ్వర్‌రావు (కిషన్‌జీ) ఎన్‌కౌంటర్‌లో చనిపోయాడని ఇంటలిజెన్స్ వర్గాలు ధృవీకరించాయి. కోటేశ్వర్‌రావు ఎప్పుడు ఉద్యమంలోకి వచ్చాడు ఏయే బాధ్యతలు నిర్వహించాడు మావోయిస్టు పార్టీపైన ఎటువంటి ప్రభావం ఉండవచ్చు ఇంకా ప్రత్యేకతలు ఏమైనా ఉన్నాయా తెలిసిన వారి వద్ద నుంచి ప్రశ్నల వర్షం. ప్రధాన తెలుగు టీవీ చానెళ్లు ప్రత్యేక చర్చలు నడిపాయి. ఈ చర్చల్లోనూ ప్రత్యేకంగా కొత్త విషయాలు పెద్దగా ఏమీ లేవు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్నికల ముందు చర్చలు అన్నది. తరువాత హత్యలు చేసింది. మమతా బెనర్జీ ప్రభుత్వం కూడా ఎన్నికల ముందు చర్చలు అన్నది, తరువాత హత్యలు మొదలు పెట్టింది. ఈ పోలిక మాత్రమే కొత్త విషయం. ఆంధ్రవూపదేశ్ ప్రభుత్వమే కాదు, దేశంలోని ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా ఇలాగే వ్యవహరిస్తుంది. ఈ విషయం మావోయిస్టులకు కూడా తెలుసు.

మల్లోజుల కోటేశ్వర్‌రావు గురించి ఆడిగిన ప్రశ్న లు ముఖ్యంగా రెండు రకాలవి. 1) వ్యక్తిగతమైనవి. ఉద్యమంలో ఆయన ప్రయాణం వివరాలు, ఆయన ప్రత్యేకతలు. 2) ఉద్యమంపై ఎటువంటి ప్రభావం ఉంటుంది. ముఖ్యంగా బెంగా ల్ ఉద్యమంపై ఎటువంటి ప్రభావం ఉంటుంది. వీటితో పాటు మూడవ విషయం నేను చెప్పాలనుకున్నది, మావోయిస్టు పార్టీ ఒకరి తరువాత ఒకరిని నాయకులను ఎందుకు కోల్పోతున్నది ఈ నష్టాలకు మావోయిస్టు పార్టీ స్వీయాత్మక లోపాలా లేదా భౌతిక పరిస్థితులలో వచ్చి న మార్పులా

మల్లోజుల కోటేశ్వర్‌రావు గురించిన వ్యక్తిగత వివరాలు ఇప్పటికే చాలా వరకు మీడియాలో వచ్చాయి. ఆ వివరాల్లోకి వెళ్ళను. 1980లో పీపుల్స్‌వార్ పార్టీ ఆంధ్రవూపదేశ్ రాష్ట్ర కమిటీ కార్యదర్శిగా కోటేశ్వరరావు ఎన్నికయ్యాడు. 1985వరకు కార్యదర్శిగా ఉన్నాడు. 1985లో పార్టీ అంతర్గత సంక్షోభం కారణంగా కోటేశ్వర్‌రావును దండకారణ్యానికి బదిలీ చేయడం జరిగింది. 1987లో జరిగిన దండకారణ్య కాన్ఫన్స్‌లో కోటేశ్వర్‌రావును దండకారణ్య కమిటీకి ఎన్నుకున్నారు. ప్రారంభంలో మహారాష్ట్రలోని గడ్చిరోలిలో ప్రధానంగా పనిచేశాడు. 1991లో ఏర్పడిన తాత్కాలిక కేంద్ర కమిటీలోకి కోటేశ్వర్‌రావును కూడా ఎన్నుకున్నారు. తరువాత ఇప్పటి ఏవోబీ బాధ్యునిగా కొంత కాలం పనిచేశాడు. తరువాత కోటేశ్వర్‌రావు ఉత్తర భారతదేశానికి బదిలీ అయ్యారు. ప్రధానంగా పశ్చిమ బెంగాల్‌పైనే కేంద్రీకరించినా ఉత్తర భారతదేశంలోని ఇతర విప్లవ సంస్థలను పీపుల్స్‌వార్ పార్టీలోకి తీసుకురావడానికి చాలా కృషి చేశా డు.

1995లో హర్యానా, పశ్చిమ బెంగాల్‌కు చెందిన విప్లవ సంస్థలను పీపుల్స్‌వార్ పార్టీలోకి తీసుకువచ్చాడు. ఇందులో మొత్తం పార్టీ పాత్ర ఉన్నా కిషన్‌జీది ప్రత్యేక పాత్ర. మావోయిస్టు కమ్యూనిస్టు సెంటర్‌తో ఎప్పడి నుంచో జరుగుతున్న ఐక్యత చర్చలు 1995 వరకు పూర్తిగా విఫలం అయ్యాయి. ఇక ఎంసీసీతో ఐక్యత సాధ్యం కాదనే అనుకున్నారు చాలా మంది. ఈ నేపథ్యంలోనే 1998లో పార్టీ యూనిటీ, పీపుల్స్‌వార్‌ల విలీనం జరిగింది. బీహార్‌లో ప్రధానంగా పనిచేస్తున్న విప్లవ సంస్థ అయిన ‘పార్టీ యూనిటీ’ ‘పీపుల్స్‌వార్ పార్టీ’లో విలీనంలో కూడా కోటేశ్వర్‌రావు ముఖ్యమైన భూమికను నిర్వహించా రు. ఈ రెండు పార్టీల విలీనం తరువాత బీహార్, జార్ఖండ్ రాష్ట్రాల్లో పీపుల్స్‌వార్ పార్టీకి ఎంసీసీకి మధ్యన సాయుధ ఘర్షణలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. 2001లో పీపుల్స్‌వార్ పార్టీ 9వ మహాసభ జరిగింది. ఈ మహాసభలో ఎంసీసీతో ఐక్యతకు కృషి చేయాలని తీర్మానం చేశారు. కానీ పార్టీలో చాలా మందికి అది ఇప్పుడిప్పుడే సాధ్యం అయ్యే విషయం కాదనిపించింది.

కానీ 9వ మహాసభ తరువాత జరిగిన మొదటి కేంద్ర కమిటీ సమావేశానికే ఎంసీసీతో ఐక్యతా చర్చలు కొనసాగించాలనే ప్రతిపాదన తీసుకుని వచ్చా డు. చాలా మందికి ఇది మంచిదనే అభివూపాయమున్నా.. ఇదెట్లా ఇప్పుడప్పుడే సాధ్యం అవుతుందనుకున్నారు. అనుమానంతోనే అయినా కేంద్ర కమిటీ కిషన్‌జీకి ఎంసీసీతో ఐక్యతా చర్చలు జరపడానికి అధికారం ఇచ్చింది. అంతే.. తరువాత రెండు పార్టీలు ఉన్నతాధికార డెలిగేషన్ టీములను ఎంచుకుని డాక్యుమెంట్లను పూర్తి చేసుకుని 2004 సెప్టెంబర్‌లో సీపీఐ (మావోయిస్టు) పార్టీగా ఆవిర్భవించాయి. ఈ విలీనంలో కూడా కోటేశ్వర్‌రావు ప్రధాన భూమిక నిర్వహించారు. ఉత్తర భారతంలో చెల్లాచెదురుగా ఉన్న విప్లవ సంస్థలను కూడగట్టడంలో చాలా కృషి చేశాడు. పశ్చిమ బెంగాల్ గురించి అయితే ప్రత్యేకంగానే చెప్పుకోవాలి. పశ్చిమ బెంగాల్‌లో సీపీఎంను ఎదుర్కొని ఏ విప్లవ పార్టీ లేదా సంస్థ కానీ ఉద్యమాలను నిర్మించలేకపోయాయి. చివరికి పాత ఎంసీసీ కూడా బీహార్‌లోనే బలమైన ఉద్యమాన్ని నిర్మించగలిగింది. కానీ బెంగాల్‌లో నామమావూతంగానే ఉండింది. ‘పశ్చిమ బెంగాల్‌లో బ్రహ్మాండమైన భూ సంస్కరణలు జరిగిపోయాయి.

ఇక అక్కడ ఎటువంటి విప్లవోద్యమాలకు ఆస్కారమే లేద’ంటూ ప్రచారం జరిగింది. అక్కడి ఉత్పత్తి విధానం సోషలిజం అన్నట్లుగానే భ్రమింపచేశారు. ఆ భ్రమలన్నింటిని బద్దలు కొట్టి అక్కడ ఉద్యమాన్ని నిర్మించాడు కోటేశ్వర్‌రావు. సింగూర్, నందిగ్రాం ఆందోళనల సందర్భంగా పశ్చిమ బెంగాల్‌లో ఎంత పేదరికం, వెనకబాటుతనం ఉన్నదనేది ప్రపంచానికి తెలిసింది కోటేశ్వర్‌రావు కృషి వల్లనే. బెంగాల్ నుంచి చారుమజుందార్ ఆంధ్రవూపదేశ్‌కు వస్తే ఆంధ్రవూపదేశ్ నుంచి కోటేశ్వర్‌రావు బెంగాల్‌కు వెళ్ళాడు.
రెండవ విషయం- కిషన్‌జీ చనిపోవడం వల్ల మావోయిస్టు పార్టీపైన ఎలాంటి ప్రభా వం ఉంటుందనేది. ఉద్యమం ఉధృతంగా సాగుతున్నప్పుడు ఒకరిద్దరు నాయకత్వ క్యాడర్‌చనిపోవడం వల్ల పెద్ద తేడా ఏమీ రాదు. కానీ ఉద్యమం ఎదురుగాలులను ఎదుర్కొంటున్నప్పుడు చాలా మంది నాయకత్వ క్యాడర్ చనిపోవడం ఉద్యమ రూపురేఖలనే మార్చివేయవచ్చు. కోటేశ్వర్‌రావు లాంటి నాయకుడు చనిపోవడం పెద్ద నష్టం.

అయితే ఇప్పటికే, చెరుకూరి రాజ్‌కుమార్ లాంటి నాయకులు చనిపోవడం, కోబాడ్ గాంధీ లాం టి మేధావి నాయకులు అరెస్టు కావడం తరువాత ఈ నష్టం బరువు దాని అసలు బరువు కంటే చాలా రెట్లు ఎక్కువగా ఉంటుంది. కిషన్‌జీ మరణం మొత్తం పార్టీకి పెద్ద నష్టం అయితే, బెంగాల్‌లోని పార్టీకి మరింత నష్టం.
ఒక కేంద్ర కమిటీస్థాయి నాయకునిగా ఎదగడానికి 20-25 ఏళ్లు కనీసంగా పడుతుంది. ఉద్యమంలో పాల్గొనే అందరూ కేంద్ర కమిటీ స్థాయికి చేరుకోరు. సరైన సైద్ధాంతిక అవగాహన ఉండి దాన్నిసరిగ్గా ఆచరణకు జోడిస్తూ, తిరిగి ఆచరణ నుంచి తన సైద్ధాంతిక అవగాహన పెంచుకుంటూ, ఉద్యమాలను సరిగ్గా గైడ్ చేయగలిగి, క్యాడర్ విశ్వాసం చూరగొన్న వారు మాత్రమే ‘సీసీఎం’లుగా ఎన్నిక కాగలుగుతా రు. ఒక కేంద్ర కమిటీ సభ్యుడు చనిపోతే వెంటనే ఇంకో సీసీఎం తయారు కాడు. అప్పటికీ ఆస్థాయి వాళ్లు ఇంకా ఉంటే చనిపోయిన వారి స్థానాన్ని భర్తీ చేయగలుగుతారు.

లేకపోతే ఉద్యమంలో ఖాళీలు పెరుగుతూ ఉంటాయి. 1970లో సీపీఐ(ఎంఎల్) 8వ మహాసభ తరువాత ఇలాగే నాయకత్వం చాలా మంది చనిపోవడం, అరెస్టు కావడం జరిగింది. 1972లో చారుమజుందార్ చనిపోయిన తరువాత ఉద్యమం చెల్లాచెదురు అయింది. 37సంవత్సరాల తరువాత మెజారిటీ ప్రధాన విప్లవ పార్టీలు కలిసి 2007లో సీపీఐ (మావోయిస్టు) పార్టీగా 9వ కాంగ్రెస్ జరుపుకున్నారు. అప్పటి నుంచి మళ్ళీ చాలా మంది కేంద్ర కమిటీ సభ్యులు అరెస్టు కావడం ఎన్‌కౌంటర్‌లో చనిపోవడం జరిగింది. నాయకత్వాన్ని కోల్పోయే క్రమం ఇలాగే కొనసాగితే చరిత్ర పునరావృతం అవుతుందేమో అనిపిస్తోంది.
మూడవ విషయం- మావోయిస్టు పార్టీ ఈ నష్టాలను ఎందుకు నివారించుకోలేకపోతోంది గతంలో జరిగిన నష్టాలను సమీక్షించడం లేదా సమీక్షించినా సరిగ్గా సమీక్షించడం లేదా సరిఅయిన పాఠాలు తీసుకోవడం లేదా కాని అలా అనిపించడం లేదు. సమీక్షలు జరుగుతాయి. గుణపాఠాలు తీస్తారు. అయితే తీసిన పాఠాలు అమలు కావు. జరిగిన తప్పులే తిరిగి తిరిగి జరుగుతాయి. ఎన్నిసార్లు సమీక్షించినా అవే పాఠాలు వస్తాయి. అవే సమీక్షలు.

అందుకే మావోయిస్టు పార్టీకి నష్టాలు కష్టాలు భవిష్యత్‌లో కడతేరేలా కనిపించడం లేదు. ప్రయత్నాలు చేసినా నష్టాలు ఆగడం లేదు అంటే భౌతిక పరిస్థితుల్లో ఏమైనా మార్పులు వచ్చాయా పార్టీ వ్యూహం ఎత్తుగడలలో ఏమైనా లోపాలు ఉన్నాయా ఆ విషయాలను కూడా సమీక్షించుకోవాల్సి ఉంటుంది. ఆత్మ విమర్శ చేసుకోవాల్సి ఉంటుంది. సాధారణంగా ఇటువంటి పరిస్థితుల్లో ఏ విప్లవ పార్టీలో అయినా అతివాద, మిత వాద పోకడలు బయలు దేరతాయి. సరిగ్గా అన్నింటిని సమీక్షించుకుంటే సరియైన ఎత్తుగడలను రూపొందించుకోగలుగుతారు. ఒకసారి రాజశేఖర్‌డ్డి మరోసారి మమతా బెనర్జీ మావోయిస్టు పార్టీ పట్ల సానుభూతి వ్యక్తం చేసి ఎన్నికలలో గెలిచారు. ఎన్నికలలో గెలవడానికి మావోయిస్టు కార్డును ఉపయోగించుకున్నారు. దీనికంటే మావోయిస్టు పార్టీనే ఎన్నికల్లో పాల్గొని తాము చెప్పుకుంటున్న ఉద్యమానికి ఉపయోగించుకోవచ్చుకదా అనిపిస్తోంది. 1969లో కూడా ప్రజా సంఘాల నిర్మాణమే చేయవద్దు అన్నా రు. కానీ 1974 ఆత్మవిమర్శ రిపోర్టు తరువాత అటువంటి తప్పులన్నీ సవరించుకుని ఉద్యమాన్ని తిరిగి ఉవ్వెత్తున నిర్మించడం జరిగింది. ఇప్పుడు అటువంటి ఆత్మవిమర్శ రిపోర్టు అవసరం ఉందేమో!

-లంకా పాపిరెడ్డి
http://www.namasthetelangaana.com/News/Article.asp?category=1&subCategory=7&ContentId=48279

No comments:

Post a Comment