మూగబోయిన నక్సల్స్ 'అధికార' స్వరం
ఆదిలాబాద్ అడవుల్లో ఎన్‌కౌంటర్
మావోయిస్టు పార్టీకి ఎదురుదెబ్బ
ఆజాద్‌తో పాటు మరో నక్సల్ మృతి
మహారాష్ట్ర నుంచి పట్టుకొచ్చి కాల్చి చంపారనే అనుమానం
అంత ఖర్మ పట్టలేదనన్న ఆదిలాబాద్ ఎస్పీ
నేడు మంచిర్యాలలో పోస్టుమార్టం
న్యూస్ నెట్‌వర్క్ ఛత్తీస్‌గఢ్‌లో సీఆర్పీఎఫ్ జవాన్లను చావుదెబ్బ తీస్తున్న మావోయిస్టులకు... ఆంధ్ర ప్రదేశ్‌లో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. నక్సలైట్ల 'అధికార స్వరం' మూగబోయింది. 'పాలక వర్గం'పై ప్రకటనల రూపంలో తూటాలా పేలే అక్షరం... అడవిలో నిర్జీవంగా కనిపించింది. మూడు దశాబ్దాల అజ్ఞాతం భౌతిక కాయం రూపంలో బట్టబయలైంది.
మావోయిస్టు సిద్ధాంతకర్త, అనేక సంచలనాత్మక దాడుల వ్యూహకర్త, సెంట్రల్ కమిటీలో ముఖ్యనేత, నక్సల్స్ అధికార ప్రతినిధి చెరుకూరి రాజ్‌కుమార్ అలియాస్ ఆజాద్ (53) ఎదురు కాల్పుల్లో మరణించారు.
కృష్ణా తీరంతో జన్మబంధం... రాజధాని హైదరాబాద్‌తో జీవన బంధం... ఓరుగల్లు, విశాఖలతో విద్యా-ఉద్యమ బంధం... అంతిమంగా అడవితో విడదీయరాని సంబంధం ఉన్న ఆజాద్... అదే అడవిలో, గోదావరి సమీపాన అంతమయ్యారు. ఇదే ఎన్‌కౌంటర్‌లో మరో గుర్తు తెలియని మావోయిస్టు కూడా మరణించారు.
దళపతి గణపతి తర్వాత... మావోయిస్టు పార్టీలో అగ్రస్థానం ఆజాద్‌దే. ఆయన మరణం పోలీసులకు ఘన విజయం! మావోయిస్టులకు తీరని నష్టం! పోలీసులు ప్రకటించిన ప్రకారం... ఆదిలాబాద్ జిల్లా వాంకిడి మండలం జోగాపూర్ అడవుల్లోని వెలిగి గుట్టపై జరిగిన ఎన్‌కౌంటర్ కథనమిది...
తెలంగాణలో ఉప ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో వాంకిడి, సిర్పూర్, కాగజ్‌నగర్ మండలాల్లో మావోయిస్టుల కదలికలు ముమ్మరమైనట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు ప్రత్యేక బలగాలతో గాలింపులు ప్రారంభించారు. గురువారం రాత్రి 10.30 గంటల సమయంలో వెలిగి గుట్టపై నక్సల్స్ కదిలికలను గుర్తించారు. లొంగి పోవాల్సిందిగా కోరారు.
ఇంకా చెప్పాలంటే... బతిమలాడారు. కానీ... ఎప్పట్లాగానే అటువైపు నుంచి కాల్పులు ప్రారంభమయ్యాయి. పోలీసులు కూడా తప్పనిసరి పరిస్థితుల్లో ఎదురు కాల్పులకు దిగారు. రాత్రి 10.30లకు మొదలైన హోరాహోరీ పోరు... అర్ధరాత్రి దాటాక రెండు గంటలవరకు జరిగింది. రెండు వందలకు పైగా తూటాలు పేలాయి.
ఆ తర్వాత... అంతా నిశ్శబ్దం. పోలీసులు సంఘటన స్థలంలో పరిశీలించగా... రెండు మృతదేహాలు కనిపించాయి. ఒక మృతదేహం పక్కన ఏకే-47 రైఫిల్, మరో దాని సమీపంలో 9 ఎంఎం పిస్టల్! ఏకే-47 వద్ద ఉన్న మృతదేహం చెరుకూరి రాజ్‌కుమార్ అలియాస్ ఆజాద్‌దిగా గుర్తించారు.
ఎన్‌కౌంటర్‌లో మరణించిన మరో నక్సల్ ఆజాద్ కొరియర్ కావొచ్చని, అతను ఛత్తీస్‌గఢ్‌కు చెందిన సహదేవ్ అయి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఎదురు కాల్పుల్లో 20 మంది మావోయిస్టులు పాల్గొని ఉంటారని... ఇద్దరు మృతి చెందగా మిగిలిన వారు పారిపోయారని సంఘటన స్థలం వద్ద విలేఖరులతో మాట్లాడిన కాగజ్‌నగర్ డీఎస్పీ శశిధర్ రాజు తెలిపారు.
ఎస్పీ ప్రమోద్ కుమార్ మాత్రం ఎన్‌కౌంటర్‌లో 50 మందిదాకా మావోయిస్టులు పాల్గొన్నారని చెప్పారు. సంఘటన స్థలంలో పెద్దసంఖ్యలో పేలిన తూటాలు కనిపించాయి. చెట్లకు తూటాల గుర్తులు కనిపించాయి. హైకోర్టు ఆదేశాల మేరకు... ఆజాద్ మృతదేహానికి శనివారం ఉదయం మంచిర్యాలలో పోస్టుమార్టం నిర్వహించనున్నారు.
పట్టుకొచ్చి చంపారా
పోలీసులు చెబుతున్న ఆజాద్ ఎన్‌కౌంటర్ కథనం... బూటకమని, కట్టుకథ అని అని పౌరహక్కుల నేతలు చెబుతున్నారు. మావోయిస్టు పార్టీదీ అదే మాట! వీరు అందించిన సమాచారం ప్రకారం... ఆజాద్ త్వరలో దండకారణ్యంలో రాజకీయ శిక్షణ తరగతులు నిర్వహించాల్సి ఉంది. ఇందులో భాగంగా ఆయన మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఉన్న సీతాబర్డికి వెళ్లారు. సహదేవ్‌గా భావిస్తున్న ఆదివాసీ అక్కడ ఆజాద్‌ను కలిశారు.
పోలీసులు పకడ్బందీ ప్రణాళికతో, పక్కా సమాచారంతో ఆజాద్ ఆచూకీ కనిపెట్టారు. గురువారం ఉదయం 11 గంటలకు నాగ్‌పూర్‌లో ఆజాద్‌ను, ఆయన సహచరుడిని పట్టుకున్నారు. వీరిని మహారాష్ట్ర సరిహద్దులు దాటించి... ఆదిలాబాద్ జిల్లాలో మట్టుబెట్టారని మావోయిస్టు పార్టీ ఆరోపించింది. ఆజాద్‌ను ఎన్‌కౌంటర్‌లో చంపడం అంత సులువుకాదని, పట్టుకుని కాల్చి చంపారని పేర్కొంది.
ఐదు రాష్ట్రాల్లో అలర్ట్...
ఎన్‌కౌంటర్‌లో అగ్రనేతను పోగొట్టుకున్న మావోయిస్టులు ప్రతీకార దాడులకు తెగబడవచ్చని కేంద్ర నిఘా వర్గాలు రాష్ట్రాలను హెచ్చరించాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌తోపాటు మావోయిస్టు ప్రాబల్య రాష్ట్రాలైన ఒడిషా, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ పోలీసులు అప్రమత్తమయ్యారు.
కర్ణాటకలోని పశ్చిమ కనుమల జిల్లాల్లోనూ రెడ్ అలర్ట్ ప్రకటించినట్లు ఆ రాష్ట్ర హోం మంత్రి ఆచార్య తెలిపారు. ఇక... విశాఖ ఏజెన్సీలోనూ పోలీసులు రెడ్అలర్ట్ ప్రకటించారు. మావోయిస్టులు బలంగా ఉన్న ఆంధ్రా-ఒడిషా సరిహద్దు (ఏవోబీ)లో ప్రతీకార చర్యలకు దిగవచ్చని భావిస్తున్నారు. ఈనెల 28 నుంచి ఆగస్టు 3వరకు జరగనున్న అమరవీరుల వారోత్సవాల సందర్భంగా హింసకు పాల్పడవచ్చని చెబుతున్నారు.
అంత ఖర్మ పట్టలేదు ఎస్పీ
చెరుకూరి రాజ్‌కుమార్ అలియాస్ ఆజాద్ ఎదురుకాల్పుల్లోనే మరణించారని, ఇందులో బూటకమేమీ లేదని ఆదిలాబాద్ ఎస్పీ ప్రమోద్ కుమార్ స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన ఆదిలాబాద్‌లో విలేఖరులతో మాట్లాడారు.
ఆజాద్‌ను ఎక్కడి నుంచో పట్టుకొచ్చి ఇక్కడ కాల్చి చంపారన్న ఆరోపణల గురించి ప్రస్తావించగా... ఆదిలాబాద్ పోలీసులకు అంత ఖర్మ పట్టలేదు. గాలింపు జరుపుతున్న పోలీసులు లొంగిపొమ్మని బతిమలాడినా వినకుండా నక్సల్స్ అరుచుకుంటూ, మూకుమ్మడిగా కాల్పులకు దిగారు. ఈ ఎన్‌కౌంటర్‌లో సుమారు 50మంది మావోయిస్టులు పాల్గొని ఉంటారు. ఇద్దరు మరణించగా... మిగిలిన వాళ్లు పారిపోయారు. పోలీసుల్లో ఎవరికీ గాయాలు కాలేదు'' అని ఎస్పీ వివరించారు.
ఆదిలాబాద్‌లో భారీ విధ్వంసం సృష్టించేందుకు మావోయిస్టులు కుట్రపన్నారని, గత పది రోజులు మహారాష్ట్ర నుంచి సరిహద్దులోని ఆదిలాబాద్ జిల్లా గ్రామాల్లో సంచరిస్తూ వచ్చారని చెప్పారు. ఈ విషయం తెలియడంతో కూంబింగ్ పెంచామని గురువారం రాత్రి ఈ సంఘటన జరిగిందని ప్రమోద్‌కుమార్ వెల్లడించారు.
http://www.andhrajyothy.com/mainnewsshow.asp?qry=2010/jul/3/main/3main10&more=2010/jul/3/main/main&date=7/3/2010

No comments:
Post a Comment