Monday, 19 December 2011

లాల్‌గఢ్ టు జంగల్‌మహల్

ఆదివాసీల్లో పోరుమంట రగిల్చిన కిషన్‌జీ
సింగూరు, నందిగ్రామ్ భూపోరాటాలకు చోదకశక్తి
చివరకు జంగల్‌మహల్‌లోనే హతం

హైదరాబాద్, నవంబర్ 24  నక్సల్బరీ... దేశంలో విప్లవోద్యమాల గురించి తెలిసిన వారందరికీ ఈ పేరు సుపరిచితం. చారుమజుందార్ రగిల్చిన నక్సల్బరీ రైతాంగ సాయుధ పోరాటంతో స్ఫూర్తి పొంది 1974లోనే విప్లవ జీవితంలోకి వచ్చిన మల్లోజుల కోటేశ్వర్‌రావు... చారు మజుందార్ సొంత రాష్ట్రం పశ్చిమబెంగాల్ ఉద్యమ బాధ్యతలు చూసేవారు. నక్సల్బరీ వెలుగులో లాల్‌గఢ్ లాంటి ప్రజా పోరాటాన్ని ఆయన ముందుకు తీసుకొచ్చారు. సొంత భూమిని కాపాడుకునేందుకు సింగూరు, నందిగ్రామ్‌ల్లో పేదలు చేసిన పోరాటానికి చోదకశక్తిగా నిలిచారు.

జంగల్‌మహల్‌ను విముక్తి ప్రాంతంగా ప్రకటించేందుకు అవసపరమైన యుద్ధభూమికను సిద్ధం చేస్తున్న తరుణంలో కిషన్‌జీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఎన్‌కౌంటర్‌లో మరణించేవరకు ఆయన కేంద్రసర్కారుకు రెండో ప్రధాన శత్రువు. మావోయిస్టులు కిరాయిహంతకులు, అడవి మాఫియా అంటూ అక్టోబర్ 22న మమతాబెనర్జీ మావోయిస్టులపై మాటల యుద్ధం మొదలుపెట్టిన తర్వాతే కిషన్‌జీ ఎన్‌కౌంటర్ జరిగింది. 2003లో.. అంటే మావోయిస్టు పార్టీ అవిర్భావానికి ఏడాదికి ముందు మల్లోజుల బెంగాల్ పీపుల్స్‌వార్ పార్టీకి ఇన్‌చార్జిగా వెళ్లారు. ఆ తర్వాతే బెంగాల్ ఉద్యమం దేశంలో ప్రధానాంశంగా ముందుకొచ్చింది.

సంతాల్ ఆదివాసీల సమస్యలపై మొదలైన పోరాటం భూ సమస్యపై కేంద్రీకృతమైంది. మల్లోజుల బెంగాలీతో పాటు నాలుగు ఆదివాసీ భాషలను నేర్చుకున్నారు. పశ్చిమబెంగాల్ దక్షిణ ప్రాంతంలోని ఏడు జిల్లాల్లో ఆదివాసీ రైతాంగ పోరాటాలు వెల్లువెత్తాయి. అదే సమయంలో పట్టణాల్లో ఉండే విద్యార్థి, యువకులను ఆకర్షించేందుకు నిరుద్యోగం, ఉపాధికల్పన లాంటి అంశాలపై పోరాటం చేశారు. 2004లో ఎంసీసీ, పీపుల్స్‌వార్ విలీనంతో మావోయిస్టు పార్టీ ఆవిర్భావం తర్వాత కిషన్‌జీ నే తృత్వంలో ఉద్యమం కొత్త పంథా తొక్కింది. ఉద్యమాన్ని కోల్‌కతా లాంటి నగారాలకు విస్తరింపజేసేందుకు ప్రజాసంఘాలను ముందుకు తీసుకొచ్చారు.

పరిశ్రమల కోసం సీపీఎం సర్కారు చేపట్టిన భారీ భూసేకరణ.. ప్రజా పోరాటాలకు కారణమైంది. వీటిని మావోయిస్టు పార్టీ చక్కగా వినియోగించుకుంది. సింగూర్, నందిగ్రామ్ భూ పోరాటాల చోదకశక్తి మావోయిస్టు పార్టీయేనని నాటి ప్రభుత్వం పలుమార్లు ఆరోపించింది. ఇక నక్సల్బరీ, శ్రీకాకుళం, జగిత్యాల పోరాటాల తర్వాత మావోయిస్టు పార్టీకి ప్రపంచ వ్యాప్తంగా పేరుతెచ్చింది లాల్‌గఢ్. 2007 నుంచే లాల్‌గఢ్ జిల్లాలో పోలీసుల ఆకృత్యాలు, దాడులు, ఆదివాసీల హత్యలకు నిరసనగా ప్రజలు పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తున్నారు. ప్రజలను సమీకరించి ఒక వేదికపై పోరాడే దిశగా కిషన్‌జీ కృషిచేశారని పార్టీవర్గాలు చెబుతాయి. ప్రొటెస్ట్ ఎగైనెస్ట్ పోలీస్ అట్రాసిటీస్ (పీసీపీఏ) సంస్థ ఏర్పాటైన తర్వాత ఉద్యమం ఉవ్వెత్తున ముందుకొచ్చింది.

మేధావి వర్గాన్ని సైతం ఆకర్షించిన ఈ పోరాట నిర్మాణంలో కిషన్‌జీది కీలకపాత్ర అని మావోయిస్టు వర్గాలు చెబుతుంటాయి. ఓవైపు లాల్‌గఢ్‌లో ఉద్యమ మంటలను రాజేస్తూనే.. జంగల్‌మహల్‌ను గెరిల్లా జోన్‌గా, విముక్తి ప్రాంతంగా మార్చేందుకు మల్లోజుల ప్రయత్నాలు చేశారు. జంగల్‌మహల్‌లో మావోయిస్టులను ఎదుర్కొనేందుకు నాటి వామపక్ష ప్రభుత్వం పెద్ద ఎత్తున కేంద్ర పారామిలటరీ బలగాలను మోహరింపజేసింది. గత మూడు నెలలుగా మల్లోజుల జంగల్‌మహల్‌లోనే మకాం వేశారు. జంగల్‌మహల్‌ను గెరిల్లా విముక్తి ప్రాంతంగా ప్రకటిస్తామంటూ ఇంటర్వ్యూలో చెప్పారు. అనూహ్యంగా అదే జంగల్‌మహల్‌లో కిషన్‌జీ ఎన్‌కౌంటర్ జరిగింది!!
https://www.andhrajyothy.com/mainnewsshow.asp?qry=2011/nov/25/main/25main11&more=2011/nov/25/main/main&date=11/25/2011

No comments:

Post a Comment