మెరుపుదాడులు నిర్వహించడంలో దిట్టఅతడు... కీలకసమయాలలో కీలక పదవుల్లో నియమితులై తన వ్యూహాల ద్వారా అనేక సవాళ్ళను ఎదుర్కొంటూ పనిచేస్తున్న శాఖకు కీర్తిప్రతిష్టలు తీసుకువచ్చే అధికారిగా పేరొందారు. రహస్యసమాచార సేకరణ, కమాండో ఆపరేషన్‌లకు వ్యూహాన్ని రూపొందించడం, దానిని పక్కాగా అమలు పరచడం వంటి వాటిలో దేశంమొత్తంమీద పేరుగాం చిన అతికొద్దిమంది ఐపిఎస్ అధికారుల్లో ఆయనొకరు. ఏడు సంవత్సరాల క్రితం వీరప్పన్‌ను హతమార్చినా, ఏడు సంవత్సరాల తరువాత కిషన్‌జీని లేకుండా చేసినా దేశచరిత్రలో అతికీలకమైన ఆపరేషన్‌లుగా పేర్కొనే ఈ రెండింటికీ నాయకత్వం వహించిన వ్యక్తి ఆయనొక్కడే... అతడే ఐపిఎస్ అధికారి, సిఆర్‌పిఎఫ్ డిజి టి.కె.విజయ్ కుమార్.
పశ్చిమబెంగాల్, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలలో మావోయిస్ట్ దాడులు, ఘాతుకాల ద్వారా వందల సంఖ్యలో సహోద్యోగులను కోల్పోతూ తీవ్ర నిరాశా నిస్పృహలలో ఉన్న సమయంలో సిఆర్‌పిఎఫ్ డిజిపిగా విజయ్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. అప్పటి నుంచి మావోయిస్ట్ పార్టీని కోలుకోలేని రీతిలో దెబ్బతీసేందుకు పకడ్బందీ వ్యూహాన్ని రూపొందించి దానిని అమలుపరుస్తున్నారు. మావోయిస్టు అగ్రనేతల్లో ఒకరైన కిషన్‌జీ ఎన్‌కౌంటర్ ద్వారా సిఆర్‌పిఎఫ్ బలగాలకు గుండెలనిండా ఆత్మస్థైర్యాన్ని నింపిన వ్యక్తిగా దేశంమొత్తం పోలీసు విభాగాల ప్రశంసలందుకుంటున్నారు. విజయ్ కుమార్ 1975వ బ్యాచ్ ఐపిఎస్ అధికారిగా తమిళనాడు రాష్ట్ర కేడర్ అధికారిగా పోలీసుశాఖలో ప్రవేశించారు.
ఆదినుంచీ చురుకైన అధికారిగా పేరొందిన ఆయనను దేశంలో అతికీలకమైన వ్యక్తులకు భద్రత కల్పించే స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్‌పిజి)లో ఎస్‌పిగా నియమితులై రాజీవ్‌గాంధీ వ్యక్తిగత భద్రతా విభాగంలో పనిచేశారు. ముక్కుసూటి మనస్తత్వం, నిజాయితీగా పనిచేయడంతో పాటు ఎలాంటి వివాదాల జోలికీ వెళ్లకుండా ప్రశాంతంగా తన విధులు తాను నిర్వర్తించే అధికారిగా పేరుతెచ్చుకు న్నారు. సర్వీసులో చేరినప్పటి నుంచీ సంచలనాత్మక అధి కారిగా కూడా ప్రఖ్యాతిగాంచారు. చెనై్నపోలీస్ కమిషనర్‌గా పనిచేస్తూ రౌడీలు, సంఘవిద్రోహక శక్తుల పాలిట సింహ స్వప్నంగా పనిచేశారు.
okkade23 నెలల పాటు చెనై్న నగర పోలీసు కమిషనర్‌గా పనిచేసిన ఆయన దాదాపు వెయ్యిమంది రౌడీలు, రౌడీషీటర్లను పిడి చట్టంద్వారా సంవత్సరంపాటు జైలులో ఉంచారు. అంతేకాకుండా చెనై్న నగరాన్ని తమ కార్యకలాపాల ద్వారా గడగడలాడిస్తున్న పేరుమోసిన రౌడీలు అయోధ్యకుప్పం వీరమణి, వి.ఫణ్ణియ్యర్ వంటివాళ్ళతో పాటు మావోయిస్ట్ కార్యకలాపాలకు పాల్పడుతున్న రాజారాం, శరవనణ్ వంటివారితో కలిపి మొత్తం 8 మందిని ఎన్‌కౌంటర్ చేయడం ద్వారా చెనై్న నగరంలో పూర్తిస్థాయిలో శాంతిభద్రతలు నెలకొల్పిన అధికారిగా ప్రజలచే కీర్తించ బడ్డారు. ఆ తర్వాత బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌లో ఆపరేషన్స్ విభాగం ఐజిగా పనిచేస్తూ జమ్మూ,కాశ్మీర్ లోయల్లో అనేక కీలక ఆపరేషన్‌లు నిర్వహించి అనేకమంది పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులను తుదముట్టించారు. అదే సమ యంలో తమిళనాడు, కర్నాటక రాష్ట్రాలకు తలనొప్పిగా తయారైనస్మగ్లర్ వీరప్పన్‌ను తుదముట్టించేందుకోసమే ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్పెషల్ టాస్క్‌ఫోర్స్ (ఎస్‌టిఎఫ్) కు పూర్తిస్థాయి అధిపతిగా నియమితులైయ్యారు.
ఆపరేషన్ కకూన్
ఎస్ట్‌టిఎఫ్ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించిన వెంటనే వీరప్పన్‌ను సజీవంగానో, లేక నిర్జీవంగానో పట్టుకునేందుకు ఆపరేషన్ కకూన్ పేరుతో వ్యూహం రూపొందించారు. తనతో పాటు బిఎస్‌ఎఫ్‌లో పనిచేసిన ఐపిఎస్ అధికారులు శాంతమనలైకన్నన్,కె.షణ్ముగవేలు, పి.చిన్నస్వామి.లతో పాటు తమిళనాడు పోలీసుశాఖకు చెందిన ఎన్.తిరునావు క్కరసులతో పాటు మరో ఆరుగురు డిఎస్‌పి స్థాయి అధికా రులు, 14 మంది సిఐలను ఎంపిక చేసుకుని కోర్‌టీమ్ నెల కొల్పారు.
అజ్ఞాత వ్యక్తులు, అజ్ఞాతంగా ఉంటూ కార్యకలా పాలు నిర్వహించే అండర్‌గ్రౌండ్ గ్రూపుల గురించి రహస్యసమాచారం సేకరించడంలో కాకలుతీరిన అధికారిగా పేరొందిన కన్నన్‌కు వీరప్పన్ కదలికలు తెలుసుకునే కీలకబాధ్యత అప్పగించారు. అప్పటి నుంచి 20 నెలల పాటు నిర్విరామంగా పనిచేస్తూ మూడోకంటికి తెలియకుండా వీరప్పన్ కార్యకలాపాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ వచ్చారు. చివరకు 2004 అక్టోబర్ 18వ తేదీ వీరప్పన్‌పై దాడిచేసి అతడితో పాటు మరో ముగ్గురు సహచరులను కాల్చిచంపారు. ఆ తరువాత హైదరాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పోలీస్ అకాడమీకి డైరక్టర్‌గా నియమితులైన విజయ్ కుమార్ దాదాపు సంవత్సరానికి పైగా ఇక్కడ పనిచేసి తిరిగి గత సంవత్సరం అక్టోబర్ ఒకటవ తేదీ సిఆర్‌పిఎఫ్ డైరక్టర్ జనరల్‌గా బాధ్యతలు స్వీకరించారు.
చిదంబరం పిలుపుమేరకే...
కాగా ఎన్‌పిఏలో ఉన్న విజయ్ కుమార్‌ను కేంద్ర హోంశాఖ మంత్రి చిదంబరమే ప్రత్యేకంగా పిలిపించుకుని చర్చలు జరిపి సిఆర్‌పిఎఫ్ చీఫ్‌గా నియమించినట్లు తెలు స్తోంది. ఒక పక్క పశ్చిమబంగా, జార్ఖాండ్‌లతో పాటు ఛత్తీస్ గఢ్, ఏఓబిలలో మావోయిస్ట్ కార్యకలాపాలు పెరిగిపోవడం వారి ఘాతుకాల్లో భారీ సంఖ్యలో సిఆర్‌పిఎఫ్ దళాలు మృత్యువాత పడుతూండటంతో సిఆర్‌పిఎఫ్ సారధ్య బాధ్యతలను విజయ్ కుమార్‌కు అప్పగించారు.
బాధ్యతలు స్వీకరించిన వెంటనే తన పాతటీమ్ అయిన కన్నన్, షణ్ముగవేలు, తిరువావుక్కరసులతో పాటు మరికొంత మందిని ప్రత్యేక కేటగిరీకింద సిఆర్‌పిఎఫ్‌లోకి డిప్యుటేషన్‌పై నియమించుకున్న విజయ్ కుమార్ వారి సహకారంతో ఆపరేషన్ చీతా చేపట్టారు. ముఖ్యంగా జంగల్ మహల్ అడవులను కేంద్రస్థావరంగా చేసుకుని మావోయిస్ట్ పార్టీ దేశవ్యాప్తంగా సాగిస్తున్న కార్యకలాపాలను అడ్డుకోవాలంటే దాని వ్యూహకర్తలు, అగ్రనేతలే లక్ష్యంగా సిఆర్‌పిఎఫ్ పనిచేసిందనే చెప్పుకోవాలి. ఈ లక్ష్యం కారణంగానే విజయ్ కుమార్ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి అంతకు ముందు మాదిరి కిందిస్థాయి కొరియర్‌లు, దళ సభ్యులను ఎన్‌కౌంటర్ పేరుతో కాల్చిచంపడం ఆగిపోయింది.
గాలింపులు కూంబింగ్‌లలో కిందిస్థాయి వ్యక్తులు ఎవరు పట్టుబడినా వారినుంచి కావలసిన సమాచారం రాబట్టుకు న్నాకా చట్టప్రకారం అరెస్ట్ చేసి జైలుకు పంపాలని విజయ్ కుమార్ ఆదేశాలు జారీ చేయడంతో పాటు వాటిని ఖచ్చితంగా అమలుపరిచే విదంగా ఆయా ప్రాంతాల పోలీసు అధికారులతో ముఖాముఖీ చర్చలు జరిపేవారు. ఈ విధంగా కూడా ఆయన అమాయకులు, మావోయిస్ట్ ప్రచారానికి ఆకర్షితులైన వారికి దగ్గర కాగలిగారు. దాంతో వారిలో చాలామంది జైళ్ళనుంచి బైటకు రాగానే ఏదో ఒక విధంగా విజయ్‌కుమార్‌కు దగ్గరై మావోయిస్ట్‌ల కదలికల గురించి సమాచారం ఇచ్చేందుకు సిద్దపడ్డారు. ఆ విధంగా సిఆర్‌పిఎఫ్ డిజిగా సొంత ఇన్ఫార్మర్ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు.
దాదాపు సంవత్సర కాలం అతి చాకచక్యంగా పనిచేస్తూ మావోయిస్ట్ అగ్రనేతల గురించి సమాచారం తెలుసుకుంటూ అవసరమైన సందర్భాలలో దాడులు నిర్వహిస్తూ వచ్చారు. గత మార్చి నెలలో లఖన్‌పూర్ అటవీ ప్రాంతంలో జరిగిన భారీ ఎదురుకాల్పుల ఘటన కూడా విజయ్ కుమార్ వ్యూహంలో భాగంగా జరిగిందే. ఆ ఎన్‌కౌంటర్‌లో మావో యిస్ట్ పశ్చిమబంగా రాష్ట్ర కార్యదర్శి సఫాదర్ మహతాతో పాటు మరో నలుగురు హతమవగా కిషన్ జీ తీవ్రంగా గాయపడి త్రుటిలో తప్పించుకున్నారు. అప్పటి నుంచీ కిషన్ జీ కదలికలు తెలుసుకునేందుకు తీవ్రంగా శ్రమించిన విజయ్ కుమార్ ఎట్టకేలకు రెండువారాల క్రితం పక్కా సమాచారం అందుకున్నారు. దాంతో కోల్‌కతాలో మకాం వేసి స్వయంగా ఆపరేషన్ పర్యవేక్షించారు.
కలసి వచ్చిన అక్టోబర్...
కాగా విజయ్ కుమార్ కెరియర్‌లో అక్టోబర్ నెలతో ఏదో బంధం ఏర్పడింది. ఆయన సర్వీసులో చేరినప్పటి నుంచీ జరిగిన ప్రతిష్టాత్మకమైన ఆపరేషన్‌లన్నీ అక్టోబర్ నెలలోనే జరిగాయి. బిఎస్‌ఎఫ్ ఆపరేషన్స్ ఐజిగా ఎనిమిది కీలక ఎన్‌కౌంటర్‌లలో పాల్గొంటే వాటిలో ఆరు అక్టోబర్ నెలలోనే జరిగాయి. అదే విధంగా చెనై్న నగర పోలీసు కమిషనర్‌గా పనిచేసిన ఇరవై మూడు నెలల్లో కీలక ఘట్టాలన్నీ అక్టోబర్ నెలలోనే జరిగాయి. తాజాగా సిఆర్‌పిఎఫ్ డిజిగా గత సంవత్సరం అక్టోబర్ నెలలో నియమితులైన ఆయన కిషన్ జీ కోసం ఆపరేషన్ చీతాను క్షేత్రస్థాయిలో అమలు పరచడం ప్రారంభించింది గతనెల మూడవ వారం నుంచే....
బూటకంకాదు...పైచేయి మాదే అయింది...
కాగా కిషన్ జీ ఎన్‌కౌంటర్ బూటకం ఎంతమాత్రం కాదని విజయ్ కుమార్ సూర్యప్రతినిధితో స్పష్టం చేశారు. దట్టమైన అడవిలో పరస్పర వ్యతిరేక లక్ష్యాలున్న సాయుధ బృందాలు ఎదురైతే ఎవరు ముందుగా ఆయుధం వాడతారో అక్కడ జరిగే పోరులో వారిదే పైచేయి అవుతుంది...ఇది అందరికీ తెలిసిన యుద్దరీతి...జంగల్ మహల్ అడవుల్లోనూ అదే జరిగింది అన్నారు. కిషన్‌జీ కదలికలు తెలుసుకుంటూ ఒక పద్దతి ప్రకారం కిషన్ జీ వ్యక్తిగత రక్షణ కవచాన్ని ఛేదించుకుంటూ ఆయన మకాం వేసిన ప్రాంతానికి చాలా సమీపంలోకి మా బలగాలు వెళ్ళిపోయాయి...
చివరి నిమిషంలో వారంతా మా వాళ్ళని చూసినా అప్పటికే ఆలస్యం అయిపోయింది...మా కమెండోలు సురక్షిత ప్రదేశంలో ఉన్నారు..వారు రక్షణకవచం ఏర్పాటు చేసుకోవడానికి కూడా వీలులేకుండా ఐపోయింది దాంతో పరస్పర కాల్పుల్లో మా వాళ్ళు ముగ్గురికి గాయాలైనా..అవతలి వ్యక్తులు ప్రాణాలు కోల్పోవలసి వచ్చింది అన్నారు. కమెండోలకు గాయాలు తగలడం వల్ల జరిగిన కొద్ది క్షణాల ఆలస్యం కారణంగానే కిషన్‌జీ వెంట ఉన్నవారు తప్పించుకోగలిగారు అని ఆయన వివరించారు. మొత్తం మీద ఆపరేషన్ చీతాను విజయ వంతంగా నిర్వహించిన విజయ్ కుమార్ కేంద్ర హోంశాఖ మంత్రి చిదంబరం ప్రత్యేకంగా అభినంధించినట్లు తెలిసింది. గురువారం నాడు సుమారు 14 నిమిషాల పాటు చిదంబరం విజయ్‌కుమార్‌తో ఫోన్‌లో మాట్లాడి ఆపరేషన్ గురించి వివరంగా తెలుసుకున్నారు. దీంతో పాటు దేశ వ్యాప్తంగా పలురాష్ట్రాల డిజిపిలు, ప్రత్యేక దళాల అధిపతులనుంచి ప్రసంశల జల్లు కురుస్తోంది.
http://www.suryaa.com/main/showNews.asp?cat=1&subCat=2&ContentId=58525
No comments:
Post a Comment