నేను రెండోసారి కడుపుతో ఉన్నప్పుడు డాక్టర్ నా పెద్దబిడ్డను ‘నీకు చెల్లె కావాల్నా, తమ్ముడు కావాల్నా’ అనడిగింది. దానికి అది ‘అన్న కావా లి’ అన్నది. కానీ మాకెప్పుడూ అట్లనిపియ్యలే. మేం ముగ్గురం ఆడపిల్లలమే. మాకు అన్నో, తమ్ముడో కావాల్ననిపియ్యలే. స్వంత అన్నదమ్ములు లేనందుకు పార్టీ మాకు ‘కోటి’ ‘అన్న’లనిచ్చింది. కరుణక్క జోక్ కూడా చేస్తుండే.. అందర్ని అన్నలంటే.. ఎట్లనే..అని. అ-అంటే అమ్మ, న-అంటే నాన్న, కల్సి అన్న అయిందని ఏదో సినిమాల అన్నట్టు, ఆయన మాకు అన్న. ఆదీవాసీలకు దేవుడన్న.
కోట్ల ప్రజలు ఆయనను మా స్వంత అన్న అనుకున్నరు. అందుకే ఆయన ‘కొటన్న’ అయిండు.73-75లల్ల పరిచయం ఆయనది. అంటే నాకప్పటికి ఏడెండ్లు. ఇల్లంటే అమ్మ, బాపు, చెల్లెండ్లు, ఉంటే..అమ్మమ్మ తాతయ్య, నాయనమ్మ మాత్రమే ఉం టరని మాకు తెల్వది. ఇంటినిండా అన్నలే. ‘చిన్నాల’న్న దగ్గర్నుంచి.. ఎంత మంది అన్నలు. అందరూ మా కుటుంబ సభ్యులే. పొద్దున లేస్తే ఓ అన్న ‘సృజన’ పని చేసుకుంట, ఇంట్ల అమ్మతోటి పని చేసుకుంట, బాపుతోటి మాట్లాడుకుంటనో ఎం తో మంది. ఈయనెవరు అంటే కోటన్న, బాలన్న, మహేశన్న, అంజన్న, లింగన్న...
మాకెందుకో వరసలు నేర్పలే అమ్మవాళ్లు. అందర్నీ పేర్లతోటే.. కానీ వీళ్లను మాత్రం అన్న అంటుంటిమి. వాళ్లు పార్టీ వల్ల పరిచయమయిన్రు.
కానీ ఒక్క పార్టీ పరమైన పనులకే పరిమితం కాలే.. మా కుటుంబల సభ్యులైన్రు. మా రక్తంల రక్తం అయిన్రు. మాకు కాళ్లూ, చేతులయిన్రు. మాకు వెన్ను దన్నయిన్రు. మాకు బలం ధైర్యం అన్నీ వాళ్లే. బాపు ఏండ్లకేండ్లు జైళ్ల ఉంటే.. ముగ్గురు ఆడపిల్లల్తోటి అమ్మెట్ల బతికిందంటే.. అన్నలే. అంటే వాళ్లు భౌతికంగా మాతోటి ఉండి మమ్మల్ని సాధివూనని కాదు. మాకు ఊపిరయిన్రు. బాపెప్పుడంటుంటరు.. ‘డాక్టర్ గారు ఇచ్చిన బతుకిది’ అని. అన్నట్టు మాకు అన్నలే బతుకునిచ్చిన్రు. మొన్న దీప ఏడుస్తుంటే.. అనిపించింది. ఆమె కోటన్నకు స్వంత అన్న బిడ్డ. ఆమె అసలు ఆయనను చూడనేలేదు. నేనెవరు, ఆయనకు నాకు ఎక్కడిదీ అనుబంధం. నేనాయనతో కలిసి తిరిగిన. నాకాయన పెద్దన్న. ఆయనతోటి ఎన్నో అనుభవాలు. జ్ఞాపకాలు.
ఎంత గమ్మత్తంటే... ఆయనతోటి 84-86 లల్ల కల్సున్నప్పుడు ఆయనంత గొప్పోడని తెల్వ దు. నిజానికి ఏ అన్న కూడా మాదగ్గర మామూలుగానే ఉంటుండే. బైట ఆయన గురించి వింటే.. అమ్మో ఇంత పెద్దోడు, మేధావి అనుకునేటోళ్లం. ఆ కాలంలో మేం ఒక మామయ్యింట్ల కల్సుకునేటోళ్లం. ‘ఈ ఇల్లు మనందరికి అడ్డా అయింది. కానీ మన వల్ల అక్కకు పని పెరుగొద్దు. నువ్వేమన్న సాయం జేస్తున్నవా లేదా’ అని మందలించేటోడు. మనమెక్కడుంటే.. అక్కడికొచ్చి మోకాళ్లమీద కూచొని ‘ఊ చెప్పు సంగతులు..జెప్పు’ అనే ఆయన రూపం కళ్లముందు నుంచి పోతలేదు. నేను సినిమాలు, సీరియల్స్ చూసి కూడా ఏడుస్త. అంకురం సినిమాల లాయర్ అడుగుతడు ‘నువు సినిమాలు చూసి ఏడుస్తవా అయితే నీలో మానవత్వం ఉన్నట్లు’ అని. కానీ నాకు కోటన్న చచ్చిపోతే ఏడుపు రాలే. ఎందుకని ఇన్ని రోజులు ఆలోచించిన. ఎందుకంటే..ఆయన చచ్చిపోలేదు కదా.
అని తట్టింది. కోటన్న కు చావుంటదా బాలగోపాల్‌సార్ చనిపోయినప్పుడు అట్లనే ఏడుపు రాలే. సారూ నీకు కూడా చావుంటదా
చేతి మీద డాంబర్ పడిపుండ్లయితే కూడాఊళ్లన్నీ తిరిగినవు కదా,
కడుపుల పుండునిచూసుకోలేక పోయినవా
కళ్లకు గంతలు కడితే కూడారూటంత చెప్పినవ్ కదా!
నీ అనారోగ్యాన్ని చూసుకోలేదాఅడవిని ఆక్రమిస్తున్న
అధికారుల గురించిఆదివాసీలను హెచ్చరించినవ్
నిన్ను ఆక్రమిస్తున్న రోగాన్ని తెల్సుకోలేక పోయినవా..!
అని ఆయన మీద కోపమొచ్చింది.ఎంత మంది.. భౌతికంగా తెల్సిన వాళ్లు, భావాల్తో తెల్సిన వాళ్లు.. వాళ్లెవరూ చచ్చిపోయినట్లు నాకనిపించదు. చిన్నాలన్న ఇంకా ఉన్నడు. పుట్టిన ఊళ్ల, మట్టిల నిక్షిప్తమై ఉన్నడు. అంజన్న , భాగ్యక్క, రామకృష్ణ, నాగేశ్వరరావు, ఎమ్మెస్, వీరన్న....
మరణమంటే ఏంది ఆయన శరీరం ఉండదు. అంతేకదా. అన్నీ వుంటయ్. నదులు, జీవులు, ప్రకృతి, భూమ్యాకాశాలు.. అన్నీ ఉంటే వాళ్లెక్కడికిపోతరు వాళ్లట్లనే ఉంటరు. వాళ్ల భావాలు, ఆలోచనలు, అభివూపాయాలు అన్నీ ఉంటయ్. 36 ఏండ్లనుంచి ఆయన వాళ్లమ్మకు కనపడలే. అంటే ఉన్నట్టా, లేనట్టా మాక్కూ డా ఇరవై ఏండ్లనుంచి కనపడలే.. ఉన్నట్టా లేనట్టా నాకొకటే అనిపిస్తున్నది... ఆయన బతికుంటే మనమిట్లా మాట్లాడుకునే అవకాశం ఉండేది కాదు, అంతే. ఇప్పుడాయన గురించి మాట్లాడుకునే అవకాశం వచ్చింది.
ఆయన ఫోటోలు ఫేస్‌బుక్‌ల పెట్టొచ్చు. ఆయన పాత ఫోటోలు, ఆయన రాసిన ఉత్తరాలు తీసి చూసుకోవచ్చు. మనం చేసే ఏ చిన్న పొరపాటో ఆయనకు ప్రమాదం అయితదేమో అన్న భయం లేదిప్పుడు. ఆయన గురించి రహస్యంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఆయన కోటన్న. మా అన్న అని గట్టిగ పదిమందిల మాట్లాడుకోవచ్చు. మేం ఓ బస్తీల ఓ రూమ్‌ల ఉండి పుస్తకాలు చదువుకున్నం. ‘ఉదయగీతిక’ అనువాదం చేయించిండు నాతోటి. పాటలు పాడుకున్నం. బట్టలుతుక్కు న్నం. జావలాంటి ఉప్మా చేస్తే ‘గ్లాసుల్ల పోసియ్యరా’ అని అన్న నవ్విండని నేను మురిపెంగ చెప్పుకోవచ్చు. అప్పుడు బాపు జైళ్లుండే. ‘తెలంగాణల బిడె్డైనా, కొడుకైనా ఒకటే. నువ్వింటికి పెద్దబిడ్డవు, అమ్మను నువ్వే చూసుకోవాలే’ అన్నడు. పెద్దోడివి నువ్వున్నంక నాకేంది అన్న నేను. దబ్బున దగ్గరికి తీసుకున్నడు. కళ్లు చెమ్మగిల్లినయ్ కావచ్చు.
నా కప్పుడు కనపడ్లే. అర్థం కాలే. కానీ ఆ స్పర్శ, ఆ ఆర్ద్రత ఇప్పటికీ అనుభూతిస్తునే ఉన్న. బస్తీల రూమ్ తీసుకోంగనే.. కుర్చీలు కొందామనుకుంటుంటే.. ‘వద్దు మనింట్ల (కుమార్‌పెల్లి) ఉన్నట్టు బల్ల కొందాం అదయితే ఎంతమందన్నా కూచోవచ్చు. మేమట్లనే కూచునేటోళ్లం’ అన్నడు. ఆయనకు దేశ మంతా మనిల్లే. ఇట్ల ఎన్నెన్నో యాదికొస్తున్నయ్. అవన్నీ.. ఇప్పుడు బైటికి తీసి దులిపి ప్రపంచానికి చూపించే అవకాశమొచ్చింది. కాళోజీ తాతయ్యను చూస్తున్నప్పుడల్లా నాకు కాళోజీ తెల్సని కాదు, నేను కాళోజీకి తెల్సు. సహజ అంటే.. గుర్తుపడతాడు అని గర్వంగ ఉండేది.అట్లనే ప్రహ్లాద్ నాకు తెల్సని కాదు, నేను ప్రహ్లాద్‌కు తెల్సు. ‘సాజి’ని అయనకు చెల్లెను. అమ్మా బాపును అక్క, సార్ అని పిల్చినా, వాళ్లాయనకు తల్లిదంవూడులు. మా ఇంటి పెద్ద కొడుకు. దేశానికి పెద్దన్న. కుమార్ పెల్లిల మా ఇల్లు ఎంత మంది అన్నలనిచ్చింది.
మాకు ఇప్పుడు ఒక్క కోటన్న గురించే కాదు, కోటి అన్నలను తల్సుకోవాలనిపిస్తున్నది. ఒక్కొక్కళ్లతో మా అనుబంధం, వాళ్ల ఆప్యాయత, అనురాగం. ఒక్క ప్రేమాప్యాయతలే కాదు, మంచీ చెడూ, మందలించుడు ,కోప్పడుడూ, బుద్ధి చెప్పుడు.. ఎన్నని.. స్వంత అన్న ఉన్నా ఇట్లుండునా...
‘అన్నా.. అంటే ఉన్నా..’ అనే అన్నపూంత మంది. కుమార్‌పెల్లిల మేం ఇంట్ల తలుపులు పెట్టుకొని ఉన్నా.. అన్నల కళ్లు మమ్మల్ని గమనిస్తున్నయని ధైర్యమే. మేం ప్రశాంతంగా నిద్ర పోయినమంటే.. ఎవరు నిద్ర లేకుండా మమ్మల్ని కాపాడిన్రో. మేం కాలేజీకి పోయొచ్చినమంటే..ఏ అన్నో నీడలాగ మా వెంటున్నాడు కనుకనే. మనం ప్రజల కోసం నిలబడితే.., ప్రజలే మనల్ని కాపాడుతరనేది ఒక్క అడవిల్నే కాదు, నగరంలో కూడా సాధ్యమే అని నిరూపించింది అన్నలే.
ఆయనను ఎప్పుడు ఎక్కడ ఎవరు కల్సినా మొదటి ప్రశ్న ‘అక్క పిల్లలు ఎట్లున్నరు’ అని అడిగేటోడట. అంత పెద్ద పార్టీ లీడర్, ఒక మామూలు తెలంగాణ మనిషిలాగా, ఒక కుటుంబం మంచి చెడ్డలు అర్సుకున్నడంటే.. అండ్ల మా గొప్పతనమేం లేదు. మేం చేసింది పైసంత. అన్నలు మాకిచ్చింది లెక్కలేనంత...కానీ ఇప్పుడు లెక్కలు తీయాల్సిందే. లెక్కకు లెక్కా తేల్చుకోవాల్సిందే. ప్రజలంతా కల్సి లెక్కలేసి అంతకంతా రుణం తీర్చుకోవాల్సిందే.. ప్రజలకోసం ప్రాణమిచ్చిన్రు వాళ్లు. ప్రాణం కన్నా గొప్పది విలువైంది ఏమన్న ఉంటదా అంత ప్రాణానికి మన మేం ఇద్దాం. ఆయన ప్రాణం తీసిన ఈ రాజ్యాన్ని ఏం చేద్దాం. లెక్క తేల్చుకోవద్దా వాళ్ల తలలకు వెలకట్టింది ఈ రాజ్యం. మనం వాళ్ల ప్రాణాలకు వెలకట్టి ఈ రాజ్యం తో వసూలు చేసుకోవద్దా ఇక్కడొక పోలీస్ పగో, పార్టీ కక్షో కాదు. ఈ రాజ్యం భయం కనపడుతున్నది. రాజ్యం కసితోని ఆయన శరీరాన్ని ఛిద్రం చేసింది కావ చ్చు, కానీ భయపడుతున్నది. ఒక్క కోటన్నను చంపి రాజ్యం ప్రశాంతంగా పడుకుంటదా ఇప్పటివరకట్ల జరిగిందా అయితే.. ఈనాడు ఓ కిషన్ జీ, ఆదిడ్డి, అంతకుముందు వెంపటాపు సత్యం, కైలాసంలను చంపి నిద్రపోతుండే కదా... ఇంకా ఇంకా ఎందుకు చంపుతున్నట్లు... మనిషిని చంపేస్తే విప్లవం ఆగిందా.. ఒక వీరుడు మరణిస్తే వేలకొలది ప్రభవింతురు. ఒక అన్న మరణిస్తే ‘కోటి’ అన్నలు ప్రభవింతురు.
-సహజ
http://www.namasthetelangaana.com/News/Article.asp?category=1&subCategory=7&ContentId=52213
No comments:
Post a Comment