మొదటి తరం స్వాతంత్య్ర సమర యోధులు ఈ దేశాన్ని, ప్రజల్ని, మేధస్సుతో ప్రేమించారు, రెండో తరం యోధులు మనసుతో ప్రేమించారు. మూడో తరంవారు ఆలోచనలతో పాటు అనుభవాలూ కలిగినవారు. అనుభవాలలో నలిగిపోయిన జీవితాలవి. చేదు అనుభవాలతో స్వతహాగా దోపిడీకి గురైన వర్గం ఇది. ఈ మూడో తరం పోరుదారిలోంచి పెకలించుకొచ్చిన ఓ అగ్ని పుష్పం కిషన్‌జీ.
నాకు మూడు తరాల స్వాతంత్య్ర సమరయోధుల్ని చూసే అవకాశం లభించింది. మొదటి తరం స్వాతంత్య్ర సమరయోధులు ఇతర దేశాల్లో వచ్చిన స్వాతంత్య్ర ఉద్యమాలతో స్ఫూర్తి పొందారు. అలాగే తమ దేశంలో కూడా అదే మాదిరి ప్రజాస్వామిక సమాజాలు, సోషలిస్టు వ్యవస్థలు రావాలని ఉద్యమించారు. మహాత్మా గాంధీ, జవహర్‌లాల్ నెహ్రూ, సుభాస్‌చంద్ర బోస్, డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్‌లు విదేశాల్లో చదువుకున్నారు. వీరందరూ బ్రిటిష్ ప్రజాస్వామ్యాన్ని కళ్లారా చూశారు.
అక్కడి విశ్వవిద్యాలయాల్లో ప్రపంచ గతిని అర్థం చేసుకున్నారు. తమకు పాఠాలు చెప్పిన ప్రొఫెసర్ల నుంచి వీళ్లంతా స్ఫూర్తి పొందిన వారే. ఒక్క కాంగ్రెస్‌లోనే కాదు, కమ్యూనిస్టు పార్టీకి చెందిన ఎస్.ఏ.డాంగే, భూపేష్ గుప్తా, జ్యోతిబసు, సోషలిస్టు పార్టీ వ్యవస్థాపకుడు లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ్ లాంటి ఎందరెందరో ఇతర దేశాల్లో సంభవించిన పరిణామాల నుంచి ఉత్తేజం పొందారు. పాశ్చాత్య విశ్వవిద్యాలయాలు ప్రేరేపించిన వాతావరణం వాళ్లందర్నీ స్వాతంత్రోద్యమకారులుగా మార్చింది.
వీళ్లంతా సంపన్న కుటుంబాల నుంచి వచ్చి చదువు ద్వారా చైతన్యవంతులై ఉద్యమంలో దూకారు. ఆ తరాన్ని నేను జైల్లో చూశాను. ప్రతివారూ నిష్ణాతులే. పరిపూర్ణ అధ్యయనపరులు. జ్ఞానాన్ని ఒంట బట్టించుకున్న వారు. దేశాన్ని మనసారా ప్రేమించిన వారు. ఈ మట్టికోసం తమ ప్రాణాలను త్యాగం చేయడం కోసం సిద్ధపడి స్వాతంత్య్ర సమరాంగణంలో దూకిన వారు ఈ మొదటితరం కోవకు చెందిన వారు. ఆ స్వాతంత్య్రయోధుల త్యాగశీలత, నిబద్ధత, వ్యక్తిగత జీవితం చూసి మేమెంతో ప్రేరణ పొందాం.
రెండో తరానికి చెందిన పోరాటయోధుల్ని చూసే అవకాశం మళ్లీ కలిగింది. ఈ రెండవ తరం వారు విశ్వవిద్యాలయాలకు వెళ్లలేదు. పెద్ద పెద్ద పెద్ద చదువులు చదవలేదు. దోపిడీ వ్యవస్థ, భూస్వామ్యం కింద నలిగిపోయి కష్టాలు అనుభవించారు. మొదటి వర్గం థీరియాటికల్ జ్ఞానంతో వచ్చింది. ఈ రెండో వర్గం ప్రాక్టికల్ జ్ఞానంతో వచ్చి ఉద్యమంగా ఉప్పొంగారు. ప్రాక్టికల్‌గా అనుభవించిన వారి అభ్యసనం చాలా లోతుగా ఉంటుంది. అనుభవాలు కూడా సమాజంలో గర్భితమై ఉంటాయి.
మొదటి తరం వ్యక్తులు ఈ దేశాన్ని, ప్రజల్ని, మేధస్సుతో ప్రేమిస్తే, రెండో తరం వ్యక్తులు మనసుతో ప్రేమించారు. ఈ రెండో తరగతి యోధలకు ప్రపంచ ప్రఖ్యాత కీర్తేమీ దక్కలేదు. అయినా ఈ రెండో తరం ఏనాడూ కీర్తి కోసం ప్రజల పక్షాన నిలబడలేదు. తమ కళ్లారా చూసిన జీవిత అనుభవాల నుంచి వాళ్ళు పోరు దారిలో కదలివచ్చారు. తరానికి దక్కకపోవచ్చును. కానీ ప్రజల మనుసులపైన ముద్రలు వేశారు. వీరి పేర్లు ఏ పుస్తకంలో కనబడవు. పార్లమెంటు, అసెంబ్లీలలో వీరి గురించి చర్చలు జరగవు. ప్రజల నాల్కలపై మాత్రం చిరస్థాయిగా నిలిచిపోయారు. ఆ పోరుదారిలో వారు నా భుజాలకు రాసిన రాపిడి ఇప్పటికీ స్మరణీయం.
మూడో తరంవారు ఆలోచనలతో పాటు అనుభవాలు కూడా కలిగినవారు. అనుభవాలలో నలిగిపోయిన జీవితాలవి. వీరికి చేదు అనుభవాలతో స్వతహాగా దోపిడీకి గురైన వర్గం ఇది. ఈ తెలంగాణ ప్రాంతంలో అన్యాయమంటే దాన్ని అనుభవించటం మాత్రమే కాదు. అన్యాయపు పాదాల కింద నలిగిపోయిన వారు శిరసెత్తి పోరాటంలో దూకారు. అలాంటి యోధులను ఎవరెన్ని ప్రలోభాలకు గురిచేసినా వారు ఏనాడూ వెనకడుగు వేయరు. వారి త్యాగాలను మననం చేసుకుంటూ చరిత్ర తనను తాను తడుముకుంటూ ముందుకు సాగుతుంది. మల్లోజుల కిషన్ జీ లాంటి వారు ఆ కోవకు చెందినవారుగా చెప్పాలి.
ఇటీవల ఎన్‌కౌంటర్‌లో కన్నుమూసిన కిషన్‌జీ జీవితాన్ని విశ్లేషించి చూస్తే అట్టడుగు వర్గాలకు, ఆదివాసీలకు ఆయనెంత ఆశాదీపమో అర్థమవుతుంది. ఈ మూడో వర్గం పోరుదారిలోంచి పెకలించుకొచ్చిన ఓ అగ్ని పుష్పం కిషన్‌జీ. ఉద్యమాలు ఇక పొద్దుపొడవవని, పోరాటాలు ఈ నేలపై ఇంకెప్పుడు జరగాలి అని సమాజమంతా సంశయగ్రస్తమైన దశలో మట్టికి మాటలు నేర్పి పోరు జెండాలు ఎగురవేయించిన వ్యక్తి మల్లోజుల కోటేశ్వరరావు. ఇది ఈ కాలంలో పోరాట రూపాలలో, పోరుదారుల్లో అపూర్వమైనదని ఉద్యమ అభిలాషులంతా వ్యాఖ్యానిస్తున్నారు.
ఈ అనుభవాలున్నవారు గత 30 ఏళ్ళ నుంచి భారత్‌లో అణగారిన జాతులను, ఆదివాసీలను కదిలించి కిషన్‌జీ తిరుగులేని నాయకుడయ్యారు. ఆయన కేవలం తెలంగాణకే క్యాడర్ నివ్వలేదు. మల్లోజుల కిషన్‌జీ భారతజాతికే పోరు స్ఫూర్తిని రగిల్చిన త్యాగశీలి. అది బీహార్ కావచ్చును. ఛత్తీస్‌గఢ్, గుజరాత్, బెంగాల్, మహారాష్ట్రలలో ప్రజల్ని ఆయన కదిలించి ఉండవచ్చును. కానీ ఆ వేర్లు మాత్రం తెలంగాణ మట్టి పెద్దపల్లి గడ్డ నుంచే వచ్చాయి. చదువుతో ప్రగతిశీలురైతే కొందరు అనుభవాలతో త్యాగమూర్తులవుతారు. కొందరు పుట్టుకతో విప్లవ వీరులౌతారు.
ఇప్పటికైనా కేంద్రప్రభుత్వం తెలంగాణ గడ్డ ఎంత సారవంతమైన పోరు భూమినో, త్యాగమూర్తులకు తెలంగాణ చిరునామా అని గుర్తించాలి. త్యాగమూర్తులకు పోరు గంధం పూయటం కాదు. ఆ గంధాన్ని నరనరాల్లోకి ఎక్కించిన కోటి పోరుతీగల వీణ తెలంగాణ. ఈ గడ్డలో పుట్టిన ప్రతి వారు మహనీయుల త్యాగాన్ని ఆదర్శంగా తీసుకొని అడుగులు వేస్తారు. తను నమ్ముకున్న సిద్ధాంతానికి జీవితాంతం కట్టుబడి ఎన్ని కష్టాలు వచ్చినా ఎదురు నిలిచి పోరాడేవాడే ఏ కాలంలోనైనా కిషన్‌జీ లాగా నిలబడతారు. అలా ప్రజాహిత రాజకీయాల కొనసాగింపు కోసం అలుపెరగని పోరాటం చేసిన, చేస్తున్న యోధులే పీడిత ప్రజలకు అండగా నిలుస్తారు. ఈ మూడు తరాల పోరు గర్జనల్లో తడిసిన మనిషిని నేను. ఎవరికీ లభించని అవకాశం 86 సంవత్సరాలు జీవించి ఉండటం వలన ఈ మూడు తరాలను చూసే అవకాశం నాకు దక్కింది. ఆ పోరు దారిలో నడిచే వారందరికీ, నడవబోయే వారందరికీ దండాలు.
- చుక్కా రామయ్య
శాసనమండలి సభ్యులు
https://www.andhrajyothy.com/EditorialShow.asp?qry=2011/dec/1/edit/1edit4&more=2011/dec/1/edit/editpagemain1&date=12/1/2011
No comments:
Post a Comment