Monday, 19 December 2011

జనం నేత కోటన్నకు కన్నీటి వీడ్కోలు

జనం నేత కోటన్నకు కన్నీటి వీడ్కోలు
- చివరి చూపుకు సవాలక్ష ఆంక్షలు.. అంతిమ యాత్రకు ఖాకీల అడ్డంకులు
- అయినా వేలాదిగా తరలివచ్చిన జనం.. నిర్బంధంపై ఈసడింపు
- కిషన్‌జీది బూటకపు ఎన్‌కౌంటరంటూ ప్రజాసంఘాల మండిపాటు
నమ్మిన విలువల కోసం విశ్వాసాల కోసం విప్లవజీవితాన్ని ఎంచుకున్న.. మూడున్నర దశాబ్దాలుగా ప్రజల కోసం అంకితమైన మావోయిస్టు అగ్రనేత మల్లోజుల కోటేశ్వరరావు అలియాస్ కిషన్‌జీ (58)కి ఆదివారం మధ్యాహ్నం ఆయన స్వగ్రామమైన కరీంనగర్ జిల్లా పెద్దపల్లిలో ప్రజలు అంతిమ వీడ్కోలు పలికారు. భారతదేశ విప్లవోద్యమంలో మరో నిబద్ధుడైన విప్లవకారుడికి ప్రజలు బరు హృదయాలతో నివాళులర్పించారు. అశేష అభిమానుల విప్లవ నినాదాల మధ్య ఘనంగా అంత్యక్షికియలు జరిగాయి. ఉద్యమకారుడికి పెద్దపల్లి పోరు నివాళి అర్పించగా, కొడుకు దారుణ గాయాలు చూసి తల్లి గుండె తల్లడిల్లింది. ఆ దృశ్యాలను చూసి చలించని హృదయం లేదు.

ప్రజా ఉద్యమకారులపై పాశవిక అణచివేతను పలు పార్టీల, సంఘాల నేతలు తీవ్రంగా ఖండించారు.
పశ్చిమబెంగాల్‌లోని జంగల్‌మహల్‌లో గురువారం ఎన్‌కౌంటర్‌లో చనిపోయినట్టు పోలీసులు ప్రకటించిన కిషన్‌జీ భౌతికకాయాన్ని శనివారం రాత్రి కోల్‌కతా నుంచి విమానంలో హైదరాబాద్ తీసుకొచ్చారు. అనంతరం పోలీసులు హైడ్రామా నడుమ ఎవరికీ కనిపించకుండా అర్ధరాత్రి దాటిన తర్వాత పెద్దపల్లికి తరలించారు. అప్పటికే కిషన్‌జీ మృతదేహం వస్తోందన్న వార్త పాకిపోయింది. అర్ధరాత్రి నుంచే ప్రజలు, విప్లవాభిమానులు, ప్రజాసంఘాలు, పౌరహక్కుల సంఘాల కార్యకర్తలు పెద్దపల్లికి తరలివచ్చి కిషన్‌జీకి నివాళులర్పించారు. విరసం నాయకులు వరవరరావు, చలసాని ప్రసాద్, కళ్యాణ్‌రావుతోపాటు విమలక్క, గద్దర్, గంటి ప్రసాదం, పద్మకుమారి, అల్లం నారాయణ, టీఆర్‌ఎస్ నాయకులు ఈటెల రాజేందర్, కొప్పుల ఈశ్వర్, నారదాసు లక్ష్మణరావు, కాంగ్రెస్ ఎంపీ వివేక్, వివిధ ప్రజా సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు. ప్రజల కోసం పోరాడిన, దోపిడీ అణచివేతలపై తిరగబడిన విప్లవకారుడిని ప్రభుత్వం ఘోరంగా చంపించడాన్ని పలువురు తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వాలు అమానుషంగా వ్యవహరిస్తున్నాయని వివిధ రాజకీయ పార్టీల, విప్లవ, ప్రజాసంఘాల నేతలు మండిపడ్డారు. కిషన్‌జీ మరణంపై న్యాయవిచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కేంద్ర హోంమంత్రి చిదంబరం, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ ఇందుకు బాధ్యత వహించాలని ప్రజాసంఘాల నేతలు అన్నారు.

ప్రధాని మన్మోహన్, యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీ కూడా ఈ కుట్రలో భాగమేనని విమర్శించారు. తమ పార్టీ అగ్రనేత అకాల మరణంపై తీవ్రంగా స్పందించిన సీపీఐ (మావోయిస్టు) నిరసన కార్యక్షికమాలకు, బంద్‌లకు పిలుపునిచ్చింది. కిషన్‌జీని ప్రాణాలతో పట్టుకొని చంపారని పార్టీ ఉత్తర తెలంగాణ కార్యదర్శి చంద్రన్న ఆరోపించారు. ప్రజా ఉద్యమాల్లో తెలంగాణ వారు ఎక్కడ కనిపించినా చంపుతున్నారని పేర్కొన్నారు. ఈ ఘటనకు నిరసనగా డిసెంబర్ 1, 2 తేదీల్లో 48 గంటలు తెలంగాణ బంద్ పాటించాలని కోరారు. మరోవైపు మావోయిస్టు కేంద్ర కమిటీ ఈనెల 29 నుంచి డిసెంబర్ 5 వరకు నిరసన దినాలుగా ప్రకటించింది. 4, 5 తేదీల్లో 48 గంటల భారత్ బంద్ నిర్వహించాలని కోరింది.

కిషన్‌జీది ముమ్మాటికీ బూటకపు ఎన్‌కౌంటరేనని విరసం నేత వరవరరావు మండిపడ్డారు. చిత్రహింసలు పెట్టినట్లు మృతదేహాన్ని చూస్తే అర్థమవుతుందని అన్నారు. గ్రీన్‌హంట్‌లో భాగంగానే జరిగిందని ఆరోపించారు. తెలంగాణ ఉద్యమానికి కిషన్‌జీని ఆదర్శంగా తీసుకుందామని గద్దర్ అన్నారు. నివాళిగా తెలంగాణ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసి, సాధించుకుందామని పిలుపునిచ్చారు. ై‘జెకిషన్‌జీ’ ‘జైతెలంగాణ’ అనే నినాదంతో సాగుదామన్నారు. ఎన్టీఆర్ నుంచి మమత వరకు ఒకే రకంగా వ్యవహరిస్తున్నారని టీఆర్‌ఎస్‌ఎల్పీ నేత ఈటెల రాజేందర్ ఆవేదన వ్యక్తం చేశారు. నక్సలైట్లు ఏ ఎజెండా కోసం కొట్లాడుతున్నారో దాని అమలుకోసం ఆలోచించకుండా అది తీర్చకుండా.. ప్రశ్నించేవారిని చంపడం దారుణమన్నారు. కిషన్‌జీది హత్యేనని మందకృష్ణ మాదిగ అన్నారు. ఇదివరలో ఇక్కడ చంద్రబాబు, వైఎస్ హయాంలో ఎంతోమంది నాయకులను చంపారని తప్పుబట్టారు. కిషన్‌జీ మానవతావాది అని అన్నారు. కిషన్‌జీ ఆదివాసీ దేవుడని టీడీపీ ఎమ్మెల్యే సీతక్క అన్నారు. కిషన్‌జీ ఎన్‌కౌంటర్‌పై కోర్టుకు వెళ్తామని పౌరహక్కుల సంఘం నేత చంద్రశేఖర్ తెలిపారు. ఈ ఎన్‌కౌంటర్‌ను సుమోటోగా స్వీకరించాలని ‘నమస్తే తెలంగాణ’ ఎడిటర్ అల్లం నారాయణ కోరారు. గతంలో మావోయిస్టు అగ్రనేత ఆజాద్ ఎన్‌కౌంటర్ కేసు మాదిరే సుమోటోగా స్వీకరించి, అందులో పాల్గొన్న వారిపై హత్యా నేరం కేసులు నమోదు చేయాలని కోరారు.
http://www.namasthetelangaana.com/News/Article.asp?category=1&subCategory=2&ContentId=48732

No comments:

Post a Comment