Friday, 30 December 2011

ప్రజా మేధావి ప్రొ.ఆర్ఎస్ రావు మృతి

మూత్రపిండాల వ్యాధితో ఢిల్లీలో కన్నుమూత
అక్కడే పూర్తయిన అంత్యక్రియలు

కలెక్టర్ వినీల్ విడుదలలో కీలక భూమిక
'అభివృద్ధి' గుట్టును ఎప్పుడో రట్టు చేసిన రాజకీయ అర్థ శాస్త్రవేత్త

న్యూఢిల్లీ, జూన్ 17 ప్రముఖ ఆర్థిక వేత్త, రచయిత, మార్క్సిస్టు మేధావి ప్రొఫెసర్ రేగులగడ్డ సోమేశ్వరరావు (74) (ఆర్ఎస్ రావు) శుక్రవారమిక్కడ మరణించారు. గత కొంత కాలంగా మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్న ఆర్ఎస్‌రావు స్థానిక గ ంగారామ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన అభిమానులు, మిత్రుల కన్నీటి నివాళుల మధ్య స్థానిక లోధీ రోడ్ శ్మశాన వాటికలో అంత్యక్రియలు పూర్తయ్యాయి. మార్క్సిస్టు-లెనినిస్టు అధ్యాపకునిగా, రాజకీయ అర్థ శాస్త్ర బోధకునిగా ప్రగతిశీల శిబిరానికి ఆర్ఎస్ రావు అత్యంత సన్నిహితుడు. స్వస్థలం విశాఖపట్నం జిల్లా చోడవరం.

ఆయనకు కుమార్తె, కుమారుడు. ఇద్దరూ ఆర్థిక శాస్త్రంలో ప్రొఫెసర్లే. భార్య భారతి భౌతిక శాస్త్రంతో పాటు రాజనీతి శాస్త్రంలో ఉన్నత పట్టాలు పొందారు. ఒడిసాలోని సంబాల్‌పూర్ యూనివర్సిటీలో దాదాపు 35 సంవత్సరాల పాటు ఆర్ఎస్ రావు పని చేశారు. ప్రజల దృక్కోణం నుంచి ఆర్థిక శాస్త్రాన్ని విశ్లేషించిన మేధావిగా ఘనత వహించారు. కోల్‌కతాలో గణాంక విభాగం పరిశోధకునిగా ఆయన వృత్తి జీవితం ప్రారంభించారు. ఆ సమయంలో బెంగాల్ మేధావులతో ఏర్పడిన పరిచయం ఆయనను మార్క్సిస్టు-లెనినిస్టుగా తీర్చిదిద్దింది.

అభివృద్ధిపై ప్రస్తుతం దేశవ్యాప్తంగా జరుగుతున్న చర్చకు 20 ఏళ్ల క్రితమే ఆర్ఎస్ రావు శ్రీకారం చుట్టారు. భార్యతో కలిసి ఇటీవలే ఏడు పుస్తకాలు వెలువరించిన ఆర్ఎస్ రావు కొన్ని వందలాది రచనలు చేశారు. ఒడిసా రాష్ట్రం మల్కన్‌గిరి కలెక్టర్ వినీల్ కృష్ణ కిడ్నాప్ ఉదంతంలో మావోయిస్టుల ప్రతినిధిగా ఒడిసా ప్రభుత్వంతో చర్చల్లో పాల్గొని..వినీల్ విడుదలకు దోహదపడ్డారు. ప్రత్యామ్నాయ ఆర్థిక వ్యవస్థ నిర్మాణంకోసం ఆర్ఎస్ రావు తపించారు.

ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధిలోని ప్రజా వ్యతిరేక స్వభావాన్ని వెలుగులోకి తెచ్చారు. ఆయన లేని లోటును భర్తీ చేయలేం'' అని విరసం నేత వరవరరావు గుర్తు చేశారు. చివరి ఘడియల్లో ఆయన ఆర్ఎస్‌రావు చెంతనే ఉన్నారు. హక్కుల నేత ప్రొ. హరగోపాల్, ప్రగతిశీల రచయిత వేణుగోపాల్‌తో పాటు ఢిల్లీకి చెందిన మేధావులు, ప్రజాసంఘాల కార్యకర్తలు రావుకు నివాళులు అర్పించారు.

ఆర్ఎస్ రావుకు విరసం నివాళి
హైదరాబాద్,  ప్రగతిశీల మేధావి ప్రొఫెసర్ ఆర్ఎస్ రావు మృతి పట్ల విరసం తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. మార్క్సిస్టు-లెనినిస్టు అవగాహన, రాజకీయ అర్థ శాస్త్రాలను సరళమైన పద్ధతుల్లో తెలుగు సమాజానికి పరిచయం చేసిన కొద్ది మంది బుద్ధిజీవుల్లో ఆర్ఎస్్ రావు ఒకరని సంఘం కార్యదర్శి పినాక పాణి శుక్రవారమిక్కడ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. జీవితాంతం విప్ల వోద్యమానికి, విప్లవ సాంస్కృతికోద్యమానికి సన్ని హితం గా ఉండి..పీడిత ప్రజానీకానికి విముక్తి పాఠాలు బోధిం చారన్నారు. నెహ్రూ నుంచి నేటి పాలకుల దాకా అనుసరిస్తున్న అభివృద్ధి నమూనా నిజ రూపాన్ని అత్యంత విశ్లేషణాత్మకంగా విప్పి చెప్పారని కొనియాడారు.

https://www.andhrajyothy.com/mainnewsshow.asp?qry=2011/jun/18/main/18main21&more=2011/jun/18/main/main&date=6/18/2011

No comments:

Post a Comment