Friday, 30 December 2011

అదృశ్యమైన ధృవతార ఆర్ ఎస్ రావు

మనకాలపు మహామేధావి, సునిశితమైన మార్క్సిస్టు విశ్లేషకుడు ఆర్ ఎస్ రావు కన్నుమూశారు. ముప్పై సంవత్సరాలుగా ఆయనతో సాగిన అనుబంధంలో కలిసి చేసిన ఆలోచనలు, పనులు, ప్రయాణాలు, కలిసి కన్న కలలు, పొందిన విజయాలు, వైఫల్యాలు అన్నీ ముగింపుకు వచ్చినట్టు గుండె పగిలే మౌనం. మహానిశ్శబ్దం. ‘చలనం మాత్రమే ఉంది. విశ్రాంతి, విరామం లేవు, విశ్రాంతి, విరామాల గురించి ఉన్న తాత్విక ప్రత్యయం కేవలం మన ఆలోచనా సౌలభ్యానికే తప్ప, సాపేక్షికంగానే తప్ప ప్రకృతిలో, సమాజంలో, మానవ మేధలో దానికి అవకాశమే లేదు’ అని ఎప్పుడూ చెపుతుండే ఆయన మేధ విరామానికి చేరింది. బహుశా అది ఆ ఆలోచనలకు విరామం కాదేమో. ఆ చలనం కొనసాగుతూనే ఉంటుందేమో.

నిజంగా ఆయనతో మాట్లాడడం అంటే ఒక చలనం, ఒక చైతన్యం, ఒక వెలుగు. అప్పటిదాకా మనకు తట్టని ప్రశ్నను మన మెదడులో ప్రవేశపెట్టి అల్లకల్లోలం చేసేవారాయన. ఇక ఇది అంతిమ నిర్ణయం, ఆలోచించవలసిందేమీ లేదు అనుకున్న దాని మీద కందిరీగల తుట్టెను రేపేవారాయన. అప్పటిదాకా ఎన్నో వైపుల ఆలోచించిన విషయానికే మరొక కొత్త కోణాన్ని చూపెట్టేవారాయన. గ్రామీణ వ్యవసాయ సమాజంలో చీకటి రాత్రి దిక్కు చూపడానికి ప్రతి మనిషీ వాడుకునే ధృవనక్షత్రం లాంటి వారాయన. ముసిముసి చీకటి తొలగిపోకముందే వెలుగుదారి పరిచే వేగుచుక్క ఆయన. తెలుగు సమాజమూ, భారత విప్లవోద్యమమూ అతి కీలక దశలో ఉన్నప్పుడు, ఎన్నెన్నో కొత్త, సంక్లిష్ట సమస్యలకు జవాబులు వెతకవలసిన తరుణంలో ఆ ధృవతార అదృశ్యమయింది.

ఎప్పుడో 1990లో పర్ స్పెక్టివ్స్ ప్రచురణగా చిన్నపుస్తకంగా వచ్చిన ‘అభివృద్ధి – వెలుగు నీడలు’ వ్యాసం మినహా ఈ ఇరవై ఏళ్ళలో ఆయన రచనలు పుస్తకరూపంలో రాలేదు. అంతకు ముందూ ఆ తర్వాతా కలిపి అరవై దాకా వ్యాసాలు రాశారు. దాదాపు అన్ని ప్రజాసంఘాల సభలలో, సమావేశాలలో వందకు పైగా ఉపన్యాసాలు ఇచ్చారు. ఆ కృషినంతా ఎప్పటికైనా ఒక్కచోటికి తీసుకురావాలనే కలలో భాగంగా వీక్షణం ప్రచురణల తరఫున ఆర్ ఎస్ రావు తెలుగు రచనల సమగ్ర సంపుటం ‘కొత్తచూపు’ 2010 నవంబర్ లో వెలువరించాం. దానికి రాసిన ముందుమాటలో ఆయనతో వ్యక్తిగత సాన్నిహిత్యం ఎక్కువ రాశానని, ఆయన మీద నా భక్తిని బహిరంగంగా వ్యక్తీకరించానని నాకే అనుమానం వచ్చింది. ప్రచురణకు కొద్దిరోజుల ముందు ఆ ముందుమాట ఆయన చేతికిస్తూ బెరుకుగా “సబ్జెక్టివ్ గా వచ్చినట్టుంది” అన్నాను. “నువ్వు సబ్జెక్టివ్ అనుకునేది మరొకరికి ఆబ్జెక్టివ్ కావచ్చు. మరొకరికి సబ్జెక్టివ్ అనిపించినది నీకు ఆబ్జెక్టివ్ కావచ్చు. అది రిలేటివ్. అసలింతకీ ఆబ్జెక్టివ్ లేని సబ్జెక్టివ్ ఉండదు, సబ్జెక్టివ్ లేని ఆబ్జెక్టివ్ ఉండదు. వాటిమధ్య విభజన రేఖ మనం గీసిందే. చాలసార్లు అనవసరమైనదే” అన్నారు ఆయనకు సహజమైన ఒక కొంటె చిరునవ్వుతో. ఆయనతో చర్చలలో వందలసార్లు ఈ సాపేక్షికత గురించీ, అందులోని గతితార్కికత గురించీ ప్రస్తావన వచ్చింది. భారత కమ్యూనిస్టు సంప్రదాయంలో అలవాటయిన తప్పుడు వాదనాపద్ధతుల గురించి మాట్లాడేటప్పుడు చాల సందర్భాలలో ఆయన ముఖం మీద ఇటువంటి కొంటె చిరునవ్వు విరిసేది.

ముప్పై ఏళ్లుగా చూస్తున్న ఆ చిరునవ్వు ఢిల్లీలోని సర్ గంగారాం ఆస్పత్రిలో జూన్ 17 మధ్యాహ్నం చెరిగిపోయింది. నిజం చెప్పాలంటే మరణం తర్వాత ఆ స్ఫటికం లాంటి స్పష్టమైన, కత్తి అంచులాంటి నిశితమైన వాదన ఆగిపోయింది గాని ఆయన ముఖం మీద ఆ పెదాల ముడి అట్లాగే కొంటె చిరునవ్వుగా నిలిచిపోయే ఉంది. మరణానికి కొద్ది గంటల ముందు ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో వెంటిలేటర్ మీద, ముఖం మీద గాజు మాస్క్ తో, వళ్లంతా గొట్టాలతో, యంత్ర పరికరాలతో ఉన్న ఆయన చెయ్యి పట్టుకుని “సార్, సార్” అని పిలిస్తే మూసిన కనురెప్పలు విప్పి చూశారు. చాల రోజులుగా మాట లేదు గాని, గాజు మాస్క్ కింది నుంచి పెదవి కదల్చడానికి ప్రయత్నించారు. అప్పటికి ఇరవై రోజులుగా ఊపిరి తిత్తులు పని చేయడం లేదు, గుండె పని చేయడం లేదు. మూడు రోజులుగా మూత్ర పిండాలు పని చేయడం లేదు. కాని ఆ సునిశితమైన మేధ ఇంకా సున్నితంగా ప్రతిస్పందిస్తూనే ఉంది.

నలభై సంవత్సరాలుగా మార్క్సిస్టు రాజకీయార్థిక, తాత్విక దృక్పథాన్ని అత్యంత ప్రతిభావంతంగా, సృజనాత్మకంగా అన్వయిస్తూ, వివరిస్తూ, విశ్లేషిస్తూ ఆయన సాగించిన అనితరసాధ్యమైన కృషిని ఒక వ్యాసంలో, అదీ సంస్మరణ సందర్భంలో రాయడం సాధ్యం కాదు. కాని స్థూలంగానైనా ఆయన అనుసరించిన సంవిధానపు విశిష్టతలు ఏమిటో, ఆయన నుంచి నేర్చుకోవలసినదేమిటో తెలుసుకోవలసి ఉంది.

విశాఖపట్నం జిల్లా చోడవరంకు చెందిన ఆచార పరాయణులైన బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన రేగులగడ్డ సోమేశ్వరరావు అర్థశాస్త్రం, గణాంకశాస్త్రం చదువుకుని, సంగీతం మీద, పూలమీద, నాటకాల మీద ఆసక్తితో జీవితం ప్రారంభించి, మార్క్సిజం అధ్యయనంతో మార్క్సియన్ ఆలోచనాపరుడిగా మారి, మొత్తంగా భారత సమాజంలోని, ప్రత్యేకంగా ఒరియా, తెలుగు సమాజాలలోని అట్టడుగు ప్రజలను అధ్యయనం చేసి, నక్సల్బరీ విప్లవోద్యమంతో సన్నిహితంగా నడిచి మనకాలపు గొప్ప మార్క్సిస్టు విశ్లేషకుడిగా మారిన పరిణామ క్రమం, ఆయన మిగిల్చి పోయిన తార్కిక, తాత్విక చింతన అత్యద్భుతమైనవి. వాటినుంచి అర్థం చేసుకోవలసినదీ, నేర్చుకోవలసినదీ, ఆచరించవలసినదీ ఎంతో ఉంది.

మార్క్స్ నూ మావో నూ ఆయన తన ఆలోచనల్లో, ప్రవర్తనలో జీర్ణం చేసుకున్నారు. ముఖ్యంగా మార్క్స్ తన ఆదర్శాలుగా ప్రకటించిన రెండు మాటలు (‘ప్రతిదాన్నీ ప్రశ్నించు’, ‘మానవీయమైనదేదీ నాకు పరాయిది కాదు’) ఆర్ ఎస్ రావు గారికి కూడ ఆదర్శాలుగా ఉన్నాయి. దేన్నీ ప్రశ్నించకుండా, ఆలోచించకుండా, పరిశోధించకుండా, సొంత వాదనతో విశ్వాసం కుదుర్చుకోకుండా విశ్వసించగూడదు అనేదే ఆయన నేర్పిన పాఠం. ఇలా ప్రతిదాన్నీ ప్రశ్నించి, తర్కించి, పరిశోధించి, తనకు తానుగా నిర్ధారించుకున్న తర్వాతనే నమ్మారు గనుకనే ఆయనకు తాను చెప్పే విషయాలపట్ల అసాధారణమైన స్పష్టత ఉండేది. అపారమైన ఆత్మవిశ్వాసం ఉండేది. ఆ లక్షణం వల్లనే ఆయన కొత్త ప్రశ్నలు లేవదీసేవారు. కొత్త జవాబులు అన్వేషించేవారు. కొత్త ఆలోచనలు చేయడానికి ప్రోత్సహించేవారు. ‘గాలిపటాలు ఎగరేయాలి’ అనే అలంకారంతో ఆయన ఆలోచనలను గాలిపటాలుగా చూశారు. ఎటువంటి గాలిలోనైనా, ఎంత ఎదురుగాలిలోనైనా గాలిపటాన్ని ఎగరేయాలి. దాన్ని గాలిలో స్వేచ్ఛగా తిరగనివ్వాలి. కొత్త గాలి తెమ్మరలను ఆస్వాదించనివ్వాలి. కొత్త రంగాలలోకి ప్రవేశించనివ్వాలి. అయితే ఆ గాలిపటం ఎంత దూరం వెళ్లినా విశృంఖలంగా, గాలివాటుగా, నేలతో, మనిషితో సంబంధం వదిలి కాదు. ఎగరేయడం చేసేది మనిషి మాత్రమే. ఆ గాలిపటాన్ని స్వేచ్ఛగా వదిలేలా సూత్రం పట్టుకున్న మనిషి, నేల మీద స్థిరంగా నిలబడ్డ మనిషి మాత్రమే. ఆ స్వేచ్ఛ, ఈ స్థిరత్వం రెండూ అవసరమే. సరిగ్గా అట్లాగే గత నలభై సంవత్సరాలలో ఆయన చేసిన కృషిలో మార్కిజం పట్ల అచంచల విశ్వాసం అనే స్థిరత్వమూ ఉంది, దేన్నయినా పరిశీలించాలి, ఎక్కడికైనా వెళ్ళాలి, ఎన్ని ప్రశ్నలైనా ఎదుర్కోవాలి అనే స్వేచ్ఛా ఉంది.

మళ్లీ ‘మానవీయమైనదేదీ నాకు పరాయిది కాదు’ అని మార్క్స్ ఉటంకించిన సూక్తినీ ఆర్ ఎస్ రావు గారు ఆలోచించిన, రచించిన, వ్యాఖ్యానించిన విషయాల విస్తృతినీ చూస్తే ఇక్కడ కూడ ఆయన మార్క్స్ అడుగుజాడల్లో నడిచారని అర్థమవుతుంది. భారత సామాజిక సంబంధాలు, భూస్వామ్యం, సామ్రాజ్యవాదం, భారత ఆర్థిక వ్యవస్థ చరిత్ర, ప్రణాళికాబద్ధ ఆర్థిక విధానం, పాలనా విధానాలు, భూసంస్కరణలు, ప్రజా సాంకేతిక పరిజ్ఞానం, మార్కెట్ భావజాలం, అభివృద్ధి, విస్థాపన, పర్యావరణం, చరిత్ర నిర్మాణంలో ప్రజల పాత్ర, భారత సామాజిక ఆర్థిక వ్యవస్థల సంక్షోభం, నక్సల్బరీ వెలుగులో భారత విప్లవోద్యమం నిర్మిస్తున్న చరిత్ర, సామ్యవాద ప్రయోగాలు, ప్రత్యామ్నాయ సంస్కృతి, పౌరహక్కుల ఉద్యమం, సామ్రాజ్యవాద ప్రభావానికీ కుల, మత వాదాలకూ సంబంధం, స్త్రీవాదం, తెలుగు సాహిత్యం వంటి అనేక విషయాల మీద ఆయన అద్భుతమైన రచనలెన్నో చేశారు.

అప్పటికే మార్క్సిజం చదువుకుని, విశ్వసిస్తున్న ఆర్ ఎస్ రావు నక్సల్బరీ ఉద్యమ ప్రజ్వలనంతో క్రియాశీల మార్క్సిస్టు మేధావిగా మారారు. నక్సల్బరీ పంథా దేశాన్ని అర్ధవలస, అర్ధ భూస్వామ్య సమాజంగా అభివర్ణించినప్పుడు, ఆ సూత్రీకరణ ఎంత వాస్తవికమైనదో చూపడానికి 1970లో ఎకనమిక్ అండ్ పొలిటికల్ వీక్లీ లో ఒక చిన్న ప్రశ్నావ్యాసంతో ప్రవేశించిన ఆర్ ఎస్ రావు చనిపోయే సమయానికి ఆక్స్ ఫర్డ్ విశ్వవిద్యాలయంలో అర్ధవలస అర్ధ భూస్వామ్య సూత్రీకరణను సమర్థించే పత్రం తయారుచేసే పనిలో ఉన్నారు.

1970లోనే ఆయన వేసిన రెండు ప్రశ్నలు ఆయన దృష్టి నైశిత్యానికీ, ప్రజల పట్ల ప్రేమకూ, విప్లవోద్యమ నిబద్ధతకూ అద్దం పడతాయి. భారత వ్యవసాయంలోకి పెట్టుబడిదారీ విధానం ప్రవేశించిందని సిపిఐ, సిపిఎంలకు చెందిన సిద్ధాంతవేత్తలు, స్వతంత్ర అర్థశాస్త్రవేత్తలు సిద్ధాంతాలు చేస్తున్నపుడు ఆయన “పెట్టుబడిదారీ రైతును వెతుకుతూ…” అని ఆ వాదనలను ఖండించే చిన్న వ్యాసం రాశారు. వ్యవసాయంలోకి “ఆధునిక” పరికరాలు రావడమే పెట్టుబడిదారీ విధానానికి నిదర్శనమనే వాదనకు జవాబు చెపుతూ “ఆధునిక అనేది సాపేక్షిక పదం. కర్రనాగలి కన్న ఇనుపనాగలి ఆధునికం. ట్రాక్టర్ ఇంకా ఆధునికం. ఒకానొక సమయంలో మూడూ సహజీవనం చేస్తూ ఉండవచ్చు కూడ. సాధనం పాతదా, కొత్తదా అని కాదు, పెట్టుబడి సంచయనం అంతకంతకూ ఎక్కువగా జరుగుతూ ఉండడమే పెట్టుబడిదారీ విధానాన్ని నిర్ణయిస్తుంది” అని మౌలిక ప్రశ్న సంధించారు. ఈ వ్యాసంలోనే “చూడవలసింది ఏది ఉన్నది అని కాదు, అది ఎలా మారుతున్నది అని” అని సూత్రీకరించారు. చలనంలో ఉన్న వస్తువును అధ్యయనం చేయడం, చలనాన్ని అధ్యయనం చేయడం అనే మౌలిక భావనలకు ఆయన అప్పటినుంచీ నలభై సంవత్సరాలపాటు స్థిరంగా అంటిపెట్టుకుని ఉన్నారు.

అలాగే 1969-70లలో ఇందిరా గాంధీ ప్రవేశపెట్టిన బ్యాంకుల జాతీయకరణ ప్రగతిశీల విధానమని పార్లమెంటరీ కమ్యూనిస్టు నాయకులు, అర్థశాస్త్రవేత్తలు పొగుడుతున్నప్పుడు, నాగపూర్ లో ఒక సదస్సులో “బ్యాంకుల జాతీయకరణ సరే, పాలన జాతీయకరణ ఎప్పుడు” అనే మౌలిక ప్రశ్న వేసి ఆయన కందిరీగల తుట్టెను కదల్చారు.

లోలోపల ఆలోచన, మిత్రులతో చర్చలో, సంభాషణలో ఆలోచన, గాలిపటాలు ఎగరేయడం వల్ల ఆయన చేయవలసినంత రచన చేయలేదని, ఆయన అద్భుత అన్వేషణలన్నీ మౌఖిక సంప్రదాయంలోనే మిగిలిపోయాయని అనిపిస్తుంది. అత్యవసరమనుకుంటే తప్ప, ఎవరైనా అడిగితే తప్ప ఆయన రాయలేదు. సభలకు, సమావేశాలకు పిలిస్తే తప్పనిసరిగా లిఖిత పత్రంతోనో, నోట్స్ తోనో వచ్చేవారు.

తెలుగులో వార్త దినపత్రికకు తప్ప ప్రధానస్రవంతి పత్రికలలో ఆయన దాదాపుగా ఎప్పుడూ రాయలేదు. టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రిక తన 150 ఏళ్ల సందర్భంగా 1990లో ఆయనతో ఒక వ్యాసం రాయించుకుని దాన్ని అచ్చువేయలేదు. ఆ సందర్భంగా ఆయన రాసిన అద్భుతమైన వ్యాసం అచారిత్రక ప్రజల చరిత్ర రచన. ప్రజలు, ప్రజల శ్రమ, ప్రజల ఆకాంక్షలు, ప్రజల సాంకేతిక పరిజ్ఞానం, ప్రజల సంస్కృతి – ఈ అంశాలు ఆయనకు అన్నిటికన్న ముఖ్యమైనవి. ఏ చర్చనైనా ఆయన ఈ మౌలిక అంశాలవైపు మళ్లించేవారు. టైమ్స్ ఆఫ్ ఇండియా కోసం రాసిన వ్యాసానికి కూడ ఈ ఆలోచనలే పునాది.

ప్రజల గురించి ఇంత లోతుగా ఆలోచించే క్రమంలోనే ఆయన ప్రజల అభివృద్ధి ఆకాంక్షలకూ పాలకుల అభివృద్ధి భావజాలానికీ మధ్య అంతరం గురించి చెప్పడం ప్రారంభించారు. అసలు పాలకులు అభివృద్ధిగా భ్రమలు కల్పిస్తున్నది అభివృద్ధి కానేకాదని, అభివృద్ధి పథకాలనే అభివృద్ధిగా పాలకులు ప్రచారం చేస్తున్నారని, మధ్యతరగతి ఆ ప్రచారానికి లొంగిపోతున్నదని ఆయన విస్తారంగా రాశారు.

ఈ విశ్లేషణ వల్లనే ఆయన నక్సల్బరీ వెలుగులో నడుస్తున్న భారత విప్లవోద్యమాన్ని ఒక ప్రత్యామ్నాయ అభివృద్ధి నమూనాగా చూశారు. దాదాపు గత ఇరవై సంవత్సరాలుగా ఆయన రచనలు, ఉపన్యాసాలు అన్నిటిలోనూ, ఇతర అంశాలకన్న ఎక్కువగా ఈ ప్రజా, ప్రత్యామ్నాయ అభివృద్ధి నమూనా విశిష్టత గురించి వివరించడానికి, దాన్ని విస్తరించడానికి ప్రయత్నించారు. “నక్సలైట్లు ఇంకా విజయం సాధించి ఉండకపోవచ్చు. కాని భారత ఆర్థిక వ్యవస్థలో పేదరైతులకూ, వ్యవసాయ కూలీలలకూ ప్రధాన స్థానం ఉంటుందని వాళ్ళు లేవనెత్తిన అంశాలు, పేదరికం గురించీ, మార్కెట్ సమస్య గురించీ లేవనెత్తిన అంశాలు ఒకవైపు, విదేశీ సాంకేతిక పరిజ్ఞానం మీద, సహాయం మీద ఆధారపడడం గురించిన ప్రశ్నలు మరొకవైపు ఒక చట్రాన్ని ప్రతిపాదించే ఇతివృత్తాలవుతాయి. ఆ చట్రం పకడ్బందీ చట్రం కాకపోయినప్పటికీ, భారత వాస్తవికతను అర్థం చేసుకునే చట్రం ఇదే” అని 1984లో ఒక సదస్సులో ఆయన అన్నారు. ఈ దేశంలో ప్రజా ఉద్యమాలలో నక్సల్బరీ ప్రవేశపెట్టిన ఆ చట్రాన్ని అర్థం చేసుకోవడం, వివరించడం, విశ్లేషించడం, విస్తరించడం, ఇంకా పకడ్బందీగా మార్చడానికి ప్రయత్నించడం, ఈ చట్రం వైపు ఇతర ఆలోచనాపరులను ఆకర్షించడం ఆర్ ఎస్ రావు గత నలభై సంవత్సరాలు నిరంతరంగా చేసిన పని. ఆ పనిని కొనసాగించడమే ఆయనకు నివాళి.

ఆయన నుంచి అన్నిటికన్న ఎక్కువగా నేర్చుకోవలసినది ఆశావాదం. ప్రకృతి, సమాజం, మానవమేధలలో నిరంతరం సాగే చలనాన్ని విశ్లేషించే వ్యక్తిగా ఆయన “ఇవాళ తెలియకపోతే రేపు తెలుసుకుంటాం. ఇవాళ తప్పు చేస్తే రేపు సరి చేయడానికి ప్రయత్నిస్తాం. ఎప్పటికైనా మనిషే సాధించగలడు” అనేవారు. అపజయాలు, వైఫల్యాలు, తప్పులు, అనుకున్న పనులు కాకపోవడం ఎన్ని జరిగినా ఆయన ఆ తాత్విక దృక్పథం వల్లనే కుంగిపోలేదు, బెంబేలు పడలేదు. గత ఎనిమిది సంవత్సరాలుగా వీక్షణంతో, సెంటర్ ఫర్ డాక్యుమెంటేషన్, రిసర్చ్ అండ్ కమ్యూనికేషన్ తో ఆయన సంబంధంలో, మార్గదర్శకత్వంలో కూడ పదే పదే ఈ ఆశావహ దృక్పథమే వ్యక్తమయింది. దాదాపు ఇరవై సంవత్సరాలుగా ఆలోచిస్తున్న పరిశోధనా కేంద్రం ఆరు సంవత్సరాల కింద వాస్తవరూపం ధరించి, ఇబ్బందులను ఎదుర్కొన్నప్పుడు విమర్శనాత్మకంగానైనా సెంటర్ తో కొనసాగారు. ఫిఫ్టీ ఇయర్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లో అనేక రచనలతో ఏకీభావం లేకపోయినా, పని జరగాలని వెన్నుతట్టారు. భువనేశ్వర్ లో మరొక పరిశోధనా కేంద్రం ప్రారంభమై పనిచేస్తుందనే ఆశతో అక్కడికి వెళ్లి, అక్కడా అనుకున్న పని జరగక వెనక్కి తిరిగి వచ్చి, “నేనూ భారతి గారూ ఏమి రాసినా, ఏమి చేసినా వీక్షణం, సి డి ఆర్ సి ప్రచురణలుగానే రావాలి” అని వీక్షణం – సి డి ఆర్ సి బృందంపై తన విశ్వాసాన్ని ప్రకటించారు. వ్యక్తిగతంగా నాకు గీటురాయిగా నిలిచారు. రాంకినీ, రామునూ ఆలోచన, రచన, వ్యక్తీకరణల వైపు ప్రోత్సహించారు. సారు మా మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఎటువంటి పరిస్థితిలోనయినా వమ్ము చేయబోమని ఆయన చివరి క్షణాలలో హామీ ఇచ్చాను. నేత్రదానం వల్ల ఇంకా జీవిస్తున్న ఆయన కళ్లు మమ్మల్ని చూస్తూనే ఉంటాయి. ఆయన వదిలివెళ్లిన అసంపూర్ణ కర్తవ్యాలు మమ్మల్ని నడుపుతూనే ఉంటాయి.

Filed under Telugu by ఎన్.వేణుగోపాల్ — Leave a comment
July 25, 2011

http://kadalitaraga.wordpress.com/2011/07/25/%E0%B0%85%E0%B0%A6%E0%B1%83%E0%B0%B6%E0%B1%8D%E0%B0%AF%E0%B0%AE%E0%B1%88%E0%B0%A8-%E0%B0%A7%E0%B1%83%E0%B0%B5%E0%B0%A4%E0%B0%BE%E0%B0%B0-%E0%B0%86%E0%B0%B0%E0%B1%8D-%E0%B0%8E%E0%B0%B8%E0%B1%8D/


No comments:

Post a Comment