అరెస్టులు, లొంగుబాట్లు కోవర్టులు
రాష్ట్రంలో మావోయిస్టు పార్టీకి వరుస ఎదురు దెబ్బలు
ఐదేళ్లలో నేలకొరిగిన కీలక నేతలు

వివిధ ఎన్‌కౌంటర్లలో మాధవ్ నుంచి శాఖమూరి అప్పారావు, పటేల్ సుధాకర్‌రెడ్డి, ఎంఆర్, టెక్ రమణ, జయకుమార్, సందే రాజమౌళి తదితర అగ్రనేతలను పోలీసులు కాల్చి వేశారు. శుక్రవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు దళపతి గణపతి తర్వాతి స్థానంలో ఉన్న ఆజాద్ నేలకొరిగారు. వరుస ఎన్‌కౌంటర్లతో కీలక నేతలను కోల్పోతున్న మావోయిస్టు పార్టీకి ఆజాద్ మరణం శరాఘాతమే.
ప్రభుత్వంతో 2005లో జరిపిన చర్చలు విఫలమైనప్పటి నుంచీ మావోయిస్టు పార్టీ రాష్ట్రంలో పలువురు కీలక నేతలను పోగొట్టుకుంది. అనేకమంది ముఖ్య నేతలు ఎన్‌కౌంటర్లలో నేలకొరిగారు. పదుల సంఖ్యలో మావోయిస్టు నేతలు లొంగిపోయారు.
చర్చల ప్రతినిధులుగా వచ్చిన వారినీ పోలీసులు వదిలిపెట్టలేదు. చర్చలు విఫలమైన తర్వాత పోలీసుల వ్యూహం మారింది. చిన్నాచితకా మావోయిస్టులను వదిలేసి.. వారిలో కొందరిని తమకు అనుకూలంగా మార్చుకుని లొంగుబాట్లను ప్రోత్సహించారు. మరికొందరిని అరెస్టులతో కట్టడి చేశారు. పోలీసులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న అగ్రనేతల కదలికలపై కన్నేశారు.
వారి కదలికలను నిత్యం గమనిస్తుండే ఎస్ఐబీలోని సిబ్బంది నెలల తరబడి గాలింపులు జరిపారు. కేంద్ర, రాష్ట్ర స్థాయి నాయకుల సమాచారం అందిన వెంటనే అప్రమత్తమై.. తమకు దొరికిన వారిని అదుపులోకి తీసుకుని.. పార్టీ సమాచారం కోసం చిత్రహింసలకు గురిచేసి ఆ తర్వాత కాల్చి చంపుతున్నారని ప్రజా సంఘాలు విమర్శిస్తున్నాయి.
గత ఐదేళ్లలో నేలకొరిగిన అగ్రనేతలు
2005: వరంగల్ జిల్లాలో జరిగిన ఎదురు కాల్పుల్లో మావోయిస్టు పార్టీ నార్త్ తెలంగాణ స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు డీవీకే స్వామి అలియాస్ యాదన్న మరణించారు.
2006: మావోయిస్టు పార్టీ రాష్ట్ర కమిటీ కార్యదర్శి మాధవ్ అలియాస్ బుర్ర చిన్నయ్య, రాష్ట్ర కమిటీ సభ్యులు ఓబులేసు అలియాస్ సాగర్, మట్టం రవికుమార్, సుదర్శన్ అలియాస్ సామల వెంకటేశం, ఖమ్మం డివిజనల్ కమిటీ కార్యదర్శి జగదీష్, కడప, అనంతపురం డివిజనల్ కమిటీ కార్యదర్శి సాధు రమేశ్‌రెడ్డి అలియాస్ రమేశ్, దండకారణ్య డివిజనల్ కమిటీ కార్యదర్శి ఇ.మల్లయ్య, కరీంనగర్ ఈస్ట్ డివిజన్ కార్యదర్శి అల్వాల సారయ్యలు వివిధ ఎన్‌కౌంటర్లలో మరణించారు.
2007: అనంతపురం జిల్లా ధర్మవరం రైల్వే స్టేషన్ వద్ద జరిగిన ఎన్‌కౌంటర్‌లో కేంద్ర కమిటీ సభ్యుడు, కర్ణాటక వ్యవహారాల ఇన్‌చార్జి సందే రాజమౌళి అలియాస్ మోగిలి, మేడారం అటవీ ప్రాంతంలోని తాడ్వాయి వద్ద జరిగిన మరో ఎన్‌కౌంటర్‌లో రాష్ట్ర కమిటీ సభ్యుడైన చిట్టిరాజ పాపయ్య అలియాస్ సోమన్న మరణించారు.
2008: ఈ ఏడాది పోలీసులు వ్యూహాత్మకంగా వ్యవ హరించి ఐదుగురు అగ్రనేతలను ఒకేచోట పట్టుకుని వేర్వేరు ప్రాంతాల్లో ఎన్‌కౌంటర్లలో మట్టుబెట్టారు. మావోయిస్టు పార్టీ ప్రకటనలను పత్రికలకు విడుదల చేయడంలో కీలక పాత్ర పోషించిన ఏపీ స్పెషల్ కమిటీ సభ్యుడు మస్తాన్‌రావు అలియాస్ ఎంఆర్, రాష్ట్ర కమిటీ కొరియర్ జయకుమార్‌లను విజయనగరంలో, ఇదే కమిటీకి సంబంధించి రాష్ట్ర స్థాయి సభ్యులైన తోట గంగాధర్, టెక్ జయమ్మలను గుంటూరు జిల్లాలో కాల్చివేశారు.
వీరితోపాటు పోలీసులకు పట్టుబడ్డాడని ప్రజాసంఘాలు ఆరోపించిన మీసాల ప్రభాకర్‌ను వారం తర్వాత గుంటూరు జిల్లాలో జరిపిన మరో ఎన్‌కౌంటర్‌లో కాల్చేశారు. ఛత్తీస్‌గడ్ సమీపంలోని పామేడు వద్ద మూడు రోజులపాటు జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఖమ్మం జిల్లా కార్యదర్శి మాటూరి యాదగిరితోపాటు మొత్తం 17 మంది చనిపోయారు.
వరంగల్ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు పార్టీ మిలటరీ వ్యవహారాల నిపుణుడు, మహారాష్ట్ర కమిటీ సభ్యుడైన గాజర్ల సారయ్య, మిలటరీ ప్లటూన్ కమాండర్ అరుణ ప్రాణాలు వదిలారు.
విశాఖపట్నం జిల్లాలో జరిగిన మరో కీలక ఎన్‌కౌంటర్‌లో ఆంధ్ర ఒడిషా బోర్డర్ స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి సంతోష్, కంపెనీ కమాండర్ కామరాజు అలియాస్ రణదేవ్, సెక్షన్ కమాండర్ కోర్రా చిన్నమణి, మరో కంపెనీ కమాండర్ అశోక్ మరణించారు.
2009: వరంగల్ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో రాష్ట్ర కమిటీ సభ్యుడు పటేల్ సుధాకర్‌రెడ్డి, టెక్ నిపుణుడు, రాష్ట్ర కమిటీ సభ్యుడు కనుగుల వెంకటయ్యలను మట్టుబెట్టారు. ప్రకాశం జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో యాక్షన్ కమిటీ సభ్యుడైన గోవిందనాయక్ అలియాస్ సంజీవ్ మరణించారు.
2010: ఈ ఏడాది మార్చిలో ప్రకాశం, వరంగల్ జిల్లాల్లో జరిగిన వేర్వేరు ఎన్‌కౌంటర్లలో రాష్ట్ర కమిటీ సభ్యుడైన శాఖమూరి అప్పారావు, టెక్ రమణ అలియాస్ సోలిపేట కొండల్‌రెడ్డిలను మట్టుబెట్టారు. ఈ ఎన్‌కౌంటర్ జరిగిన వారం రోజులకే చెరుకూరి రాజ్‌కుమార్ అలియాస్ ఆజాద్‌ను పోలీసులు పట్టుకున్నట్లు ప్రచారం జరిగింది. రాజ్‌కుమార్ తల్లి కరుణ చివరకు హైకోర్టును ఆశ్రయించారు కూడా.
No comments:
Post a Comment