కిషన్‌జీని ఇలా చూస్తాననుకోలేదు
కంటతడి పెట్టిన వరవరరావు
చంపడానికి ముందు కస్టడీలో.. రోజంతా చిత్రహింసలు
మిడ్నపూర్ ఆస్పత్రిలో బాబాయిని గుర్తించిన దీప
విమానంలో హైదరాబాద్‌కు.. పెద్దపల్లికి తరలింపు
పోస్టుమార్టం నివేదికను బయటపెట్టాలన్న సీపీఎం
ఎన్‌కౌంటర్‌పై న్యాయవిచారణకు అగ్నివేవ్ డిమాండ్
కోల్‌కతా, నవంబర్ 26 నా జీవితంలో ఎందరో నక్సల్ నేతల మృతదేహాలను చూశాను. కానీ కిషన్‌జీ మృతదేహంలాంటి దాన్ని ఇంతవరకూ చూడలేదు. ఆయన శరీరంలో గాయపరచని భాగమే లేదు. చిత్రహింస అనుభవించని అవయవమే లేదు''.. జంగల్‌మహల్‌లో మరణించిన మావోయిస్టు అగ్రనేత మల్లోజుల కోటేశ్వరరావు అలియాస్ కిషన్‌జీ మృతదేహాన్ని చూసిన క్షణంలో విరసం నేత వరవరరావు తీవ్ర భావోద్వేగంతో పలికిన మాటలవి. శాంతిని కోరుకున్నందుకు కిషన్‌జీకి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చావును ప్రసాదించారని ధ్వజమెత్తారు. తన చర్యకు ఆమె ప్రజాకోర్టులో సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.
కిషన్‌జీది పచ్చి బూటకపు ఎన్‌కౌంటర్ అని ప్రకటించిన వరవరరావు.. మమత సర్కారుతో ఇక శాంతి చర్చలకు తెరపడినట్టు చెప్పారు. కిషన్‌జీ మృతిపై సీబీఐ దర్యాఫ్తునకు ఆయన డిమాండ్ చేశారు. అంతకుముందు.. కిషన్‌జీ అన్న కుమార్తె దీపారావుతో కలిసి ఆయన మిడ్నపూర్ మెడికల్ ఆస్పత్రిలో కిషన్‌జీ భౌతికకాయం చూశారు. తన బాబాయిని దీపారావు గుర్తించారు. అనంతరం వారిద్దరు దుఃఖ వదనంతో ఆస్పత్రి నుంచి బయటకు వచ్చారు. ఈ సమయంలో మీడియా వారిని చుట్టుముట్టింది. ఈ సందర్భంగా కిషన్‌జీ మృతదేహం కనిపించిన స్థితిని వరవరరావు వివరించారు.
శరీరమంతా కాల్చిన, కోసిన గాయాలు, తూటా దెబ్బలతో నిండి ఉంది. చంపడానికి 24 గంటల ముందు ఆయనను కస్టడీలోకి తీసుకొని చిత్రహింసలు పెట్టి.. అనంతరం కాల్చి చంపారు. దవడ భాగాన్ని కోసేశారు. మెడ వెనక భాగంలో పొడిచిన లోతైన గాయముంది. ఒక చెయ్యిని పూర్తిగా విరగ్గొట్టారు. కాళ్లమీద కాల్చిన గుర్తులు ఉన్నాయి. అరికాళ్లను పచ్చడి పచ్చడి చేశారు. సన్నీలతో ఎక్కడంటే అక్కడ గాయపరిచారు'' అని వాపోయారు. 1991 నుంచి కిషన్‌జీ తనకు తెలుసునని, ఈ స్థితిలో ఆయనను చూడాల్సి వస్తుందని ఏనాడూ అనుకోలేదని వరవరరావు కన్నీళ్లు పెట్టుకున్నారు.
ప్రజాస్వామ్యం గురించి గొప్పగా చెప్పే మమత చేయించిన హత్య ఇది. శాంతిచర్చలను భగ్నం చేయడానికే ఆమె ఇదంతా చేశారు. చెప్పేదొకటి.. చేసేదొకటిగా ఆమె వైఖరి ఉంది'' అని ధ్వజమెత్తారు. తన బాబాయిని అమానవీయంగా హత్య చేశారని దీపారావు కూడా ఆరోపించారు. ఆయనను చివరిసారిగా 1985లో చూశాను. ఆయనలో మా నాన్న, సోదరుని పోలికలు ఉన్నాయి. కానీ, మృతదేహం మాత్రం చూసే విధంగా లేదు'' అని కన్నీళ్లపర్యాంతమయ్యారు. సెల్‌ఫోన్‌లో బంధించిన కిషన్‌జీ భౌతికకాయం దృశ్యాలను ఆమె మీడియాకు చూపించారు.
ఒంటిపై 20 గాయపు గుర్తులున్నాయి. గడ్డం భాగాన్ని పగలగొట్టారం'టూ భోరుమన్నారు. అనంతరం కిషన్‌జీ మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి చేసి అంబులెన్స్‌లో కోల్‌కతాకు తరలించారు. మృతదేహాన్ని తామే తీసుకెళతామని వరవరరావు తదితరులు పట్టుబట్టారు. ఆయన వెంట ఉన్న బెంగాల్ ప్రజాసంఘాలూ ఇదే డిమాండ్ చేసినా.. పోలీసులు అంగీకరించలేదు. కోల్‌కతాకు వచ్చాకే మృతదేహాన్ని అప్పగించారు. దాన్ని తీసుకొని వరవరరావు, దీపారావు తదితరులు విమానంలో హైదరాబాద్‌కు చేరుకొని, అక్కడి నుంచి కిషన్‌జీ స్వస్థలం కరీంనగర్ జిల్లా పెద్దపల్లికి తీసుకెళ్లారు.
అంతకుముందు.. మిడ్నపూర్ మెడికల్ ఆస్పత్రిలో కిషన్‌జీ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. అయితే, వరవరరావు, మావోయిస్టు పార్టీ ఆరోపిస్తున్నట్టు కిషన్‌జీ బూటకపు ఎన్‌కౌంటర్‌లో చనిపోలేదని పోస్టుమార్టం నివేదికలో వెల్లడయినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ వర్గాల కథనం ప్రకారం.. స్వచ్ఛమైన ఎన్‌కౌంటర్‌లోనే కిషన్‌జీ మరణించారని నివేదిక «ద్రువీకరించింది. ఆయన శరీరం నుంచి ఆరు బుల్లెట్లు, రెండు గ్రెనేడ్ శకలాలను వెలికితీసినట్టు పేర్కొంది. శరీరంపై కనిపిస్తున్న గాయాలు గ్రెనేడ్ దాడిలో కలిగినవేనని వెల్లడించింది. దూరం నుంచే కాల్పులు జరిగాయని ఆ నివేదిక నిర్ధారించింది. ఈ నివేదికను తక్షణం బహిరంగపరచాలని విపక్ష సీపీఎం డిమాండ్ చేసింది. అగ్రనేత మృతిపై న్యాయ విచారణ జరిపించాలని అగ్నివేశ్ డిమాండ్ చేశారు.
https://www.andhrajyothy.com/mainnewsshow.asp?qry=2011/nov/27/main/27main1&more=2011/nov/27/main/main&date=11/27/2011
No comments:
Post a Comment