ఇటీవల పశ్చిమబెంగాల్‌లో పోలీసుల చేతిలో ఎన్‌కౌంటర్‌కు గురైన మల్లోజుల కోటేశ్వరరావు అలియాస్ కిషన్‌జీ.. మావోయిస్టులను బలోపేతం చేసేందుకు చైనా సాయం కోసం ప్రయత్నించారా ఆ దేశం కూడా అందుకు సంసిద్ధత వ్యక్తం చేసిందా మణిపూర్‌కు చెందిన నిషేధిత ‘పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్‌ఏ)’తో రహస్య సంబంధాలు కొనసాగించి, ఈశాన్య భారతంలోని తిరుగుబాటు సంస్థలను ఒకే గొడుగు కిందకు తెచ్చేందుకు వ్యూహం రచించారా అవుననే అంటోంది ‘తెహెల్కా’ తాజా సంచిక కథనం. ఇందుకు సంబంధించి కొన్ని ఆధారాలు సేకరించామని అది వెల్లడించింది.
దేశ రాజధాని ఢిల్లీలోని పహార్‌గంజ్‌లో ఓ హోటల్‌లో గత నెలలో నిషేధిత పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్‌ఏ) విదేశీ వ్యవహారాల అధినేత ఎన్.దిలీప్‌సింగ్ (51) అలియాస్ ఎన్. వాంగ్బా, ఆయన డిప్యూటీ అరుణ్‌కుమార్ సింగ్ సలాం(36)ను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. వారిని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) విచారించగా.. భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా మావోయిస్టులు, పీఎల్‌ఏ మధ్య 2008, అక్టోబర్ 22న కుదిరిన ఒప్పందం తర్వాత ఆ రెండు సంస్థల మధ్య సంబంధాలు పెనవేసుకుపోయిన తీరుపై ఎన్‌ఏఐ కూపీలాగింది. ఈ పరిణామాల నేపథ్యంలో దిలీప్ సాయంతో ఈశాన్య భారతంలోని సాయుధ తిరుగుబాటు సంస్థలను మచ్చిక చేసుకునేందుకు మావోయిస్టులు ప్రయత్నిస్తున్నారని, తిరుగుబాటు సంస్థలతో కలిపి ‘యునెటైడ్ ఫ్రంట్ ఆఫ్ ఆల్ రెబెల్స్’ ఏర్పాటు భావనను వ్యాప్తి చేసేందుకు కృషి చేశారని విశ్వసనీయవర్గాలను ఉటంకిస్తూ వార్తలు వచ్చాయి. అయితే.. ఈ వార్తలను ధ్రువీకరించేలా, ఇందుకు సంబంధించి పోలీసువర్గాల ద్వారా అత్యంత విశ్వసనీయ కీలక పత్రాలు లభించాయని ‘తెహెల్కా’ పేర్కొంది.
ఆ లేఖల ప్రకారం...
సీపీఐ (మావోయిస్టు) ప్రధాన కార్యదర్శి గణపతి.. జనవరి 24, 2010లో మణిపూర్‌కు చెందిన రెవల్యూషనరీ పీపుల్స్ ఫ్రంట్ (ఆర్‌పీఎఫ్- దీని అనుబంధ సాయుధ విభాగం పీఎల్‌ఏ)కు ఓ లేఖ రాశారు. గ్రీన్‌హంట్ కారణంగా కేడర్‌కు ప్రతిపాదిత సైనిక శిక్షణ నిలిపివేస్తున్నామని, ‘యునైటెడ్ ఫ్రంట్’ ఏర్పాటు ప్రధాన లక్ష్యంగా చర్చల కోసం ఇద్దరు ప్రతినిధులను పంపుతున్నట్లుగా పేర్కొన్నారు. ఈ తొలి సమావేశం 2010, మార్చి 18-20 మధ్య కాలంలో జరిగింది. దీనికి కిషన్‌జీ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా రెండు పక్షాల మధ్య ఓ ఒప్పందం కూడా కుదిరింది. సెప్టెంబర్, 2010 నుంచి 12-14 నెలల పాటు సైనిక శిక్షణ కార్యక్షికమాలను నిర్వహించేందుకు, ఆయుధాలు, కమ్యూనికేషన్ పరికరాలు పంపేందుకు పీఎల్‌ఏ అంగీకరించింది. సమావేశ మినట్స్ ఆధారంగా ఈ విషయం స్పష్టమవుతోంది. ఈ సమావేశంలో కిషన్‌జీని కిషన్‌దా అని సంబోధించారు.
సమావేశం జరిగిన రెండ్రోజలు తర్వాత, అంటే మార్చి 22న కిషన్‌జీ పీఎల్‌ఏకు ఓ లేఖ రాశారు. మావోయిస్టులు ప్రధాన పాత్ర పోషించేలా ఈశాన్య ప్రాంతంలోని అన్ని (విప్లవవాద, ప్రజాస్వామ్య, ప్రగతిశీల) తిరుగుబాటు సంస్థలను ఏకం చేసి ‘మహా కూటమి’ ఏర్పాటు చేయాలనే యోచనను ఆ లేఖలో ప్రస్తావించారు. అదే విధంగా, సైనిక, కమ్యూనికేషన్ల రంగంలో శిక్షణ ఇచ్చేందుకు సాయం చేయాలని, ఇందుకోసం మగ్గురు నుంచి ఐదుగురు ట్రైనర్లను పంపాలని కోరారు. ఇందుకు పీఎల్‌ఏ అంగీకరించింది. తదనంతరం ఇలాంటి సమావేశాలు కోల్‌కతా, గువాహటి, రూర్కెలాలో కూడా జరిగాయి. ఎన్‌ఐఏ వర్గాల ప్రకారం.. మావోయిస్టులకు శిక్షణ షెడ్యూల్‌ను ఖరారు చేసేందుకు మిజోరంలోని చాంపైలోనూ ఇరుపక్షాల నేతలు సమావేశమయ్యారు. దీనికి కిషన్‌జీ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా పీఎల్‌ఏతో పాటు ఈశాన్య భారత్‌లోని ఉల్ఫా, నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్ (ఇసాక్-మయివా)తో రహస్య సంబంధాలు కొనసాగించారు.
రాకెట్లు, గ్రెనేడ్లు, ఆటోమేటిక్ రైఫిళ్లు, అత్యాధునిక వైర్‌పూస్ సెట్లు సమకూర్చుకునేలా పీఎల్‌ఏకు ఆ బాధ్యత అప్పగించారు. ఇందులో భాగంగా ఉల్ఫా చీఫ్ పరేశ్‌బారువా, చావోన్‌లు బంగ్లాదేశ్ రాజధాని ఢాకా నుంచి చైనాలోని యువాన్ ప్రావిన్స్‌లోని కున్మింగ్‌కు వెళ్లి చైనా సైన్యాధికారులతో భేటీ అయ్యారు. మళ్లీ మే నెలలో బీజింగ్ వెళ్లి ఈ సందర్భంగా వారు ఓ ఆయుధ ఒప్పందాన్ని ఖరారు చేసుకున్నారు. ఈ సందర్భంగా మావోయిస్టులకు ఆయుధ సహకారం అందించాలని వారి తరపున పీఎల్‌ఏ చైనా సైన్యాధికారులను అభ్యర్థించారు. ఇందుకు వారు అంగీకరించారని ఎన్‌ఐఏ వర్గాలు తెలిపాయి. ప్రభుత్వ వాదనలను బలపరుస్తూ.. ఆర్‌పీఎఫ్పీఎల్‌ఏ ద్వారా విదేశాలతో సంబంధాలను కొనసాగించడాన్ని మావోయిస్టులు అంగీకరించారని, మొత్తంగా పీఎల్‌ఏ ద్వారా చైనా సాయం పొందేందుకు మావోయిస్టులు ప్రయత్నించారని, ఇందులో కిషన్‌జీ కీలక పాత్ర పోషించారని తమకు లభించిన లేఖలు స్పష్టం చేస్తున్నాయని ‘తెహెల్కా’ పేర్కొంది. కిషన్‌జీని హతమార్చడంతో పీఎల్‌ఏతో ప్రస్తుతం మావోయిస్టుల సంబంధాలకు తీవ్ర ఎదురుదెబ్బ తగిలిందని అభిప్రాయపడింది.
http://www.namasthetelangaana.com/News/Article.asp?category=1&subCategory=3&ContentId=52023
No comments:
Post a Comment