Monday, 19 December 2011

జంగల్ మహల్ జన నేతకు నీరాజనం

జంగల్ మహల్ జన నేతకు నీరాజనం
పెద్దపల్లిలో మల్లోజుల అంత్యక్రియలు
చితికి నిప్పంటించిన అన్న అంజనేయులు

కరీంనగర్, నవంబర్ 27  జంగల్ మహల్‌లో ఒరిగిన విప్లవ కెరటానికి జనం నీరాజనం పట్టింది. జాతీయ విప్లవోద్యమానికి నడక నేర్పి దిశానిర్ధేశం చేసిన విప్లవ యోధుడు మల్లోజుల కోటేశ్వర్‌రావు కడసారి చూపు కోసం ప్రజలు బారులు తీరారు. కంట నీరు తుడుచుకుంటూనే కోటన్న జోహార్లు అంటూ పుట్టెడు దుఃఖాన్ని దిగమింగుకున్నారు. పుడమి తల్లిలో కలిసి పోతున్న తమ అన్న భౌతిక కాయంపై పుష్పగుచ్ఛాలు ఉంచి ఆయన ఆశయాల సాధనకై కడదాకా పోరాడుతామంటూ నినాదాలు చేశారు.

మండే గుండెల దండోరా వినిపిస్తూ విప్లవ గీతాలతో నివాళులర్పించారు. కోటన్న అమర్ హై.. విప్లవ యోధుడా జోహార్లు.. మమతా బెనర్జీ ఖబడ్దార్.. ఖబడ్దార్, మన్మోహన్ సింగ్, చిదంబరం ఖబడ్దార్ ఖబడ్దార్ అంటూ.. నినదించారు. అమర వీరునికి ఆశ్రు తర్పణాలు అర్పిస్తూ .. పెద్దపల్లి పుర వీధుల్లో కోటేశ్వర్‌రావు భౌతిక కాయాన్ని ఊరేగిస్తూ.. నాలుగు కిలోమీటర్ల పొడవునా సాగిన అంతిమయాత్రలో పాల్గొన్నారు. దారి పొడవునా ప్రజలు పెద్దపల్లి ముద్దు బిడ్డ మట్టి మనుషుల కన్న బిడ్డ కడసారి చూపు కోసం.. ఆసక్తిగా, ఆర్తిగా ఎదురు చూస్తూ.. భౌతిక కాయాన్ని చూసి మనుసుల్లోనే మౌనంగా లాల్ సలామ్ అంటూ నివాళులర్పించారు.

వేలాది మంది ప్రజలు, విప్లవాభిమానులు, ప్రజా, హక్కుల సంఘాల నేతలు, విప్లవ రచయితల నినాదాల మధ్య పెద్దపల్లి గుండం చెరువు కట్ట వద్ద కోటేశ్వర్‌రావు అంత్య క్రియలు జరిగాయి. విప్లవ రచయితలు వరవరరావు, కళ్యాణ్ రావు కోటేశ్వర్ రావు భౌతిక కాయంపై ఎర్ర జెండా కప్పి నివాళులు అర్పించగా విప్లవ సంప్రదాయాలతో అంత్యక్రియలను నిర్వహించారు.

ఆయన అన్న అంజనేయులు చితికి నిప్పంటించగా విరసం ప్రతినిధులు వరవరరావు, చలసాని ప్రసాద్, కళ్యాణ్‌రావు, పాణి, ప్రజా కళాకారుడు గద్దర్, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షురాలు విమల, బంధు మిత్రుల కమిటీ రాష్ట్ర కార్యదర్శి గంటి ప్రసాద్, ప్రతినిధులు పద్మకుమారి, హారతి, మాధవి, పౌరహక్కుల సంఘం చంద్రశేఖర్, టీఆర్ఎస్ శాసనసభ్యులు ఈటెల రాజేందర్, కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ రావు, ఆర్ నారాయణ మూర్తి, మందక్రిష్ణ మాదిగ అంత్యక్రియలకు హాజరయ్యారు.
https://www.andhrajyothy.com/latestNewsShow.asp?qry=2011/nov/27/latest/27new56

No comments:

Post a Comment