జగిత్యాల పోరాటాల నుంచి లాల్‌గడ్ పోరాటాల దాకా ప్రజా సంచలనాలను కిషన్‌జీ అక్షరబద్ధం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లోని విప్లవ సాహిత్యోద్యమానికి ఆయన సన్నిహిత మిత్రుడు. ప్రజా సాహిత్య సాంస్కృతిక రంగం మీద నల్లా ఆదిరెడ్డి, ఆజాద్ వలె కిషన్‌జీ ముద్ర కూడా ఉంది. తెలంగాణలో ఆరోజుల్లో ప్రజా జీవన రంగాలన్నిటిలో విప్లవోద్యమం వేసిన ప్రభావాన్ని సృజనాత్మక రూపాల్లోకి రచయితలు అనువదించడం వెనుక మల్లోజుల కోటేశ్వరరావు ఉన్నారు.
భారత విప్లవోద్యమాన్ని ప్రారంభ దినాల ఆటుపోట్ల నుంచి సుస్థిరమైన ప్రజా ఆచరణ పునాది మీదికి తెచ్చిన వాళ్లలో కిషన్‌జీ ప్రముఖుడు. ఆనాటికి ఆయన మల్లోజుల కోటేశ్వరరావు మాత్రమే. శ్రీకాకుళంలో దెబ్బదిన్న విప్లవోద్యమాన్ని తెలంగాణ పల్లెల్లో ప్రచండ శక్తిగా తీర్చిదిద్దిన మేటి విప్లవకారుడాయన. ముఖ్యంగా కరీంనగర్, ఆదిలాబాద్ రైతాంగ పోరాటాలను అత్యున్నత స్థాయికి తీసికెళ్లి చెల్లాచెదరై పోయిన మార్క్సిస్టు-లెనినిస్టు ఉద్యమానికి దిశా నిర్దేశం చేశారు.
తెలంగాణలో దొరల కాళ్ల కంద నలిగిపోతున్న భూమి లేని రైతాంగాన్ని విప్లవకరశక్తిగా గుర్తించి వ్యవసాయ విప్లవానికి పునాది వేశారు. కొండపల్లి సీతారామయ్య తర్వాత ఉద్యమంలో ఆయన నిర్వహించిన పాత్ర వల్లే సీపీఐఎంల్ పీపుల్స్ వార్ ఏర్పడ్డప్పుడు సహజంగానే కోటేశ్వరరావు పార్టీ రాష్ట్ర కమిటీ కార్యదర్శి అయ్యారు. ఆయన నేతృత్వంలో తెలుగునేల అంతటా విప్లవ ప్రజాసంఘాలు చరిత్రాత్మకమైన ఉద్యమాన్ని నిర్మించాయి.
తెలంగాణలో భూస్వామ్యానికి వ్యతిరేకంగా సాగిన జగిత్యాల జైత్రయాత్రలో రైతాంగం పాత్రను కోటేశ్వరరావు నాగేటి చాళ్లలో.. । అనే పుస్తకంలో రికార్డు చేశారు. రైతాంగ పోరాటాల చరిత్రలో ఆ పుస్తకం చాలా అపురూపమైనది. ఇన్నేళ్ల తర్వాత కూడా ఆ పుస్తకం విప్లవోత్తేజాన్ని నింపుతుంది. అట్టడుగు ప్రజలు ప్రత్యామ్నాయ పోరాటం వల్ల సమాజమంతా ప్రకంపనాలతో అతలాకుతలమైపోయిన కాలం అది. ఆ సంక్షోభం, అందులోని విప్లవోత్సాహం, పరిష్కారం.. దేశ ప్రజలందరూ తెలంగాణ వైపు చూసేలా చేశాయి. భూమి లేని నిరుపేదలను, దళితులను, మహిళలను, వెట్టి కూలీలను కదిలించిన ఆ పోరాటాలకు ముందు వెనుకా కూడా కోటేశ్వరరావే. ఆ ఉద్యమాలు తయారు చేసుకున్న మట్టి వాసనల నాయకుడు ఆయన. ఆనాటి పోరాటాల్లో విస్తృతి అనేది అంతర్నిహితమైన గుణం. అందుకే శ్రీకాకుళంలో తాత్కాలికంగా ఓడిపోయినా విప్లవోద్యమం తెలంగాణలో లేచి నిలబడింది.
ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల నుంచి తెలంగాణ అంతటా, తెలుగు నేల అంతటా ఆ పోరాటం విస్తరించి, దండకారణ్యం చేరుకున్నది. గోదావరి తీరం దాటి సువిశాల ఆదివాసీ ప్రాంతం చేరుకున్నది. ఈ మొత్తం ప్రయాణంలో ఆనాటి పీపుల్స్‌వార్‌లో, నేటి మావోయిస్టు పార్టీలో కోటేశ్వరరావు పాత్ర కీలకమైనది. ఆయన ముందు చూపు, విప్లవ వ్యూహం, ఆచరణాత్మక పంథా వల్లే ఇవాళ మావోయిస్టు పార్టీ దేశవ్యాప్తంగా విస్తరించింది. ప్రహ్లాద్ పేరుతో ఆంధ్రప్రదేశ్ కార్యదర్శిగా పనిచేసి, ఆ తర్వాత మధ్య భారత దేశంలో విప్లవోద్యమాన్ని నిర్మించి కిషన్‌జీగా బెంగాల్ జంగల్ మహల్ అడవులు చేరుకున్నారు.
పెద్దపల్లి నుంచి ఆయన ఏ పల్లెలు, కీకారణ్యాలు, రాష్ట్రాలు నడుచుకుంటూ, దాటుకుంటూ వెళ్లారో ఆ దారి పొడవునా విప్లవోద్యమం విస్తరించింది. ఎర్ర సైన్యమంటే విప్లవ విత్తనాలు వెదజల్లుతూ సాగే యంత్రంలాంటిదని మావోసేటుంగ్ అన్నట్లు ఆయన తానే ఒక సైన్యంగా బయల్దేరి, నిజంగానే ఎర్రసైన్యాన్ని నిర్మించారు. నక్సల్బరీ పోరాటం తర్వాత పశ్చిమ బెంగాల్‌లో తిరిగి విప్లవోద్యమాన్ని ఆయన నేతృత్వంలో ఆ ప్రాంత ఆదివాసీలు నిర్మించగలిగారు. నందిగ్రాం, సింగూర్ పోరాటాలతోపాటు లాల్‌గడ్ విప్లవంతో ప్రపంచమంతా మావోయిస్టు ఉద్యమంవైపు చూసేలా ఆయన చేశారు.
కిషన్‌జీ గురించి మాట్లాడటమంటే నలభై ఏళ్ల పైబడిన మావోయిస్టు ఉద్యమం గురించి మాట్లాడటమే. ఆ ఉద్యమం ప్రతి మలుపులోనూ ఆయన పాదముద్ర ఉంటుంది. ఆయన ఆలోచనా ప్రభావం ఉంటుంది. కిషన్‌జీ దొరికినట్టే దొరికి తప్పించుకున్నాడని ఇప్పటికి ఎన్నోసార్లు శత్రువులు కథనాలు ప్రచారం చేశారు. ప్రతిసారీ పోలీసులు ఆయన క్రైం జాబితాను ప్రకటించేవారు. కానీ కరీంనగర్ నుంచి జంగల్‌మహల్‌దాకా సకల సామాజిక దౌష్ట్యాలకు వ్యతిరేకంగా, దోపిడీలకు వ్యతిరేకంగా కిషన్‌జీ నిర్మించిన అత్యద్భుతమైన పోరాట రూపాలు భారత ప్రజల ఉద్యమ చరిత్ర నుంచి విడదీయలేం.
విప్లవోద్యమాన్ని నిర్మూలించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఆపరేషన్ గ్రీన్‌హంట్‌లో భాగమే కిషన్‌జీ హత్య. అధికారదాహంతో దశాబ్దాలుగా కొట్టుకులాడిన మమతాబెనర్జీ ముఖ్యమంత్రి అయిన మరుసటి రోజు నుంచే మావోయిస్టులపై, ఆదివాసులపై నిర్బంధాన్ని ప్రారంభించింది. సోషల్ ఫాసిస్టు సీపీఎంను అధికారం నుంచి తప్పించి తాను చేజిక్కించుకోవడానికి మమతాబెనర్జీ.. సరిగ్గా ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి రావడానికి ముందు ఎన్టీఆర్ నక్సలైట్లకు లాల్‌సలాములు చెప్పినట్లు... ప్రగతిశీల వేషం వేసింది. ఆమె కాటన్ చీర, హవాయి చెప్పుల మార్క్ రాజకీయాలు ఎంత దుర్మార్గమైనవో మావోయిస్టులకు తెలియనివి కావు. భారత ప్రభుత్వం, బెంగాల్ ప్రభుత్వం అణచివేతకు దశాబ్దాలుగా గురవుతున్న ఆ రాష్ట్ర ఆదివాసుల్లో కిషన్‌జీ నిర్మించిన పోరాట తీవ్రతను ప్రతిపక్ష నేతగా మమతా బెనర్జీ కూడా గుర్తించక తప్పలేదు.
వామపక్షాన్ని ఇరకాటాన పెట్టడానికి ఆమె ఎంచుకున్న అధికార వ్యూహంలో భాగంగా లాల్‌గడ్, నందిగ్రామ్ తదితర పోరాటాల గురించి మాట్లాడి రాజకీయ లబ్ధి పొందాలనుకున్నది. అయితే సీపీఎం కన్నా మరింత దుర్మార్గంగా తృణమూల్ కాంగ్రెస్ పాలన ఉంటుందని, కేంద్రంలో కలిసి మమత ఆపరేషన్ గ్రీన్‌హంట్‌ను ముమ్మరం చేస్తుందనీ మావోయిస్టులకు తెలుసు. కిషన్‌జీ హత్యతో భారత పాలక వర్గాల దుర్మార్గ నైజం మరోసారి బైటపడింది. కేవలం అధికార కుమ్ములాట కోసం ఎన్ని వేషాలైనా వేయగలరని, ఒకసారి అధికారాన్ని చేజిక్కించుకున్నాక అణచివేత, హింస వారి విధానమని తాజాగా మమతాబెనర్జీ కూడా రుజువు చేసింది. ప్రజల పట్ల అకుంఠిత దీక్షతో నిలిచిన మావోయిస్టులకు ఈ వ్యవహారం స్పష్టంగా తెలుసు. ప్రజలపై జరుగుతున్న ఆపరేషన్ గ్రీన్‌హంట్ యుద్ధాన్ని తిప్పికొట్టడంలో కిషన్‌జీ రాజకీయ, సైనిక వ్యూహాన్ని దెబ్బతీయడానికి, పోరాట ప్రజలకు నాయకత్వం లేకుండా చేయడానికే మమతాబెనర్జీ, చిదంబరం కలిసి ఈ హత్యాకాండకు పాల్పడ్డారు.
రాజకీయవేత్తగా, సైనిక వ్యూహకర్తగా, ప్రజల నాడి పట్టుకొని నిరంతరం వాళ్లను ఉద్యమ చైతన్యంతో పోరాటాల్లోకి సమీకరించగల నిర్మాణ దక్షుడిగా కిషన్‌జీ గురించి మాట్లాడుకొనేటప్పుడు మరో ముఖ్యమైన పాత్రను కూడా తలపోసుకోవాలి. బహుశా సిరిసిల్లా జగిత్యాల పోరాటాలు నిర్మించి నడిపించిన ఆ తరం నాయకులందరికీ వర్తించేదే ఇది. పోలీసులు కిషన్‌జీని తలకాయలు తీసే క్రూరుడిగానే చిత్రిస్తూ వచ్చాయిగాని ఆయన సునిశితమైన ఆలోచనాపరుడేగాక సృజనాత్మక మానవుడు కూడా. ఆంధ్రజ్యోతిలో ఆ మధ్య ఆయన రాసిన కవితల్లోనేగాక 1980లలో విరసం పత్రిక అరుణతారలో, సాహితీమిత్రులు నిర్వహించిన సృజన పత్రికలో అనేక పేర్లతో కవిత్వం రాశారు. బెంగాలీలో ధారాళంగా మాట్లాడటమేగాక, విప్లవోద్యమం గురించి, ఆదివాసీ సమస్యల గురించి బెంగాలీ పత్రికల్లో వ్యాసాలు రాశారు. బెంగాలీ నుంచి అనువాదాలు కూడా చేశారు.
జగిత్యాల పోరాటాల నుంచి లాల్‌గడ్ పోరాటాల దాకా ప్రజా సంచలనాలను ఆయన అక్షరబద్ధం చేశారు. అంతేగాక ఆయన ఆంధ్రప్రదేశ్‌లోని విప్లవ సాహిత్యోద్యమానికి సన్నిహిత మిత్రుడు. ప్రజా సాహిత్య సాంస్కృతిక రంగం మీద నల్లా ఆదిరెడ్డి , ఆజాద్ వలె కిషన్‌జీ ముద్ర కూడా ఉంది. తెలంగాణలో ఆరోజుల్లో ప్రజా జీవన రంగాలన్నిటిలో విప్లవోద్యమం వేసిన ప్రభావాన్ని సృజనాత్మక రూపాల్లోకి రచయితలు అనువదించడం వెనుక మల్లోజుల కోటేశ్వరరావు ఉన్నారు. కిషన్‌జీ మరణం మావోయిస్టు ఉద్యమానికి చాలా నష్టమే కావచ్చు.
కానీ కిషన్‌జీని కూడా తయారు చేసిన ఉద్యమం తప్పక ఈ వెలితిని పూరించుకుంటుందని నమ్మవచ్చు. అత్యద్భుతమైన విప్లవకారులను ఎందరినో ఆ ఉద్యమం తయారు చేసింది. పోరాట పథంలో కోల్పోయింది. ఈ రెంటి మధ్యలోనే దేశ వ్యాప్తంగా విస్తరించి ఇవాళ నిజమైన ప్రత్యామ్నాయంగా నిలిచింది. కిషన్‌జీని భావి తరాలు వొళ్లు గగుర్పొడిచేలా, నిలువెల్లా విద్యుత్ ప్రవహించేలా, చరిత్ర పొడవునా నిలిచి ఉండే వీరుడిలా, జానపద కథానాయకుడిలా తలపోసుకుంటారు.
- పాణి
https://www.andhrajyothy.com/EditorialShow.asp?qry=2011/nov/26/edit/26edit3&more=2011/nov/26/edit/editpagemain1&date=11/26/2011
No comments:
Post a Comment