బీహార్ పీడబ్ల్యూజీ బలోపేతం
అక్కడినుంచి బెంగాల్‌కు పయనం
మీడియాతో సాన్నిహిత్యం.. పార్టీలో వివాదాలు
హైదరాబాద్, నవంబర్ 24 జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, బెంగాల్... ఈ మూడు రాష్ట్రాల పోలీసులను, కేంద్ర బలగాలను ముప్పుతిప్పలు పెట్టిన మల్లోజుల కోటేశ్వరరావు అలియాస్ కిషన్‌జీ ప్రస్థానం మన రాష్ట్రంలోనే మొదలైంది. కిషన్‌జీ ఆధ్వర్యంలో జరిగిన లేదా ఆయన వ్యూహం రచించిన దాడుల్లో కేవలం బెంగాల్‌లోనే దాదాపు 900 మంది పోలీసులు మరణించారని అంచనా. లాల్‌గఢ్, సిల్దా లాంటి ప్రాంతాల్లో ఒక సమయంలో కిషన్‌జీ సమాంతర ప్రభుత్వాన్ని నడిపాడంటే అతిశయోక్తి కాదు. 1990లలో ఇతర ప్రాంతాల్లో పార్టీని బలోపేతం చేయడానికి కిషన్‌జీని పార్టీ బీహార్‌కు పంపింది.
ఈ సమయంలో ఆ సమయంలో బీహార్‌లో మావోయిస్ట్ కమ్యూనిస్ట్ సెంటర్ ఆఫ్ ఇండియా (ఎంసీసీఐ) చాలా బలంగా ఉండేది. అలాంటి సమయంలో పీపుల్స్ వార్ గ్రూప్‌ను బీహార్‌లో బలోపేతం చేయడంలో కిషన్‌జీ కీలకపాత్ర పోషించారు. కేవలం అక్కడ కేడర్‌ను ఏర్పరుచుకోవటమే కాకుండా.. 2004లో ఎంసీసీఐని పీపుల్స్‌వార్‌లో విలీనం చేయటంలో కూడా కిషన్‌జీ పాత్ర చాలా కీలకమైంది. బీహార్‌లో ఈ పని పూర్తి కాగానే బెంగాల్‌లో పార్టీని బలోపేతం చేయడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. కిషన్‌జీ బెంగాల్‌లో అడుగుపెట్టిన తర్వాత అక్కడున్న పార్టీ నేతల్లో విభేదాలు మొదలయ్యాయి. కిషన్‌జీ వ్యవహారశైలిపై కేంద్ర కమిటీకి అనేక ఫిర్యాదులు అందాయి.
అయితే చాలా సమయాల్లో కేంద్ర కమిటీ కిషన్‌జీ వైపే మొగ్గు చూపించింది. దీనితో అనేక మంది లీడర్లు పార్టీకి దూరమయ్యారు. ఆ సమయంలో బెంగాల్‌లో ప్రముఖ నక్సల్ నేతగా పేరుమోసిన మాణిక్‌దాపై ఒక సందర్భంలో కిషన్‌జీ దాడి కూడా చేశారంటారు. ఒక వైపు పార్టీలో తన విధానాన్ని కొనసాగిస్తూనే మరో వైపు మీడియాను తమకు అనుకూలంగా వాడుకోవటంలో కిషన్‌జీ సిద్ధహస్తుడనే చెప్పాలి. సాధారణంగా నక్సల్ అగ్రనేతలు ఎవరు మీడియాతో మాట్లాడటానికి సుముఖంగా ఉండరు. బెంగాల్ లాల్‌గఢ్‌లో చాలా ప్రాంతాలను నక్సల్స్ ఆక్రమించిన తర్వాత- కిషన్‌జీ మీడియాతో మాట్లాడి సంచలనాలు సృష్టించటం మొదలుపెట్టారు.
తన ముఖాన్ని తువ్వాలుతో కప్పుకొని కనిపించే కిషన్‌జీ మీడియా ద్వారా కేంద్ర ప్రభుత్వానికి సవాళ్లు విసేవారు. ఒక సందర్భంలో హోం మంత్రి చిదంబరంతో శాంతి చర్చల కోసం ఫోన్ చేయాలంటూ ఒక ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు. కిషన్‌జీ బెంగాల్‌కు రాకముందు సీపీఎం కార్యకర్తలు.. మావోయిస్టు సానుభూతిపరుల మధ్య అనధికార ఒప్పందం ఉండేది.
దాంతో సీపీఎం కార్యకర్తలపై సాధారణంగా మావోయిస్టు దాడులు జరిగేవి కావు. కిషన్‌జీ వచ్చిన తర్వాత పరిస్థితి మారింది. తమకు అడ్డువచ్చిన వారిని- పార్టీలతో సంబంధం లేకుండా హతమార్చడంతీవ్ర నిరసనకు దారి తీసింది. 2009లోనే కిషన్‌జీ 93 రాజకీయ హత్యలకు కారణమయ్యాడనేది సీపీఎం (మావోయిస్టు) పార్టీ నుంచి బయటకు వచ్చిన నేతల ఆరోపణ. నందిగ్రామ్‌లో మాతాంగని మహిళా సమితి, గణపతి రోథ్ మోర్చా వంటి సంస్థలను కిషన్‌జీ ఏర్పాటు చేశారు.
లాల్‌గఢ్‌లో సీపీఎం నేతలను తరిమేసిన తర్వాత కిషన్‌జీ కొన్ని వ్యూహాత్మక తప్పిదాలను చేశారని కొందరు మావోయిస్టు నేతల అంచనా. ముఖ్యంగా లాల్‌గఢ్‌లో సీపీఎం నేత అంజూ పాండే ఇంటిని కూలగొట్టిన తర్వాత, కిషన్‌జీ సహాయకుడు వికాస్ టీవీ కెమెరాల ముందుకొచ్చి ఉద్యమంలో తమ పార్టీ పోషిస్తున్న పాత్ర గురించి బహిరంగంగా చెప్పాడు. కిషన్‌జీ అనుచరులు ఆయుధాలను కూడా ప్రదర్శించారు. దీనితో భద్రతా దళాలు లాల్‌గఢ్ ప్రాంతాన్ని జల్లెడ పట్టడం మొదలుపెట్టాయి. దీనితో నక్సల్స్‌కు తీవ్రమైన ఎదురుదెబ్బలు తగిలాయి.
https://www.andhrajyothy.com/mainnewsshow.asp?qry=2011/nov/25/main/25main12&more=2011/nov/25/main/main&date=11/25/2011
No comments:
Post a Comment