యువత తుపాకులు పట్టకుండా ప్రజాస్వామ్య సమాజం కోసం పోరాడండి. సమస్యకు పరిష్కారం, పెద్ద ఆయుధం ప్రజాస్వామ్యమే. లేదా నాతో రండి మీకు తృప్తిని కల్గిస్తాను. నిత్యం ఆవేదనతో కాలిపోతున్న నన్ను కిషన్‌జీ చావు రెచ్చగొట్టింది.
కిషన్‌జీ (మల్లోజుల కోటేశ్వరరావు), నువు చనిపోతావని నేను ఖచ్చితంగా ఊహించాను. కానీ మీ చేతుల్లో ఎవరు చనిపోతారనేది తెలియదు. మంచి-చెడు, హింస-అహింస ఏది సత్యం! ఏది అసత్యం! అనే చర్చకు తావేలేదు. ఇప్పుడు ఏచూరి ఆ పార్టీకి నాయకుడు కాబోతున్నాడని తెలుస్తోంది. అంతకుముందు చిదంబరమే మీకు శత్రువు అనుకున్నారు. ఆనాడే బుద్ధదేవ్, ఏచూరి, కారత్... వీళ్లంతా మీకు వ్యతిరేకులే. పేరుకు అందరిది మార్క్సిజమే. జరిగే కార్యక్రమాలు అన్నీ మార్క్స్ పేరున; చాటున చనిపోయిన అమరుల్లో నువు ఒకడివి. ఇప్పుడు మొసలి కన్నీరు కార్చటానికై చాలా మంది వున్నారు. నీ వరుసలో చావుకు సిద్ధంగా వున్న వారి లెక్క నా దగ్గర లేదు గానీ నీ వెనకమాల వున్న అనేక మందికి చావు తథ్యం. ఇది సత్యం. ఆ చావులను ఎన్‌కౌంటర్లు అనండి లేక మరొక పేరు పెట్టండి. మీ చేతుల్లో ఏ అమాయకుడు పోతాడో లేదా మీ తరఫున ఎంతమంది అమాయకులు బలిఅయిపోతారో అవి జరిగే క్షణాల వరకు మేము ప్రేక్షక పాత్ర వహించే వాళ్లమే.
కిషన్‌జీ మిత్రులను అడుగుతున్నాను- ఎక్కువ దూరం అక్కర్లేదు, రణదివే, సుందరయ్య సిద్ధాంతాల చాటున జరిగిన ఉద్యమంలో ఎన్ని వేల మంది రక్తం ఈ భూమిలో కల్సిపోయిందో తెలియలేదు. కాంగ్రెస్, సోషలిస్ట్‌ని ప్రక్కన పెట్టి ఆలోచించండి, తిరుగుబాటు కమ్యూనిస్టు సమాజాన్ని ఏర్పరుస్తుంది. రష్యా లాంటి సమాజ నిర్మాణం ఇక్కడ జరుగుతుందని ఆశపెట్టారు. దాన్ని కార్యకర్తలు నమ్మి బలిఅయిపోయారు. తిరిగి ప్రజాస్వామ్య బద్ధంగా నడిచి సమ సమాజాన్ని సాధిస్తామని అదే కమ్యూనిస్టులు ప్రతిజ్ఞ పూనారు. ఆ నాటి నుంచి అనేక సంవత్సరాలుగా ఉభయ కమ్యూనిస్టు పార్టీలు ఈ దేశానికి హామీ ఇవ్వని రోజుల్లేవు. కాని తిరుగుబాటు మావో సిద్ధాంతాలతో నిర్మిస్తామని చార్ మజుందార్ నుంచి ఈ రోజు వరకు వేలాది పిల్లలు బలమైన ప్రజాస్వామ్య ప్రభుత్వం మీద పోరాడి మావో సిద్ధాంతపు పంటలు ఇక్కడ పండిస్తామని వేలాది యువకులను బలి ఇచ్చారు.
ప్రపంచంలోని ఏడెనిమిది బలమైన ప్రభుత్వాల్లో అన్ని హంగులు కల్గినది మన భారతదేశ ప్రభుత్వం. ఇది తెలియనివాడు ఏచూరి కానే కాడు. తెల్సిన జ్యోతిబసు, రాజేశ్వరరావు మరొకబాటలో ప్రయాణించి ప్రపంచ గమనాన్ని దృష్టిలో పెట్టుకొని మార్గాన్ని మార్చుకున్నారు. ఈ హింసలో బలి అయిపోయే కమ్యూనిస్టు కామ్రేడ్స్‌కు ఎవరు సమాధానం చెప్తారు జడ్.ఏ.అహ్మద్, పి.సి.జోషి లాంటి నాయకుల కాలం నుంచి ఈనాటి వరకు నాయకత్వం వహిస్తున్న అన్ని కమ్యూనిస్టు పార్టీ వర్గాలు ఈ త్యాగాలకు ఏమని సమాధానం చెప్తారో!
సిద్ధాంతాల పేరున రెచ్చగొట్టే ఆ చావులే త్యాగమని నమ్మించి చనిపోయిన తర్వాత మొసలి కన్నీరును ఏమంటాము హింస అయినా, అహింస అయినా, తప్పైనా నమ్మి తోటి మానవుడి మంచి కోసం ముందుకెళ్లిన వాడు హింసావాది అయినా వాడు వీరుడే అవుతాడు. రెచ్చగొట్టిన వారు చాలా మంది వున్నారు. 'నేడు నిన్ను నక్సలైట్ అంటారు, నాడు నిన్ను భగత్ సింగ్ అన్నారు, రేపు వేగుచుక్క అంటారు'- ఈ మాటలతో ఉత్తేజితులయిన యువకులకు, ఆ దేశభక్తికి నేను జోహార్లు అర్పిస్తున్నాను. హింస ఏ రకంగాను నువు అనుకున్న సమాజాన్ని స్థాపించటానికి పనికిరాదు.
అది సరియైన మార్గం కాదు. నీ కళ్ల ముందు జరిగిన అన్యాయాల్ని ఎదుర్కోకుండా బెంగాల్‌లో చనిపోయిన నిన్ను ఎలా ఊహించాలి నేను పచ్చి కాంగ్రెస్‌వాదిని, గాంధేయవాదిని, మార్క్సిజంలో సిద్ధాంత పటుత్వాన్ని నమ్మినవాడిని. మనకు సంక్రమించిన ఈ కుళ్ళు సమాజంలో సీలింగ్ చట్టాన్ని తప్పించి, ఎన్ని వేల, లక్షల ఎకరాల భూమి వాళ్ల చేతుల్లో వుందో అని ఎపుడైన లెక్కతీశారా లేదా పరంపరగా దేవాలయాల పేరుతో లక్షల ఎకరాల భూమి మీద వచ్చే ఆదాయం పేదవాడికి ఏమైనా దక్కిందా ఈ లక్షల ఎకరాల దేవాలయ భూమి మీద వచ్చే ఆదాయంతో ప్రతి పేదవాడికి రెండు లక్షల రూపాయలతో కనీసం ఐదు సంవత్సరాల్లో ఇల్లు కట్టవచ్చు.
అడవుల్లో కాకుండా బహిరంగ ఉద్యమాల ద్వారా పోరాడితే పేదల లక్షలాది ఎకరాల భూమికి నీరు 30 సంవత్సరాల క్రితమే ఇవ్వగలిగేవాళ్లము. ఈ నాటికి బానిస ఛాయలు, కుల దౌర్జన్య ఛాయలు, అధికార దౌర్జన్య ఛాయలు, ధనబలం ఛాయలు, విజయ బలం దౌర్జన్యం... నేనైతే నిత్యం చూస్తూనే వున్నా. వేలాది ఐఏఎస్, ఐపిఎస్ అధికారులు వారికి అనుగుణంగా పరిపాలన చేసుకుంటూ వుంటే ఎదిరించి ప్రజల పక్షాన నిలబడి పోరాడవలసిన మీరు చావుల కోసం పోరాడుతున్నట్టుగా వుంది. ప్రపంచంలో అగ్రగామి దేశం, అన్ని హంగులు వున్న దేశం, ముఖ్యంగా ప్రజాస్వామ్య సెక్యులర్ వ్యవస్థని నమ్మి అధికారంలో వున్న దేశంలో మీరంతా ఒక ప్రక్క న్యాయానికి పోరాడుతుంటే మరొక ప్రక్క అధికారం కోసం మతాన్ని, కులాన్ని, ధనాన్ని ఉపయోగించుకొని చాలామంది అధికారం చెలాయించుతున్న దేశం కనబడుతున్నది.
120 కోట్ల మంది ప్రజలను మీరనుకున్న సిద్ధాంతం వైపు నడిపించటానికి నెహ్రూ లాంటి నాయకుడు మీకున్నాడా ఇందిరలాంటి నాయకురాలు మీకున్నారా లేదా కనీసం వీరులుగా మరణించిన గత వీరులు మీకెవరైనా వున్నారా సమస్యలు కళ్ల ముందు వున్నాయి. నా వరకు నేను నిత్యం పరిష్కరించలేక కాంగ్రెస్‌లోనే వుండి అల్లల్లాడిపోతున్నాను. పోరాడి సాధించే సమయాన్ని వెచ్చించటానికి కూడా పౌరుడు సిద్ధంగా లేడు. గంటల్లోనే తాను పెద్దవాడు కావాలని, అభివృద్ధిలో భాగస్వామి కావాలని పరుగుపరుగున సిద్ధాంతీకరించుకన్నాడు. ఇప్పుడు నేనడుగుతున్నా- ఇప్పటికైనా మీ వీరుల త్యాగాల ఫలితం రావాలంటే అడవులు, తుపాకులు రెండూ అక్కర్లేదు. ప్రజల్లో పోరాటం మెచ్చుకుంటే నిలబడితే ఒకదెబ్బ పౌరుడి మీద పడితే వేల మంది అన్యాయాల్ని ఎదిరించటానికి సిద్ధంగావున్నారు. వందలాది సమస్యలు, వేలాది అన్యాయాలు చాప కింద వున్న వాటిని మనం చూడగల్గాలి.
కాబోయే ఏచూరి మీ వైపు నిలబడతాడా చైనా నుంచి మావో ఆత్మ మీకెలా ఉపయోగపడ్తుంది ఇదంతా మీ మీద పగతో కాదు, బాధతో, ఆవేదనతో రాస్తున్నాను. వేలాది ఎకరాల దేవాలయాల భూమి, వేలాది ఎకరాల సీలింగ్‌ల భూమి బంది అయిపోతే ప్రశాంతంగా సాగే -ఈ దౌర్జన్యాన్ని ఎదుర్కోవటానికి నీ మిత్రులు ఆలోచించాలని కోరుతున్నాను. ఇప్పుడు కన్నీరు పెట్టే వాళ్లని నమ్మి యువత తుపాకులు పట్టకుండా ప్రజాస్వామ్య సమాజం కోసం పోరాడండి. సమస్యకు పరిష్కారం, పెద్ద ఆయుధం ప్రజాస్వామ్యమే. లేదా నాతో రండి మీకు తృప్తిని కల్గిస్తాను. నిత్యం ఆవేదనతో కాలిపోతున్న నన్ను కిషన్‌జీ చావు రెచ్చగొట్టింది.
- పాలడుగు వెంకటరావు
శాసనమండలి సభ్యులు
https://www.andhrajyothy.com/EditorialShow.asp?qry=2011/nov/26/edit/26edit4&more=2011/nov/26/edit/editpagemain1&date=11/26/2011
No comments:
Post a Comment