Sunday, 18 December 2011

లాల్‌గఢ్ యుద్ధభేరి ‘మల్లోజుల’!


కిషన్‌జీ ఇక లేడు. ఆంతరంగిక భద్రతకు అతి పెద్ద ముప్పుగా మారిందంటున్న మావోయిస్టు ఉద్యమ నేతగా అందరికీ సుపరిచితమైన ‘ఒకే ఒక్కడి ’ గొంతు ఇక వినిపించదు. లాల్‌గఢ్‌కు లాల్‌సలామ్ పలికి అధికార పీఠమెక్కిన మమత మావోయిస్టులతో ‘చర్చలకు’ ప్రయత్నిస్తూనే వారి ప్రతినిధిగా వ్యవహరించాల్సిన కిషన్‌జీగా అందరికీ తెలిసిన మల్లోజుల కోటేశ్వరరావు కథ ముగించడానికి కేంద్ర హోం శాఖకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందంటూ వెలువడుతున్న కథనాలు నిరాధారం కావు. గత కొద్దికాలంగా మావోయిస్టులపై భిన్న స్వరాలను వినిపిస్తూనే ఉంది. ఏమైతేనేం మధ్య భారతంలోని దట్టమైన అటవీ ప్రాంతాల నుంచి మావోయిస్టులను ఏరిపారేయడం కోసం కేంద్రం చేపట్టిన గ్రీన్ హంట్‌కు వ్యతిరేకంగా ప్రచార యుద్ధ భేరీయై మోగిన ఆ ఒకే ఒక్క గొంతు ఇక వినిపించదు.

నిత్యమూ మీడియాలో కనిపిస్తుంటే, వినిపిస్తుంటే ‘ఎప్పుడో పోతాడు... తప్పదు’ అని ఆత్మీయులు ఆవేదనతో అనుకుంటే, అతని ఇంటర్వ్యూల కోసం ఎదురుతెన్నులు చూసిన మీడియా ప్రతినిధులు అతనికి మైకు పిచ్చి అనుకోకపోలేదు. మల్లోజుల అభిమానులు, అభిమానులు కాని వారు కూడా అతని బలహీనతగా భావించినది బలహీనత కాదు, మోయక తప్పని బాధ్యత. ప్రాణాలు పణంగా పెట్టి కిషన్‌జీ సాగించిన రెండేళ్ల ప్రచార క్యాంపెయిన్ ఫలితాలను సరిగ్గా అంచనా కట్టగలిగింది బహుశా కేంద్ర హోం శాఖ మాత్రమే కావచ్చు. గ్రీన్ హంట్‌కు వ్యతిరేకంగా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలలో సాగిన మావోయిస్టు ప్రచార యుద్ధం ధాటికి వేట ఆగకపోయినా, గ్రీన్ హంట్ అనేదేదీ లేనేలేదని ప్రకటించాల్సి వచ్చింది. ఎప్పుడు ‘ఆ వార్త' వినాల్సి వస్తుందోనని అంతా ఎదురుచూస్తున్న రోజుల్లో వినిపించని ‘ఎన్‌కౌంటర్’ వార్త హఠాత్తుగా ఇప్పుడు వినిపించింది.

మల్లోజుల మరణం మావోయిస్టు పార్టీగా విలీనమైన ఒకప్పటి పీపుల్స్‌వార్ పార్టీ నాయకత్వంలోని ఒక తరం అంతరించబోతుండడాన్ని సూచిస్తుంది. ఎమర్జెన్సీ చీకటి రోజుల తదుపరి అందివచ్చిన వెసులుబాటు పరిస్థితులను ఉపయోగించుకొని కొండపల్లి వర్గశత్రు సంహార పంథాలోని తన నక్సలైటు వర్గాన్ని ప్రజాపంథా పట్టాలపైకి ఎక్కించాడు. విస్తృత ప్రజాబాహుళ్యాన్ని దైనందిన పోరాటాలలోకి సమీకరించే మహాయత్నంలో కమ్యూనిస్టు పార్టీతో అంతకు ముందు ఎలాంటి అనుబంధమూ లేని కొత్త తరం నక్సలైట్లు కొండపల్లి చేతిలో సాధనాలు అయ్యారు. 1978 నాటికి దొర పాలనకు స్వస్తి పలికే ‘జగిత్యాల జైత్రయాత్ర’ను సాధ్యం చేసి చూపించారు. జగిత్యాల రైతాంగ పోరాట కెరటాలపై కరీంనగర్ నుంచి విప్లవకారులుగా కాకలు తీరిన వారిలో నిన్నటి వరకూ మావోయిస్టు కేంద్ర కమిటీలో ముగ్గురు ఉండేవారు. రాజిరెడ్డి కేంద్ర కమిటీలోనే ఉన్నా ఉద్యమానికి కీలక నాయకత్వం అందించగల శక్తి గలవాడు కాడు. ఇక కార్యదర్శి ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతిని మినహాయిస్తే, మల్లోజులే కీలక నేత.

1975కు ముందు అంతగా ప్రాధాన్యం లేని కొండపల్లి వర్గం నక్సలైట్లు, నేడు నక్సలైట్లకు పర్యాయపదంగా మారిన మావోయిస్టు పార్టీగా ఎదగడంలో ఆనాటి జగిత్యాల జైత్రయాత్ర నిర్ణయాత్మకమైన మైలురాయిగా నిలిస్తే, ఆ కీలక మలుపునకు ప్రతినిధిగానే మల్లోజుల 1980లో రాష్ట్ర కమిటీకి ఎన్నికయ్యాడు, ఏకంగా కార్యదర్శే అయ్యాడు. గణపతి అప్పట్లో రాష్ట్ర కమిటీ సభ్యుడు కాడు, కరీంనగర్ జిల్లా కార్యదర్శి. ఆనాటి రాష్ట్ర కమిటీ సభ్యులలో మావోయిస్టు పార్టీలో మిగిలిన ఏకైక నేత మల్లోజుల ఒక్కరే. ఉద్యమ ప్రాంతాలకు నాయకత్వం అంటూ కమ్యూనిస్టు సూత్రాలకు లొంగని ఒక వివాదాస్పద సూత్రంతో కొండపల్లి మల్లోజులను రాష్ట్ర కమిటీ కార్యదర్శిని చేయడానికి కారణం.. కొత్త తరం మాత్రమే ఒంటెత్తు పోకడలకు పోకుండా ప్రజాపంథాకు ప్రాణం పోయగలదన్న విశ్వాసమే. కొండపల్లి తనపై ఉంచిన నమ్మకానికి మించి మరీ మల్లోజుల ఉద్యమాన్ని బహుముఖంగా విస్తరింపజేయగలిగాడు. అంతేకాదు కొండపల్లి కల పీపుల్స్‌వార్, ఎంసీసీ, పార్టీ యూనిటీల ఐక్యతను సాకారం చేసింది కూడా మల్లోజులే.

మల్లోజుల అలియాస్ ప్రహ్లాద్‌గా కార్యదర్శి బాధ్యతలను స్వీకరించినదే తడవుగా అవి తనకు చిరపరిచితమైన బాధ్యతలేనన్నంత సమర్థవంతంగా నాయకత్వం అందించగలిగాడు. 1985లో ఎన్టీఆర్ హయాంలో ఎన్‌కౌంటర్ల పర్వం మొదలు కావడానికి ముందు నాటికి రాష్ట్ర వ్యాప్తంగా రాడికల్స్ ఒక ప్రముఖ శక్తిగా ఎదిగారు. రైతు కూలీలు, విద్యార్థి, యువజన, కార్మిక, ఉద్యోగి, మేధావి రంగాలలోకి, సాంస్కృతిక సాహిత్య రంగాలలోకి ఉద్యమం వేగంగా విస్తరించడంలో మల్లోజుల కీలక పాత్రధారి అయ్యాడు. 1980-85 మధ్య హైదరాబాద్‌ను పీపుల్స్‌వార్ పార్టీకి ‘రాజధాని’గా మార్చేశాడు. ప్రహ్లాద్‌తో విశ్వవిద్యాలయాలు, కార్మికవాడలు, బస్తీలు, ఉద్యోగులు, టీచర్ల ఇళ్లు హైదరాబాద్‌లో ఎక్కడ చూసినా అతని డెన్‌లే. కరీంనగర్ వాళ్లకు అప్పట్లో విలక్షణమైన గుర్తుగా ఉండే మెలి తిరిగిన భారీ మీసాలతో తెల్లవారింది మొదలు నడిరాతిరి వరకూ సైకిల్‌పైనే ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి, డెన్ నుంచి డెన్‌కి, సమావేశం నుంచి సమావేశానికి సాగిన ప్రహ్లాద్ ఎప్పుడూ బిజీయే.

కానీ ఎన్నడూ అలసట కనిపించేది కాదు లేదా కనిపించనిచ్చేవాడు కాదు. ఆ నిత్యనూతనోత్సాహం, క్షణమైనా విశ్రాంతి లేకుండా ఇంకా మరింత మందిని కలవడం... మాట్లాడడం... ఎవరి శక్తియుక్తులను బట్టి వారికి ఏదో ఒక పని అప్పజెప్పి ఉద్యమంలో భాగస్వాములను చేయడమే. వెయ్యికాళ్ల జెర్రి అంటూ తనకు సహచరులు పెట్టిన పేరుకు తగ్గట్టుగానే మల్లోజుల చివరికంటా తాను పరుగులు తీస్తూ, సహచరులను పరుగులు తీయించేవాడు. ఉద్యమాన్ని కొత్త ప్రాంతాలకు, కొత్త రంగాలకు విస్తరింపజేయడంలో ఈ ఉత్సాహమే పెట్టుబడిగా నిలిచింది. తెలంగాణ జిల్లాలకు ప్రత్యక్ష బాధ్యతలు వహిస్తూ, మరోవంక రాష్ట్ర స్థాయి ప్రజా సంఘాలకు, రాష్ట్ర కమిటీకి నేతృత్వం వహించాడు. మరో చేత్తో 1980లో మొదలైన దండకారణ్య ఉద్యమానికి ఐదేళ్లపాటు అన్నీ తానే అయి నిలిచాడు.

1986లో దండకారణ్యానికి ప్రత్యేక కమిటీ ఏర్పడిన తదుపరి ఆ కమిటీకి ప్రత్యక్ష మార్గదర్శి అయ్యాడు. నూతన రాష్ట్ర కమిటీ కార్యదర్శి గణపతి దండకారణ్య బాధ్యతలు స్వీకరించడంతో 1990 నాటికి కలకత్తా నగరం చేరాడు. తొలినాటి నుంచి బహుశా తుదివరకూ మల్లోజులపై సహచరులందరికీ ఒక్కటే ఫిర్యాదు... అత్యుత్సాహం. తన పరిధులు దాటి మరీ అన్ని పనులనూ నెత్తిన వేసుకోవడం, అతి చొరవ చాలా మంది అతని బలహీనతలనుకున్నవే అతనిలోని బలమైన అంశాలు. హద్దులు దాటనివారు సరిహద్దులను చెరపలేరు. అలా అన్ని హద్దులూ దాటే, మార్క్సిస్టుల కంచుకోటలో పాగావేసి, ఆ పార్టీ పతనానికి ముఖ్య కారణంగా మారిన లాల్‌గఢ్ ఉద్యమాన్ని నిర్మించాడు. పార్టీ యూనిటీతో సరిహద్దులు చెరిపేయగలిగాడు. ఎంసీసీతో విలీనాన్ని సాధ్యం చేయగలిగాడు. ఢిల్లీ, హర్యానా, ఉత్తరప్రదేశ్‌ల నుంచి ఈశాన్యం వరకూ అంతా... వె య్యి కాళ్ల జెర్రి కాబట్టే చుట్టేయగలిగాడు.

తను నడిచిన బాటంతా మావోయిస్టు ఉద్యమం విత్తనాలు చల్లగలిగాడు. సరిగ్గా చెప్పాలంటే మల్లోజుల ఎన్నడూ ‘అజ్ఞాతవాసం’లో లేడు. దాదాపు ఎప్పుడూ బహిరంగంగా కనిపిస్తూనే... అందినట్టే అంది తప్పించుకుంటూ అతడు చూపిన చేదు అనుభవాన్ని పోలీసులు అంత తేలికగా మరిచిపోలేరు. 1975లో పెద్దపల్లి కాలేజీ విద్యార్థిగా నక్సలైటు ఉద్యమంలో చేరింది మొదలు బెంగాల్‌లో తుదిశ్వాస విడిచేవరకూ మల్లోజులది బహిరంగ జీవితమే. జన జీవితమే. జాగ్రత్తల పేరిట మడిగట్టుకోవడం కంటే నిత్యమూ ప్రమాదాలను ఆహ్వానిస్తూ ‘లీగల్ పద్ధతులు’ అన్న విమర్శలను ఎదుర్కొంటూ మూడున్నర దశాబ్దాలు ఆయన బతకగలగడమే విచిత్రం. అనుక్షణం అప్రమత్తతతో వ్యవహరించే నేర్పు, క్షణాల్లో నిర్ణయాలు తీసుకోవడం మల్లోజులకు తోడ్పడ్డాయి.

మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి అనారోగ్యంతో పలు కీలక బాధ్యతల నుంచి ఇప్పటికే తప్పుకొని ఉంటారని ఊహించడం కష్టం కాదు. మరో వంక ఆజాద్ ఎన్‌కౌంటర్ కావడంతో మావోయిస్టు పార్టీ అగ్రనాయకత్వంలో పూడ్చలేని అతి పెద్ద శూన్యం ఏర్పడింది. లాల్‌గఢ్ ఉద్యమ గళంగా నిత్యమూ మీడియాలో కనిపించే మల్లోజుల ఇటీవల ‘కనుమరుగు’ కావడానికి కారణం అదే అయి ఉంటుందనుకోవాలి. పీపుల్స్‌వార్ పార్టీ సీపీఐఎంఎల్ (పార్టీ యూనిటీ)తోనూ, మావోయిస్టు కమ్యూనిస్టు సెంటర్ (ఎంసీసీ)తోనూ విలీనం కోసం సుదీర్ఘకాలం సాగించిన చర్చల్లో కిషన్‌జీగా మల్లోజులదే కీలకపాత్ర. ఆ పార్టీలతో జరిగిన విలీనాల తదుపరి ఏర్పడ్డ మావోయిస్టు పార్టీకి దేశం తూర్పు, ఉత్తర ప్రాంతాల్లో అతి కీలక నేత మల్లోజులే. అంత ప్రముఖుడు కాకపోయినా ఉత్తర భారతంలో సుదీర్ఘకాలం పనిచేసిన సుబ్రహ్మణ్యం అలియాస్ విమల్ అరెస్టుతో పీపుల్స్‌వార్ పార్టీ నుంచి ఆ ప్రాంతాల్లో ఉద్యమానికి నేతృత్వం వహించడానికి, విలీనమైన ఆ రెండు పార్టీల నేతలతో, క్యాడర్‌తో సన్నిహిత సంబంధాలు నెరపడానికి తగిన నేత ఇప్పట్లో దొరుకుతాడని భావించలేం. గణపతి తర్వాత ఆ పార్టీకి సారథిగా నిలవడానికి ఇంకా మిగిలి ఉన్న ఏకైక నేత కిషన్‌జీ మరణం లోటునుంచి ఆ పార్టీ ఇప్పట్లో కోలుకోలేదు.

కేంద్ర హోంశాఖ నక్సలైట్ల ప్రభావిత ప్రాంతాల అభివృద్ధి జపం చేస్తూనే సమస్యను సైనిక పద్ధతుల్లో పరిష్కరించడం అనే ఏకైక మార్గాన్ని అనుసరిస్తోందన్నది స్పష్టమే. ఈ పరిస్థితుల్లో మల్లోజుల వంటి బహుముఖ ప్రజ్ఞాపాటవాలు గల నేత... ప్రత్యేకించి ప్రజాసంఘాలు, విస్తృత ప్రజా ఉద్యమాలు నిర్మించగల నేత ఇప్పట్లో తయారుకావడం కష్టం. ఒక ప్పటి ఎంసీసీ నుంచి వచ్చిన నేతలకు విశాల ప్రాతిపదికపై ప్రజా ఉద్యమాలను నిర్మించడంలో అనుభవం తక్కువ. మావోయిస్టులపై కేంద్ర హోంశాఖ పోరు రోజురోజుకూ పూర్తిస్థాయి యుద్ధ స్వభావాన్ని సంతరించుకుంటోంది.

ఈ పరిస్థితుల్లో ఇప్పటికే సైనిక పంథా పార్టీలో పైచేయి సాధించిందన్న విమర్శల్ని ఎదుర్కొంటున్న మావోయిస్టులు మరింత ఎక్కువగా సాయుధ చర్యలకు పరిమితమయ్యే ప్రమాదముంది. గ్రీన్‌హంట్‌తో మావోయిస్టులపై పైచేయి సాధించలేకపోయినా కేంద్ర ప్రభుత్వం కీలక నేతలను హతమార్చడంలో విజయం సాధించగలుగుతోంది. గత కొన్నేళ్లుగా సాగుతున్న నేతల వేట మల్లోజుల ఎన్‌కౌంటర్‌తో ఆ పార్టీలో తీవ్ర నాయకత్వ సంక్షోభాన్ని సృష్టించే స్థాయికి చేరవచ్చు. ఆ సంక్షోభం సైన్యం పరోక్ష సాయంతో సాగిస్తున్న గ్రీన్‌హంట్‌కు తోడ్పడవచ్చు. కానీ, నక్సలైటు ఉద్యమాన్ని అంతం చేయలేదు. సామాజిక, ఆర్థిక అసమానతల నుంచి పుట్టిన ‘ఆంతరంగిక భద్రతకు అతి పెద్ద ముప్పు’కు కేంద్రం సైనిక పద్ధతుల్లో పరిష్కారాన్ని వెతుకుతూ మరింత పెనుముప్పును ఆహ్వానిస్తున్నట్టు గుర్తించినట్టు లేదు.

విశ్లేషణ
- పిళ్లా వెంకటేశ్వరరావు

No comments:

Post a Comment