Monday, 19 December 2011

పుట్టింట్లో పూర్వవైభవానికి సారథి

హైదరాబాద్, న్యూస్‌లైన్ నక్సలిజానికి పుట్టిల్లయిన పశ్చిమబెంగాల్‌లో ఉద్యమానికి పూర్వ వైభవం సాధించి పెట్టిన ఘనత కిషన్‌జీదే. 3 దశాబ్దాలకు పైగా బెంగాల్‌ను ఏలిన లెఫ్ట్ సర్కారుకు చివరి ఐదేళ్లలోనైతే వెన్నులో చలి పుట్టించారు! మెరుపు దాడులతో పోలీసులకు ముచ్చెమటలు పోయించారు. నాటి సీఎం బుద్ధదేవ్ భట్టాచార్యపై మందుపాతర పేల్చి సంచలనం సృష్టించారు.

వామపక్షాల పతనానికి బాటలు వేసిన నందిగ్రాం, లాల్‌గఢ్ ఉద్యమాల్లోనూ కీలక పాత్ర పోషించారు. బెంగాల్, జార్ఖండ్ రాష్ట్రాల్లో, జంగల్‌మహల్ ప్రాంతంలో మావోయిస్టు పార్టీ సాయుధ కార్యకలాపాలకు కుష్బొనీ అడవుల నుంచే కిషన్‌జీ 2009 నుంచి సారథ్యం వహిస్తున్నారు. బెంగాల్లోని మిడ్నాపూర్, పురులియా, బంకుర జిల్లాలపై పూర్తి పట్టు సాధించారు. నాడియా, ముర్షిదాబాద్, మాల్డా, బర్ద్వాన్ జిల్లాల్లో కార్యకలాపాలను విస్తరించారు.

‘‘ఐదేళ్ల సమయమివ్వండి. ప్రభుత్వానికి నిద్రలేని రాత్రులు చవిచూపుతాం. మా మాస్ నాయకుడు రంగంలోకి దిగాడు’’ అని కిషన్‌జీ గురించి పేర్కొంటూ మావోయిస్టు పార్టీ 2005లో బెంగాల్ అంతటా పోస్టర్లు వేయడం విశేషం! పోలీసులు తనను గుర్తు పట్టకుండా ఉండేందుకు కిషన్‌జీ నిత్యం ముఖం చుట్టూ గుడ్డ చుట్టుకుని నిత్యం ఒకచోటి నుంచి మరోచోటికి మారుతూ ఉండేవారు. తలను పూర్తిగా గుడ్డతో కప్పుకుని, వెనక్కు తిరిగి నుంచుని, భుజానికి ఏకే 47 రైఫిల్ వేసుకుని మాట్లాడుతున్న కిషన్‌జీ ఫొటో మీడియాలో ఎప్పుడూ కన్పిస్తుంటుంది. జాతీయ మీడియాకు ఆయన తరచూ ఇంటర్వ్యూలు ఇచ్చేవారు.

http://sakshi.com/main/FullStory.aspx?catid=273340&Categoryid=1&subcatid=33

No comments:

Post a Comment