Friday, 30 December 2011

విప్లవాల బాటసారి

విద్యార్ధి దశ నుంచే ఉద్యమంలోకి
ఆర్ఎన్‌యూ వ్యవస్థాపకుల్లో ఒకరు
31 సంవత్సరాలుగా అజ్ఞాత జీవితం
మావోయిస్టు పార్టీలో అగ్రస్థానం
ఓరుగల్లులో ఉద్యమ పాఠాలు
కొండపల్లితో సాహచర్యం
ఇదీ ఆజాద్ ప్రస్థానం

మూడు దశాబ్దాల అజ్ఞాత జీవితం, మూడు వందలకుపైగా కేసులు, సంచలనాత్మక దాడులకు వ్యూహం, తలపై 12 లక్షల రూపాయల వెల! అన్నీ కలిపితే ఒక ఆజాద్! ఆయనే చెరుకూరి రాజ్ కుమార్!

ప్రధాని మన్మోహన్ సింగ్‌కు గుణపాఠం చెబుతామని హెచ్చరించినా, హోంమంత్రి చిదంబరాన్ని భారత హిట్లర్‌గా అభివర్ణించినా, పాలకులే అసలైన టెర్రరిస్టులంటూ తెగనాడినా... ఆ ప్రకటన చివర్లో 'ఆజాద్' సంతకం కనిపిస్తుంది.

కేంద్ర కమిటీ సభ్యుడైన ఆయన మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి. మావోయిస్టు దళపతి గణపతికంటే ముందుగా ఆజాద్ కేంద్ర కమిటీ సభ్యుడు! ఇప్పుడు... గణపతి తర్వాత ఆయనే అగ్రనాయకుడు. ఆజాద్ జీవితం ఉద్యమానికి అంకితం. ఆయన మరణం మావోయిస్టు పార్టీకి శరాఘాతం.

( న్యూస్‌నెట్‌వర్క్) కృష్ణా జిల్లాకు చెందిన చెరుకూరి లక్ష్మయ్య చౌదరి, కరుణ దంపతుల కుమారుడు రాజ్ కుమార్. కోస్తాలో పుట్టిన ఆయన చదువుల కోసం తెలంగాణ వచ్చారు. కోరుకొండ సైనిక స్కూల్‌లో చదువు అనంతరం... వరంగల్‌లోని రీజినల్ ఇంజనీరింగ్ కాలేజీ (ఆర్ఈసీ)లో బీటెక్‌లో చేరారు. అక్కడ ఆయన ఉద్యమ పాఠాలూ నేర్చారు.

సౌమ్యుడిగా కనిపించినప్పటికీ... అన్యాయాలపై తీవ్రంగా స్పందించేవారు. ఆజాద్ ఆర్ఈసీలో చదువుతున్న సమయంలోనే కొండపల్లి సీతారామయ్య కాజీపేటలోని ఫాతిమా స్కూల్‌లో హిందీ పండిట్‌గా, కేజీ సత్యమూర్తి సెయింట్ గ్యాబ్రిల్ స్కూలులో ఇంగ్లీష్ మాస్టర్‌గా పని చేసేవారు. వీరితో ఆజాద్‌కు సాన్నిహిత్యం పెరిగింది. మరో నక్సల్ నేత సూరపనేని జనార్దన్ అందించిన స్ఫూర్తి తోడైంది.

ఈ క్రమంలోనే 1974లో రాడికల్ విద్యార్థి సంఘం (ఆర్ఎస్ యూ) ఏర్పాటయింది. దాని వ్యవస్థాపక సభ్యుల్లో రాజ్ కుమార్ ఒకరు. చదువుకుంటూనే జిల్లాలో ఆర్ఎస్‌యూ విస్తరణకు కృషి చేశారు. మార్క్సిజం, లెనినిజం, మావో ఆలోచనా విధానాలకు సంబంధించిన అత్యంత క్లిష్టమైన అంశాలను సహ విద్యార్థులకు సులువుగా వివరించేవారు. 1975లో ఎమర్జెన్సీ సమయంలో పోలీసులు రాజ్‌కుమార్‌ను అరెస్టు చేశారు.

కొన్నాళ్లకు బెయిల్‌పై విడుదలైన తర్వాత ఆయన తన ఉద్యమ ప్రణాళికను ముమ్మరం చేశారు. పోలీసులు 1978లో మరోమారు ఆయనను అరెస్టు చేశారు. ఆయన 1979లో జైలు నుంచి విడుదలయ్యారు. అప్పటికి ఆయన ఆర్ఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు. అప్పుడే... అజ్ఞాతంలోకి వెళ్లారు. పీపుల్స్‌వార్‌లో భాగస్వామి అయ్యారు.

కొండపల్లి సీతారామయ్య, ముక్కు సుబ్బారెడ్డి తదితర నాయకులతో సమానంగా పార్టీ కోసం పని చేశారు. 'ఆజాద్'గా మారారు. దళ కమాండర్‌గా, రాష్ట్ర కమిటీ సభ్యుడిగా, మిలటరీ కమిటీ సభ్యుడిగా, కర్ణాటక ఇన్‌చార్జిగా వ్యవహరించారు. మరణించే నాటికి ఆయన మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు. సిద్ధాంత వ్యూహకర్తగా ఆజాద్ అగ్రస్థానంలో ఉన్నారు. కోబాడ్ గాంధీ అరెస్టు తర్వాత ఆయనే కీలకమయ్యారు.

పార్టీకి సంబంధించిన రచనలు, సిద్ధాంతాల రూపకల్పనలోనే నిమగ్నమయ్యేవారు. అధికార ప్రతినిధిగా పార్టీ భావ జాలాన్ని మీడియాకు అందజేసేవారు. రెడ్ కారిడార్‌లోని తొమ్మిది రాష్ట్రాల కమిటీలను సమన్వయపరుస్తూ, పార్టీలో జరుగుతున్న పరిణామాలను, ఇతర విషయాలను కేంద్ర కమిటీ దృష్టికి తీసుకెళ్లేవారు. ఆజాద్ భార్య పద్మ కూడా మావోయిస్టులో పార్టీలోనే ఉన్నారు.

విశాఖతో బంధం...
వరంగల్‌లో బీటెక్ అనంతరం ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఎంటెక్ చేయడానికి 1978లో ఆజాద్ విశాఖ వచ్చారు. అక్కడ కూడా విద్యార్థి ఉద్యమం బలోపేతంపైనే ప్రధానంగా దృష్టి సారించారు. అజ్ఞాతంలో ఉంటూనే 1980 నుంచి 1983వ సంవత్సరం వరకు విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో విస్తృతంగా పర్యటించారు. ఉత్తరాంధ్రలో విద్యార్థి ఉద్యమం బలపడటానికి ఆజాద్ కృషే కారణమని చెబుతారు.

విశాఖ ఉక్కు ఉద్యమం, సిటీ బస్సుల జాతీయికరణ కోసం సాగిన పోరాటంలో ఆజాద్ చురుకుగా పాల్గొన్నారు. కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లోనూ ఆర్ఎస్‌యూ విస్తరణలో ఆజాద్ పాత్ర ఉంది. రాడికల్ విద్యార్థి సంఘం తొలి తరం నాయకులే ఇప్పుడు మావోయిస్టు కేంద్ర స్థాయి నాయకులుగా కొనసాగుతుండటం గమనార్హం. ఇది ఆర్ఎస్‌యూను ఆజాద్ ఎంత బలంగా నడిపారో చెప్పేందుకు నిదర్శనమని అంటారు.

కుటుంబ ప్రస్థానం...
రాజ్‌కుమార్ కుటుంబానికి కృష్ణా జిల్లా పెద్దపారుపూడి మండలం యలపర్రు, మొవ్వ మండలం పెడసనగల్లు, పమిడిముక్కల మండలం పెనుమత్స, కృష్ణాపురం, నూజివీడు పట్టణాలతో సంబంధాలున్నాయి. ఆజాద్ కృష్ణాపురంలోగానీ, నూజివీడులోగానీ జన్మించి ఉండవచ్చని చెబుతారు. ఆజాద్ తండ్రి మిలిటరీలో పని చేశారు.

లక్ష్మయ్య తండ్రి వెంకటరత్నం హోటల్ నడిపారు. ఆ తర్వాత ఈ హోటల్ బాధ్యతలను లక్ష్మయ్య చేపట్టారు. 1959లో ఆ హోటల్‌ను బావమరిది యలమంచిలి సుబ్బారావుకు అప్పగించి హైదరాబాద్‌కు వచ్చేశారు. కాచిగూడ పోలీస్ స్టేషన్ ఎదుట త్రివేణి హోటల్ అండ్ లాడ్జిని ఏర్పాటు చేశాడు. ప్రస్తుతం వారి కుటుంబం మూసారాంబాగ్‌లో స్థిరపడింది.

ఆజాద్ అజ్ఞాతంలో ఉండగా... 1977 నుంచి మూడేళ్లపాటు విజయవాడలోని మాచవరంలోని జమీందార్ హాస్టల్‌లో ఉన్నట్లు సమాచారం. సాగర్ అలియాస్ చలం, బాలశౌరితో కలిసి ఎస్ఆర్ఆర్ అండ్ సీవీఆర్ కాలేజీలో ఆర్ఎస్‌యూను స్థాపించారు.
http://www.andhrajyothy.com/mainnewsshow.asp?qry=2010/jul/3/main/3main16&more=2010/jul/3/main/main&date=7/3/2010

No comments:

Post a Comment