Friday, 30 December 2011

10 భాషలపై పట్టు

రోజూ 14 పత్రికల పఠనం
బ్రెజిల్ సభలో ప్రసంగం
అజాద్ నేపధ్యమిదీ

ఎన్‌కౌంటర్లో మృతి చెందిన మావోయిస్టు కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి చెరుకూరి రాజ్‌కుమార్ అలియాస్ అజాద్‌కు విద్యార్థి దశ నుంచే ఆంగ్లంపై మంచి పట్టు ఉండేది. ఈ కారణం గానే పార్టీ కార్యక్రమాల్లో ఆయన ప్రాముఖ్యం ఎక్కువగా ఉండేది. సిద్ధాంత రీత్యా పార్టీ నిర్ణయాలు, అదేశాలు అమలు కావాలంటే ఆయన ఆమోదముద్ర ఉండాల్సిందే నని సమాచారం. కేంద్ర కమిటీ, పొలిట్ బ్యూరో స్థాయిలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నా అజాద్ అనుమతితోనే బయటకు వచ్చేదని తెలుస్తోంది. ఆయనకు దాదాపు 10 భాషలపై పట్టు ఉండటమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఆంగ్లంపై విశేష పరిజ్ఞానం సంపాదించిన అజాద్, తెలుగు, తమిళం, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ, ఇతర ఉత్తరాది భాషల్లోనూ చదవగలిగేంత పట్టు సాధించారు. అందుకే పార్టీకి చెందిన దాదాపు 14 పత్రికలను ఆయన చూసేవారని సమాచారం. ఆంగ్లంలో అనర్ఘళంగా మాట్లాడగలిగే సామర్థ్యం ఉన్నందునే ఆయనకు అంతర్జాతీయ వేదికలపై మాట్లాడే అవకాశం దక్కింది.

1991లో బ్రెజిల్‌లో కమ్యూనిస్టు పార్టీల ప్రపంచ స్థాయి సమావేశాలు జరిగినప్పుడు మావోయిస్టుల (అప్పట్లో పీపుల్స్ వార్ గ్రూప్-పీడబ్ల్యూజీ) తరపున భారత దేశం నుంచి చెరుకూరి రాజ్‌కుమార్ పాల్గొన్నారు.ఒక్కో పార్టీనుంచి పాల్గొన్న ప్రతినిధికి సుమారు 5 నిమిషాల పాటు ఆ వేదికపై మాట్లాడే అవకాశం దక్కగా, ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడటం, సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులను విశ్లేషించడం, పార్టీ సిద్ధాంతాలను వివరించడంలో ఆయన వాగ్దాటికి సభికులు ఆసక్తి చూపి, దాదాపు 10 నిమిషాల పాటు మాట్లాడే అవకాశం కల్పించారు. భారత దేశ విప్లవ పార్టీల తరపున అంతర్జాతీయ వేదికలపై మాట్లాడిన ఘనత చెరుకూరిదేనని చెప్పుకుంటుంటారు.

ఎడమన గాజు కన్ను? 
అజాద్ ఎడమ కన్ను గాజు కన్ను అని తెలిసింది ఆయనతో పాటు పార్టీలో ఉండి అతి సన్నిహితంగా చూసిన మాజీ నేతలు కొందరు ఈ విషయాన్ని చెప్పారు. ఆయన ప్రతి జిల్లానూ ప్రతి దళాన్ని సందర్శించారు. ఆయన జిల్లాకు వచ్చినప్పుడు కనీసం 15 రోజుల పాటు జిల్లా మొత్తం పర్యటించేవారు. సిద్ధాంతాలు,రాజకీయ, ఆర్థిక, సామాజిక విశ్లేషణతో క్యాడర్‌ను ప్రజలను ఆకట్టుకునే వారు. ఈ సమయాల్లోనే మేం అతి సన్నిహితంగా చూసినప్పుడు ఎడమకన్ను గాజు కన్ను అని తెలిసింది. ఎలా ఎప్పుడు జరిగిందో తెలియదు కాని, మొహం కడుక్కునేటప్పుడు గాజు కన్ను తీసి నీటితో కడుక్కుని మళ్లీ పెట్టుకునే వారు." అంటూ మాజీ మావోయిస్టు నేత ఒకరు వెల్లడించారు. ఒకట్రెండు సంవత్సరాలనుంచే చెరుకూరి రాజ్‌కుమార్ పేరు అజాద్‌గా వినపడుతోంది. అంతకుమందు ఉద్యమంలో ఎక్కువగా గంగాధర్, ఉదయ్ పేర్లతోనే ఆయన తిరిగేవ వారని తెలుస్తోంది.

Eenadu.net
04-07-2010
వరంగల్, న్యూస్ టుడే. 04-07-2010

No comments:

Post a Comment