Tuesday, 24 April 2012

శివసాగర్‌కు మరణం లేదు

కసితో స్వార్థం శిరస్సు గండ్రగొడ్డలితో
నరకగలిగినవాడే నేటి హీరో
ప్రజల గుండెల కొండల్లో మాటుగాసి
ట్రిగర్ నొక్కగలిగినవాడే స్రష్ట
ప్రజను సాయుధం చేస్తున్న
రెవల్యూషనరీ నేడు కవి

ఈ ఆఖరి చరణమే వరంగల్ నుంచి పెండ్యాల కిషన్‌రావు సంపాదకత్వంలో వెలువడిన 'విప్లవకవులు' కవితా సంకలనం 'మార్చ్'కు మకుటం. ఈ కవిత్వంలో మనకు కనిపించే కొంచెం దిగంబర కవుల వాసన, స్పష్టమైన విప్లవ అవగాహన, కవితా 'ప్రభంజనం' తిరుగుబడు కవులు కలిసి జులై 4, 1970న ఏర్పడిందే విప్లవ రచయితల సంఘం. ఆనాటి నుంచి ఈనాటి వరకు సాహిత్య, సాంస్కృతిక రంగాల్లో విరసం ఆశయం, లక్ష్యాలకు ఇదే మార్గనిర్దేశం.

'ఆకులందున అణగిమణగి కవితకోకిల పలకవలెనోయ్' అన్నాడు గురజాడ. 'కదిలేది కదిలించేది, పెనునిద్దర వదిలించేది, మునుముందుకు నడిపించేది కావాలోయ్ నవకవనానికి' అన్నాడు శ్రీశ్రీ. కాని నక్సల్బరి, శ్రీకాకుళోద్యమ దశకు విప్లవోద్యమ దశకు ఎటువంటి కవిత్వం కావాలో దిశానిర్దేశం చేసినవాడు మాత్రం పాణిగ్రాహి అడుగుజాడల్లో వచ్చిన శివుడు, శివసాగర్. 1974 నా 'ఊరేగింపు' కవితాసంకలనాన్ని మార్క్సిస్టు లెనినిస్టు నాయకులు కామ్రేడ్ కెజి. సత్యమూర్తికి అంకితం చేసాను.

'To find heroes in the grand manner we must look rather in the present' అని మావోసేటుంగ్‌ను ఉదహరిస్తూ ఈ పై కవితా చరణాలను నేను ఉటంకించాను. అంతకుముందు 68లో నా మొదటి కవితాసంకలనం 'చలినెగళ్లు' గుడిపాటి వెంకటచలానికి అంకితమిచ్చాను. దీన్నిబట్టే నాపై చలం తర్వాత అప్పటికి శివసాగర్ ఫ్రభావం ఎంత ప్రగాఢమైందో ఎవరైనా ఊహించుకోవచ్చును.

1966లో 'ఆధునిక సాహిత్య వేదిక'గా ప్రగతిశీల భావాలు, శాస్త్రీయదృక్పథం, ప్రయోగం కొరకు ప్రారంభమైన సృజన 67 నాటికి రక్తచలన సంగీతశృతి''ని వ్యక్తావ్యక్తంగా వినడం, విని హృదయంలోకి ఇంకించుకోవడం ప్రారంభమైంది. ఇప్పుడు వెనక్కి తిరిగి చూస్తే అది చైనా శ్రామికవర్గ సాంస్కృతిక విప్లవ గాలుల ప్రభావం అని అర్థమవుతంది. ఆ రోజుల్లో నేను జడ్చర్లలో పనిచేస్తున్నాను. కాని 1966-68 మధ్యన వరంగల్ మిత్రమండలి సమావేశాల్లో కవిమిత్రుడు లోచన్‌తో కవిత్వం వింటు న్నాం, మంచి చెడ్డలు మాట్లాడుకుంటున్నాం కాని దిశానిర్దేశం చేయలేకపోతున్నాం అని మధనపడుతుండేవాళ్లం.

గాబ్రియెల్‌స్కూళ్లో కెజి. సత్యమూర్తి అనే టీచర్ ఉన్నాడని, ఆయన అయ్యర్‌గారి టీచర్స్‌గిల్డ్‌లో పనిచేస్తున్నాడని, ఆయన నాటకాలు రాసి ప్రదర్శింపచేస్తున్నాడని, ఆయనకు తీవ్రమైన అభ్యుదయభావాలున్నాయని తన ఇంప్రెషన్‌గా లోచన్ చెప్పేవాడు. ఒకసారి మిత్రమండలిలో విల్సన్ అనే కవిమిత్రుడ్ని సత్యమూర్తిగారు మీ కొలీగా అని అడిగాను. ఆయన ఉలికిపడి ఆయనా, ఆయన స్టాలినండీ'' అన్నాడు. బహుశా అప్పటికే ఆయన బ్రహ్మానందరెడ్డి కాలంలోని ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాల సమ్మెలో పాల్గొని, స్కూళ్లో ఉపాధ్యాయ సంఘ నిర్మాణం చేయబోయి సస్పెండయి ఉన్నాడు.

కాని, నేను ప్రత్యక్షంగా సత్యమూర్తిని కలిసింది మాత్రం హైదరాబాద్ రెడ్డి మహిళా కళాశాల ఎదురుగా సందులో ఒక చిన్న ఇంట్లో ఉంటున్న సృజన సాహితీమిత్రుడు శ్రీపతి ఇంట్లో. తెల్లటి ధోవతి, మీద జుబ్బా, ఉంగరాల జుట్టు, కళ్లలో వెలుగు, చిరునవ్వు. అచ్చం కవికుమారిడి లాగా ఉన్నాడు. శ్రీపతి పరిచయం చేసాడు. సృజన ద్వారా నేనూ ఆయనకు పరోక్షపరిచయమే. ఆయన రాజకీయ విశ్వాసాల గురించి విని ఉన్నాను. బహుశా అప్పటికే ఆయన ముందస్తు నిర్భంధంలో భాగంగా జైలుకు కూడా వెళ్లివచ్చి పూర్తికాలపు రాజకీయ కార్యకర్తగా పనిచేస్తున్నాడు. ఆయన చేతిలో 'లెనిన్ నా లెనిన్' అని రాసిన ఆయన దీర్ఘకవిత కాగితాలున్నాయి.

అది లెనిన్ శతజయంతి జరుగుతున్న సంవత్సరం. ప్రపంచవ్యాప్తంగా రివిజనిస్టులు మొదలు విప్లవకారుల వరకు బూర్జువా ప్రభుత్వాలు కూడా లెనిన్ శతజయంతి జరుపుకుంటున్నాయి. శివసాగర్ మాటల్లోనే చెప్పాలంటే ఆయననొక బాబాను చేసి, ఆయన కాళ్లకు మేజోళ్లు తొడిగి, ఆయననొక విగ్రహాన్ని చేసి ఆరాధనా ఉత్సవాలు జరుపుతున్నారు. లెనిన్ విప్లవాచరణలో ఉన్నాడని తీవ్రమైన ఉత్తేజంతో రాసిన కవిత అది. ఆ సాయం త్రం కృష్ణదేవరాయాంధ్ర భాషానిలయంలో లెనిన్ శతజయంతి సందర్భంగా ఒక కవిసమ్మేళనం ఉందట. అక్కడ ఈ కవిత చదివించాలి'' అని ప్రతిపాదించాడు. ఆ ఏర్పాటు ఏదో చేసినట్టు న్నాం.

ఎట్లాగూ ఒక సంచలనం ప్రారంభమైంది. లెనిన్ పుట్టినరోజయిన 69 ఏప్రిల్ 22న ప్రపంచవ్యాప్తంగా మార్క్సిస్టు లెనినిస్టు పార్టీలు ఏర్పడ్డాయి. నక్సల్బరీ, శ్రీకాకుళోద్యమాల వెలుగులో ఆ ఉద్యమాలకు ఒక నిర్మాణరూపం ఇవ్వడానికి మనదేశంలో చారుమజుందార్ కార్యదర్శిగా మార్కిస్టు లెనినిస్టుపార్టీ ఏర్పడింది.

మేడే రోజు కలకత్తా షహీద్‌మినార్ మైదాన్‌లో కానూసన్యాల్ ఆ పార్టీ ఆవిర్భావ ప్రకటన చేసాడు. ఆ తర్వాత గుంటూరులో నక్సల్బరీ సంఘీభావ కమిటీని ఏర్పాటు చేసిన డాక్టర్ చాగంటి భాస్కరరావు, శ్రీకాకుళోద్యమ జిల్లా నాయకుడు పంచాది కృష్టమూర్తి మొదలయినవారు చారుమజుందార్‌ను తెలుగునేలకు తీసుకొనివచ్చి గుత్తికొండబిలంలో రాష్ట్ర పార్టీని ఏర్పాటుచేసారు. ఆ సమావేశానికి కొండపల్లి సీతారామయ్య, కెజి. సత్యమూర్తిలను రాష్ట్రకమిటీలోకి తీసుకున్నారు.

అయితే 1969 నుంచి 85 దాకా కెజి.సత్యమూర్తితో సృజనకైనా, విరసంకైనా గాఢమైన అనుబంధం 'శివసాగర్' తోనే. కెజి. సత్యమూర్తిగా లేదా ఆయన అజ్ఞాతజీవితం లోని పార్టీ పేర్లతో ఆయన నిర్వహించిన పాత్ర గురించి సాధికారికంగా చెప్పగలిగేది ఆ పార్టీ నిర్మాణమే. లెనిన్ కవిత మొదలుకొని 85 దాకా అంటే సృజన నిర్వహించబడినంత కాలం ఆయన ఏ కవిత రాసినా సిరా తడి ఆరకముందే అది సృజనకే పంపించేవాడు. అచ్చయి వచ్చేలోగా మళ్లీ ఎన్నిసార్లు ఆ కవితకు ఆయన నుంచి సవరణలు వచ్చేవో, ఆయనంతటి కవితాశిల్పి. ఆయన పర్‌ఫెక్షనిస్ట్. కవిత్వంలో కానిది పలకడాన్ని ఆయన సహించేవాడు కాదు.

అట్లే ఆయన ఎన్నో పాటలు రాసాడు. ఆ పాటలన్నీ సృజనలోనే వచ్చినవి. 69 నుంచి 79 దాకా అజ్ఞాత జీవితంలోనో, జైళ్లలోనో ఉన్నందువల్ల ఆ పాటలకు స్వరకల్పన (ట్యూన్) ఎన్‌కె (రామారావు) చేసేవాడు, చెయ్యాలని ఎస్ఎమ్ కోరుకునేవాడు కూడా. 'చెల్లీ చెంద్రమ్మా' 'తోటా రాముడు, 'జాలరన్న' వంటి పాటలన్నీ ఎన్‌కె ట్యూన్ కట్టి పాడినవే విస్తృత ప్రచారాన్ని పొందినవి.

పాట అన్నప్పుడు ముఖ్యంగా చెప్పవలసిం ది ఆయన 'నరుడో భాస్కరుడా'. డాక్టర్ చాగంటి భాస్కరరావును ఎన్‌కౌంటర్లో చంపివేసిన తర్వాత భాస్కరుడు నామవాచకం కాదు, అనే చిన్న వివరణతో తెలంగాణ ప్రాంతంలో పీరీలు నీళ్లల్లో పడినతర్వాత మొహర్రం ఆఖరి రోజున తిరిగివస్తూ పాడుకునే జానపద గీతం శైలిలో ఆయన నరుడో భాస్కరుడా పాట రాసాడు. ఈ పాటయే విరసం పాట, మౌఖిక కళారూపాల ద్వారానే విప్లవభావ ప్రచారం చేయాలనే దానికి ప్రాతిపదిక అయింది.

ఖమ్మం సుబ్బారావు పాణిగ్రాహినగర్‌లో జరిగిన విరసం ప్రథమ మహాసభలకు విరసం ప్రథమ కవితాసంకలనం 'ఝంఝ'ను స్వయంగా అచ్చువేయించుకొని వచ్చిన శ్రీశ్రీ ఈ పాట పాడుతూనే ట్రైయిన్ దిగాడని సభలు జరిగిన రెండ్రోజులూ ఈ పాట పాడుతూనే ఉన్నాడని, ఈ పాట రాసిన శివుడెవరో అప్పటికి ఆయనకు తెలియదని మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం. నగ్నముని తన 'తూర్పుగాలి' కవితాసంకలనాన్ని ఈ నరుడూ భాస్కరుడికే అంకితం చేసాడు. ఈ పాటతో పాటు ఝంఝలో 70 జులై 10న ఎన్‌కౌంటర్లో అమరులయిన వెంపటాపుసత్యం, ఆదిభట్ల కైలాసంల స్మృతిలో రాసిన 'సత్యం చావదు' (డు) అనే కవిత కూడా అచ్చయింది.

'మార్చ్' కవితాసంకలనంలో ప్రారంభంలో పేర్కోన్న కవితతో పాటు లెనిన్‌పై రాసిన దీర్ఘకవిత కూడా ఉంది. ఇతర కవితలను విడిగా ఒకచోట అచ్చువేసిన బుక్‌లెట్‌ను నిషేధానికి వెరవకుండా గుంటూరు విరసం మహాసభల్లో పంచిన ధూళిపాళ మోహన్ ఇప్పటికీ నాకు కళ్లల్లో ఆడుతున్నాడు. ఈ నాలుగు కవితలు ఎస్ఎమ్ శివుడు అనే పేరుతోనే రాసాడు. ఆ తర్వాత ఆయన సృజనకు రాసిన కవితకూ కవితా వస్తువును బట్టి ఎక్కువగా సాహితీమిత్రులే శివసంబంధమైన పేర్లు పెట్టేవాళ్లు. శివసాగర్, నటరాజ్ (ఉద్యమం నెలబాలుడు), పార్వతి (మాతృఘోష) ఇట్లా.

ప్రపంచకార్మికులంతా ఒకేతల్లి బిడ్డలురా, ప్రపంచ శ్రామికులంతా ఒకే కొమ్మ పువ్వులురా అని రాసిన పాటకు మాత్రం ఆజాద్ అని పేరు పెట్టాం. సృజన ప్రచురణగా వెలువడిన గెరిల్లా విప్లవగీతాలకు ముందుమాటలో అందుకే ఇందులో వివిధ కవుల కవితలు ఉన్నాయి గాని వీటన్నింటిలో విప్లవ సత్యమూర్తిత్వం ఆవిష్కరింపబడింది అని ప్రస్తావించడం జరిగింది. కవిత్వంలో, కవిత్వం ద్వారా ఆయన ఇవ్వాల్టి కవికి నిర్వచనాన్ని, కవితారూపాన్ని నిర్దేశించినట్లుగానే విప్లవ కాల్పనికవాదాన్ని విప్లవ ఆశావాదాన్ని ప్రవేశపెట్టాడు. ఆయన కవిత్వంపై ఏకకాలంలో గురజాడ, కృష్ణశాస్త్రి, శ్రీశ్రీల ప్రభావాన్ని చూడవచ్చు.

వీటితోపాటు తనదైన కవి సమయాలను, కవితా రూపాలను, శిల్పాన్ని, వినూత్న ప్రయోగాలను కూడా ప్రవేశపెట్టాడు. ముఖ్యంగా సమకాలీన విప్లవపరిభాషతో, కవితా వస్తువులతో, కవిసమయాలతో కవిత్వాన్ని సుసంపన్నం చేసాడు. తెలుగు వచన కవితపై, ముఖ్యంగా విప్లవ కవిత్వంపై శ్రీశ్రీ తర్వాత బలమైన ముద్ర శివసాగర్. మరొక ప్రత్యేకత ఏమంటే నరుడో భాస్కరుడా పాట నుంచి గంగ దాటెలిపోకే చెల్లెమ్మా దాకా ఆయన ప్రతి పాటా, కవితా ద్వారా శ్రీకాకుళోద్యమం మొదలు జగిత్యాల జైత్రయాత్ర దాకా విప్లవోద్యమ చరిత్ర నిర్మాణం చేసి చూపవచ్చు.

ముఖ్యంగా శ్రీకాకుళోద్యమ చరిత్రను, ఆయన కవిత్వం లో రక్తమాంసాలతో కూడిన చరిత్రగా పునర్లిఖించవచ్చు. ఆయన కవిత్వంలో చెరబండరాజు కవిత్వంలో వలెనే పోలమికల్ అంశాలు కూడా చాలా ఉంటాయి. ఏ కవితా సందర్భం లేకుండా అనిర్దిష్టంగా ఉండదు. 'లెనిన్' గ్రేట్ డిబేట్ ముగిసి మార్క్సిస్టు లెనినిస్టు విప్లవాలు పెల్లుబికిన కాలం. 'నరుడో భాస్కరుడా' ఎన్‌కౌంటర్ హత్యలు ప్రారంభమైన కాలం. అంతే కాదు, నీ బాటనే నడు స్తాం అని విప్లవభాస్కరునికి హామీపడిన సందర్భం. జాలరన్న పాట సత్యం, కైలాసాల అమరత్వం సందర్భంగా తెలంగాణలో మాత్రమే నాయకత్వం మిగిలినపుడు కెఎస్‌ను ఉద్దేశించి రాసిన కవిత్వం. తెరచాప చిరిగినా, పడవ మునకేసినా, కొందరప్పటికే దిగజారి తెడ్డు నదిలో విసిరేసినా చుక్కాని దిక్సూచిగా పనిచేసినంతకాలం ఈ ఎదురీత కొనసాగుతుందని చెప్పిన పాట.

ఉద్యమం నెలబాలుడు శ్రీకాకుళోద్యమ నాయకత్వమే రివిజనిస్టు మార్గాన్ని జైల్లో ఉండి ప్రతిపాదించినపుడు ఆగ్రహంతో రాసిన గీతం. ఇట్లా ఉద్యమం నెలబాలుడు సంపుటిలోని ప్రతి కవితకు ఒక నిర్దిష్టమైన సందర్భాన్ని చెప్పవచ్చు. ఎస్ఎమ్ 73లో ఖమ్మంలో అరెస్టయ్యాడు. ఒక ద్రోహి కారణంగానే అరెస్టయ్యానని హోచిమిన్ వలెనే చందమామను ఉద్దేశిస్తూ జైలు నుంచి కవిత పంపాడు. ఖైదీగీతం పేరుతో 74 జనవరిలో అది చిన్నకవితా సంకలనంగా వెలవడింది. గెరిల్లా విప్లవ గీతాలు, ఖైదీ గీతం ఆ తర్వాత రాసిన కవితలు అన్నీ కలిపి అప్పటికి ఒక సమగ్ర సంపుటంగా ఉద్యమం నెలబాలుడు వెలువడింది.

ఈ కాలంమంతా ఆయన కొండపల్లి సీతారామయ్యతో కలిసి పార్టీ కార్యకలాపాల్లో కూడా పాల్గోంటూనే ఉన్నాడు. ఆదిలాబాదు, వరంగల్, భోనగిరి, హైదరాబాదు మొదలైన ప్రాంతాల్లో పనిచేస్తూనే ఉన్నాడు. రాష్ట్రకమిటీ నాయకత్వంలో ఉండి విరసంతో గాని, ఇతర ప్రజాసంఘాలతో గాని సంబంధాల్లోనే ఉన్నాడు. ఈ క్రమమంతా ఆయన దృష్టి ప్రధానంగా సాహిత్య సాంస్కృతిక భాషా రంగాల మీద ఉండేది, ఆయన ప్రభావమూ ఈ రంగాల మీద ఉండేది.

ఆదిలాబాదు అడవుల్లో తిరిగినపుడు వెంట ఉన్న నర్సిరెడ్డి అనే సహచరుడితో ఆ అడవుల్లో చెట్ల, పిట్టల పేర్లు అడిగి తెలుసుకొని రాసుకొని ఆ తర్వాత కాలంలో వాటిని తోటరాముడు పాటలో అద్భుతంగా ఉపయోగించుకున్నాడు. ఆ తోటరాముడు భూమయ్య కిష్టాగౌడ్‌లోని కిష్టాగౌడ్. సత్యమూర్తి ఎమర్జెన్సీలో జైల్లో ఆ ఇద్దరి పక్కన గంజ్‌లో ఉన్నాడు. వాళ్లకు సన్నిహితుడయ్యాడు. కిష్టాగౌడ్ తొడలో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట కాలంలో దూరిన బుల్లెట్‌ను చూసి ఆయన 'తోటరాముని తొడకు కాటా తగిలిందాట' అని పాట రాసాడు. భూమయ్య కిష్టాగౌడ్ ఉరిశిక్షల మీదనే 'ఉరిపాట' రాసాడు. ఉరికంబం మీద నిలిచి ఉజ్వలగీతం పాడెద అని సృజనలో రాసాడు. అది నిషేధానికి గురయింది. 1972లో తరచుగా సృజన సంచికలు నిషేధానికి గురయినాయి.

ఎక్కువగా శివసాగర్ కవిత ల కోసమే. ఇంటిలిజెన్స్ వాళ్లు (మూడు ఎమ్ఏలు చేసిన గోపాల్‌రావనే ఇంటిలిజెన్స్ ఇన్స్‌స్పెక్టర్ ఈ సాకుతో ఆ రోజుల్లో కవిత్వాన్ని అనువాదం చేసేవాడు) చేసే ఆ ఇంగ్లీష్ అనువాదాలు నిషేధపు ఉత్తర్వులు ప్రచురించే సాకుతో సృజనలో అచ్చేసేవాళ్లం. సృజన సంచికల నిషేధం గురించి విని ఆవేదనతో శివసాగర్ 'అల లు' కవిత రాసాడు. అలల పైన నిఘా. అలల కనే కలల పైన నిఘా అనే అద్భుతమైన కవిత అది. సృజనతో ఆయనకున్న అనుబంధం అటువంటింది. 1974 చార్రితాత్మకమైన రైల్వే సమ్మె అప్పుడు ఆయన రాసిన 'రెడ్‌కార్నర్' కవిత నిర్మాణం, భాష, పదబంధాలు, కవిసమయాలు మొదలయిన మొత్తం నిర్మాణరూపంవల్ల గద్దర్ గ్యాంగోళ్లమండీ, వంగపండు యంత్రమెట్లా నడుస్తున్నదంటే పాటలతో పోల్చదగిన కవిత.

అజ్ఞాత జీవితంలోనూ జైల్లోనూ కలిపి మొత్తం ఈయన 69 నుంచి 79 దాకా బహిరంగ జీవితంలో లేడు. పార్వతీపురం, సికింద్రాబాద్ కుట్రకేసుల్లో ముద్దాయిగా అదే క్రమంలో ఎమర్జెన్సీలో కూడా 73 నుంచి జైల్లోనే ఉన్నాడు. 78లో బెయిల్ మీద విడుదలయి 79 జనవరిలో మహాసభల్లోనే ఆయనకు విరసం గౌరవ సభ్యత్వమిచ్చింది. బహూశా అటువంటి అరుదయిన గౌరవం ముందూ వెనుకా ఎవరికీ లేదు. బహూశా గుంటూరు విరసం మహసభలకు ఆయన ఆఖరిసారి వచ్చాడు. ఆ తర్వాత మండల్ కమిషన్‌కు అనుకూలంగా రిజర్వేషన్‌కు అనుకూలం గా వెలవరించిన కవితాసంకలనం సందర్భంగా విరసం ఆయనతో కలిసి పనిచేసింది. గద్దర్ మీద హత్యాప్రయత్నం సందర్భంలోనైతే ఆయన నాయకత్వంలో పనిచేసింది.

80లో సిపిఐఎమ్ఎల్ పీపుల్స్‌వార్ ఏర్పడిన తరువాత ఆయన విరసంను గైడ్‌చేయడం నాకు జ్ఞాపకం ఉంది. మాచర్ల విరసం మహాసభలకు ముందు ఆయన శ్రీశ్రీ గురించి ప్రస్తావిస్తూ ఆయన విప్లవ శిబిరంలో చనిపోవాలని, ఆయనకు ఎర్రజెండా కప్పాలని, విప్లవం విజయవంతమయిన తర్వాత ఆయ న విగ్రహాన్ని విశాఖ సముద్రతీరాన యేరాడకొండపై పెట్టాలని మా ముందు ఒక స్వప్నాన్ని ఆవిష్కరించాడు.

1979నుంచి 82 దాక కొంత బహిరంగ జీవితంలోనూ, కొంత అజ్ఞాతంలోనూ ఆయన తరచూ కలుస్తుండేవాడు. విరసం మిత్రులతో మాట్లాడుతుండేవాడు. రాజకీయ నిర్దేశకత్వంకన్నా ఎక్కువగా సాహి త్యం గురించి, కవిత్వం గురించి మాట్లాడుతుండేవాడు. శ్రీశ్రీ తర్వాత తెలుగు కవిత్వంలో ఆయనదే స్థానం అని, 70ల విప్లవ కవిత్వానికి పాణిగ్రాహి తర్వాత ఆయనే మార్గదర్శకుడని, అందుకే శివసాగర్‌కు మరణం లేదని చిత్తశుద్ధిగా ఆయనతో అనుబంధాన్ని గుర్తుచేసుకుంటున్నాను.

-వరవరరావు
http://andhrajyothy.com/vividhaNewsShow.asp?qry=2012/apr/23/vividha/23vividha2&more=2012/apr/23/vividha/vividhamain&date=4/23/2012

చరిత్ర చెక్కిలిపై సంతకం

చనిపోవడానికి చాలా రోజుల ముందటి నుంచి కె.జి. సత్యమూర్తిగారు స్ప­ృహలో ఉన్నప్పటికీ స్మారకంలో లేరు. ఆయనను పలకరించడానికి కుటుంబసభ్యులు రకరకాల ప్రశ్నలతో ప్రయత్నించేవారు. చాలా వాటికి ఆయన సమాధానం చెప్పలేకపోయేవారు. ఒకసారి, వర్తమాన రాజకీయాల గురించి ఆయనను అడిగారట. 'ఎన్నికలు వస్తున్నాయట, ఓటెవరికి వేయాలి, చిరంజీవికా, చంద్రబాబుకా' అన్నది ప్రశ్న. 'ఎందుకు, సుందరయ్య లేడా' అని సత్యమూర్తి ఎదురు ప్రశ్న వేశారట.

పద్ధెనిమిదో తారీకునాడు విజయవాడలో కృష్ణాజిల్లా స్వాతంత్య్ర సమరయోధుల భవనంలో సత్యమూర్తి భౌతిక కాయం సమక్షంలో జరిగిన నివాళిసభలో ఆయన సోదరి మంజులాబాయి ఆ ఉదంతాన్ని చెప్పారు. దాన్ని విన్న తరువాత అనివార్యంగా శ్రీశ్రీ గుర్తుకు వచ్చారు. చనిపోవడానికి కొద్దిసేపటి ముందు శ్రీశ్రీ 'స్పెయిన్ నియంత ఎవరు' అని ప్రశ్నించారట. ఎప్పటినుంచో ఆపేరు గుర్తుకు రాక ఆయన ఆ ప్రశ్న వేసి ఉంటారు. జీవితాంతం సాధకులుగా గడిపినవారు చరమదినాలలో, అంతిమక్షణాలలో ఏ కాలాలలో, ఏ విషయాలలో తమ మనస్సులను నిమగ్నం చేసుకుని ఉంటారో

తన భావాలను, సాహిత్యసంస్కారాన్ని అమితంగా ప్రభావితం చేసిన 1930ల నాటి స్పెయిన్ అంతర్యుద్ధపు రోజులలోనే శ్రీశ్రీ మనసు కొట్టుకులాడుతుంటే, మార్క్సిస్టు లెనినిస్టు విప్లవకారుడిగా ఇంకా పరిణమించని, తన వ్యక్తిత్వానికి బీజాలు వేసిన ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ రోజులలో సత్యమూర్తి ఎందుకో పచార్లు చేస్తున్నారు. ఒక సుదీర్ఘ జీవితం, సాయుధ స్వాప్నిక జీవితం, కవిత్వపు జవనాశ్వం మీద పరుగులు తీసిన జీవితం, ఒడిదుడుకుల జీవితం- అన్నిటికి ముగింపు చెప్పి, గాజుపెట్టెలో విశ్రమిస్తున్న సత్యమూర్తిని చూసినప్పుడు అవిశ్రాంత చరిత్ర వలె కనిపించారు.

ఆయనలో సుడులు తిరిగిన సంచలనాలతో, సదసదత్సంశయాలతో, రెక్కలు తొడుక్కున్న కొత్త ఆలోచనలతో, లోలోపల సాగిన వైఫల్యసాఫల్యాల ఆత్మసమీక్షణతో- ఆయనకు శ్రద్ధాంజలి ఘటిస్తున్న సమూహాలకు సంబంధం ఉన్నదా అన్న అనుమానం కలిగింది. ఆయనతో గతానుబంధాలు కలిగిన సహచరులు, కుటుంబసభ్యులు తప్ప చివరిదాకా ఉన్న వారెవరూ లేరు. అభిమానులు తప్ప అనుయాయులెవరూ లేరు. వారిలోనూ, దళితోద్యమంతో ఆయనతో కలసి నడిచినవారే ప్రధానంగా కనిపించారు. అంతిమయాత్రలో నీలిజెండాలు అనేకం రెపరెపలాడితే, ఒకటో రెండో ఎర్రజెండాలు వెంట నడిచాయి.

మనిషి చనిపోగానే, అంచనాలకు పాల్పడడం అమానుషంగా కనిపిస్తుంది. నిజమే, చనిపోయిన మనిషి ఇక ఏ తప్పూ ఒప్పూ చేయడు కాబట్టి, అంతా గతమే కాబట్టి, ఒక సమీక్షకు అవకాశం ఉంటుంది. అయినంత మాత్రాన, అంతిమయాత్రకంటె ముందే అంతిమ నిర్ధారణలకు రావలసిన అవసరం ఉన్నదా కొన్ని స్థూల ప్రతిపాదనలు మాత్రం చేయడంలో తప్పు లేదు. విస్తరించడానికి, సవరించుకోవడానికి ఆస్కారం వదిలి కొన్ని సూత్రీకరణలనూ చర్చించవచ్చు. కానీ, వెంటనే ముద్రవేసి, సీల్‌చేసి అటకెక్కించడానికి సాహసించకూడదు. ఆకాశానికెత్తే ప్రశంసలయినా, తక్కువ చేయాలనుకునే ప్రయత్నాలయినా- ఈ పరిమితులను గుర్తుంచుకోవాలి.

మనిషి లేని లోటు క్రమక్రమంగా తెలిసివస్తుంది. బతికి ఉన్నప్పుడే అవశిష్టంగా మిగిలిన మనిషి నిష్క్రమణ సహజంగా కనిపిస్తుంది. ఎనభైఏండ్ల జీవితం గడిపిన సత్యమూర్తి భౌతికంగా చెందింది కాలధర్మం కావచ్చు. ప్రభావం వేయగలిగిన కార్యాచరణ నుంచి ఆయన చాలా కాలం కిందటే ఉపసంహరించుకుని ఉండవచ్చు. కానీ, సత్యమూర్తి కేవలం ఒక సంస్థలోనో, అనేక సంస్థల్లోనో భౌతికమయిన ఆచరణ చేసిన వ్యక్తి మాత్రమే కాదు, అతను శివసాగర్ కూడా. అతని ఆలోచనలు, ఊహలు, ఉద్వేగాలు- అన్నీ అక్షరాల్లో సురక్షితంగా ఉన్నాయి. అవి దూరాన్ని కాలాన్ని అధిగమించి తరతరాలను పలకరిస్తాయి. కాలనాళికలో భద్రపరచిన జీవకణాలు అవి, మళ్లీ మళ్లీ అవి ప్రాణం పోసుకుంటాయి.

విప్లవకారుడిగా, విప్లవకవిగా శివసాగర్ రాసిన కవిత్వం, వ్యాసాలు నిశ్చలనిశ్చిత భావాలతో ఉండి ఉండవచ్చు, అందులో సంశయాలకు సందేహాలకు ఆస్కారం తక్కువ కావచ్చు. ఆ నిబద్ధ అక్షరం సైతం అమోఘమైన సృజనాత్మకతతో, జీవకళతో అలరారింది. ఆ ఘట్టం గడచివచ్చిన తరువాత అతను అంతటి పరిణామంలో గొప్ప కవిత్వం రాసి ఉండకపోవచ్చు. కానీ, అందులో ఎంతో మథన, ఎంతో తపన. నక్సల్బరీతరం కవులను అందుకోవాలని శ్రీశ్రీ చేసిన ప్రయత్నం వంటి ప్రయత్నం, దళితోద్యమ సృజనాత్మకతను అందుకోవడానికి శివసాగర్ చేశాడు. శ్రీశ్రీ కంటె ఎక్కువ విజయం పొందాడు. తన సొంత ముద్ర కలిగి

ున సాహిత్యప్రేరణలు ఆధునికవాద ప్రగతిశీల సాహిత్యంలో ఉన్నాయి. గురజాడ అంటే శివుడికి పిచ్చి. ఆయన ఒక కుమారుడికి సౌజన్యరావు పేరు పెట్టుకున్నాడు. ముత్యాలసరాలను రాశాడు. కన్యాశుల్కాన్ని వర్తమాన వ్యవస్థకు అనువర్తిస్తూ దీర్ఘకవిత రాశాడు. అట్లాగే, శ్రీశ్రీ ప్రభావం అతని మీద అమితంగా కనిపిస్తుంది, గేయాల్లోనూ వచనకవిత్వంలోనూ. 1960లలో వచనకవిత్వోద్యమం తరువాత సీవీ, దిగంబర కవులు తీర్చిదిద్దిన వచనకవిత్వ శైలి ప్రభావమూ శివసాగర్‌మీద ఉన్నది. శివసాగర్ దళితవిముక్తివాదాన్ని స్వీకరించినప్పుడు, అతని స్థాయి, పరంపర ఉన్న సీనియర్ కవి ఎవరూ ఆ శిబిరంలో లేరు. సత్యమూర్తి దళితరాజకీయాల స్వీకరణ- దళిత ఉద్యమానికి గొప్ప స్థాయిని, ప్రతిష్ఠను అందించింది.

విప్లవపార్టీలో సత్యమూర్తికి వచ్చిన సమస్యలేమిటో, లేదా ఆయనతో వారికి వచ్చిన సమస్యలేమిటో, వాస్తవంగా జరిగిందేమిటో, ఆయన బాహాటంగా చెప్పిన అంశాలేమిటో- ఆయన సాధారణ అభిమానులకు పెద్దగా ముఖ్యమైన విషయాలు కావు. పైకి వ్యక్తమయ్యే అంశాలేమయినప్పటికీ, ఏదో ఒక వైరుధ్యమూ ఘర్షణా ఉన్నాయన్నది వాస్తవం. ఉద్యమంలోని కొందరు వ్యక్తుల మీద ఆయన ప్రదర్శించిన వ్యతిరేకత, ఉద్యమం మీద చూపలేదు.

జీవితంలో అధికభాగం తనకు మార్గదర్శిగా ఉన్న మార్క్సిజాన్ని వదలడానికి ఎన్నడూ ఆయన సిద్ధపడలేదు. విప్లవ కార్యాచరణానుభవం ఆయనను అనంతరకాలంలోనూ ప్రభావితం చేస్తూనే ఉన్నది. గత ఇరవయ్యేళ్ల కాలంలో ఆయన అనేక సంస్థలను, పార్టీలను, శిబిరాలను వదిలివెళ్లడానికి, లేదా వారే ఆయనను వదలడానికి సత్యమూర్తి మార్క్సిజం పట్టింపు ఒక కారణమా- అన్వేషించాలి.

దళిత శిబిరాలలో పదేళ్లు పనిచేసిన తరువాత కూడా ఆయన మరోసారి మార్క్సిస్టు లెనినిస్టు పార్టీ సారథ్యాన్ని, అజ్ఞాత జీవితాన్ని స్వీకరించడానికి కారణం ఏమిటి- కుల, వర్గ వాదాలను సమ్మిళితం చేయడంలో ఆయన ప్రయత్నాలు విజయవంతం కాలేదా, స్వీకరించేవారు లేకపోయారా- అన్నదీ మరో ప్రశ్న. శివసాగర్ కవిత్వజీవితంలో చివరి దశాబ్దంలో ఆయన రాసిన కవితలను పరిశీలిస్తే, అటూ ఇటూ ఉండడానికి ఆయన చేసిన ప్రయత్నం కనిపిస్తుంది. జీవితం ఆయనకు మరో యవ్వనాన్ని ఇస్తే, ఏమి చేసి ఉండేవాడు అని కుతూహలం కలుగుతుంది.

ఒక ఉన్నత సమాజాన్ని ఆవిష్కరింపజేయడానికి జీవితాంతం పనిచేసిన మనిషి సత్యమూర్తి. ఆ పనిలో భాగంగా వివిధ మార్గాలను అన్వేషించాడు. చివరకు దేనితోనూ పూర్తి సంతృప్తి సాధించినట్టు కనిపించదు. కానీ, ఆయన తొలి, మలి దశల్లో వేసిన, నడచిన మార్గాలు ఉత్సాహంగా ముందుకు కదులుతున్నాయి, ఆయనను గుర్తు పెట్టుకున్నా, పెట్టుకోకపోయినా.

-- కె. శ్రీనివాస్
http://www.epaper.andhrajyothy.com/editorial.asp?qry=dailyupdates/editpagemain

మన పాబ్లో నెరుడా

కె.జి. సత్యమూర్తి గారు ఇక లేరు అనే వార్త విన్నప్పుడు 40 ఏళ్ళ నాటి జ్ఞాపకాలు చుట్టూ ముసురుకుని మనసును కలిచివేసినై. సంవత్సరం సరిగా గుర్తులేదు. 1966 అనుకుంటా. స్టేట్ టీచర్స్ యూనియన్, ఎన్‌జిఓ యూనియన్లు కలసి తమ హక్కుల సాధన కోసం నెలరోజులకు పైగా సమ్మె చేసినై. సమ్మెలో భాగంగా ఒక రోజు హనుమకొండ జీవన్‌లాల్ గ్రౌండ్స్‌లో పెద్ద బహిరంగ సభ ఏర్పాటైనది. ఉద్యమ నాయకుల ఉపన్యాసాల మధ్య కొందరు పాటలు, కవితలు వినిపించారు.

నేనూ ఒక కవిత చదివాను. జనం నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. వేదిక దిగగానే తెల్ల దుస్తుల్లో ఒకాయన నా దగ్గరకు వచ్చి 'నా పేరు సత్యమూర్తి. గేబ్రియల్స్ హైస్కూల్ టీచర్‌ని. ఈ సభ చివర్న స్నేహితులతో కలసి ఒక నాటిక ప్రదర్శించబోతున్నాను. మీరు చూసి అభిప్రాయం చెప్పండి' అన్నారు. అలా మొదలైంది మా స్నేహం. మా ఆలోచనలు, అభిరుచులు, అన్నింటినీ మించి ఆయన మాటలలోని ఆత్మీయత క్రమంగా మమ్మల్ని ఎంతో సన్నిహితుల్ని చేసినై. ప్రాపంచిక జ్ఞానం, చారిత్రక అవగాహన, మార్క్సిజం వెలుగులో అనేక సమస్యలపై ఆయన విశ్లేషణలు, ఎదుటివారి మీద ప్రగాఢ ముద్ర వేసేవి.

అణగారిన జనం మీద అపారమైన ప్రేమ, అన్యాయం మీద ఆగ్రహం, దాడి ఆయన వ్యక్తిత్వ ప్రధాన లక్షణాలు. అందుకే సుదీర్ఘకాలం ఆయన సాయుధపోరాట యోధుడైనాడు. పీడిత జనంతో మమేకమై పోరాటంలో ఉన్న వారు రచయితలైతే ఎంత అద్భుత సాహిత్యం వస్తుందో 'శివసాగర్' ఒక సజీవ ఉదాహరణ. విప్లవోద్యమం నుంచి బయటికి వచ్చిన సత్యమూర్తి ఆలోచనల్ని నేను విశ్లేషించలేను కాని, ఆయన ఎక్కడో ఆగిపోయిండని అనుకోను. ఇవ్వాళ్టి సంక్లిష్ట సంక్షోభాల నడుమ, అమానుష అణచివేతల మధ్య నిత్య పరాయీకరణ విధ్వంసాల మధ్య గమ్యం చేరి ఏవేవో మార్గాలు వెతుక్కుంటూ వెళ్ళిపోయిన బాటసారి అనుకుంటాను.

సత్యమూర్తి ఖాజీపేట దగ్గర ఫాతిమానగర్ గేబ్రియల్స్ హైస్కూల్‌లో పనిచేసిన రోజులు అప్పుడక్కడ పనిచేసిన అధ్యాపకులకు, చదివిన ఎందరో విద్యార్థులకు బాగా గుర్తుండిపోయిన రోజులు. గేబ్రియల్స్ హైస్కూల్ మంచి పేరున్న పాఠశాల. అయినా అంతర్గతంగా ఉపాధ్యాయుల సర్వీస్ నిబంధనల అమలు విషయంలో యాజమాన్యం కొంత అప్రజాస్వామికంగా, హై హ్యాండెడ్‌గా ఉండేదని విన్నాం. అధ్యాపకులు అనేక సందర్భాల్లో తమ న్యాయమైన హక్కులను అడగడానికి కూడా జంకేవారని, సర్వీస్ రిజిస్టర్లు కూడా ఉండేవి కావని చెప్పుకునేవారు.

అలాంటి పరిస్థితుల్లో సత్యమూర్తిగారు కలిగించుకుని ఉపాధ్యాయులను ఏకంచేసి యాజమాన్యంపై ఒత్తిడి తెచ్చి వారికి రావలసిన అన్ని సౌకర్యాలను చాలా వరకు సాధించి సర్వీస్ రిజిస్టర్లు కూడా ఏర్పాటు చేయించారని తెలిసింది. ఆ విధంగా ఆయన అక్కడ తన సోదర అధ్యాపకులకి ఒక 'వాయిస్' ఇచ్చి గౌరవపూర్వకమైన ఉనికిని కల్పించారు. ఆ పాఠశాల నుంచి రిటైరైన ఎందరో ఉపాధ్యాయులు సత్యమూర్తిగారి పేరును ఎంతో పూజ్య భావంతో ఉచ్ఛరించడం నేను విన్నాను.

ఒక ఉపాధ్యాయుడు ఉద్యమ శీలుడైతే సమాజానికి ఎంత మేలు జరుగుతుందో ఊహించలేం. a teacher does not know where his influence stops' ప్రపంచ వ్యాప్తంగా అనేక ఉద్యమాల్లో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో గణనీయమైనది.

టీచర్‌గా సత్యమూర్తి చాలా క్రియేటివ్. చాలా మంది అధ్యాపకుల్లాగా పాఠ్య పుస్తకాల పేజీల వరకే పరిమితం కాకుండా పాఠ్యాంశాలకు అనేక జీవితానుభవాలు, ప్రాపంచిక విషయాలు జోడించి తన విద్యార్థులను ఒక విశాల జగత్తులోకి తీపసుకెళ్ళేవారు. సత్యమూర్తి టీచింగ్ ఎంతో లైవ్లీగా ఉండేదని ఆయన శిష్యులు చెప్పేవారు. a teacher trying to teach his puplis without inspiring them is hammering on cold iron'. ఆయన వ్యక్తిత్వ ప్రభావం పిల్లలపై ఎంతగానో ఉండేది.

పాఠశాలను సమాజంలో విస్తరింప జేసిన గొప్ప అధ్యాపకుడు, విజనరీ సత్యమూర్తి. ప్రతిష్ఠాత్మక వరంగల్ రీజినల్ ఇంజనీరింగ్ కాలేజీ, కాకతీయ మెడికల్ కాలేజీ విద్యార్థుల మీద ఆయన ప్రభావం ఎంతటిదో సమాజం కోసం ప్రాణాలర్పించిన సూరపనేని జనార్ధన్ లాంటి అనేకులను గుర్తు చేసుకుంటే అర్థమౌతుంది. నిజమైన విప్లవకారుడు ఎంత మృదుభాషిగా ఉంటాడో, మనసు ఎంత నవ్య నవనీత సమానమో సత్యమూర్తిగారితో పరిచయమున్న వారందరికీ తెలుసు. ఆయన తిరిగిన వాడలకీ, నడచిన అడవి బాటలకీ, కలిసిన అశేష అభాగ్య జనానికి తెలుసు.

1976 ఎమర్జెన్సీ-విప్లవకారులతో పాటు ఎందరో విప్లవ రచయితలను జైళ్ళలోకి నెట్టిన చీకటి రోజులు. నేనప్పుడు వరంగల్ సెంట్రల్ జైల్లో ఉన్నా. విశాఖ జైలు నుంచి అనుకుంటా సత్యమూర్తి గారిని ఏదో కేసు విషయంలో వరంగల్ జిల్లా కోర్టులో హాజరుపరచడానికి తీసుకొచ్చినప్పుడు ఒక రోజు ఆయన్ని వరంగల్ జైల్లో ఉంచారు. జైలు జవాన్లు ఆయనను ఒక బ్యారక్ నుంచి ఇంకో బ్యారక్‌కు తీసుకు వెళ్తున్నప్పుడు నేను కనపడితే ఆప్యాయంగా పలకరించి మాట్లాడారు.

మావో చనిపోయి అప్పటికి రెండు మూడు రోజులు అయి ఉంటుందనుకుంటాను. జైల్లో ఒక గోడ పక్కన ఒక మందారపు మొక్కను చూపుతూ 'చూశారా అక్కడ ఒక పువ్వు రాలిపడి ఉంది. చెట్టు మీద ఒక మొగ్గ విచ్చుకుంటున్నది. మావో మరణంతో విప్లవం ఆగిపోదు. కొత్తతరం ఆవిర్భవిస్తుందని చాలా సింబాలికల్‌గా కవితాత్మకంగా చెప్పి నవ్వుతూ వెళ్ళిపోయారు.every where essentially he was a poet, a revolutionary and a dremer.

1998లో ఒక కారు ప్రమాదంలో నా ఎడమకాలు విరిగిపోయింది. కదలలేని స్థితిలో దాదాపు ఎనిమిది నెలలు మంచం మీద ఉండిపోయాను. వరవరరావు, జయశంకర్ ఇంకా చాలా మంది మిత్రులు, ఆత్మీయులు పలకరించడానికి వచ్చారు. ఎలా తెలిసిందో సత్యమూర్తిగారు ఓ పది పన్నెండు మంది సహచరులతో కలిసి మా ఇంటికి వచ్చారు. నా మంచం చుట్టూ చేరి దాదాపు ఓ గంటసేపు విప్లవగీతాలతో, మాటలతో నన్ను ఉత్సాహపరచి వెళ్ళిపోయారు.

సత్యమూర్తి గొప్ప పాటలు రాయడమే కాదు. వాటిని తన్మయంగా పాడేవారు కూడా. ఒకరోజు హనుమకొండ కుమార్‌పల్లి వరవరరావు గారింట్లో సాహితీ మిత్రులమంతా కలిసి సత్యమూర్తిగారితో మాట్లాడుతున్నాం. మాటల మధ్య పాటల ప్రస్తావన వచ్చింది. ఎవరో అన్నారు, లోచన్ పాటలు కూడా పాడతాడని. సత్యమూర్తిగారు నన్ను పాడండన్నారు. నాకు కొంచెం బిడియం. ఎంతసేపూ నోరు విప్పకపోయేసరికి సత్యమూర్తి గారే అందుకున్నారు- 'తూర్పు పవనం వీచెనోయ్, తూర్పు దిక్కెరుపెక్కెనోయ్' అని మాంచి మూడ్‌లో అద్భుతంగా పాడారు.

విప్లవోద్యమంలో ఉబికి వచ్చిన అరుణగానం సత్యమూర్తి. పాటకు ప్రాణం పోసి ఎరుపు సొగసులను అద్దిన వాడు. ఆనాడు ఆయన రాసిన 'నరుడో భాస్కరుడా' గొప్ప రెవల్యూషనరీ హిట్ సాంగ్. శ్రీ శ్రీ ఆ గీతాన్ని తన్మయుడై పాడుతుంటే ఒక జీరతో, మానవీయ కంపనతో చెప్పలేని ఒక స్పెషల్ ఎఫెక్ట్‌తో వినిపించేది. సభల్లో. సమావేశాల్లో చుట్టూ గాలి గాలంతా ఎర్రెర్రని ఆర్కెస్ట్రా ధ్వనులతో నిండిపోయినట్లు. ఆ రోజుల్లో గద్దర్, శివసాగర్, వంగపండు పాటలదే హవా. 'తోటరాముని కాటా తగిలిందని' గొంతెత్తి ఎన్‌కె పాడుతుంటే వేలాది జనం ఊగిపోయేవారు. అలా శివసాగర్ అంతటా పాటై ప్రవహించాడు, ప్రతిధ్వనించాడు.

ఆ రోజులను తలచుకుంటే గత కాలమే మేలేమో అనిపిస్తుంది. కాని మనకు తెలుసు చరిత్ర ముందుకే నడుస్తుంది. ఈ భూగోళ గర్భాన్ని తవ్వుతున్న ప్రపంచీకరణ పెనుభూతం ఎంత దీర్ఘకాలమైనా పీడిత జనాగ్రహ జ్వాలల్లో బూడిదై రాలిపోతుంది. ఇలా రాసుకుంటూ పోతే ఎన్నెన్నో చిన్న చిన్న జ్ఞాపకాలు. విప్లవకవిత్వంలో ఎన్నో ఖాళీలను పూరించిన వాడు శివసాగర్. కవితకు, పాటకు, కొత్త ఎనర్జీని, డిక్షన్‌ను, డైరెక్షన్‌ను ఇచ్చిన వాడు. ఎన్నో బ్యూటీ స్పాట్‌లను అద్దిన అలంకారికుడు.

కలం కార్మికుడు శివసాగర్. అందుకే ఆయన కవిత ఎంతో అందమైనది. ఆయన కమిట్ మెంట్ ఎంతో విలువైనది. ఆయన అన్వేషణ ఆలోచించదగినది. ఆయన నడిచివచ్చాడు, అణగారిన వాడలనుంచి, అణచివేతల దారి నుంచి, కొల్లేరు ప్రకృతి పరిసరాల నుంచి, సుదూర యానం చేశాడు. నెత్తురోడిన రాస్తాల నుంచి, తిరగబడ్డ అడవి ఆగ్రహం నుంచి..

సత్యమూర్తిని గుర్తుచేసుకుంటే చరిత్రను గుర్తుచేసుకున్నట్లు, ఒక అర్థవంతమైన అధ్యాయం చదివినట్టు. మనం శివసాగర్‌ని గుర్తు చేసుకుందాం. ప్రతి క్షణం రణరంగమైన ఈ విధ్వంస మార్గంలో శివసాగర్‌ని తలచుకోకుంటే మనల్ని మనం మరచిపోయినట్లే. 'నరుడో భాస్కరుడా' విన్నప్పుడు ఆ అంటున్నది మన తెలుగు పాబ్లోనెరుడానా అనాలనిపిస్తుంది.

- లోచన్
http://www.epaper.andhrajyothy.com/EditorialShow.asp?qry=2012/apr/22/edit/22edit3&more=2012/apr/22/edit/editpagemain1&date=4/22/2012

విప్లవ స్వాప్నికుడు

జనం ఊపిరితో విప్లవ కవిత్వంలోకి వచ్చినవాడు శివసాగర్. విరసం తొలినాళ్లలో ఆయన మాకు 'నరుడో భాస్కరుడా'గా ఉత్తేజాన్ని నింపినవాడు. తెలుగు జానపద బాణీలను - నుడికారాన్ని విప్లవ కవిత్వంగా మలచిన కవి. ఒక భావుకుడిగా, విప్లవ రొమాంటిసిజమ్‌తో తన స్వాప్నిక వ్యక్తీకరణతో విశిష్టమైన శైలిని సాధించగలిగాడు- గేయం కావొచ్చు లేదా వచన కవిత కావొచ్చు. కె.జి.సత్యమూర్తి దళిత రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత వివాదాస్పదమైన వ్యాఖ్యలతో ఉద్యమానికి దూరమైన దశ ఒక విషాదం. నేనూ మిత్రులు జ్వాలాముఖి మొదటిసారి సత్యమూర్తిని విశాఖ జైలులోని ప్రత్యేక న్యాయస్థానంలో కలుసుకున్నాము. ఆ తర్వాత రాజకీయ అంశాల్లో ఆయనతో విభేదించినా, ఆయా సందర్భాలలో సంభాషణ సాగిపోయేది. చివరి దశలో ఆయన ఒంటరిగా మిగిలిపోయినా, తెలుగు విప్లవ కవిత్వంలో ఒక అగ్రగామి కవిగా, విప్లవ స్వాప్నికుడిగా సుస్థిర స్థానాన్ని పొందగలిగారు. శివసాగర్ స్మృతికి నా విప్లవ జోహార్లు.
- నిఖిలేశ్వర్

శివనేత్రం మూతపడింది
వొక నిప్పు వాగు ఆగిపోయింది. వొక మల్లియ రాలిపోయింది. వొక శివనేత్రం మూతపడింది. వొక చంద్రహారం తెగిపోయిం ది. శివసాగర్! అడవి లోం చి వచ్చీ రాగానే నువ్వు నా బుగ్గ మీద పెట్టిన ముద్దు చెమ్మ ఇంకా తడిగానే వుంది. నీ కలల రెమ్మ ఇంకా మా వూహల గాలి లో వూగుతూనే వుంది. శివసాగర్! ఎక్కడ వున్నా నువ్వు హోరెత్తుతూనే వుంటావ్.
- అఫ్సర్

వాటా అడక్కుండానే వెళ్ళిపోయాడు
విప్లవోద్యమంలో- విప్లవోద్యమ సంస్కృతిలో సైతం 'అంటరానితనాన్ని' ఎదుర్కొన్న ఒంటరై విప్లవ వేదిక మీద తన వంతు పనిని పూర్తి చేసేసినా, తన వాటా అడక్కుండానే వెళ్లిపోయిన 'ఉద్యమ నెల బాలు డు'... అంబేద్కర్ తత్వాన్ని మార్క్సిజానికి తాపడం చేసి చూపించి, సైద్ధాంతిక రాద్దాంతాలకు ముందుగా కుల రాద్దాంతాల్ని నిర్మూలించమని, కవిత్వంతో దళితులకు మార్గ దర్శకత్వం వహించిన కె.జి.సత్యమూర్తి ఆత్మ శాంతిని కోరుతూ...
- తుల్లిమల్లి విల్సన్ సుధాకర్

ఉద్యమాల చిరుగాలి సితార
భారత విప్లవోద్యమ అజెండాలో కులం అజెండా చేర్చకుండా ఎర్రజండా ముందడుగు వేయలేదని పీడిత, తాడిత, దళిత ఉద్యమాలకు వెన్నుదన్నుగా నిలిచి పోరాడుతూ- ఉమ్మడి కమ్యూనిస్టు ఉద్యమాల నుండి నేటిదాకా పోరాడుతూ అనేక ఉద్యమాల చిరుగాలి సితార ధ్వని వినిపిస్తూనే వెళ్లిపోయిన సత్యమూర్తికి జోహార్లు. శివసాగర్ ఆశయాలను కొనసాగిద్దాం. - అరుణోదయ రామారావు

సంస్మరణ సంచికకు రచనలకు ఆహ్వానం
ఉపాధ్యాయుడుగా, కార్మిక నాయకుడుగా, పాత్రికేయునిగా, విప్లవ, దళిత ఉద్యమ నేతగా అన్నింటికీ మించి ప్రజాకవిగా కె.జి.సత్యమూర్తి, సమకాలీన సామాజిక సాంస్కృతిక రాజకీయ సాహిత్య ఉద్యమాలను బలంగా ప్రభావితం చేయడమే గాకుండా, వాటికి స్పష్టమైన తాత్విక దిశా, నిర్దేశం చేశాడు. త్యాగభరితమైన ఆయన జీవిత ఉద్యమ ఉత్తేజాన్ని నెమరువేసుకుంటూ మునుముందుకు సాగటం చారిత్రక అవసరం. అందుకే సత్యమూర్తి సంస్మరణ సంచికను ప్రచురిస్తున్నాం. బహుముఖీన శివసాగర్ ప్రస్థానాలపై రచనలను ఈ నెల 26లోగా పల్నాటి శ్రీరాము లుకు- bahujanakeratalu@gmail.com పేర మెయిల్ చేయాలి. ఫోన్ 9849944170
- సంపాదకవర్గం, బహుజన కెరటాలు

శివసాగర్ సంస్మరణ సభ
భారత విప్లవోద్యమ నిర్మాణం లో అగ్రజుడు, దళిత బహుజనోద్యమ స్ఫూర్తి ప్రదాత, కులవర్గ సామాజిక విప్లవ మహాకవి కె.జి.సత్యమూర్తి (శివసాగర్) సంస్కరణ సభ ఏప్రిల్ 24, సా.5గం.లకు సుందరయ్య విజ్ఞానకేం ద్రం, హైదరాబాద్‌లో జరుగనుంది. ప్రముఖులంతా పాల్గొం టారు. ఉద్యమ - సాహితీ మిత్రులందరూ నివాళులర్పించడానికి రావలసిందిగా ఆహ్వానిస్తున్నాం.
- సత్యమూర్తి
(శివసాగర్) ఉద్యమ, సాహితీ మిత్రులు


http://andhrajyothy.com/vividhaNewsShow.asp?qry=2012/apr/23/vividha/23vividha6&more=2012/apr/23/vividha/vividhamain&date=4/23/2012

ఉద్యమ నెలరేడు

పాటల తాకిడికి పగిలిన నిశీధాలు
మాటల ఉరవడికి చిట్లిన ఆకాశాలు
పాద స్పర్శకు తమకించిన బీడు నేలలు
ఆలింగనాలకు పులకించిన అడవి కూనలు
చూపుల వేడిమికి తుకతుక ఉడికిన సందర్భాలు
అతడికోసం వెదుకుతున్నాయి
అతడిక లేడని వాటికి తేలీదు

అతడు-
గుత్తికొండ బిలంలో తెరుచుకున్న
మోజెస్ ఫాలనేత్రం
సినాయి కొండ మీద లిఖించిన
శివుడి పదకొండో ఆజ్ఞ
రాంనగర్లో విరబూసిన లుంబినీవనం
రష్యన్ చెలి రాగాలాపనలో తడిసి
నెత్తుటి ముద్దయినవాడు
అభినవ బోధిసత్వుని ఆరాధనలో మురిసి
వెచ్చటి పొద్దయినవాడు
బహిర్యుద్ధంలో బందూకయినవాడు
అంతర్యుద్ధంలో బందీ అయినవాడు

అతణ్ని చూసినప్పుడల్లా అనిపిస్తుంది-
ధ్యేయం ఎంత గొప్పది!
అతడి ధ్యేయం నిర్దేశించిన ప్రస్థానమెంత గొప్పది!!
గేయం ఎంత గొప్పది!
అతడి గేయం తోడిపోసిన జీవజలమెంత గొప్పది!!
అతణ్ణి తాగినప్పుడల్లా అనిపిస్తుంది-
కల ఎంత గొప్పది!
అతడు కలగన్న సౌందర్యరాజ్యమెంత గొప్పది!!
కలం ఎంత గొప్పది!
అతడి కలం రేపిన సామాజిక సంచలనమెంత గొప్పది!!

అతణ్ని ముద్దాడినప్పుడల్లా అనిపిస్తుంది-
వర్గం ఎంత గొప్పది!
అతడి వ్యతిరేక వర్గం జరిపిన వ్యూహాత్మక
విద్రోహమెంత గొప్పది!!
కులం ఎంత గొప్పది!
అతడిది కాని కులం జరిపిన బహిరంతర
విధ్వంసమెంత గొప్పది!!

అడవిని మనువాడే చందమామ
అమావాస్య నాటికి ఎన్‌కౌంటరవ్వాలి
ఇది సవరణలకు తావు లేని రాజ్య నియమం
అడవికి విడాకులివ్వగల చందమామ
చీకటిని రద్దు పరిచే సూరీడవ్వాలి
ఇది సవర్ణులకు మింగుడు పడని అతడి నియమం

ఇంతా చేస్తే-
అతడొక విషాదాంత విప్లవ కావ్యం
విషాదం ఏంటంటే
అతడు అడవిని జయించలేకపోయాడు
ఏలయనగా-
అప్పటికే మనుధర్మం అడవిని కబ్జా చేసి వుండెను

నేను నిర్మించింది నాది కాకుండాపోయింది
చేసిందేమీ మిగల్లేదు... రాసిందే మిగిలింది''
అన్నాడతడు
కలే కంట్లో ముల్లై దిగినప్పటి బాధ!
పార్థివ దేహాలు ప్రపంచభాషలో మాట్లాడతాయి
ఆర్థిక దేహాలు అర్థం చేసుకొనును గాక
అతడిప్పుడు-
తీర్పరితనాన్ని వెక్కిరించే పీఠమ్మీద
తిష్టవేసిన హతసాక్షి!
ఎక్కుపెట్టిన వింటిమీద
విశ్రాంతి తీసుకుంటున్న నిర్నిమేష నేత్రం!!

- పైడి తెరేష్‌బాబు
99484 91523
(కె.జి.సత్యమూర్తి మిగిల్చిన అసంతృప్తికి
నిరసనగా శివసాగర్‌కి ప్రేమతో-)
- పైడి తెరేష్‌బాబు
http://andhrajyothy.com/vividhaNewsShow.asp?qry=2012/apr/23/vividha/23vividha1&more=2012/apr/23/vividha/vividhamain&date=4/23/2012

గెరిల్లా యోధుడు

నేనీ నేల మీద
ఓ... అద్భుత గెరిల్లా
యుద్ధ సైనికుణ్ని చూశాను
కేవలం సైనికుడు మాత్రమే కాదు!
గొప్ప కలం యోధుడు
తన కవిత్వంతో
శవాలను సైతం
కవాతు చేయించ గల
కమేండర్!
ప్రతి అంశాన్ని
మైక్రోస్కోప్‌తో
నిశతీకరించ గల
ఆర్గానిక్ ఇంటెలెక్చువల్
ఫీనిక్స్ పక్షిలా ఎగిరి
ఎగిరిపడే అలల అంచున
నిలబడి, ఎన్నో
కలలు కనగలడు
నడిరేతిరి
చీకటడివిలో
మిణుగురు పురుగై
తిరుగాడగలడు
నడుస్తున్న చరిత్రపై
చెరగని సంతకం చేసి
మండే మాదిగ డప్పులా
ఉదయించిన సూరీడై
చినుకుల్లో చిందేస్తాడు
నా యవ్వనాన్ని నాకిమ్మని
కాలాన్ని ప్రశ్నించిన
ఉద్యమ నెలబాలుడు
జాఫ్నాలో మందుపాతరై పేలి
అమరత్వం సొంతం చేసుకున్న
నల్లసూరీడు... శివసాగర్

- కత్తి కళ్యాణ్
97038 39766


- కత్తి కళ్యాణ్
http://andhrajyothy.com/vividhaNewsShow.asp?qry=2012/apr/23/vividha/23vividha4&more=2012/apr/23/vividha/vividhamain&date=4/23/2012

వివిలా! శివసాగర్!

- కె. దివాకరాచారి

'తూర్పు పవనం వీచెనోయ్'
అంటూ 68లో వసంతకాల మేఘగర్జనతో
సాగిన నీ ఉద్యమ కవిత,
'గార్ల రైలు దారిలోన గుంజుకొన్న
బల్ రైఫిల్ నీకిస్త తమ్ముడా' అన్న
నీ పిలుపు ఎన్ని తిరుగుబాటు గొంతుకలను
ఉద్యమదారుల్లోకి నడిపించాయో!
ప్రజల్ని సాయుధం చేసిన రెవెల్యూషనరీ కవిత్వం నీదే!
'నరుడో భాస్కరుడా' అంటూ
విప్లవ కవిత్వానికి నిర్వచనం చెప్పి,
నినాదాల హోరు నుండి ఉద్యమ కవిత్వాన్ని
జన హృదయాలను కదిలించేలా
పెను నిద్దుర వదిలించేలా చేసిన సాహితీ సైనికుడా!
ఆయుధం పట్టిన కలం యోధుడు
అడవిలోనూ, అక్షరంతోనూ ధీరుడుగానే నిలుస్తాడు!
ఓరుగల్లు జైలుగోడల్ని దాటివచ్చి
రా.కొ.శాస్త్రి ఇంట్లో
మావో ఓదార్పు గీతం
'నా మల్లియ, నీ మొగిలి ఆకాశం చేరెను'
పాడిన ఆ ఆ్రర్థ గొంతు, ఆ రూపం కళ్లెదుటే కదలాడుతోంది
అవును నిజం నీవన్నట్టే
నీవొక మరణం లేని సైనికుడివే!
ముదిమిలో 'ఆయుధం' జారిపోయినా,
ఆచరణ దారిలో అడుగులు తడబడ్డా,
తలవంచక నిలిచిన నీ అక్షరాలు
ఉరి కొయ్యలపై స్వేచ్ఛాగానాలు చేస్తూనే ఉన్నాయి!
నీ పాట, నీ పలుకులు,
గంగ దాటెల్లిపోయే చెల్లి చంద్రమ్మలకు,
విల్లంబులు ఎక్కుపెట్టి నిలిచిన
తోటరాముడులాంటి విలుకాండ్లకు,
నూతనలోకం కోసం నిరీక్షించే
మా లాంటి చాతక పక్షులకు
పోటెత్తి, పొంగి పొరలే ఓల్గా, యంగ్సీ నదులే!
ఖడ్గాన్ని మీటి ప్రచండ జన సంగీతాన్ని
తన్మయత్వంతో పలవరిస్తూనే ఉన్నాం!
అందుకే 'ఫీనిక్స్' పక్షిలా
రెక్కలల్లార్చుకొంటూ మళ్లీ తిరిగొస్తావులే!
వివిలా శివసాగర్! వివిలా శివసాగర్!

- కె. దివాకరాచారి
93910 18972
http://andhrajyothy.com/vividhaNewsShow.asp?qry=2012/apr/23/vividha/23vividha5&more=2012/apr/23/vividha/vividhamain&date=4/23/2012