ఛత్తీస్‌గఢ్ పరిణామాలు గమనిస్తున్నవారికి ఈ ఘటన గురించి వినగానే 2011 మార్చి 16న అదే ప్రాంతంలో జరిగిన ఒక ఎన్‌కౌంటర్‌లో 36 మంది మావోయిస్టులు మరణించారనే వార్త గుర్తుకు వచ్చే ఉంటుంది. నిజానికి అప్పుడు అక్కడ ఎన్‌కౌంటర్ జరగలేదని, గ్రామాలపై పారా మిలటరీ బలగాలు ఏక పక్షంగా దాడులు చేసి ఆదివాసులను హత్య చేశాయని వెలుగులోకి వచ్చింది. దేశవ్యాప్తంగా హక్కుల సంస్థలు, అగ్నివేశ్ లాంటివారు నిజనిర్ధారణలో చింతల్నార్‌లో జరిగిన దుర్మార్గాన్ని ప్రచారం చేశారు. సరిగ్గా జూన్ 29 నాటి ఎన్‌కౌంటర్ కథనం కూడా ఇలాంటిదే. హిమాంసుకుమార్ దీన్నే ధ్రువపరుస్తున్నారు.
ఆ ప్రాంతంలో మూడు ఎన్‌కౌంటర్లు జరిగాయనే కథనాలు పత్రికల్లో వచ్చాయి. అసలు వాస్తవాలు వేరే. జూన్ 28 రాత్రి బీజాపూర్ జిల్లా బాసగూడెం దగ్గర కరకుగూడెం, కొత్తగూడెం, రాజుపెంట గ్రామాలకు చెందిన 150 మంది ప్రజలు తొలకరి మొదలైంది కాబట్టి వ్యవసాయ పనులకు ప్రారంభంగా భూమి పూజ చేసేందుకు, ఇంకా ఆ ప్రాంతంలో జరగాల్సిన భూ పంపకాల గురించి మాట్లాడుకునేందుకు సమావేశమాయ్యరు. ఇది సుకుమా జిల్లాకు 4 కి.మీ. దూరంలో ఉంటుంది. ఆ సమయంలో సీఆర్‌పీఎఫ్, బీఎస్ఎఫ్ బలగాలు వచ్చి కాల్పులు జరిపాయి. ముసలివాళ్లు, పిల్లలతో కలిపి 23 మంది చనిపోయారు. అనేక మంది గాయపడ్డారు. వీరిలో 9 మందిని హెలికాప్టర్‌లో తీసుకెళ్లారు. వారిని రాయపూర్ తీసుకెళ్లి ఉండొచ్చు.
మరోఘటన అదే ప్రాంతంలో మర్నాటి ఉదయం 5.30 గంటలకు జరిగింది. పశువులు కాస్తున్న మడకం ముత్తాలు, మడకం లచ్చాలు అనే ఇద్దరు ఆదివాసీలను చింతల్నార్ పోలీసులు అకారణంగా కాల్చి చంపారు. ఆ శవాలను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. అదే ఊళ్లో 9 మంది ఆదివాసీ రైతులను చిత్రహింసలు పెట్టి పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. ప్రజలు ఆ ఉదయం స్టేషన్ ముందు ధర్నా చేశారు. శవాలను స్వాధీనం చేయమని డిమాండ్ చేశారు. అయితే పోలీసులు బైటికి వచ్చి ఆందోళన కారులపై లాఠీ చార్జి చేశారు
మరో ఘటన సిమేరు గ్రామంలో జరిగింది. ఇక్కడ ఆరుగురిని పట్టుకొని చిత్రహింసలు పెట్టి పట్టుకుపోయారు. ఆ పక్కనే ఉన్న సింగేరు గ్రామంలో 40 మందిని పట్టుకుపోయారు. ఈ రెండు ఊళ్లలో ఇళ్లు కూలగొట్టారు. ధాన్యాగారాలు ధ్వంసం చేశారు. ఈ రెండు ఘటనలు జరిగిన గ్రామాలు సుకుమా జిల్లా జాదుగూడ పోలీస్ స్టేషన్ పరి«ధిలోకి వస్తాయి. జొన్నగూడెం అనే గ్రామంలో గ్రామ రక్షకదళ కమాండర్‌ను పట్టుకొని హింసించి చంపేశారు. ఒక మహిళను పట్టుకెళ్లారు.
మావోయిస్టులతో, సీఆర్‌పీఎఫ్ బలగాలకు జరిగిన మూడు ఎన్‌కౌంటర్ కథనాల వెనుక ఉన్న వాస్తవాలు ఇవి. ప్రత్యక్షసాక్షులు చెప్తున్న నిజాలు ఇవి. భూమిని దున్నితే దేవుడికి కోపం వస్తుందని నమ్మే ఆదివాసులు నూతన చైతన్యంతో ఉత్పత్తిలో భాగమవుతూ ఉంటే కార్పొరేట్ శక్తులకు ఆదివాసీ ప్రాంతాల్లోని సహజ సంపదను కట్టబెట్టడానికి ప్రభుత్వం ఈ యుద్ధం చేస్తున్నది. మావోయిస్టుల నాయకత్వంలో ఆదివాసులు నాలుగైదేళ్లుగా వేల ఎకరాల నేల చదును చేసి పంటలు పండించుకుంటున్నారు. ఉత్పత్తిని, ఆ ఉత్పత్తికి కారకులైన ప్రజలను ధ్వంసం చేస్తున్న ప్రభుత్వం మరో చింతల్నార్ కథనాన్ని వినిపిస్తోంది. తరతరాల వివేకాన్ని విప్లవంలో పదునుబెట్టుకొని ఆదివాసులు నూతన వ్యవస్థను నిర్మిస్తుంటే... జ్ఞానవంతులైన బుద్ధిజీవులు కనీస వివేకంతోనైనా ఎందుకు ఆలోచించకూడదు
- పాణి
https://www.andhrajyothy.com/EditorialShow.asp?qry=2012/jul/6/edit/6edit5&more=2012/jul/6/edit/editpagemain1&date=7/6/2012
No comments:
Post a Comment