Saturday, 14 July 2012

అడవిని శోధిస్తూ..


అడవిని శోధిస్తూ..
అబూజ్‌మాడ్ గుట్టు విప్పే యత్నంలో విషాదం
మరణించిన ఫొటోగ్రాఫర్

తరుణ్ సెహ్రావత్.. నూనూగు మీసాల యువకుడు. సంచలనాల తెహల్కా వారపత్రికకు ఫొటో జర్నలిస్టు. వృత్తి జీవితం చిన్నదే. ఎంచుకున్న లక్ష్యం..దానికోసం చేసిన సాహసోపేత ప్రయాణం.. వెరసి ఈ చురుకైన కుర్రాడి వైపు లోకం కన్నార్పకుండా చూసేలా చేశాయి. అతడి కెమెరా కన్నులోంచి ఇప్పటిదాకా ఎవరికీ అంతుబట్టని 'అబూజ్‌మాడ్'ను చూసి మీడియా ప్రపంచమే అబ్బురపడుతోంది. అరణ్యగర్భంలో ఆదివాసీ వేస్తున్న పెనుకేకను, పడకేసిన తండాల తంటాలను చూసి నివ్వెరపోతోంది. కానీ, ఇదంతా చూడటానికి, తానెంత అరుదైన ఆవిష్కరణ చేశాననేది చూసేందుకు తరుణ్ సెహ్రావత్ ఇప్పుడు లేడు. ప్రయాణ క్రమంలో తీవ్ర అనారోగ్యానికి గురై గత నెల 15వ తేదీన మరణించాడు. ఈ ఏడాది మే నెలలో వారం పాటు తిరిగి 'అబూజ్‌మాడ్' వ్యథార్థ జీవన చిత్రాన్ని తరుణ్ కళ్లకు కట్టాడు.

ఛత్తీస్‌గఢ్‌లో అనేక ప్రాంతాల్లో మలేరియా విజృంభిస్తోందనీ, సరైన మందులూ, వైద్య సేవలూ లేనందువల్ల వందలాది మంది విషజ్వరాల బారిన పడి ఆస్పత్రుల పాలవుతున్నారనీ పత్రికలు ఎంతగా గగ్గోలు పెట్టినా ప్రభుత్వం చూసీ చూడనట్టే ఊరుకుంది. పైగా..పత్రికలు గోరంతలు కొండంతలు చేస్తున్నాయని ప్రభుత్వం వాదించింది. కానీ, ఛ త్తీస్‌గఢ్‌లో అందులోనూ దంతెవాడ ప్రాంతంలోని అనేక గ్రామాల్లో మలేరియా పలువురిని పొట్టనబెట్టుకున్నట్టు తెహల్కా వారపత్రిక బృందం బయటపెట్టింది. ఆ పత్రిక విలేకరి తుషా మిట్టల్, ఫొటోగ్రాఫర్ తరుణ్ సెహ్రావత్ దిగ్భ్రాంతిపరిచే అనేక విషయాలను తొలిసారిగా ప్రపంచానికి తెలియజేయగలిగారు. ఈ క్రమంలో 'సెరెబ్రల్ మలేరియా'కు గురై తరుణ్ ప్రాణాలు కోల్పోయాడు. అప్పుడుగానీ సర్కారు కళ్లు తెరుచుకోలేదు.

ప్రయాణం మొదలైందిలా..
మలేరియా మీద కంటే రాష్ట్రంలో కార్యకలాపాలను విస్తరిస్తున్న మావోయిస్టుల మీదే ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం ఎక్కువగా దృష్టి కేంద్రీకరించింది. దంతెవాడ పరిసర ప్రాంతాల్లోని గ్రామాల మీద మావోయిస్టులు తరచూ దాడులు చేసి 'నరమేధం' కొనసాగిస్తుండడాన్ని ప్రభుత్వం తీవ్ర విషయంగా పరిగణించింది. ఈ క్రమంలో మావోయిస్టుల కార్యకలాపాలపై కొన్ని వార్తాకథనాలను సేకరించాల్సిందిగా తెహల్కా ఎడిటర్ తరుణ్ తేజ్‌పాల్ తమ విలేకరి తుషా మిట్టల్ (27), ఫొటోగ్రాఫర్ తరుణ్ సెహ్రావత్ (23)లకు సూచించారు.

వారిద్దరూ ఈ ఏడాది మే రెండో వారంలో ఢిల్లీ నుంచి బయలుదేరి దంతెవాడ మీదుగా అబూజ్‌మాడ్ అడవుల్లోకి ప్రవేశించారు. మావోయిస్టులను స్వయంగా కలిసి మాట్లాడే ఉద్దేశంతో అడవుల్లోకి మరింతగా చొచ్చుకుపోయారు. వాళ్ల దగ్గరున్న మం చి నీళ్ల సీసాలు దారిలోనే ఖాళీ అయిపోయాయి. కొండలు ఎక్కడం, లోయల్లోకి దిగడం కారణంగా.. బరువు తగ్గించుకోవడానికి ఆ సీసాలను కూడా పారేయక తప్పలేదు. తీసుకెళ్లిన ఆహార పదార్థాలు కూడా అయిపోయాయి. అయినా అబూజ్‌మాడ్ రహస్యం ఛేదించాల్సిందేనన్న పట్టుదల వాళ్లను ముందుకే నడిపించింది.

తండాలో తంటాలు..
దారిలో కొన్ని తండాలు, గ్రామాలు ఎదురయ్యాయి. ఆ గ్రామాల్లో సగానికి సగం మంది వ్యాధిగ్రస్తులే ఉండటం కలచివేసింది. వాళ్లకు అక్కడ తెలిసిందేమిటంటే, ఆ ప్రాం తాల్లో ఒక్క మలేరియానే కాక, టైఫాయిడ్, కామెర్లు వంటివీ విజృంభించి ఉన్నాయి. ప్రభుత్వం ఈ వ్యాధుల విషయంలో ఎంతగా మభ్యపెడుతోందో, పత్రికల ముందూ, శాసనసభలోనూ ఎంతగా బుకాయిస్తోందో వాళ్లకు అర్థం కావడానికి ఎంతో సమయం పట్టలేదు. తరుణ్, తుషాలు ఈ పరిస్థితిని ముందుగా ఊహించలేదు.

అడవులనేసరికి ఆరోగ్యవంతమైన గాలి, నీళ్లు, పండ్లు, కూరలు దొరుకుతాయని అనుకున్నారు. మలేరియా, టైఫాయిడ్ వంటి విష జ్వరాలు సోకకుండా వాళ్లు ముందు జాగ్రత్తలేవీ తీసుకోలేదు. ఫలితంగా ఆ అడవుల్లో వాళ్లు పడిన కష్టాలు, ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. వాళ్లకిప్పుడు మావోయిస్టులను కలుసుకోవడం కంటే, గ్రామస్థుల్ని విష జ్వరాల బారి నుంచి కాపాడడమే ప్రధానమైపోయింది. స్థానికులు పెట్టిన అపరిశుభ్ర భోజనాన్ని తినక తప్పలేదు. ఆ పచ్చటి నీళ్లు తాగడం తప్ప మార్గం లేకపోయింది.

- స్పెషల్ డెస్క్

https://www.andhrajyothy.com/mainnewsshow.asp?qry=2012/jul/6/main/6main3&more=2012/jul/6/main/main&date=7/6/2012

No comments:

Post a Comment