Friday, 6 January 2012

బలమైన గొంతుక ఏదీ

ఎస్. జీవన్‌కుమార్
https://www.andhrajyothy.com/EditorialShow.asp?qry=2011/dec/30/edit/30edit5&more=2011/dec/30/edit/editpagemain1&date=12/30/2011

బాలగోపాల్, కన్నబిరాన్ ఆకస్మాత్తుగా మాయమైనప్పటి నుంచి సమాజం ఒక బలమైన గొంతు కోసం వెతుకుతుంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం అంశం విషయంలో ప్రజల ఆకాంక్షలపై రాజకీయ కపటత్వం నీళ్ళు చల్లుతున్నప్పుడు, ప్రజాస్వామిక ఉద్యమాన్ని పోలీసులతో అణచివేస్తుంటే, ఇదంతా అన్యాయమని నిలదీసే బలమైన గొంతుక కోసం ప్రజలు తాపత్రయపడ్డారు. రాజకీయ పార్టీల రెండు నాల్కల ధోరణి, రాజకీయ భ్రష్టత, విలువల రాహిత్యాన్ని, ప్రజలు ఇంత స్పష్టంగా ఎప్పుడూ వీక్షించి ఉండరు. ఇంత బహిరంగంగా భూముల్ని, వనరుల్ని దోచుకోవడం బహుశా రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ జరిగి ఉండదు.

ఇదివరకు ఫలానా భూమి, వనరు ఫలానా మంత్రి లేక నాయకుడు అక్రమంగా వశపరుచుకున్నారట అని గుసగుసలుగా చెప్పుకునేవారు. ఇప్పుడు అన్నీ బహిరంగం అయినప్పటికీ, నిస్సిగ్గుగా రకరకాల విధాల పాదయాత్రలు చేసుకుంటూ ప్రజలను మభ్యపెడతూ ఉపన్యాసాలు దంచడం ఎప్పుడూ చూడలేదు. రైతులు 'అన్నం అరగక' 'మానసిక సమస్యలతో' ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఒక మంత్రి అంటే ఇవన్నీ 'నష్ట పరిహారం' కోసమే అన్న వాళ్ళ నాయకుడి వైనాన్ని చూసాం.

వీళ్ళే ఇప్పుడు తలకు కండువాలు కట్టుకుని మొసలి కన్నీళ్ళు కారుస్తూ ఇది ప్రభుత్వామా ఇది పాలనేనా అని గొంతెత్తి అరుస్తున్నారు. ప్రజలు ఈ తమాషా నాటకాన్ని వింతగా వీక్షిస్తన్నారు. ఒకప్పుడు రాజకీయ నాయకులకు రకరకాల మాఫియాలతో సంబంధాలు ఉన్నాయని పత్రికలు కథనాలు రాసేవి. ఇప్పుడు ఆ మాఫియాలే నిర్భయంగా ప్రభుత్వాలను నడిపిస్తున్నాయి ఇదివరకు నడిపించాయి. రాజకీయ అనిశ్చిత పరిస్థితి, సంక్షోభం ఆసరాగా అధికారానికి వచ్చిన ముఖ్యమంత్రి సొల్లు మాటలు వత్తి పలుకుతూ, 'గ్యాస్' కొడుతూ పాలన సాగించటం ప్రజలు చూస్తున్నారు. ఎవరిపనులు వాళ్ళు నిర్భయంగా చేసుకుంటూ పోతున్నారు.

ఎన్‌కౌంటర్‌లు, లాక ప్ హత్యలు, చిత్రహింసలు జరుగుతూనే ఉన్నాయి. పరిస్థితులు ఎట్లా ఉన్నా పోలీసు వ్యవస్థ ఎప్పటిలాగానే తమ కార్యక్రమాలు కొనసాగిస్తుంది. అంతా ప్రజల అభివృద్ధి కోసమే అని చెపుతూ మన 'జి. డి.పి. పెరగాలి కదా', 'మనం అభివృద్ధి కావాలి' కదా, అంటూ ప్రధా న మంత్రి దగ్గరి నుంచి స్థానిక నాయకుని వరకు ప్రజల జీవితాలు ఎట్లా విధ్వంసం చేయాలో, జీవించే హక్కును ఎట్లా భగ్నపర్చాలో పథకాలు వేస్తూ ముందుకు పోతూనే ఉన్నారు. న్యాయవ్యవస్థ అప్పుడప్పుడు ఉలిక్కిపడుతూ ఎక్కువ కాలం నిదురపోతూనే ఉంది.

ఇలా ఉన్న ఈ వ్యవస్థ చాలా క్రూరమైంది అని కన్నబిరాన్ ఎప్పుడో అన్నారు. ఈ వ్యవస్థకు చట్టబద్ధ పాలనతో సంబంధం లేనేలేదని మరీ నొక్కి చెప్పారు. చాలాకాలంగా హక్కుల సంఘాలు పోలీసు వ్యవస్థలో ఉన్న అధికార దుర్వినియోగం, 'శిక్షలేని - శిక్ష భయం' లేని అధికార నేర ఉన్మాదంపై ఆందోళన చేస్తూనే ఉన్నాయి. ఇటువంటి నేరాల్ని ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నాయి, సమర్ధిస్తున్నాయి. ఎన్‌కౌంటర్ హత్యలన్నీ ప్రభుత్వ ఆదేశాలతోనే జరుగుతున్నాయి. చర్చల పేరుతో పిలిచి తదుపరి చల్లగా హత్యలు చేసారు. మధ్యవర్తులుగా వ్యవహరించిన వారిని చంపారు ఇంకా చంపుతున్నారు. ప్రభుత్వం ఎప్పుడు ఎన్‌కౌంటర్‌లు ఆపమంటే అప్పుడు ఆగిన సందర్భాలని గమనించాము.

అయితే ఈ శిక్షారహిత నేర సంస్కృతి పోలీసు వ్యవస్థ నుంచి పాలనా వ్యవస్థకు, రాజకీయ వ్యవస్థకు విస్తరించింది. ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులు, రాజకీయ నాయకులు భయం లేకుండా నేరాలు చేస్తూనే ఉన్నారు. పోలీసు శాఖ నేరాల్ని మాత్రమే ప్రధానంగా ఎత్తిచూపే హక్కుల సంఘాల బాధ్యత ఇంకా పెరిగిపోయింది. ప్రజలు ఎవరి కోసమో, దేనికోసమో వెతుకుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఒక బలమైన గొంతుక, తమ ఆరాటాల్ని, ఆకాంక్షల్ని ప్రతిధ్వనించే గొంతుక ఎక్కడైన వినిపిస్తుందా అని చూస్తున్నారు.

ప్రజాస్వామిక వాదులు, విలువల కోసం ఆరాటపడే వ్యక్తులు, ప్రజలను ప్రేమించే పౌరులంతా ఏకమైతే తప్ప ఆ గొంతుక ప్రజలకు వినపడదు, పాలకులను భయపెట్టదు. అటువంటి ఒక బలమైన, నిర్భయమైన, స్వచ్ఛమైన గొంతుక కోసం మనం అంతా ఐక్యం కావడమే కన్నబిరాన్‌కు మనం ఇచ్చే నివాళి.

- ఎస్. జీవన్‌కుమార్
మానవ హక్కుల కార్యకర్త
(కన్నబిరాన్ ప్రథమ వర్ధంతి సందర్భంగా)

No comments:

Post a Comment