Friday, 6 January 2012

రాయ్‌పూర్‌లో వికృత న్యాయం

- ఇందర్ మల్హోత్రా
https://www.andhrajyothy.com/EditorialShow.asp?qry=2010/dec/30/edit/30edit3&more=2010/dec/30/edit/editpagemain1&date=12/30/2010

భారత రాజ్యవ్యవస్థకు వ్యతిరేకంగా, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని హింసాత్మక పద్ధతులలో కూల్చివేయడానికై, సాయుధ తిరుగుబాటుకు పూనుకున్నవారిని కఠినంగా అణచివేయవల్సిందే. ఈ విషయంలో మరో అభిప్రాయానికి తావులేదు. దేశ ఆంతరంగిక భద్రతకు పెద్ద ముప్పుగా ప్రధాని మన్మోహన్ అభివర్ణించిన నక్సలైట్ల విషయానికి వస్తే, ఈ విధానంలో మరో ముఖ్యమైన అంశముంది.

కత్తి ఎత్తినవాడు కత్తితోనే కూలబడుతాడనే లోకోక్తిని నిజం చేస్తూనే, అదే సమయంలో దేశ ఆదివాసీలకు ముఖ్యంగా మధ్య భారత రాష్ట్రాల్లోని వారికి దశాబ్దాలుగా జరుగుతోన్న భయంకరమైన అన్యాయాలను సంపూర్ణంగా నిర్మూలించడానికి భారత ప్రభుత్వమూ, పౌర సమాజమూ దృఢ సంకల్పంతో పూనుకోవాలి.

నిస్వార్థ వైద్యుడు, మానవహక్కుల కార్యకర్త డాక్టర్ వినాయక్ సేన్‌కు యావజ్జీవ శిక్ష విధిస్తూ రాయ్‌పూర్ (ఛత్తీస్‌గఢ్ రాజధాని)లోని సెషన్స్ కోర్టు ఒకటి వెలువరించిన తీర్పు మీకు దిగ్భ్రాంతి కల్గించలేదా విద్రోహ కార్యకలాపాలకు పాల్పడ్డారనే ఆరోపణకు దుర్భలమైన సాక్ష్యాధారాలతో డాక్టర్ సేన్ పట్ల న్యాయస్థానం ఇంత కఠినంగా వ్యవహరించడం ఆయన కుటుంబసభ్యులనే కాదు, ప్రజాస్వామిక చైతన్యం కల ప్రతి ఒక్కరినీ నిరుత్తరుణ్ణి చేసింది.

ఆసేతు హిమాచలం విద్యావేత్తలు, హక్కుల కార్యకర్తలు డాక్టర్ సేన్‌కు జరిగిన అన్యాయం పట్ల తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. నక్సలైట్లు తమ ప్రాబల్యాన్ని పెంచుకోవడానికి లక్ష్యంగా పెట్టుకున్న రాష్ట్రాల్లో ఛత్తీస్‌గఢ్ ఒకటనేది సందేహాతీతమైన విషయం. అయినంత మాత్రాన రాయ్‌పూర్‌లోని అదనపు జిల్లా, సెషన్స్‌జడ్జి బి.పి.వర్మ ఇటువంటి రాక్షస తీర్పు వెలువరించడం న్యాయబద్ధమేనా వర్మ తీర్పు పూర్తిగా లొసుగుల మయమే కాదు, అది ఎంత మాత్రమూ ఆమోదయోగ్యమైనది కాదు.

భద్రతా సిబ్బంది,అమాయక సామాన్య ప్రజలపై నక్సలైట్లు, అమలు జరుపుతున్న విచక్షణారహిత హింసను వ్యతిరేకిస్తున్నవారు రాయ్‌పూర్ జడ్జి తీర్పును సమర్థించవచ్చు. ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం వలే, ఛత్తీస్‌గఢ్ పోలీసులు కూడా మావోయిస్టులకు మద్దతుదారు గా తాము భావిస్తున్న వ్యక్తికి గరిష్ఠ స్థాయిలో శిక్ష పడాలని కోరుకుంటున్నారు.

డాక్టర్ సేన్ విషయంలో వారి అభీష్టం నెరవేరింది. అయి తే పాలకులు, పోలీసుల కంటే న్యాయమూర్తులు వాస్తవాల పట్ల మెరుగైన అవగాహనతో నిష్పాక్షిక నిర్ణయాలు తీసుకోగలరని ఎవరైనా భావిస్తారు. న్యాయాధికారులు చట్టాన్ని మినహా మరి దేన్నీ పరిగణలోకి తీసుకోకూడదు. రాయపూర్ సెషన్స్ జడ్జి వర్మ ఈ ఆరోగ్యకరమైన న్యాయ నియమాన్ని ఉపేక్షించారు.

వర్మ వెలువరించిన 92 పేజీల తీర్పు పట్ల న్యాయవాదులు, విద్యావేత్తలు, సామాన్య పౌరులు తీవ్రంగా ప్రతిస్పందిస్తున్నారు. సందిగ్ధ సాక్ష్యాధారాలనే ఆయన పరిగణనలోకి తీసుకున్నారు. అంతకంటే చోద్యం భారతీయ శిక్షా స్మృతిలో విద్రోహానికి సంబంధించిన సెక్షన్ 24 ఎ అనేది వలస పాలకుల నుంచి సంక్రమించిన నిబంధన అని సుప్రీం కోర్టు 1962లోనే స్పష్టం చేసినా ఆ కాలం చెల్లిన నిబంధన ఆధారంగానే జడ్జి వర్మ తన తీర్పునివ్వడం.

నిందితుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాయుధ తిరుగుబాటును రెచ్చగొడుతున్నాడనేందుకు ప్రత్యక్ష రుజువులు లభించేంతవరకు ఆ వ్యక్తిపై దేశ ద్రోహ అభియోగాన్ని మోపకూడదని సర్వోన్నత న్యాయస్థానం దాదాపు ఐదు దశాబ్దాల క్రితమే విస్పష్టంగా పేర్కొంది. మరి డాక్టర్ సేన్ కేసులో ఛత్తీస్‌గఢ్ పోలీసులు నివేదించిన సాక్ష్యాధారాలు చాలా బలహీనమైనవి. జైలులో ఉన్న మావోయిస్టు నాయకుడు నారాయణ్ సన్యాల్ నుంచి కొన్ని లేఖలను బయటకు చేరవేశాడన్నదే వినాయక్ సేన్‌పై పోలీసులు చేసిన ఆరోపణ. ఆ లేఖలను కోల్‌కతా లోని పీయూష్ గుహా అనే వ్యాపారి నుంచి స్వాధీనం చేసుకున్నారు.

సన్యాల్‌తో పాటు పీయూష్ గుహాకు కూడా యావజ్జీవ శిక్ష విధించారు. ఆసక్తికరమైన విషయమేమిటంటే డాక్టర్ సేన్ జైలులో ఉన్న మావోయిస్టు నేత నుంచి లేఖలను బయటకు చేరవేశాడనేందు కు పోలీసులు చూపిన రుజువు పీయూష్ వాంగ్మూలం కాదు. ఆ లేఖలను మరో వ్యక్తి ద్వారా పీయూష్‌కు అందజేశాడని పోలీసులు పేర్కొన్నారు. ఆ మరో సాక్షిని పోలీసులు అరెస్ట్ చేసి రెండేళ్ళ పాటు జైలులో ఉంచారు. అయినప్పటికీ అతన్ని ఎప్పుడు, ఎందుకు అరెస్ట్ చేసింది అన్న విషయమై పోలీసులు వివరణ ఇవ్వలేక పోతున్నారు!

ఇదంతా దేశ ద్రోహ కార్యలాపాలకు జరిగిన 'కుట్ర'గా రాయపూ ర్ జడ్జి పరిగణించారు. నిందితులలో ఒకరైన డాక్టర్ సేన్ జైలులో ఉన్న మావోయిస్టు నేత నారాయణ్ సన్యాల్‌ను పలు మార్లు కలుసుకోవడాన్ని అందుకు అదనపు రుజువుగా జడ్జి భావించారు. జైలు అధికారులు సేన్, సన్యాల్‌ల సమావేశాలకు తామే అనుమతిచ్చామ ని, జైలు అధికారుల సమక్షంలోనే ఆ సమావేశాలు జరిగాయని అనికూడా పేర్కొన్నారు.

సేన్, సన్యాల్‌ల మధ్య జరిగిన వారి సంభాషణల్లో అభ్యంతరకరమైనవేవీ చోటు చేసుకోలేదని కూడా తెలిపారు. ఒక విచిత్రమైన రుజువును కూడా పోలీసులు ఉదహరించారు. డాక్టర్ సేన్ పాకిస్థాన్ గూఢచారి సంస్థకు ఇ మెయిల్స్ పంపారని వారు ఆరోపించారు. నిజానికి సేన్ ఇ మెయిల్‌ను పంపింది ఐఎస్ ఐ (ఢిల్లీలోని 'ఇండియన్ సోషల్ ఇన్‌స్టిట్యూట్') కాగా దాన్ని అదే సంక్షిప్త నామం గల పాక్ గూఢచారి సంస్థగా ఛత్తీస్ గఢ్ పోలీసులు భావించారు.

వినాయక్ సేన్ ఉదంతంపై మన విదేశీ గూఢచారి సంస్థ 'రా' రిటైర్డ్ డిప్యూటీ చీఫ్, ఉగ్రవాద కార్యకలాపాల నిరోధక నిపుణు డు బి. రామన్ అభిప్రాయాలను తప్పక పరిశీలనలోకి తీసుకోవల్సి వుంది. డాక్టర్ సేన్ పై నిర్ణయం తీసుకోవడంలో మూడు అంశాలను పరిగణనలోకి తీసుకుని వుండవల్సిందని ఆయన పేర్కొన్నారు.

అవి సేన్ మానవీయ వ్యక్తిత్వం, ఆదివాసీలకు ఆయ న చేసిన సేవలు; గతంలో ఎన్నడూ హింసాకాండకు పాల్పడినట్టుగాని, ప్రోత్సహించినట్టుగాని పోలీసుల దృష్టికి రాకపోవడం; విశ్వసనీయమైన రుజువులులేని సాక్ష్యాధారాలను కేసుకు ప్రాతిపదికగా తీసుకోవడం.

తీవ్రవాద కార్యకలాపాల నిరోధక విధాన రూపకర్తలు, ఆ విధానాన్ని అమలుపరిచే వారు కొన్ని వాస్తవాలకు మరింత ప్రాధాన్యమివ్వాల్సిన అవసరముందని రామన్ పేర్కొన్నారు. 'కరడుగట్టిన' తీవ్రవాదులపై 'కఠినచర్య' తీసుకోవాలని, డాక్టర్ వినాయక్ సేన్ లాంటి ' సానుభూతిపరుల'పట్ల సంయమనంతో వ్యవహరించాలని ఆయన సలహా ఇచ్చారు. ప్రస్తుత విధానాన్ని కొనసాగించడం వల్ల డాక్టర్ సేన్ వంటి వారు తీవ్రవాదులకు సంపూర్ణ మద్దతుదారులవుతారని, సమస్య మరింత సంక్లిష్ట మవుతుందని ఆయన పేర్కొన్నా రు.

రాయపూర్ సెషన్స్ జడ్జి తీర్పు అనవసరంగా చట్టాన్ని సాగదీసిందని నేను గట్టిగా అభిప్రాయపడుతున్నాను. ఏ పరిస్థితులనైతే నివారించవచ్చునో ఆ పరిస్థితులనే ఆ తీర్పు సృష్టించింది. న్యాయవ్యవస్థ, కార్యనిర్వాహక వర్గమూ నక్సల్స్ విషయంలో మితిమీరి చర్యలు చేపట్టే ధోరణిని మానుకోకపోతే జాతీయ ప్రయోజనాలకు హాని జరగడం ఖాయం. రామన్ వివేకవంతమైన సలహాను మన పాలకులు పాటిస్తారని ఆశిద్దాం.

చాలా క్రూరమైన, కాలం చెల్లిన, వలసపాలనాయుగం నుంచి సంక్రమించిన చట్టాలపైనే మనం ఇంకా ఆధారపడుతున్నాం. ఆ చట్టాల స్థానంలో తక్షణమే కొత్త చట్టాలను ప్రవేశపెట్టాల్సిన అవసరమెంతైనా ఉంది. ప్రపంచపు అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ పాలన అరవై మూడేళ్ళ స్వాతంత్య్రానంతరమూ 19వ శతాబ్దిలో బ్రిటిష్ వలస పాలకులు రూపొందించిన చట్టాల ప్రకారమే సాగుతోంది. ఇది చాలా సిగ్గుచేటైన అంశం.

అధికారపూర్వకంగా భూముల స్వాధీనతపై చోటుచేసుకుంటున్న ప్రజల తిరుగుబాట్లకు మూలకా రణం ఆ భూస్వాధీనాలన్నీ 1894 నాటి కాలం చెల్లిన చట్టం ప్రకారం జరగడమే. మన పోలీసు శాఖల పాలన సైతం చాలా పాత కాలం నాటి చట్టం ప్రకారమే జరుగుతోంది. కాలదోషం పట్టిన ఆ చట్టాన్ని సవరించడానికి, పోలీసు వ్యవస్థ పనితీరును మార్చడానికి జరిగిన ప్రయత్నాలేవీ ఇంతవరకు ఫలించలేదు.

(ఆంధ్రజ్యోతికి ప్రత్యేకం)

No comments:

Post a Comment