Friday, 6 January 2012

విప్లవ దేశదిమ్మరి అసిత్‌సేన్ గుప్తా

-వరవరరావు
https://www.andhrajyothy.com/EditorialShow.asp?qry=2011/jan/9/edit/9edit3&more=2011/jan/9/edit/editpagemain1&date=1/9/2011

డాక్టర్ బినాయక్ సేన్, నారాయణ్ సన్యాల్, పీయూష్ ఘోష్ లకు రాయపూర్‌లోని సెషన్స్ జడ్జి యావజ్జీవ శిక్ష ప్రకటించిన రోజే మరో మేధావి, రచయిత, 'వరల్ట్ టు విన్' ప్రచురణ కర్త, ఎడిటర్ అసిత్‌సేన్ గుప్తా కు కూడ అదే పట్టణంలోని మరో సెషన్స్ కోర్టు ఎనిమిదేళ్ల శిక్ష విధించింది. ఈ విషయం ప్రజాస్వామ్య వాదుల దృష్టికి తగినంతగా రానట్లున్నది. కలకత్తాలో అసోసియేషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ డెమొక్రటిక్ రైట్స్ అనే సంస్థ మాత్రం రెండు శిక్షలు రద్దుచేయాలని, భారత శిక్షా స్మృతి నుంచి రాజద్రోహ నేరం తొలగించాలని డిమాండ్ చేస్తూ ప్రదర్శనలు, సభలు నిర్వహిస్తున్నది.

అసిత్‌సేన్ గుప్తాకు రాజద్రోహ నేరానికి మూడేళ్లు, మరో ఆరోపణకు ఎనిమిదేళ్లు శిక్ష విధించారు. అంటే ఆయన కనీసం ఎనిమిదేళ్లు జైల్లో మగ్గ వలసిందే. ఇప్పటికే ఆయన రాయపూర్ జైల్లో మూడేళ్లకు పైగా బెయిలు కూడా రాకుండా అనారోగ్యంతో మగ్గుతున్నాడు. 2009 జూలైలో నేను రాయపూర్ లో ఒక సెమినార్‌కు వెళ్లిన సందర్భంగా జైల్లో ఆయననొక్కణ్ణే కలుసుకోగలిగాను. ఆయన నాతో పాటు చిరకాలం అఖిల భారత విప్లవ సాంస్కృతిక సమితి (ఎఐఎల్ఆర్‌సి)లో కార్యవర్గ సభ్యుడుగా ఉన్నాడు.

బెంగాలీ, హిందీ, మలయాళీ, ఇంగ్లీష్ భాషల్లో రాజకీయ వ్యాఖ్యానాలు, హిందీలో కవిత్వం కూడా రాసేవాడు. సునిశిత మేధావి. నాకు జైల్లో అసిత్‌సేన్‌ను కలవడానికి అనుమతి కూడా సూపరింటెండెంట్ ఇచ్చినది కేవలం ఆయన రచయిత, నాతోపాటు ఒక సాహిత్య, సాంస్కృతిక సంస్థలో పనిచేశాడనే అనుకూలతతోనే. నేను కలిసినప్పుడు జైలు సూపరింటెండెంట్ స్వయంగా అసిత్ సేన్ హిందీలోకి అనువాదం చేసిన జోస్ మారి యాసిజన్ (సుప్రసిద్ధ ఫిలిప్పైన్స్ విప్లవ నాయకుడు, కవి) కవిత్వం చదువుతున్నాడు. తాను సెన్సార్ చేసి బయటికి పంపడానికి.

అరెస్టయ్యేనాటికి అసిత్‌సేన్ గుప్తా 'స్ట్రగుల్ ఇండియా' అనే సంస్థకు అధ్యక్షుడు. రాయపూర్‌లోనే ఆయన అద్దెకున్న ఇంటి మీద పోలీసులు దాడిచేసినప్పుడు ఆ సంస్థకు సంబంధించిన సాహిత్యం, వరల్ట్ టు విన్, ఇంగ్లీష్, హిందీ సంచికలు, పూర్వీ పబ్లికేషన్స్ తరఫున ఆయన ప్రచురించిన పుస్తకాలు మాత్రమే దొరికాయి. ఇవన్నీ చట్టబద్ధంగా, బహిరంగంగా వస్తున్న సాహిత్యం. వీటిలో వరల్డ్ టు విన్ -ప్రపంచవ్యాప్తంగా వివిధ భాషల్లో వెలువడుతూ రిజిష్టర్డ్ కూడా అయిన ప్రామాణిక మైన పత్రిక.

పూర్వీ ప్రచురణ లు కూడా రిజిష్టర్డ్ సంస్థ. అయినా ఛత్తీస్‌గఢ్‌లో ఉన్న యుద్ధ వాతావరణం లో ఆయనకు మావోయిస్టు పార్టీతో సంబంధాలున్నాయనే నెపంతో జైల్లో పెట్టి మూడేళ్లుగా ఇంత చిన్న ఆరోపణపై పోలీసులు బెయిలుకు కూడా అడ్డు పడుతున్నారు. ఏ ఆధారమూలేని కుటుంబం కనుక (ఆయన కేరళలోని విప్ల వ ప్రజాసంఘంలో పనిచేస్తున్న మహిళా కార్యకర్తను వివాహమాడారు) ఆర్థికంగా కూడా తన కేసు విచారణ కోసం తానుగా ఏ ప్రయ త్నం చేయలేకపోయాడు.

అసిత్‌సేన్ గుప్తా విప్లవ దేశదిమ్మరి. కలకత్తా బెనారస్, ఢిల్లీ, రాయపూర్, త్రిసూర్‌లో విప్లవ సాంస్కృతికోద్యమాల్లో పనిచేశాడు. నక్సల్బరీ రాజకీయా ల పట్ల ఆకర్షితుడై కేరళ నుంచి వెలువడే రెడ్ ఫ్లాగ్ పత్రికకు సంబంధించిన ప్రచురణలు ఢిల్లీలో హిందీ ఇంగ్లీష్‌లో తెచ్చేవాడు. ఆ తర్వాత సిపిఐ ఎంఎల్ (నక్సల్బరీ) పార్టీ ప్రచురణలు, సాహిత్యంతో అనుబంధంగా పనిచేశాడు.

కెఎన్ రామచంద్రన్, కానూ సన్యాల్ నాయకత్వంలోని సిపిఐ ఎంఎల్ లో చేరిన తర్వాత అసిత్‌సేన్ కేరళలో ఏర్పడిన 'పోరాటం' సంస్థ సామ్రాజ్యవాద వ్యతిరేక కార్యకలాపాలను ఢిల్లీ, రాయపూర్‌లో నిర్వహించేవాడు. అట్లా నేపా ల్ మావోయిస్టు పార్టీ చొరవతో వచ్చే వరల్డ్ టు విన్ పత్రిక ప్రచురణను, సంపాదక బాధ్యతలను ఢిల్లీనుంచి నిర్వహించేవాడు. ఆ విధంగా చూసినప్పుడు నిర్మాణ రీత్యానూ, సంస్థాగతంగానూ ఆయన భారత మావోయిస్టు పార్టీ కార్యలాపాలకు కూడా చెందిన వాడుకాదు.

రచయితగా, బుద్ధిజీవిగా, సాంస్కృతి క కార్యకర్తగా ఆయన తన రాజకీయ విశ్వాసాలు ఏమయినప్పటికీ ఎఐఎల్ ఆర్‌సి కాలం నుంచి కూడా భూస్వామ్య, సామ్రాజ్యవాద వ్యతిరేక సాంస్కృతిక కార్యకలాపాల్లో నక్సల్బరీ పంథాను, చైనా శ్రామిక వర్గ సాంస్కృతిక విప్లవ భావధారను ప్రచారంచేసే కార్యక్రమాల్లో క్రియాశీలంగా కొనసాగుతూ వస్తున్నాడు. తన కార్యక్షేత్రంగా కూడా రచన, ప్రచురణ రంగాల్లో ఈ భావజాల ప్రచారాన్ని ఎంచుకున్నాడు. దేశ వ్యాప్తం గా అఖిల భారతస్థాయిలో జరిగే సామ్రాజ్యవాద వ్యతిరేక సభల్లో, సదస్సుల్లో ఆయన వేదిక మీద వక్తగా ఎంత కనిపించే వాడో అంతకన్న ఎక్కువ గా ఆయన సహచరితో కలిసి ప్రచురణలు అమ్మే పుస్తకాలశాలల్లో కనిపించేవాడు.

స్నేహ పాత్రుడు. సాహిత్య జీవి. వయసేమిటో పోల్చుకోలేనంత బక్క పలుచని అతి సాధారణ శరీర నిర్మాణం. మాంసం లేని శరీరం. ఆచ్ఛాదనగా ఉండే ఆహార్యం. సాన్నిహిత్యం, సంభాషణల్లో , ప్రసంగాల్లో మాత్ర మే వ్యక్తమయ్యే అపార మైన అధ్యయన, అనుభవ జ్ఞానం. అవగాహన. ఒక బలమైన దేశవ్యాప్తమైన నిర్మాణంలో సంస్థలో ఉన్న వాడు కాదు.

అష్ట దారిద్య్రాన్ని అనుభవిస్తూ పుస్తకాలు అచ్చు వేసుకుంటూ, అమ్ముకుంటూ అదే ఆధారంగా జీవిక వెళ్ల దీసుకుంటున్నవాడు. కాకపోతే నక్సల్బరీ రాజకీయా ల్లో నాకు తెలిసి మూడు దశాబ్దాలుగా అలుపెరగని సామ్రాజ్యవాద వ్యతిరేక ప్రచారంలో ఢిల్లీ, రాయపూర్‌లు కేంద్రంగా తిరుగుతున్నాడు. అసిత్ సేన్‌గుప్తాను అరెస్టుచేసి ఆ నిరరంతర చలన ప్రచారాన్ని అరికట్టగలిగిందే గానీ ప్రభుత్వం ఆయన నిబద్ధతను నిర్బంధించలేకపోయింది.

విశ్వాసాలను బంధించి, శిక్ష వేస్తే రాజద్రోహం చేయకుండా ఒక బుద్ధి జీవి బుద్ధిగా ఉండగలడన్నంత పిరికిగా, కక్షతో వ్యవహరిస్తున్నది రాజ్యం. అందుకే గ్రీన్‌హంట్ ఆపరేషన్ కేవలం వనర్ల కోసం కంపెనీల దళారీగా ప్రభుత్వం తన ప్రజల మీద తాను చేసే ప్రత్యక్ష యుద్ధం మాత్రమేకాదు. అది ఒక భావజాలం. అభివృద్ధి నమూనా పేరుతో అమలవుతున్న ఒక విధ్వంస భావజాలం. ఒక దోపిడీ భావజాలం. ఇవ్వాళ దేశంలో ఒక మౌలిక ప్రతిఘటనా భావజాలంగా, ప్రజల అభివృద్ధి రాజకీయంగా ఆచరణలో ఉన్నది. నక్సల్బరీ పంథాను ముందుకు తీసుకు పోతున్న మావోయిస్టు సిద్ధాంత ఆచరణ.

జల్, జంగిల్, జమీన్, గనులు, వనర్లు ఈ దేశ ప్రజలకే చెందాలని వాటిపై దేశప్రజలకే సార్వభౌమాధికారం ఉండాలని నమ్ముతు న్న నిజమైన దేశభక్తుల్లో అసిత్‌సేన్ గుప్తా ఒకరు. తన వంటి వారిని కలుపుకొని 'స్ట్రగుల్ ఇండియా అనే ఒక పోరాట సంస్థను నిర్మాణం చేస్తున్న దశలో నే అసిత్‌సేన్ గుప్తాను నిర్బంధించి ఇవ్వాళ ఆయనకు రాజద్రోహ నేరానికి, మరో ప్రభుత్వ వ్యతిరేక ఆరోపణకు ఎనిమిదేళ్ల శిక్ష విధించింది కోర్టు. బినాయక్ సేన్ యావజ్జీవ శిక్ష రద్దు చేయాలని ఉద్యమిస్తున్న ప్రజాస్వామ్యవాదులందరూ అసిత్‌సేన్ గుప్తాకు కోర్టు విధించిన శిక్ష కూడా రద్దు చేసి బేషరతుగా విడుదల చేయాలని డిమాండు చేయాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నాను.

-వరవరరావు

No comments:

Post a Comment